శుక్రవారం సాయంకాలం యమధర్మరాజు ఆఫీసు కట్టేసి ఇంటికెళ్ళిపోతూంటే చిత్రగుప్తుడు అడిగేడు.
“రాజా, ఈ ఆదివారం మీరు ఆఫీసుకి రావడం కుదురుతుందా?”
“అదేమిటి? మళ్ళీ ఏదైనా సునామీ కానీ అటువంటి ఉపద్రవం కానీ వస్తోందా, అలా వారాంతం ఆఫీసుకి రమ్మంటున్నారు?” యముడు చిరాగ్గా చూస్తూ అన్నాడు.
“అటువంటిదే కానీ కాస్త చిన్న సైజుది. ఈ సారి ఇది తెలుగు భాషకి సంబంధించిన విషయం. అందుకే…”
“ఏదో భాషకి సంబంధించిన విషయమైతే నేనెందుకు ఆఫీసులో?”
“భాష ఒక్కటే కాదండి. ఆ భాష రాసే జనాలు మూకుమ్మడిగా కొట్టుకు ఛస్తూ ఒక్కసారి మన దగ్గిరకి రాబోతున్నారు. ఇద్దరు తెలుగువాళ్ళు ఎక్కడున్నా దెబ్బలాడుకోవడం అనేది సర్వసాధారణం కనక, వాళ్ళు వచ్చాక ఇక్కడ కూడా కొట్టుకుంటే నేనొక్కణ్ణే అదుపు చేయలేను. మీ సహాయం ఉంటే బావుంటుందనీ…”
“వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదా?”
“చెప్పాను కదండి. మీరు వస్తే మిమ్మల్నీ మీ వాహనాన్నీ, యమపాశాన్నీ చూసి కాస్త కొట్టుకోవడం తగ్గవచ్చు అని అడుగుతున్నాను తప్పితే మరోటి కాదు. రిమోట్‌గా పనిచేయడం కుదిరేది అయితే మిమ్మల్ని అలా వీలు చేసుకుని ఇక్కడకి రమ్మని అడిగేవాడినా? అంతేకాకుండా, మీకు రావడం కుదరకపోతే…”
“ఆఁ! కుదరకపోతే?”
“…బ్రహ్మగారి తలవ్రాతలు తప్పు అవుతాయి. దాన్ని బట్టి తర్వాత ఆయనకి కోపం, ఆ మీద విష్ణు మహేశ్వరులకి మన మీద ఫిర్యాదులూ వెళ్తాయి. ఇంక ఆ తర్వాత మన పని కొరివితో తల గోక్కున్నట్టే కదా.”
విష్ణుమహేశ్వరుల పేర్లు వినేసరికి యముడు కాస్త తడబడ్డాడు. ఆ మధ్య గురుపుత్రుణ్ణి వెనక్కి ఇవ్వమని అడగడానికి వచ్చిన కృష్ణుడూ అతని అన్న బలరాముడూ గుర్తొచ్చారు. మార్కండేయుణ్ణి తీసుకురావడానికి తాను స్వంతంగా వెళ్తే – వక్షస్తాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః – తన వక్షం మీద తగిలిన శ్రీకంఠుడి పాద తాడనం తానెరగంది కాదు. కంగారుగా అడిగేడు.
“పొద్దుటే వచ్చి మధ్యాహ్నానికి భోజనానికి ఇంటికెళ్ళిపోవచ్చా?”
“తప్పకుండా ప్రయత్నిద్దాం.”
“సరే!” కాస్త విసుగు మొహంతో యముడు మహిష వాహనం మీదెక్కి చెప్పేడు దానితో, “వెళ్దాం పద.” మహిషం రాబోయే ఉపద్రవాన్ని సూచిస్తున్నట్టు ఘంఠికలు భీకరంగా మ్రోగిస్తూ యముడి భవనంకేసి కదిలిపోయింది.
చిత్రగుప్తుడు ‘హమ్మయ్యా’ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
శనివారం సాయంత్రం అయిదింటికి సత్తిబాబు వీధి-అరుగు.కామ్ అనే వెబ్ సైటు తెరవబోయేడు. పనిచేయలేదు. గూగుల్లోకి వెళ్ళి “వీధి-అరుగు” అని వెతకమన్నాడు. ఏవో రోడ్డులనీ, హైవేలనీ, మరోటనీ వచ్చాయి కానీ తెలుగు అగ్రిగేటర్లూ ఏవీ తేలలేదు పైన. సరే పోనీ గుఛ్ఛం.కామ్ అనేది వెతికాడు. ఒకటిపోతే మరోటైనా ఉంటుందనే ఆశ. సెర్చ్ ఇంజను లోంచి బయటకొచ్చిన రిజల్టుల్లో మొదటి సైటు ఆ తెలుగు అగ్రిగేటరే. అందులో మొదటి పోస్టు సత్తిబాబు కనుబొమలు ఆశ్చర్యంతో పైకెత్తేలా చేసింది.
“గుఛ్ఛం అగ్రిగేటరు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల్నుండీ పనిచేయదు. ఈ మార్పు ఎందుకంటే మన తెలుగు బ్లాగర్లు, బ్లాగరిణులందరూ కొట్టుకు ఛస్తూ ఒకరిమీద ఒకరు తిట్లే కామెంట్లుగా రాస్తున్నారు కనక. ఇది మూసేశాక తెలుగువాళ్ళందరూ ఎక్కడ కొట్టుకు ఛస్తారో మాకనవసరం. అసలు ఈ అగ్రిగేటరు ప్రారంభించినందుకూ, ఇంతకాలం దీన్ని తెరిచి ఉంచినందుకూ మమ్మల్ని మేము తిట్టుకోని రోజే లేదు. ఇదంతా సాధ్యమయ్యేలా చేసిన తెలుగువాళ్ళందరికీ ఒకే ఒక సలహా – తాంబూలాలిచ్చేశాం. (ఎక్కడ కుదిరితే అక్కడ) తన్నుకు చావండి.”
గత ఐదారు నెలలుగా జరిగినదేమిటో తెలియని సత్తిబాబు ఏమైందా అనుకుంటూ మిగతా పోస్టులన్నీ చదవడం మొదలుపెట్టాడు. కనిపించే పేజీలో మొత్తం బ్లాగులన్నీ చదవకుండానే విషయం అర్ధమైంది. ‘హమ్మయ్యా పోతే పోనీ దరిద్రం వదిలింది,’ అనుకుంటూ కంప్యూటర్ కట్టేసి లేచాడు.
ఆ రోజు రాత్రే అన్ని అగ్రిగ్రేటర్లూ మూసేయబడ్డాయి. పనిలోపనిగా బ్లాగులు ఉచితంగా రాసుకోమని ఇచ్చే కంపెనీలన్నీ బ్లాగులు మూసేశాయి. దానితోబాటూ ఆయా కంపెనీలు నిర్వహించే వెబ్ మాగజైన్లూ, తెలుగు వెబ్ సైట్లూ అలా అనేకానేక తెలుగు భాషకి సంబంధించినవన్నీ ఒక్కసారి మూతబడ్డాయి. సునామీ వచ్చినప్పుడు మూకుమ్మడిగా జనం పెద్ద ఎత్తులో కొట్టుకుపోయినట్టు మొత్త తెలుగు భాష, బ్లాగర్లు, కాపీ పేస్టు ఆర్టిస్టులు, కామెంటర్లు అందరూ ఇంటర్నెట్టు మీద తనువులు చాలించారు. అంతర్జాలం మీద తెలుగు ఒక్కసారి మూగబోయింది. దానితో చిత్రగుప్తులవారు చెప్పినట్టూ శనివారం రాత్రి నుంచి చచ్చిపోయిన బ్లాగులూ, బ్లాగు రచయిత(త్రు)లూ, ఎడిటర్లు, కామెంటర్లు తదితరులందరూ చేసుకున్న పాపాల్ని కూడగట్టుకుని నరకం ముఖద్వారం వద్ద చాంతాడంత క్యూ కట్టారు. అక్కడితో ఆగితేనా? ఆదివారం పొద్దున్న యమధర్మరాజు ఆఫీసుకి వచ్చేవరకూ క్యూ హనుమంతుడి తోకలా అలా పెరుగుతూనే ఉంది.
