మొట్టమొదటి సారాకాపు

మొహం వేళ్ళాడేసుకుని చిన్నభూతం నరకం లోకి వచ్చి పడింది. ఉట్టి చేతుల్తో లోపలకొచ్చిన చిన్నభూతాన్ని చూసి అందరూ నొసలు చిట్లించేరు. ఎన్ని సార్లు అవకాశం ఇచ్చినా ఈ భూతం పాఠం నేర్చుకున్నట్టులేదు. ఎంత చెప్పినా నరకానికి తీసుకొచ్చే వాళ్ళలో వర్తకులో, మామూలు జనమో, మిగతా దొంగలో, దొరలే కానీ ఒక్కడు కూడా ఒళ్ళు వంచి కష్టపడే వ్యవసాయం చేసుకునే వాడు లేడు. ఇదెలా కుదురుతుంది? ఇలా అయితే నరకంలో సమతూకం ఉండొద్దూ? అందుకే ఆ పని చిన్నభూతానికి అప్పగించేరు. ఈ చిన్న భూతానికి పని నేర్చుకుందామనే పట్టుదలా, శక్తీ లేవా? పనికిరాని భూతాలు నరకంలో దేనికీ? రెండు దెబ్బలు తగిల్తే ఒళ్ళు దగ్గిర పెట్టుకుని పని చేయొచ్చు.

“ఈ సారి కూడా అంతేనా?” చిన్నభూతాన్ని అడిగింది పై అధికారైన ముసలి పిశాచం.

“ఎంత కష్టపడినా…” నీళ్ళు నానుస్తున్న చిన్న భూతం కేసి ఉరిమి చూసింది ముసలి పిశాచం.

“నోట్లోంచి మాట రాదేం? ఎంతమందిని తీసుకొచ్చేవు ఈ రోజున?”

“ఎవరినీ తీసుకురాలేదు.”

“ఓరి చేతకాని వెధవా? ఇక్కడున్న వాళ్ళని చూడు. వీళ్ళందరూ నీతో పాటు మొదలు పెట్టిన వాళ్ళే ఈయన రెండువేలమంది వకీళ్ళనీ, అటుపక్కనున్నాయన ఆరువేలమంది వర్తకులనీ, ఆ చివర్లో ఉన్నాయన పదివేలకి పైబడి జనాల్ని తీసుకొచ్చేరు. నువ్వేమో చేతులుపుకుంటూ వచ్చావా? నీకు పని చెప్పిన ఈ రెండేళ్ళలో నువ్వు నేర్చుకున్నదేం లేదన్నమాట. సిగ్గూ, శరం లేదూ?” ముసలి పిశాచం అరిచింది.

“రెండువేలమంది వకీళ్ళే? వకీళ్ళని తీసుకురావడం సులువా?” చిన్న భూతం నోరెళ్ళబెట్టింది.

“సులువా అంటే సులువే. మొదట్లో ఈ వకీళ్ళు న్యాయమూర్తులతో కలిసి జనాల్ని మోసం చేసేవారు. ఇప్పుడేమో ఈ వకీళ్ళు జనాలతో కలిసి వాళ్ళనే మోసం చేస్తున్నారు. ఇదెంతవరకూ వచ్చిందంటే కారణం ఏమీ లేకుండానే వ్యాజ్యాలు బయటకొస్తున్నాయ్. అంటే వాళ్ళకు వాళ్ళే నరకంలోకి రావడానికి తహతహ లాడిపోతున్నారు. నేనక్కడ నుంచుని చేసేది, రండి రండి అని స్వాగతం పలకడమే,” కన్ను కొడుతూ చెప్పింది వకీళ్ళ భూతం చిరునవ్వుతో.

చిన్న భూతం నాయకుడి కేసి తిరిగి అంది క్షమాపణలతో, “నా తప్పేం లేదండి ప్రభో. ఎంత కష్టపడి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా ఈ రైతులెవరికీ కోపం రాదు. ఎంత ఏడిపించినా కోపం తెచ్చుకోకపోతే నేనేం చేయనూ?”

“నువ్వు ఇప్పటిదాకా ఏం చేశావో చెప్పి అఘోరించు ముందు!”

“ఓ రైతు పొలం దున్నుతుంటే వాళ్ళావిడ మధ్యాహ్నం భోజనం పంపించింది. అది వాడికి కనపడకుండా ఎత్తుకొచ్చాను. ఏదో దొరికినది తిని కడుపు నింపుకుందాం అనుకుంటూంటే ఏమీ దొరక్కుండా చేశాను. ఆఖరికి వాడు తాగే నీళ్ళలో మట్టి కలిపేశాను. అయినా వాడు అవే తాగుతూంటే మధ్యలో గిన్నె కింద ఒలికిపోయేలా చేశాను. దేనికీ కోపం తెచ్చుకోలేదు.”

“మరి ఏమంటాడు?”

“నా భోజనం పోతే పోనీయ్. దొంగతనం చేసినాయినకి నాకంటే ఎక్కువ ఆకలేస్తోందేమో. భగవంతుడు నాకు మరేదో పంపించడా, అని ఖాళీ కడుపుతో కళ్ళు మూసుకు పడుకున్నాడు.”

