భగవానుడి ప్రసంగం అందరితోపాటు కూర్చుని వినడానికి ఆ రోజు ఆనందుడికి వీలు కుదిరింది. చీమ చిటుక్కుమంటే వినపడే నిశ్శబ్దంలో గంభీరంగా సాగుతోంది బుద్ధుడి ప్రసంగం.
“భవము అంటే పుట్టుక. ఈ జీవితంలో చేసే పనులకి మనం అనుభవించే కర్మకి పరిపాకం ఈ జీవితంలోనే కలగవచ్చు లేదా ఆయుర్దాయం సరిపోకపోతే ఆ కర్మ శేషం మరో జన్మ ఎత్తి అనుభవించాలి. కాలాన్ని మించినది మరొకటి లేదు. కళ్ళు మూసి తెరిచినట్టూ జీవితం గడిచిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవరూ తప్పించుకోలేనిది ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియని మృత్యువు. ‘అయ్యో ఈ భార్యాభర్తలు యాభై ఏళ్ళు ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఉన్నారు కదా, అందువల్ల ఒకరిని వదిలి ఒకర్ని తీసుకుపోవడం మంచిది కాదు’ అనే జాలి మృత్యువు ఎవరి మీదా చూపించదు. మనకి కలిగే నిరంతర జనన మరణాలే సంసారం. ఒక జీవితం తర్వాత మరో జీవితం ఎత్తుతూ అనేకానేకసార్లు జనన మరణ కష్టాలు పడడం అనేది ఒక చక్రం తిప్పడం వంటిది. మనం చేసే కర్మ బట్టి ఆ చక్రం ఎంత వేగంగా తిరుగుతుందో మనమే నిర్ణయిస్తున్నాం. ఈ జనన మరణ చట్రమే సులభంగా వదుల్చుకోలేని భవరోగం. ఈ భవరోగానికి ఒకటే చికిత్స. కర్మ చేయడం మానడం ఎవరికీ సాధ్యం కాదు కనక, ఎప్పటికీ తప్పని చావుని నిరంతరం గుర్తుపెట్టుకుంటూ ధ్యానంతో ధర్మం తెలుసుకోవడం, కర్మ ఫలాన్ని త్యాగం చేయడం, నిమిత్త మాత్రుడిగా కర్మ చేయడం ఒకటే దారి. సన్యసించడమంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయడమే. ఫలత్యాగం చేసిన కర్మ మనకి అంటుకోవడానికి ఆస్కారం లేదు. ఈ విధంగా వేగంగా తిరిగే జనన మరణ చక్రాన్ని ఆపుచేయడం సాధ్యమే కానీ ఇది అంత సులభం కాదు. సాధన విడవకుండా చేస్తూనే ఉండాలి. అయితే నిజంగా అందరికీ ధర్మం పూర్తిగా తెలిసి అవగతమౌతుందా అనేది మనమీదే ఆధారపడి ఉంది. ధర్మం, మహాబోధి అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి కాని దాన్ని ఎవరూ ఎవరికీ అరచేతిలో పెట్టి మీకు ఇవ్వలేరు. ఏనాటికీ మారనిది ధర్మం ఒకటే. ఒకసారి దాన్ని తెలుసుకోగానే ఆ ధర్మం అకాలికమని, అతర్క్యమని, అతి సూక్ష్మమని, ఎవరికి వారే తెలుసుకోదగ్గదనీ మనకి అవగతమౌతుంది. ఓ సారి ధర్మం అవగతమవగానే జనన మరణ చట్రంలోంచి విముక్తి కలుగుతుంది. అదే మానవజీవితానికి పూర్తి ఆనందాన్నిచ్చే దారి, మన పరమావధి కావాలి.”