ఆదివారం షాపింగుకు తీసికెళ్ళకుండా ఆఫీసుకు పోతున్నందుకు రుసరుసలాడుతూ యమి, మిగిలిపోయిన ఇడ్లీపిండితో చేసి పెట్టిన మినపరొట్టె తిని యముడు చేతిలో కాఫీ మగ్గుతో కొంచెం ఆలశ్యంగా ఆఫీసు కొచ్చేసరికి అప్పటికే ప్రాణుల్ని లైన్లో నించోపెట్టడానికి భటులూ చిత్రగుప్తుడూ నానా అవస్థ పడుతున్నారు. నేను ముందు, అంటే నేను ముందు, అని కేకలు వినిపిస్తున్నాయి. యముణ్ణి చూస్తూనే చిత్రగుప్తుడు చెప్పేడు.
“చూడండి, వీళ్ళు ఒక్కొక్కరూ వచ్చి నా డెస్కు చుట్టూ గుమికూడడం, నేను చిట్టా తీసి చూసేలోపుల మరొకడు వచ్చి’ముందు నాది చూడవోయ్’ అనడం. టోకెన్ తీసుకుని లైన్లో నుంచోండయ్యా అంటే కుదరదుట. ‘నేను తిరుపతి, అన్నవరం లాంటి చోటే లైన్లో నుంచోను ఇక్కడేం నుంచుంటా?’ అని కసురుతున్నారు.”
“తిరుపతిలో లైన్లో నుంచోకుండా ఎలాగయ్యా దర్శనం?” యముడు కుతూహలంగా అడిగేడు ప్రాణుల్నీ, చిత్రగుప్తుణ్ణీ మార్చి మార్చి చూస్తూ. అందరికంటే కాస్త బరువుగా ఉన్న ప్రాణం ముందుకొచ్చి చెప్పింది సమాధానం.
“ఆయ్, అక్కడో స్పెషల్ టికెట్టు కొని, లంచమిస్తే ముందు వరసలోకి పోవచ్చండి.”
“అలాగా, స్పెషల్ టికెట్ మరి అందరికీ దొరకొద్దూ? అది ప్రముఖులకే కదా?”
యముణ్ణి ఓ వెర్రిబాగులవాడిలా చూసి చిరునవ్వుతో చెప్పింది బరువు ప్రాణి. “మీరు మరీ సత్తెకాలపు సత్తెయ్య లాగున్నారు యమరాజు గారూ, ఆ స్పెషల్ టికెట్ కొనడానికి మరో లంచం ఇస్తే చాలు, లేకపోతే కాకా పట్టే జనం ఉంటే వాళ్ళని కాకా పట్టినా పనైపోతుంది. అవన్నీ మనకెందుగ్గానీ ముందు నా సంగతి చూసెయ్యకూడద్సార్? ఈ లైన్లో నుంచుంటే ఎంతకాలం పడుతుందో?”
యముడికి ఒక్కసారి అర్ధమైంది కాకా పట్టడం అంటే ఏమిటో. స్పెషల్ టికెట్ ఎలాగయ్యా అని అడిగితే ఈ ప్రాణి తనని మంచి చేసుకుని ముందు లోపలకి పోదామని ప్రయత్నం. ఆఖరికి నరకం లోకి వెళ్ళడానిక్కూడా కంగారే? ఒక్కసారి మొహంలో కోపం చూపిస్తూ దండం విదిల్చి చెప్పేడు కరుగ్గా, “పోయి లైన్లో నుంచో. భూమ్మీద రూల్స్ ఇక్కడ పనిచెయ్యవ్. చిత్రగుప్తులవారు ఒక్కొక్కర్నీ పిలుస్తారు, ఫో!”
యముడి ఆర్డర్ వినగానే ఏదో అర్ధమైనట్టూ మహిషం వికృతంగా భీకరమైన ఒక్క అరుపు అరిచింది. నుంచున్న అందరి నడుముల మీదా భటులు వేస్తోన్న వాతలు తేలాయి. వెంటనే అందరూ సర్దుకుంటూ లైన్లో నుంచున్నారు. అంతా నిశ్శబ్దం. చిత్రగుప్తుడు పిలిచేడు.
“ప్రాణి నంబర్ 1. బ్లాగరు సమోసా! బ్లాగరు సమోసా!”
సమోసా ప్రాణి ముందుకొచ్చింది.
యముడు చిత్రగుప్తుడి వైపు తిరిగి అడిగేడు, “ఏమిటీయన చేసిన పాపాలు?”
“ఈయన కాదండి, ఈవిడ.”
“ఓహో సరే, ఈవిడ చేసిన తప్పులేమిటి?”
“బ్లాగు మొదలుపెట్టిన రోజుల్లో సమోసా ఎలా తయారు చేయచ్చో, కారప్పూస ఎలా చేయచ్చో, మరోటీ, ఇంకోటీ స్నాకుల గురించీ రాసేవారు. కానీ ఉత్తరోత్తరా ఆటవెలదీ, తేటగీతి అనే తెలుగు పద్యాలు రాయడం నేర్చుకుని జనాల్ని చంపుకు తినడం సాగించారు. ఉదాహరణకి చూడండి:
ఏ.తె. నిజమాటల ననుచును త
నజబ్బలను చరచుచు, టపటప మనుచు
నిజమేనని చెప్పుటమేలా?
ఈజనులకు వేస్టు సామోసా గరగరం పల్కు!
“ఏ.తె. అన్నారేమిటి? ఇదేమి వృత్తం? కందమా, ఆటవెలదా, తేటగీతా?” యముడు కాస్త అనుమానంగా అడిగేడు.
“ప్రభో, నన్నా అడుగుతున్నారు? నాకు ఈ చిట్టా చూడ్డానికే సమయం సరిపోవట్లేదు.” చిత్రగుప్తుడు అరిచేడు.
“అయినా అసలు కధ చెప్పబోతున్నాను వినండి. ఇలాంటి పద్యాలు ఈవిడ తన బ్లాగులోనూ, ఇతర బ్లాగుల్లోనూ కామెంట్ల రూపంలో వేయడం మొదలు పెట్టింది. దాంతో ప్రతీ ఒక్కరూ పద్యాల్రాయడం మొదలెట్టారు. అది ఎంతవరకూ వచ్చిందంటే నాలుగు లైన్లు రాయడం కూడా రాని వాళ్ళు, వచ్చినా రాయని వాళ్ళు, అసలు ఛందస్సంటే ఏవిటో తెలీనివాళ్ళు, కొత్తరకం ఛందస్సు మొదలు పెట్టి ఇలా ఏ వృత్తానికీ పట్టని పద్యాలు రాయడం సాగించారు. ఈవిడ సృష్టించిన ఈ పద్యం ఏ.తె. అని ఎందుకన్నారంటే ఎవరైనా ఇదేం వృత్తం అని అడిగితే ‘ఏమో తెలియదు’ అని చెప్పడానికి అంటున్నారు. అదీ కష్టం అనుకున్న జనాలు…”
“ఏవిటీ, నాలుగు లైన్లు రాయడం కష్టమా?”
“…అదేకదండి మరి వింత? అదీ కష్టం అనుకున్న జనాలు నానీలనీ, మినీలనీ, వానీలనీ మొదలుపెట్టి రెండు లైన్లతో, ఒక్కలైనుతో రాస్తున్నారు. ఇదేమి వృత్తమయ్యా అంటే ఇదో కొత్తది మీరూ నేర్చుకోండి అనే ముక్తాయింపు మొదలైంది. రెండు ఇంగ్లీషు పదాలు లేకుండా ఓ తెలుగు వాక్యం నోట్లోంచి రావట్లేదు వీళ్ళకి. ఈవిడ పద్యాల దగ్గిరకొస్తే ‘సమోసా’ అనే పదం వచ్చేలాగ పద్యాలు రాస్తో జనాలని కుడీ, ఎడమగా వాయిస్తోందీవిడ.”