“మళ్ళీ భగవంతుడి పేరెత్తావూ? నువ్వు చేసేదేమీ లేదు కానీ ఆయన పేరెత్తి నా దుంప తెంపేలా ఉన్నావు.”

“రైతు అన్నదే నేను చెప్పాను, నన్నేం చేయమంటారు? పోనీ నన్ను వేరే చోటకి మార్చి చూడొచ్చు కద?” బతిమాలుతున్నట్టూ అంది చిన్న భూతం.

“కుదరదు,” కరుగ్గా వచ్చింది సమాధానం, “నువ్వు ఈ రైతుల పని పట్టేదాకా అక్కడ ఉండవల్సిందే. నీ చేతకానితనం ఇంకోచోట ఎందుకూ? ఇంకా ఏమైనా కొత్త ఆలోచనలు ఉన్నాయా నీ దగ్గిర?”

“లేవు.” ఏడుపు మొహంతో తల అడ్డంగా ఊపింది చిన్న భూతం.

“చూడబోతే నీ పని కూడా నన్నే చేయమనేలా ఉన్నావే?”

“…”

“పోనీ కదా అని ఇప్పటిదాకా ఊరుకుంటూంటే ఇదన్న మాట నువ్వు చేసే నిర్వాకం. ఎవరక్కడ? ఇలా కొరడాలు పట్టుకుని రండి. ఈ చిన్నభూతానికో రుచి చూపిద్దాం”

“ప్రభో ఇంక కొట్టకండి. ఏదో ఒకటి చేసి ఈ సారి రైతుల్ని తీసుకొస్తా.” చిన్నభూతానికి వంటిమీద నాలుగు తట్లు తేలేసరికి ఏడుస్తూ అరవడం మొదలెట్టింది.

“ఏం? ఏమన్నా కొత్త విషయాలు తెలిశాయా?”

“లేదు. కానీ ఏదో ఒకటి కనిపెట్టి ఈ సారి తీసుకొస్తాను.”

“సరే ఫో అయితే. ఆఖరుసారిగా నీకు మూడేళ్ళు గడువు ఇస్తున్నాను. ఈ మూడేళ్ళలో కావాల్సినంత మంది రైతుల్ని తీసుకొచ్చావా సరే సరి లేకపోతే పాతరేయిస్తాను ఇక్కడే.”

“ఈ సారి రైతు దగ్గిర పనిచేసే పాలేరులా మారి వాళ్ళ లోపలి రహస్యాలు కనిపెడతానులెండి. ఓ సారి అవి తెలిస్తే ఏదో ఒకదారి కనిపించకపోదు.”


రైతు ఇవానోవిచ్ ఇంట్లోంచి బయటకొచ్చేడు ఖాళీ కుంచం తోటి. బయట పాలేరు నికోలాస్‌ గింజలు కొలుస్తున్నాడు.

“ఇంకా ఎన్నున్నాయ్? అవతల మన గిడ్డంగి పూర్తిగా నిండిపోయినట్టే. ఇంకేమీ పట్టేలా లేదు లోపల.”

“ఎందుకు పట్టదూ? లోపలకెళ్ళి పైనుంచి అంతా మళ్ళీ సర్దుదాం చదునుగా. నేను చేస్తాను కదా? ఇక్కడ ఇంకో రెండు మూడు బస్తాల గింజలున్నాయి. ఇప్పుడు దాచుకుంటే చలికాలం కష్టపడ్డక్కర్లేదు కదా?”

“సరే, కొలవడం అయ్యాక మళ్ళీ వస్తాను నేను. ఇప్పుడు చిన్న పనిమీద అలా ఊళ్ళోకెళ్ళాలి.”

“సరే వెళ్ళి రండి. ఇక్కడ పని నేను చూస్తాను.”

ఇవానోవిచ్ అటు వెళ్ళగానే పని తొందరగా కానిచ్చి పక్కనే ఉన్న గడ్డిమీద కాళ్ళు చాపి వెన్ను వాల్చేడు నికోలాస్. “హమ్మయ్య, ఈ పనితో వళ్ళు హూనం అవుతోందే కానీ ఇవానోవిచ్‌కి కోపం వచ్చే మార్గం కనిపించడం లేదే? నా పక్కనే నుంచుని నే చేసేదంతా చూస్తూంటాడు కనక నా టోపీ, బూట్లూ తీయడం కుదరదు ఆయన ముందు. టోపీ బూట్లూ తీయకపోతే తలా, కాళ్ళూ ఒకటే దురద. తీస్తే నా తలమీద కొమ్ములూ కాలివేళ్ళూ నేను చిన్న భూతాన్నని చెప్పేయవూ? ఆ రహస్యం కానీ తెల్సిందా మళ్ళీ నరకం దాకా వెళ్ళడం కాదు గానీ ఈ రైతే నన్ను ఇక్కడ పాతిపెడితే నా గతేమిటి? పంట నేను చెప్పినట్టు సాగు చేశాక ఇప్పుడు గిడ్డంగులన్నీ నిండి ఉన్నాయి. నా మీద గురి కుదిరింది కనక ఈ సారి కూడా నేను చెప్పినది చేయడానికి వెనుకంజ వేయడు. ఇదే అదను చూసి ఏదో మంత్రం వేశానా ఇంక వీణ్ణి బుట్టలో వేయడం సులభం. ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయాయి. నాకున్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే…”