ప్రసంగం అయ్యి అందరూ వెళ్ళాక ఆనందుడు భగవానుడి దగ్గిరకెళ్ళి అడిగాడు. “ఈ రోజు ప్రసంగంలో ధర్మం ఎవరికి వారే తెలుసుకోవాలి అన్నారు కానీ కొంతమందికి జీవితంలో తీరిక చిక్కకపోవచ్చు. కొంతమందికి తీరిక ఉన్నా ప్రయత్నానికి కోరికే ఉండకపోవచ్చు. మరి కొందరికి మన అంగుళిమాలుడికి, నర భక్షకులకి జరిగినట్టూ ధర్మం వైపు దృష్టి మరలి మనిషి ఒక్కసారి మారవచ్చు. మిగతావారి సంగతో?”
“మనకి చేయతనైంత చేయడమే. ‘ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఎలా లయం అవుతుంది, మిగతావారు ఏమౌతారు’ అనేటువంటి ఊహాజనిత విషయాల పై మనం ఏమీ మాటాడరాదు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జన్మలో ధర్మం తెలుసుకోవడం, భవరోగ నివారణ చేసుకోవడం ముఖ్యం కానీ ఈ ఊహాజనిత విషయాల పై ఎడతెగని చర్చల వల్ల ఏం ప్రయోజనం? నేను సన్యసించాక కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వవి వాటిని అవ్యాకృతాలని చెప్పుకుంటున్నాం. అటువంటి ప్రశ్నే నిన్ను అడుగుతాను చెప్పు. ఎప్పుడైనా పులి ఆహారం కోసం వేటాడం చూశావా?”
“పులి కాదు కానీ సింహాలు కలిసికట్టుగా ఓ ఎనుబోతును వేటాడటం చూశాను.”
“ఎనుబోతు ప్రాణం కాపాడాలని ప్రయత్నం చేశావా?”
“లేదు, నేను బంధులిడికి ఉన్నంత శారీరక బలం ఉన్నవాణ్ణి కాదు కదా?”
“పోనీ నీకు నిజంగా అంత శారీరక బలం ఉంటే ఎనుబోతు ప్రాణం కాపాడ్డానికి ప్రయత్నం చేసేవాడివా?”
“ఏమో, చేసేవాణ్ణేమో!”
“ఎనుబోతుని కాపాడితే సింహాల నోటిముందు ఆహారం పాడు చేసిన పాపం, ఆహారం లేక అవి చనిపోతే వచ్చే ఆ పాపం మూటగట్టుకోవా?”
“అవును అది కూడా సాధ్యమే.”
“ఈ పరిస్థితిలో ఏం చేయడం మంచిది? ఎనుబోతు ప్రాణం ముఖ్యమా, ఆహారం లేక చనిపోయే సింహాల ప్రాణాలు ముఖ్యమా? నువ్వు అక్కడ ఉన్నప్పుడెలాగో ఎనుబోతు ప్రాణం కాపాడినా నువ్వు అక్కణ్ణుంచి కదలగానే సింహాలు అదే ఎనుబోతునో మరో ప్రాణినో చంపుతాయి కదా తినడానికి?”
“…”
“అందుకే ఆ పరిస్థితిలో మనం ఏమీ చేయరాదు. ఈ సృష్టిక్రమంలో అటువంటివి ప్రకృతి నియమాలు. అటువంటి పరిస్థితులలో ఇటు సింహాలకీ సహాయం చేయలేం, అటు ఎనుబోతుకీ సహాయం చేయలేం. అలాగే మన దగ్గిరకి వచ్చే కొంతమందికి మనం ఏనాటికీ సహాయం చేయలేము; మనం ఎంత ప్రయత్నించినా కొంతమంది ధర్మమార్గం లోకి రాలేరు. అందుకే ఎవరికి వారు ఈ ధర్మ శోధన మొదలుపెట్టాలి కానీ మనం బలవంతంగా ఎవరికీ మార్చలేము. మన ప్రయత్నం మనం చేయడమే. ఆ తరవాత ఎవరి జీవితం వారిది. నేను మరొకరి కర్మకి ప్రేరణ, కారణం కూడా కాలేను. ధర్మమార్గం చూపించడం వరకే మన కర్తవ్యం. ఆ తర్వాత ఎవరి దారి వారిదే.”