“ఆమాత్రం తెలుస్తోంది కదా? నాలుగో లైనులో వేరే భాష వచ్చినట్టుంది.”
“ప్రజలని ఏడిపించడం, భాషని చంపడం కూడా పాపమే కదా?”
“ఏమి శిక్ష నిర్ణయించారు?”
“అయ్యా, నా పని చిట్టా చదవడం వరకే కదా?!” ఈ ఎడిషనల్ పని నేను ఎందుకు చేయాలన్నట్టు చిత్రగుప్తుడడిగేడు.
యముడు కరుగ్గా చెప్పేడు.
“ఈవిణ్ణి వచ్చే యుగాంతం వరకూ పచిసూ చదివిస్తూ యమాతారాజభానస అంటే ఏవిటో, తెలుగు వృత్తాలంటే ఏవిటో చదువుతూ ఉండమనండి. చంపకమాల, ఉత్పలమాలలతో మొదలుపెట్టి స్రగ్ధర, మహాస్రగ్ధర అనే వృత్తాలు పూర్తిగా తెలుగులో రాయడం వచ్చే వరకూ; సమోసా, కారప్పూస అని రాయకుండా ద్రాక్షాపాకం రాయొచ్చని బుద్ధి వచ్చేవరకూనూ.”
“నంబర్ 2. మన తెలుగు సంస్కృతి బ్లాగరు! మన తెలుగు సంస్కృతి బ్లాగరు!!” అరిచేడు చిత్రగుప్తుడు.
“ఈ ప్రాణి తప్పు?” అడిగేడు యముడు; ఆయన, ఈవిడ లాంటి అనే పదాలు నోట్లోంచి రాకుండా జాగ్రత్తపడుతూ.
“ఈయన పండగలకీ పబ్బాలకీ తయారుచేసే స్వీట్లు బ్లాగులో రాసి పారేస్తూ ఉంటారు రకరకాల కొత్త కొత్త రుచులూ వంటలూ కనిపెడుతూ. ఈ మధ్యన వినాయక చవితికి రాసిన బ్లాగులో ఆవాలు, ఇంగువ కలిపి లడ్డూ ఎలా చేయలో రాస్తూ ‘గణపతి పబ్బా మోరియా’ అని రాశారు.”
“శివశివా, పబ్బా మోరియా ఏవిటయ్యా? బప్పా మోరియా అనాలి కదా?” యముడు తల పట్టుకున్నాడు.
“అందుకే గదండి ఇక్కడ తేలారు మనదగ్గిర?” చిత్రగుప్తుడు చెప్పాడు సమాధానంగా, “రోజూ బ్లాగుల్లో గడుపుతూంటే ఇంతకన్నా మంచి భాష ఎలా వస్తుంది లెండి నోట్లోంచి? ఆ పైన రాసిన వాక్యాలు చిత్తగించండి.
1. నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో మస్టర్డ్ సీడ్లు వేసి తక్కువ మంట మీద డ్రై రోస్ట్ చేయాలి. 2. అలాగే ఆల్మండ్సు కూడా వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3. పాన్‌లో ఇంగువ కూడా వేసి ఫైవ్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. 4. చల్లారిన తర్వాత మిక్సీ జార్6లో వేసి రఫ్‌గా పొడి చేసుకోవాలి. 5. ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఘీ వేయాలి…”
యముడు కోపంగా ప్రాణి కేసి తిరిగి అడిగేడు, “ఏవిటయ్యా ఈ గోల? ఒక వాక్యం కూడా పూర్తిగా తెలుగులో రాయలేవూ?”
“నన్నేం చేయమంటారు? తెలుగులో చెప్తే ఎవరికీ అర్ధం కాదు. ఆ మధ్య మా మేనల్లుడు మా ఇంటికొచ్చినప్పుడు ఆకలేస్తోంది అన్నాడు. అన్నం తింటావా అంటే అన్నం అంటే ఏమిటి అన్నాడు. వైట్ రైస్ అని చెప్పాల్సి వచ్చింది. అలాగే ‘దోరగా వేయించండి’ అంటే తెలియదుట, ‘నూనె లేకుండా వేయించాలి’ అంటే తెలియదు. కాన్వెంటు చదువులు చదువుతూ దేవభాష మాట్లాడితే మధ్యలో తప్పు నాదా?”
“అలాంటివాళ్ళకి తెలుగు సరిగ్గా నేర్పాల్సిన భాధ్యత నీకు లేదా?”
“అలా అంటారేంటి సార్? వాళ్ళకి తెలుగు రాకపోవడం నా తప్పా?”
“మరి నీ బ్లాగుని తెలుగు బ్లాగు అని ఎందుకు పిలవడం?”
“రాసేది తెలుగులో కాబట్టి.”
యముడికి ఒళ్ళు మండింది. “వీణ్ణి సలసల కాగే హాట్ ఆలీవ్ ఆయిల్లో వెట్ రోస్టు చేస్తూ రఫ్‌గా వేయించేయండి!” అరిచేడు.
“ఈ మూడో ప్రాణి సినిమా బ్లాగరు. సినిమాలకి పేర్లు పెట్టడం, సినిమా డైలాగులు రాయడంలో సిద్ధహస్తులు. ఉదాహరణకి చూడండి. సినిమా పేరు – టేగముడురు; డైలాగ్ – లైటు తీసుకో.”
“టేగముడురు? టేగముడురు?? టేగముడురు… ఆ సరే గానీ, లైటు తీసుకోవడం ఏవిటి? ఇదేమైనా దీపాలు దొంగిలించే దొంగ బాపతా?”
“కాదు యమరాజా. ఎంత చిన్న వ్యాక్యాలు రాస్తే అంత గొప్ప. తేలిగ్గా తీసుకో అని రాస్తే – ఇప్పుడే నరకం లోకి తోసేయబడిన బ్లాగరు చెప్పినట్టూ – ఎవరికీ అర్ధం కాదు. అందుకుని సగం కాన్వెంట్లో నేర్పిన వేరే దేవభాషలో ‘లైట్ గా తీసుకో’ అని రాస్తే గాని అది అసలు తెలుగు అవదు. సినిమా తార వంటి మీద బట్టలు రోజు రోజుకీ తగ్గిపోతున్నట్టే ఎంత చిన్న వ్యాక్యం రాస్తే అంత గొప్ప కదా? అందుకే ‘లైట్ తీసుకో’ అంటారు. మధ్యలో గకారం ఉంటే ఎవడిక్కావాలి, పోతే ఎవడిక్కావాలి? అసలే ప్రతీ సినిమా డైరక్టరూ ఇప్పుడో డిగ్రీ హోల్డరు కదా? వాళ్ళు చెప్పినదే వేదం.”
“నా మొహంలా ఉంది. లైట్ తీసుకో ఏవిటి వీడి శ్రాద్ధం!”
“వీడు పోయినది క్రితం రాత్రే నండి. వీళ్ళ భాషలో చెప్పాలంటే ఇప్పుడు వీడి కొడుకు ఇంకా డెడ్ బాడీకి బాంబూ బెడ్ తయారు చేస్తున్నాడు. శ్రాద్ధానికి జస్ట్ మేకింగ్ వైట్ రైస్. మరో గంటా గంటన్నర పట్టొచ్చు, అది కుక్ అయి ఉడికి రడీ అవడానికి. శ్రాద్ధం అన్నారు కనక అలా చెప్పాల్సి వచ్చింది. మరో విషయం, ఈయన బ్లాగులో ‘అదో తుత్తి,’ ‘ఇరగదీస్తున్నారు’ లాంటి కొత్త కొత్త వాక్యాలూ, పదాలు సృష్టిస్తూ ఉంటారు. కొత్త కొత్త పదాలు సృష్టించకపోతే భాష ఎలా పైకి వస్తుందోయ్ అంటూంటారు కూడా.”