నికోలాస్ ఆలోచనల్ని తెగ్గొడుతూ ఎవరిదో కంఠం వినిపించింది, “ఇవానోవిచ్ ఉన్నాడా ఇంట్లో లోపల?” వచ్చినాయన పక్కింటి రైతు, ఏదో చేబదులు కావాల్సి వచ్చినట్టున్నాడు.

“మా రైతు ఇంట్లో లేడు కానీ, చెప్పండి ఏం ఇలా వచ్చేరు?” నికోలాస్ అడిగేడు కంగారుగా టోపీ బూట్లూ సవరించుకుంటూ.

“చిన్న పని మీద వచ్చాను గానీ ఈ ఏడు పంట బాగుందా?”

“బాగానా? భలేవారే ఈ గింజలన్నీ దాచుకోవడానికి ఉన్న గోదాం సరిపోవట్లేదు. కళ్ళు అదిరిపోయేటట్టూ ఉంది మా దిగుబడి. ఇదిగో చూడండి,” గింజల్ని చేత్తో చూపిస్తూ అన్నాడు నికోలాస్.

“అదృష్ఠం అంటే మీదేనయ్యా, రెండేళ్ళ బట్టీ చూస్తున్నాను. ఊళ్ళో ఎవరికీ రాని దిగుబడి మీకెలా వస్తోందో కాని. ముందు ఎలా తెలుస్తోందో కానీ సరిగ్గా ఎక్కడ వెయ్యాలో అక్కడే వేస్తున్నాడు పంట ఇవానోవిచ్. పోయినేడు వర్షాలు అంతగా లేవు. చిత్తడి నేల చూసి పంట వేసుకున్నాడు ఈ ఏడు వర్షాలు అదే పనిగా కురుస్తూంటే ఏదో ముందే తెల్సినట్టూ మెరక మీద వేశాడు పంట. మొత్తం మీద రెండుసార్లూ బాగా దిగుబడి సంపాదించేడు సుమా. దిగుబడి మాట అటుంచి ఇంక ఈ గింజలకేసి చూడు, ఒక్కో గింజా దున్నపోతులా లేదూ?”

మాటల్లో ఇవానోవిచ్ వచ్చి నవ్వుతూ పలకరించేడు పక్కింటాయన్ని, “ఏం ఇలా వచ్చేరు?”

“ఆ, అదే ఈ పంట దిగుబడి గురించి మాట్లాడుతున్నాను మీ పాలేరుతో. ఏం దిగుబడీ, ఏం గింజలూ! ఎక్కడ సంపాదించారో గానీ ఈ విత్తనాలు. గిడ్డంగులన్నీ నిండిపోయాయని నికోలాస్ చెప్తున్నాడు. ఊళ్ళో రైతులం మాకు పంటలు అరకొరగా పండుతున్నాయి కానీ మీ అదృష్ఠం మాకు లేదు.”

“నిజమే, అసలు ఇదంతా నికోలాస్ మూలంగానే అనుకో. ఏ ఏడు పంట ఎక్కడ వెయ్యాలో నన్ను బలవంతంగా ఒప్పించి మరీ వేయించాడు. మొదట్లో నేను నమ్మలేదు కానీ తర్వాత్తర్వాత ఒప్పుకోక తప్పలేదు. ఈ నికోలాస్ మంచి పనిమంతుడే కాదు సరిగ్గా ఏది ఎప్పుడు చేయాలో తెల్సినవాడు కూడానూ.”

“అది మాత్రం ఒప్పుకోక తప్పదులే. ఇంతకీ ఈ గింజలన్నీ అమ్మేస్తున్నారా?”

“చూద్దాం లెండి ఇంకా ఆలోచించుకోలేదు. ఇంతకీ ఇలా వచ్చేరేం?”

“మా ధాన్యం ఈ ఏటికి అయిపోయినట్టే. తినడానికేమీ లేదు. మీకు బాగా పండుతోంది కనక ఓ బస్తా ధాన్యం ఇప్పిస్తారేమో అని అడగడానికొచ్చాను. మళ్ళీ వచ్చే ఏడు పంటకి తీర్చేస్తాను.”

రైతు ఇవానోవిచ్ ఏదో అనబోతూంటే పక్కింటాయన వెనకనున్న నికోలాస్, ‘వద్దు ఇవ్వకు’ అని సైగ చేసేడు. అది పట్టించుకోకుండా ఇవానోవిచ్ చెప్పేడు, “తప్పకుండా తీసుకెళ్ళండి. ఇదంతా మేము తినగలిగేదా? అమ్మినా ఇంకా బోలెడు మిగుల్తాయి.”