“తుత్తి, ఇరగదీయడం అంటే?”
“యమరాజా, తెలుగు సినిమా డయలాగులకీ, టి.వి న్యూసుకీ అర్ధాలు చెప్పమంటే ఎలా?”
యముడి నల్లటి మొహంలో ఏడు రంగులు మారాయి.
“ఇంకా వినండి. ఈ డిగ్రీలు ఉన్న కొత్త సినిమా దర్శకుల వల్ల సినిమా ఫీల్డు సరస్వతీ కటాక్షంతో ధగధగలాడిపోతోందని ఈయన బ్లాగులో ఒక పోస్టు. ఏడాదికో సారి ‘తెలుగు సినిమాలో మొదటి గొప్ప పదిమంది నాయికలు’ అనే హెడింగుతో మరో పోస్టు. ఇందులో గమనించవల్సింది ఏవిటంటే ఆ ఆ గొప్ప తెలుగు సినిమా నాయికలు – ప్రేషితా శెట్టి, రీతు సింగ్, గామంతా, అన్నమ్మ, లాంటివాళ్ళు పదిమందీ తెలుగువాళ్ళూ కాదు, వాళ్ళకి తెలుగూ రాదు.”
యముడు బ్లాగరు ప్రాణి కేసి చూసి అడిగేడు, “ఏదైనా చెప్పుకోవాలని ఉందా శిక్ష వేసే ముందు?”
“ఓ సారి బాపూ గార్నీ, ముళ్ళపూడి గార్నీ మీటవటం కుదురుద్దా?” బ్లాగరు సినిమా యాసలో అనేశాడు అసంకల్పితంగా.
“ఓరి చవటా, వాళ్ళెందుకు నరకంలో ఉంటార్రా? ఎవరక్కడ, వీణ్ణి అంధతామిస్రంలో పారేయండి!” యముడు అరిచేడు.
పిలుపు విని నాలుగో ప్రాణి ముందుకి రాబోతూంటే చిత్రగుప్తుడు చెప్పాడు యముడికేసి చూస్తూ.
“ఈయనో ఆల్ రౌండర్ గారు. మరో విధంగా చెప్పాలంటే తెలుగు బ్లాగుల రాజ్యంలో ఈయనో అనధికారిక ఆస్థాన పండితుడు.”
“అంటే?”
“ఈయనకి తెలియని విషయం లేదు. తెలుగు, పద్యాలు, పాటలు, యోగా, జ్యోతిషం, హస్త సాముద్రికం, పాద సాముద్రికం, నుదిటి మీద గీతలు చదవడం, వైద్యం, ఇంజినీరింగు, లా అండ్ ఆర్డర్, బస్కీలు తీయడం, కబడ్డీ, వాలీబాల్ అలా మీరేది చెప్పినా అందులో ఈయన నిష్ణాతుడని ఈయన స్వంత అభిప్రాయం. అక్కడతో పోతే బాగుణ్ణు కానీ ప్రజలందరూ ఈయన్ని చూసి, ఈయనకిన్ని కళలెలా వచ్చాయబ్బా అని ఏడ్చుకుంటున్నారనీ, కుళ్ళుకుంటున్నారనీ ఈయననుకుంటూ ఉంటాడు.”
“అందులో తప్పేం ఉంది? ఎవరి గొప్ప వాళ్ళదే కదా?”
“తప్పు అది కాదండి. ఫలానా అల్లవరం ప్రోజక్టు ఏ తేదీకి అవుతుందో, అవదో, ఫలానా రాజకీయ నాయకుడికి, ప్రముఖులకీ ఏం జరగబోతోందో, జరిగిందో, ఎందుకలా అయిందో అవన్నీ ఈయన బ్లాగుతూ ఉంటారు. దానివల్ల కొంతమంది జనాలు భయపడుతూ ఉంటారు. అలా జనాల్ని బెదరగొడుతూ రాయడం ఈయనకో మాంఛి సర్దా.”
“ఈయన సర్దా సంగతి అటుంచితే, ప్రజలందరికీ వేరే పనేం లేదా ఈయన్ని చూసి ఏడుచుకోకపోతే?”
“సగటుకి రోజుకి అయిదారు వందలమంది తెలుగు బ్లాగులు చదువుతారనుకుంటే ఈయన బ్లాగు చూసేది కొంతమంది ఉంటారు కదా. అందులో రోజుకి 12-14 గంటలు పనిచేసే కోడ్ కూలీలని తీసేస్తే కాస్త చదువుకుని ఖాళీగా ఉన్నవారు ఈ బ్లాగు అప్పుడప్పుడూ చూస్తూంటారనుకుందాం. రోజు రోజుకీ ఏవేవో పోస్టులు రాసి ఆ చూసే కాసిని జనాల్ని బెదరగొడుతూ ఉంటారు ఈ ప్రముఖులు.”
“ఈయన రాసినవన్నీ నిజం అవుతూంటాయా? అల్లవరం ప్రోజక్టు ఏమైంది?”
“…అదే చెప్పబోతున్నాను. చెప్పినవి జరుగుతున్నాయో లేదో కూడా ఆయనే చెప్తారు. ప్రపంచంలో ఏ మూలనైనా ఏదైనా జరిగితే ‘ఇదిగో నేను చెప్పినది అక్షరాలా నిజం అయింది చూడండి’ అనడమూ, జరగకపోతే ఇంక దాని గురించి నోరెత్తకపోవడమూ ఆల్ రౌండర్ గారికి అలవాటే. అల్లవరం ప్రోజక్టు అనేదో గంగి గోవు. పాలిచ్చే గోవుని ఏ రాజకీయనాయకుడు చంపుకుంటాడు? ప్రోజక్టు అయిపోతే గోవు వట్టిబోతుంది కదా? రాజకీయ జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా దాన్ని పూర్తి చేస్తాడా అనేది జగమెరిగిన సత్యం. జీవితాల్లో ముందు ఏం జరుగుతుందో ప్రజలకి తెలియకూడదనే కదా భగవంతుడు భూమ్మీద మానవ సృష్టి మొదలుపెట్టినప్పుడు నిర్ణయించాడు? అవన్నీ ఈయనకి పట్టవు; ఎందుకంటే ఈయన అన్నింట్లోనూ, నాది ఒకే మాట ఒకే బాణం, అనే అథారిటీ. కనీసం ఆయన గురించి ఆయన అభిప్రాయం అది.”
“ఈయన వల్ల భయం కలిగి ఇంతకు ముందు పోయిన బ్లాగర్లు ఎవరైనా ఉన్నారా మనదగ్గిర నరకంలో?”
చిత్రగుప్తులవారు కనుసైగ చేయగానే యమభటుల కూడా – వాళ్ళు చేసిన మిగతా పాపాలకి శిక్ష అనుభవిస్తున్న- ఓ పదిమంది బయటకొచ్చారు నరకం లోంచి. వాళ్ళని చూపించి చెప్పేరు చిత్రగుప్తులవారు, “వీళ్ళు బ్లాగర్లూ, ఆల్ రౌండర్ గారి చదువర్లూ కూడా.”
“అయితే ఆల్ రౌండర్ పుణ్యం అంతా వీళ్ళకిచ్చి ఆయన్ని లోపలకి పంపించండి.”
పదిహేను సెకన్ల లోపున యముడు చెప్పిన పని కానిచ్చి చిత్రగుప్తుడు చెప్పేడు, “పుణ్యం అంతా ఇచ్చినా ఇంకా పాపం మిగిలే ఉంది మన ఆల్ రౌండర్ గారికి.”
“అలాగా, అయితే వాళ్ళ పాపాలన్నీ ఈయనకి తగిలించి ఆ పదిమందినీ మళ్ళీ భూమ్మీదకి పంపండి. ఈయన ఇక్కడే ఉంటారు వాళ్ళు మళ్ళీ వచ్చేదాకా.”
“యమరాజా, ఈయనకి ఈ శిక్ష ఎలా ఖాయం చేశారో తెలుసుకోవచ్చా?”
“అదేమంత కష్టం కాదే? ప్రపంచం పుట్టినప్పట్నుంచి, అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఏడిపించిన కాలం నుంచి ఇప్పటివరకూ ప్రపంచం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది దాని నైజం. ఎదుటి వాళ్ళని అకారణంగా ఏడిపిస్తూ వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితే వాళ్ళ పాపాలు మనకీ మన పుణ్యం వాళ్ళకీ చేరుతుంది. తమ చుట్టూ జనాల్ని భయబ్రాంతుల్ని చేయడం, తపస్సు చేస్తూ కనబడినది చూస్తూండడం, ఫలానా రోజున ఇలా జరుగుతుంది అని చెప్పడం, దాన్ని శాస్త్రంతో ముడిపెట్టడం, వేశ్య ప్రదర్శన చూడడం వంటిదే.”
లోపలకి వెళ్ళబోయే ఆస్థాన పండితుడు అడిగేడు, “యమరాజా నేను నరకంలో ఏమి చేయాలి?”
“అమ్మమ్మా, నరకం అంటే ఏం పని ఉండదనుకోకండి. మీక్కావాల్సిన ల్యాప్టాపూ, సాఫ్టువేరూ ఇస్తాం. ఇక్కడ జనాలు తినేసి ఊరకే కూర్చోడం వల్ల బరువు పెరిగిపోతున్నారు. వాళ్ళ రోగాలకి మందులూ, బరువు తగ్గడానికి రాజయోగం, భవిష్యత్తు చెప్పడానికి హస్త, పాద సాముద్రికాలు పనికొస్తాయి. మీకొచ్చిన అరవై నాలుగు కళలనీ నరకం మేనేజ్మెంటు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది. ఏమీ భయంలేదు. మీరింక వీర బిజీ.” నవ్వుతూ చెప్పేడు యముడు.
చిత్రగుప్తుడు మరో ప్రాణాన్ని పిలవడానికి చిట్టా తిరగేశాడు.
అయిదో ప్రాణి వచ్చింది. అంతట్లోనే, “ఈవిడో ప్రతినకలు సంపాదక కళాకారిణి!” చిత్రగుప్తుడి కంఠం వినిపించింది.
“ఇదేం కొత్త ఉద్యోగం?” యముడు ఆశ్చర్యపడ్డాడు.
“ఈవిడ చేసే ఉద్యోగం ఏమిటంటే ఓ కొత్త బ్లాగు తెరిచి ఎక్కడెక్కడి బ్లాగుల్లో ఉండే విషయాలూ నకలు తయారు చేసుకుని తన బ్లాగులో, తన పేరు మీద తానే రాసినట్టూ అంటించడమే. వీళ్ళని కాపీ ఎడిటర్లు అనే వారు ముందు ఇప్పుడు కాపీ పేస్టు ఎడిటర్లు అంటున్నారు.”
“అదేం పని? అవతలి వాళ్ళ టపాలు అలా దొంగిలిస్తే అది గ్రంథచౌర్యం కాదూ?”
“నిజమే కానీ అలా ఎవరైనా అన్నారా, గొంతు చించుకుని ఫలానావాడికి మతి పోయిందహో అని ఉన్న ప్రసార మాధ్యమాలలో, వెబ్ సైట్లలో అలా ఎక్కడపడితే అక్కడ, కనబడిన ప్రతీ చోట ఊరకుక్కల్లా అరుస్తారు.”
“మరి అసలు రాసినాయన, ఆవిడ ఏవంటారు?”
“వాళ్ళేమంటారు పాపం, ప్రతీ టపా రాశాక, చివర్లో ‘దేవుడా, ఈ టపా ఎవరూ ఎత్తుకుపోకుండా చూడూ!’ అని రాసుకుంటున్నారు.”
“న్యాయ శాఖలూ, ప్రజలూ ఏమీ చేయరా?”
“న్యాయశాఖా? అటువంటిదొకటి ఉందా విశాలభారద్దేశంలో అనేది అనుమానమే. అయినా ఎవరికండీ అంత తీరిక? ఎవడి గోల వాడిది. తన పని అయిపోయిందంటే చాలు. అయినా మీరు భలే ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను; న్యాయం, ధర్మం అనేవి ఉంటే ఈ గుమ్మం ముందు ఇంతమంది లైనులో ఉంటారంటారా?”
“మరి ఈ కళాకారిణి పనిచేసే చోట యాజమాన్యం ఊరుకుంటుందా?”
“వాళ్ళకేం? వాళ్ళ పత్రికల్లో, వెబ్ సైట్లలో ఏదో ఒకటి ఉంటే చాలు ఖాళీలు నింపడానికి. ఎన్ని ప్రతులు అమ్మితే వాళ్ళకంత ఆనందం. ఏదైనా తేడాలొస్తే ఇటువంటి కళాకారుల్ని తొలగించి మరొకళ్ళని తీసుకుంటారు ఉద్యోగంలోకి. తర్వాత మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అన్నట్టూ ఈ కళ అప్రతిహతంగా సాగిపోతూ ఉంటుంది.”
“ఈవిడ తిక్క కుదరాలంటే ప్రస్తుతం ఆర్కైవుల్లో ఉన్న తెలుగుకి సంబంధించిన మొత్తం పుస్తకాలన్నింటినీ ఒక్కొక్కటీ పదేసి సార్లు చొప్పున తప్పులు రాకుండా రాయించండి. ఎక్కడైనా ఒక్క తప్పు వచ్చిందా, అన్నీ మళ్ళీ తిరగ రాయడమే.”
లోపలకెళ్ళబోయే కళాకారిణి ఏడుపుమొహంతో అంది యమధర్మరాజుతో, “కంప్యూటర్లో కాపీ పేస్టు చేసేస్తే ఈజీగా అయిపోతుంది కదా మిస్టర్ రాజ్? నాచేత రాయించడం దేనికీ?”
“మళ్ళీ కాపీ పేస్ట్ అంటున్నావే, ఎవరక్కడ? ఈవిడకి విరిగిపోయిన పెన్సిలు ముక్కలూ, ఒకవేపు మాత్రం ఖాళీగా ఉండే చిత్తుకాయితాలు ఇవ్వండి. వాటిమీదే రాయాలి అన్నీ చేత్తోటి. పెన్సిలు చెక్కుకోడానికి, గెడ్డం గీసుకోగా విరిగిపోయిన బ్లేడు ముక్కలు ఈవిడ మొహం మీద పారేయండి. పెన్సిలు చెక్కుతుంటే వేళ్ళు తెగినా సరే రాయడం ఆపడానికి లేదు.”
“ఈయనో స్వేఛ్ఛా వ్యాఖ్యాత,” చిత్రగుప్తుడు అంటూండగానే ఆరో ప్రాణి ముందుకొచ్చింది.
“ఈయన పాపాలు?”
“ఈయనికి బ్లాగు రాయడం చేతకాదు. కధలు రాద్దామని మొదలుపెట్టాడు కానీ రెండు పేరాలు రాయగానే అదీ కుదర్లేదు. అంచేత అప్పట్నుండి అగ్రిగేటర్ల మీద, అంతర్జాల పత్రికల మీద, అలా ఒకటేమిటి ఎక్కడపడితే అక్కడ పడ్డాడు. ఎవరు ఏం రాసినా దానికో వ్యాఖ్యానం రాయడం ఈయన ప్రత్యేకత.”
“అందులో తప్పేముంది?” యముడు అడిగేడు, ‘స్వేఛ్చగా తన అభిప్రాయం చెప్పడం’ కనీసపు హక్కు కదా భూమ్మీద ప్రజలకి?”
“అవునండి. కానీ ఈయన చేసేది వేరు. రాసిన ప్రతీదానిలో – పత్రిక అవనీయండి, బ్లాగు అవనీయండి – కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకినట్టూ తప్పులు వెదుకుతూ రాసేవాళ్ళని దుయ్యబడుతూ ఉంటాడు. ఉదాహరణకి చూడండి. తెలుగు ఇళ్ళలో ఏ వంటైనా సునాయాసంగా చేసేయొచ్చు కానీ ఘుమఘుమలాడే చారు చేయడం అత్యంత కష్టం అని తెలుసు కదా? ఓ నీలిమగారు చాలాకాలం కష్టపడి ఈ విద్య నేర్చుకుని చారు ఎలా చేయొచ్చో రాసుకున్నారు ఆవిడ బ్లాగులో. ఈయన అందులో కామెంటారు – ‘ఆమాత్రం చారు గురించి ఎవరికి తెలియదు? ఇలాంటి పనికిరాని వ్రాతలు ఆపండి!’ అంటూ. ఆవిడేమో బ్లాగు మొదలుపెట్టి పాపం ఒక్క నెల అయింది. ఈ కామెంటుతో బాగా నిరుత్సాహం వచ్చి బ్లాగు మూసేశారు. ఈ పెద్దమనిషి, ఒక్కోసారి ఏ బ్లాగు ఐనా నచ్చకపోతే దానికి కౌంటర్ బ్లాగులు తయారు చేస్తూంటారు కూడా. ఉదాహరణకి, ఒకాయన ‘సొంత-ఇల్లు’ అనే బ్లాగులో ఇల్లు కట్టుకోవడంలో ఉన్న సాధక భాధకాలు రాసుకుంటున్నారు. ఈ ప్రబుద్ధుడు ‘దరిద్రం-కొంప’ అనే కౌంటర్ బ్లాగు మొదలు పెట్టారు. సొంత-ఇల్లు బ్లాగులో ఎడ్డెం అంటే దరిద్రం-కొంప బ్లాగులో తెడ్డెం అని ఆయన్ని ఏడిపించడం మొదలుపెట్టారు. ఆఖరికి సొంత-ఇల్లు బ్లాగు మూసేసేవరకూ ఈయన ఊరుకోలేదు.”
“అవునా, దీనికి తగిన శిక్ష పడవల్సిందే”
“ఇంకా వినండి. ఈయనకి పేరూ ఊరూ లేవు. ఏదో ఒక నకిలీ పేరుతో కామెంటుతూ ఉంటారు; అదీ బ్లాగు రాసే రచయితలు అడిగితే. అడక్కపోతే ఈయనో అనామక అనో అజ్ఞాత అనే వాటితో కామెంటడం. కొండొకచో అసలు కథో, బ్లాగో ఏ విషయం మీద రాశారో ఆ విషయం మర్చిపోయి మిగతా విషయాల్లో దెబ్బలాడుతూ ఉంటారు మిగతా బ్లాగర్లతోనూ కామెంటర్లతోనూ. దీనితో వీళ్ళు సంపాదకులకి కూడా తలనెప్పి.”
“ఇందాకట్నుంచి వింటున్నాను మీ నోట్లోంచి. కామెంటడం అంటే?”
“చెప్పాను కదండి? వ్యాఖ్యానం అంటే ఇప్పుడు తెలుగువాళ్ళకి ఎవరికీ అర్ధం కాదు. సగం దేవభాష రాసి తీరవల్సిందే ప్రతీ పదంలోనూ. అందుకే వ్యాఖ్యానం రాయడాన్ని కామెంటడం అని అంటున్నారు. ఇప్పుడిది నిఘంటువుల్లోకి కూడా చొచ్చుకుపోయి ఉండొచ్చు కూడా…”
యముడి మొహంలో కోపం కనిపించింది.
“…కథారచయితలకీ, సంపాదకులకీ, బ్లాగు రాసేవాళ్ళకీ ఈయనో పెద్ద రాచకురుపు లాంటివాడు. ఇలాంటి వాళ్ళని ఏరిపారేయడానికి రెండు దార్లు ఉన్నాయి. కామెంట్లు పూర్తిగా తీసిపారేయడం మొదటిది. దీనివల్ల ఎంతమంది చదువుతున్నారో తెలిసినా ఎవరేమనుకుంటున్నారో తెలియదు. కానీ తెలుసుకోవడానికి వేరే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రయత్నించాలి. రెండోది బ్లాగో, పత్రికో మూసేసి నోరు మూసుక్కూర్చోవడం. అందువల్ల ఈయనకి తెలుగు భాష నాశనం కావడానికి వేసిన సమిధల్లో ఇరవై శాతం వాటా ఉంది.”
యముడు మౌనంగా తల పంకించేడు. చిత్రగుప్తుడడిగేడు, “ఏమి శిక్ష ఖాయం చేద్దామనుకుంటున్నారు?”
“మన ఆర్కైవుల్లో తెలుగు సాహిత్యం ఎంత పెద్దదుండొచ్చు?” యముడు అడిగేడు.
“బ్లాగు సాహిత్యమా? అంతర్జాల సాహిత్యమా?”
“రెండూ కాదు; అసలు తెలుగులో మొదటి పుస్తకం వ్రాయబడిన దగ్గిర్నుంచి ఈ రోజు వరకూ ఎక్కడ ఏవిధంగా వ్రాసినదైనా సరే?”
“అబ్బో, అనేకానేక షిలెంట్నో బైట్లు ఉండొచ్చు.”
“ఈయన్ని ఆ ఆర్కైవుల దగ్గిర కూర్చోబెట్టి ఆ సాహిత్యంలో తప్పులన్నీ దిద్దమనండి. అవి దిద్దడానికి ముందు, పచిసూ ప్రధమ శిక్షణ కలిపితే మరీ మంచిది.”
“ఏడో ప్రాణి సుబ్బారావుగారనబడే చిన్న సైజు రాజకీయనాయకుడు. ఈ తెలుగు బ్లాగులూ అవీ మొదలు పెట్టగానే తాను ఒకణ్ణి నియమించి, ‘తన పార్టీ నాయకులు తప్ప మిగతా వాళ్ళంతా చేసేదంతా చెత్త’ అని రోజూ చెప్పడమే ఈయన పని. ఈయన పేరు మీరు ఇంతకుముందు విని ఉండవచ్చు.” చిత్రగుప్తులవారు చెప్పేరు.
యముడి మొహంలో నవ్వు గోచరించింది. “తెలియకపోవడమేం? ఆ మధ్య ఎవరో చంపబోతే మన గుమ్మం దాకా వచ్చేసరికి ఈ శాల్తీకి ఇంకా ఆయుర్దాయం ఉందని వెనక్కి పంపించేశాం కదూ. ఈయనికీ ఓ బ్లాగుందని ఇప్పుడే వినడం. అన్నట్టు ఈయన పద్మశ్రీలు, పద్మవిభూషణలూ ఇచ్చే సమితిలోనూ, సినిమాలకి ఇచ్చే అవార్డుల్లోనూ సభ్యుడనుకుంటా? ఆ మధ్య అభయారణ్యం అనేదేదో మొదలు పెట్టినట్టున్నారు?”
“అవును పులులనీ, కృష్ణ జింకల్నీ ఉంచడానికీ, పెంచడానికీ శ్రీశైలం వెళ్ళేదారిలో అభయారణ్యం మొదలుపెట్టారు.”
పులీ, కృష్ణ జింకా అనేసరికి యముడు ఉత్సాహంగా అడిగేడు “ఆ అభయారణ్యం బాగుందా? అది మొదలుపెట్టి అంతమవ్వబోయే జీవుల్ని రక్షిస్తున్నందుకు ఈయనకి చాలా పుణ్యం వచ్చి ఉండాలే?”
“మీరు ఈ రోజు ఆఫీసుకి రాగానే మొదట్లోనే ఓ ప్రాణి కాకా పట్టడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని ఏమందో గుర్తుందా?”
“సత్తెకాలపు సత్తెయ్య అన్నట్టు గుర్తు.”
“నన్ను శపిస్తారని భయపడుతున్నాను కానీ ఆ ప్రాణి చెప్పిందే నిజమనిపిస్తోంది ఇప్పుడు. ఈయన సృష్టించిన అభయారణ్యంలో కుప్పలు తిప్పలుగా గ్రామ సింహాలూ, కిష్కింధా వాసులు తప్ప మరెవరూ లేరు.”
“అదేం?”
“ఒక్కసారి ఆలోచించండి యమరాజా, పులులు ఉంటే వాటి చర్మం కోసమో, గోళ్ళ కోసమో, జింకలుంటే తినడానికీ తప్ప వాట్ని పెంచడానికి ఎవరికండీ ఆత్రుత? హనుమంతుడు గుర్తొచ్చి ఊరుకుంటారు కానీ లేకపోటే ఆ శునకాలనీ వానరాల్ని కూడా ఏదో ఒకరోజు ఆరగించేవారే. అందుకనే ఆ అభయారణ్యాలలో కుక్కలూ, కోతులూ తప్ప మరోటి ఉండవు.”
“మరి ఈ సినిమా, పద్మ సమితుల్లో ఉండీ ఏమైనా సేవ చేశాడా?” యముడు ఒక్కసారి నీరసపడిపోయి అడిగేడు.
“చేశాడండి – తెలుగువాళ్ళక్కాదు గానీ, వేరే భాషల వాళ్ళకి. తెలుగు సినిమాలూ, తెలుగు కళాకారులు పద్మ అవార్డులకి పనికిరారని నొక్కి వక్కాణించి చెప్పేవారు ప్రతీ మీటింగులోనూ. చెప్పడం మరిచాను సుమా, ఈయన ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించే కమిటీలో కూడా సభ్యుడే. వేరే దేశంలో జరిగిన ఆ సభలకి – తెలుగు పండితులనీ, రచయిత(త్రు)లందర్నీ ఓ పక్కన పెట్టి – ప్రత్యేక ప్రతినిధులుగా ఎక్కడెక్కడి తన బంధుకోటినీ, స్నేహితుల్నీ చేర్చుకుని వాళ్ళందరికీ ఉచిత విమానం టికెట్లూ అవీ ఇచ్చి, సంతోషం కల్గించారు కూడా.”
యముడు సుబ్బారావు కేసి చూశాడు సమాధానం కోసం.
సుబ్బారావు చెప్పేడు అతి శాంతంగా, “పద్మ అవార్డులకి మీటింగ్ కమిటీకి నాయకుడు బెంగాలీ వాడు. ఆయన ఇష్టప్రకారం తందాన తాన అనకపోతే వచ్చే ఏడు కమిటీలో నా పేరు ఉండదు. అందుకని అలా చెప్పాల్సి వచ్చింది. ఇక పోతే తెలుగు మహాసభల్లో మా వాళ్ళకి మేము సహాయం చేసుకోపోతే మీరు చేస్తారుటండీ? చోద్యం కాకపోతే? ఏమీ తెలియనట్టు కొత్తగా అడుగుతారేం?”
“నువ్వు పుట్టినది తెలుగునాట అయ్యుండీ సాటి తెలుగువాళ్ళకి అన్యాయం చేయడానికి సిగ్గులేదూ?”
“ఎందుకండీ సిగ్గు? దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి జయ జయ ప్రియ భారత జనయిత్రీ అనే పాటని జాతీయగీతం కాకుండా అడ్డుకున్న నా ముందు తరం తెలుగువాళ్ళ మీద అరవకూడదూ, నా మీద అరవకపోతే? వాళ్ళు చేయగా లేంది నేను చేస్తే తప్పా? అయినా బాపూకి ఆఖరి రోజుల్లో పద్మశ్రీ ఇచ్చాం కదా? ఇంకా ఎందుకు ఏడుపు?”
“చూశారుగా ఈయన భాష, వ్యవహారం, మాట్లాడే పద్ధతీను?” చిత్రగుప్తుల వారు హెచ్చరించారు యముణ్ణి.
యముడు గంభీరంగా చూస్తూ చెప్పేడు, “ఈయనని భస్మ ఖచిత తృణ సింహాసనం మీద కూర్చోబెట్టి తల మీద అ-ఆ అంటూ అటూ, ఇ-ఈ అంటూ ఇటూ నిరంతరం చలిస్తూ హరిణ శార్దూలాస్థికలతో చేసిన రుధిరం మధించే కిరీటం ఏర్పాటు చేయండి.”
“నాకు ఏకంగా కిరీటమే?” సింహాసనం, కిరీటం అనేది తప్ప మిగతా ఏమీ అర్ధమవ్వని అసలు సిసలు తెలుగు రాజకీయనాయకుడు సుబ్బారావు సంబరపడిపోతూ అడిగేడు.
“అవును కిరీటమే, మరి ఇంతమందికి సహాయం చేసిన నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా? ఓ సారి తలమీద పెట్టాక తెలుస్తుంది ఎంత బాగుంటుందో, వెళ్ళి ఆనందంలో ఓలలాడు,” చెప్పేడు యముడు గుంభనంగా నవ్వుతూ.
డబ్బూ, అధికారం అనే మాటలు వినగానే ఒళ్ళు తెలియకుండా పోయే రాజకీయ నాయకుడిలా సుబ్బారావు ప్రాణి ముందూ వెనకా చూసుకోకుండా సంతోషంగా నరకం లోకి పరుగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. యమభటులూ, చిత్రగుప్తుడూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా.
ఎనిమిదో ప్రాణి ముందుకి రాబోతూంటే, యముడు వాచీ చూసుకున్నాడు. ఇంకా లైన్లో చాలా మంది ప్రాణులున్నారు. మధ్యాహ్నం ఇంటికెళ్ళడం కుదరదేమో?
“ఈయన మీరోజు పత్రిక ఎడిటర్ గారు.”
“ఈయన చేసిన పాపం?”
“ఈ ఎడిటర్ ‘అసలు తెలుగు రచయితలు రాసేదంతా చెత్త’ అని ప్రతీదీ తిరగ్గొట్టేస్తూ ఉండడం వల్లే బ్లాగర్లు స్వంతంగా అచ్చు వేసుకోవడానికి తెలుగు బ్లాగులనేవి ప్రారంభం అయ్యేయి. ఈయన ప్రారంభించిన ఓ అంతర్జాల పత్రిక వల్ల అచ్చుపత్రికలు హరీ మన్నాయి కూడా. అంచేత ఈయన ఈ బ్లాగులు పుట్టడానికీ, కొండొకచో చావడానికీ కూడా కారకుడు. ఇటువంటివాళ్ళు లైన్లో ఇంకా చాలామంది ఉన్నారు వెనక.”
“ఔరా,” యముడు ఆశ్చర్యపోతూ “దీనికేం సమాధానం చెప్తావ్?” అన్నట్టు ఎడిటర్ కేసి చూసేడు.
“అయ్యా నా దగ్గరకి నెలకో యాభై నుంచి అరవై దాకా కధలు వస్తాయి. అందులో నేను వేసుకునేవి నాలుగు. మా పత్రిక పెద్ద పేరున్న రచయితల రచనలు మాత్రమే వేసుకుంటాం. మరి తిరగ్గొట్టకపోతే ఎలా?”
“నల్లపరాగమర్తినేని వెంకట సత్య నాగ సూర్య వీర హనుమంత వెంకటేశ్వర్రావు పెద్ద పేరు కాదా? ఆయన పంపించిన కధ వేసుకోలేదేం?”
“ఆయన కధలో చివర్లో రావాల్సిన మలుపు రాలేదు. అది మరీ చందమామ కధలా ఉంది. అయినా పెద్ద పేరు అంటే అసలు పెట్టిన పేరు కాదండి. కధల్రాయడంలో పేరు ఉండాలి.”
“మరి మీరు వేసుకున్న ఆ నాలుగు కధలూ మీ బామ్మర్ది రాసినవే కదూ?” చిత్రగుప్తుడు అంటించేడు చురక.
“మీకెలా తెల్సిపో…” అంటూ నాలుక్కర్చుకున్నాడు ఎడిటర్.
చిత్రగుప్తుడు చిట్టా కేసి, అక్కడున్న ‘మైండ్ బోగిల్’ అనే వేగంగా పనిచేసే సెర్చ్ ఇంజన్ కేసి చూపించి చిరునవ్వు నవ్వితే, యముడు పెళ్ళున నవ్వేడు ఎడిటర్ అజ్ఞానానికి. మొత్తమ్మీద ఇంకేమీ ప్రయాస లేకుండానే ఎడిటర్ నరకంలోకి తోయబడ్డాడు.
ఒళ్ళు విరుచుకోవడానికి యముడు కుర్చీలోంచి లేచి నుంచుని చెప్పేడు చిత్రగుప్తుడితో.
“వీళ్ళందర్నీ ఇలా విచారిస్తూ పోతే మనకి సాయింత్రం అయిపోయేలా ఉంది గానీ వీళ్ళందరికీ పచిసూ శిక్ష – మొత్తం అంతా కళ్ళుమూసుకుని పూర్తిగా అప్పచెప్పేవరకూ – ఖాయం చేయండి. నేను ఇంటికెళ్ళాలి.”
“మరి గిడుగు వారొప్పుకోవద్దూ?”
“ఒప్పుకోకపోతే, వీళ్ళు రాసే తెలుగు ఎలా ఉందో, వీళ్ళు బ్లాగుల్లో ఏం రాస్తున్నారో ఓ సారి మన ఆర్కైవులు తీసి చూపించండి. ఎందుకు ఒప్పుకోరో చూద్దాం.”
చిత్రగుప్తుడు నిజమే కదా అన్నట్టూ తలాడించి చిరునవ్వు నవ్వేడు. మరుక్షణంలో లైనంతా ఖాళీ అయింది.
యముడూ, చిత్రగుప్తుడూ ఇలా మాట్లాడుకుంటూండగానే ఒకావిడ గుమ్మంలోంచి లోపలకి వచ్చింది. ధగధగలాడే పట్టుచీర, కొప్పుముడి, ఓ చేతిలో కలశం, మరో చేతిలో చెరుకుగడ ఇటువంటివేమిటో ఉన్నాయి. మహాలక్ష్మి నరకానికి ఎలాగా రాదు కనక మరీవిడ ఎవరా అనుకుంటూ అప్రయత్నంగా యముడు ఆసనం మీద నుంచి గౌరవ సూచకంగా లేచి నిలుచున్నాడు.
వచ్చినావిడ కన్నీళ్ళు ఆగకుండా కారుస్తూంటే, యముడు చిత్రగుప్తుడి వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
“ఈవిడేనండి తెలుగు తల్లి!” చెప్పాడు చిత్రగుప్తుడు.
అప్పటిదాకా ఎవరో దేవత తనని శపించడానికొచ్చిందేమోనని భయపడుతున్న యముడు హాయిగా ఊపిరి పీల్చుకుని అడిగాడు, “అమ్మా నువ్వు? ఇక్కడా?”
తెలుగు తల్లి కళ్ళు తుడుచుకుంటూ నోరు విప్పి చెప్పింది.
“నాయనా, భూభారం పెరిగినప్పుడు భూదేవి బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నట్టూ నేను మొదట్లో బ్రహ్మదేవుడి దగ్గిరకి వెళ్ళాను. ఆయన ఇప్పుడు మీరిద్దరూ తెలుగు పాపులకి శిక్షవేస్తున్నారనీ త్వరలోనే తెలుగు భాషకి మహర్దశ రాబోతోందనీ చెప్పి ఇలా పంపించాడు. ఏమైంది మీ శిక్ష సంగతి? నాకేమిటి ఒరిగేది వీటివల్ల?”
చేతులు జోడించి యముడు చెప్పాడు: “అందరికీ శిక్ష విధించాము. వీళ్ళందరూ మళ్ళీ పుట్టి పచిసూతో మొదలుపెట్టి వాడుక భాష నేర్చుకుంటారు. అసలు మొదట్లోనే పచిసూ చదవడం వల్ల నోరు తిరగక ఆ తర్వాత వాడుక భాష గొప్పదనం అర్ధమౌతుంది. పచిసూ వల్ల మరో లాభం ఏమిటంటే, అది పెద్ద బాల ‘శిక్ష’ కన్నా కష్టం కనక మొదట్నుంచీ తెలుగంటే చిన్నచూపు ఉన్న వీళ్ళందరికీ అది ఈ మూలనుంచి ఆ మూలదాకా కంఠతా వచ్చేదాకా చదివి చదివి తిక్క కుదురుతుంది. అంతకన్నా పెద్ద శిక్ష ఇంకేమీ అక్కర్లేదనే అనుకుంటున్నాము. ఆ జగదభిరాముడు పోతనచే రాయించిన, ఎప్పటికీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే కావ్యం ఒకటి ఈ తెలుగువాళ్ళకుంది కనక, ఓ సారి పచిసూ ఒళ్ళు దగ్గిరపెట్టుకుని చదివేకా పోతన భాగవతంలోని ద్రాక్షాపాకం సులభంగా అర్ధమై భాష అంటే గౌరవం కలుగుతుంది. శిక్షలైతే విధించగలం కానీ ఓ సారి పుట్టాక వీళ్ళని ఎలా బతకాలో శాసించలేము కదా? నాలుగు యుగాల్లో ధర్మం ఒక్కో పాదం పోగొట్టుకుంటూ నడుస్తుందని తెలుసు కదా తల్లీ, అటువంటిదే ఇదీను. ఇప్పటి పరిస్థితుల్లో తెలుగు ఇలా ఉంది. ధర్మం ప్రకారం రాబోయే రోజుల్లో నాలుగు పాదాలతో కళకళ లాడుతుందని ఆశిద్దాం. మేము చేయాల్సిన పని మేము చేశాం. ఆ తర్వాత ఆ పరమేశ్వరుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అని కదా గీతా వాక్యం? రాబోయే రోజుల్లో ధర్మం ప్రకారం జరగకపోతే ఏమి చేయమంటావు అని నన్ను అడక్కు. ధర్మ రక్షణ అనేది నా పని కాదు. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని చెప్పిన ఆ పెద్దాయనే చూస్తాడు ఆ సంగతి.”
“పచిసూ శిక్ష అంటే?” తెలుగు తల్లి అడిగింది యముణ్ణి అనుమానంగా చూస్తూ.
“పరవస్తు చిన్నయ సూరి, ఆయన రాసిన బాల వ్యాకరణమూ” చెప్పేడు యముడు.
అప్పటివరకూ కన్నీళ్ళతో ఉన్న తెలుగు తల్లి ఒక్కసారి ఫకాల్న నవ్వి కళ్ళు తుడుచుకుంటూ యముడి దగ్గిర శెలవు తీసుకుని నరకంలోంచి భూమ్మీదకి నిష్క్రమించింది.
యముడు ఆ రోజుకి ఆఫీసు కట్టేసి ఇంటికెళ్ళడానికి మహిషాన్ని అధిరోహిస్తూంటే సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చిన చిత్రగుప్తుడు మెల్లిగా అన్నాడు, “వారాంతమైనా, ఈ రోజు శ్రమ అనుకోకుండా ఆఫీసుకి వచ్చినందుకు ధన్యవాదములు.”
“సరే గానీ. ఈ కన్నీళ్ళు పెట్టుకున్న తెలుగు తల్లిని చూస్తూంటే పోతన పద్యం గుర్తొచ్చింది సుమా!”
“ఏవిటా పద్యం? ఎలాగా ఇంటికి వెళ్ళిపోతున్నారు కనుక ఆ పద్యం చెప్పేసి వెళ్ళిపోండి అయితే”
ఉ. కాటుక కంటి నీరు చనుగట్టుపయిం బడ నేలయేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
యముడి నోట్లోంచి వచ్చే పద్యం విన్న చిత్రగుప్తుల వారు కైటభ మర్దనుణ్ణి తల్చుకుంటూ చేతులు జోడిస్తూంటే, ఘంఠికలు సుతిమెత్తగా మ్రోగించుకుంటూ మహిషం వడివడిగా ముందుకి సాగిపోయింది.