“అడిగిన అందరికీ సన్యాసం ఇస్తూ భిక్షుసంఘంలోకి ఆహ్వానిస్తారు కదా. విరాజమానంగా ఉండే మీ రూపం చూపించినా అటువంటి వారిని మార్చలేమా?”
“నువ్వే చెప్తున్నావు కదా. నా దగ్గిరకి వచ్చి అడిగితే ఏనాడూ ఎవర్నీ కాదనలేదు. అంతేకానీ నా సిద్ధాంతాలని ఎవరిమీదా బలవంతంగా రుద్దలేదు. ఈ సంగతి ముందు రోజుల్లో నీకే బాగా తెలుస్తుంది; శ్రద్ధగా గమనిస్తూ ఉండు.” నవ్వుతూ ముగించాడు భగవానుడు.
కొన్నాళ్ళకి శ్రావస్తి నగరానికి బయల్దేరాడు భగవానుడు ఆనందుడితో. నగర ముఖద్వారం దగ్గిరలో ఓ ముసలి అవ్వ కూర్చుని బిచ్చం ఎత్తుకోవడం కనిపించింది. వడిలిపోయిన శరీరం, చిరిగిపోయిన బట్టలు, అసలు స్నానమనేది చేసి ఎన్నాళ్ళైందో అనిపించే మట్టికొట్టుకుపోయి, నెరిసిపోయిన జుట్టూ; అశుభ్రంగా ఉన్న వంటిమీద వాలుతున్న ఈగలూ. దీనాతి దీనంగా అతి భయానకంగా, జాలిగొలిపేలా ఉంది పరిస్థితి ఆవిడది. ఆనందుడికి గుండె గొంతులోకొచ్చిన్నట్టు అయింది. తిన్న ఆహారం నోట్లోంచి బయటకి తన్నుకుంటూ రాబోతూంటే తల తిప్పి తమాయించుకున్నాడు. బుద్ధుడు నడుస్తూంటే అందుకోలేక వెనకబడినా కొన్ని క్షణాలకి ఆయన్ని చేరుకుని అభ్యర్ధించాడు.
“మీ జీవితంలో ఇటువంటి వారిని ఎప్పుడూ చూసి ఉండరు. ఇటువంటివారికి మనం సహాయం చేయకపోతే మనకి సంఘం అనేది ఉండడమే దండగ. దయచేసి ఏదో ఒక సహాయం చేయండి.”
ముందుకి నడవబోతున్న బుద్ధుడో సారి తలతిప్పి ఆవిడకేసి చూశాడు. ఓ క్షణం పోయాక చెప్పేడు ఆనందుడితో.
“ఈవిడకి మనం ఏం చేసినా ఇప్పుడదో వ్యర్ధప్రయాస అవుతుంది.”
“ఐతే అవనీయండి. కానీ మన ప్రయత్నం మనం చేయాలని మీరే అన్నారు కదా?”
“ఈ వయస్సులో ఆవిడకి మనం ఏదో శారీరక సేవ చేయగలం గానీ దాదాపు మృత్యువు ఒడిలో ఉన్న ఆవిడకి ధర్మమార్గం గురించి, ధ్యానం చేయమని చెప్పడం ఏం సబబు?”
“ఇంతకు ముందు అడిగినదే మరోసారి అడుగుతున్నాను. మీ దివ్యమైన విరాజమాన రూపం చూస్తే ఆవిడకి అంతా ఒక్క క్షణంలో అవగతమౌతుంది.”
“సరే నువ్వే గమనించు ఏమౌతుందో…” ఆనందుణ్ణి వదిలేసి తథాగతుడు ముసలి అవ్వ దగ్గిరకి నడిచాడు.
ఆనందుడు తానున్న చోటునుంచే చూస్తే కనిపించిన దృశ్యం ఇది: తనకున్న ముప్ఫై రెండు మహాపురుష లక్షణాలతోనూ, ఎనభైకి పైబడి ఉన్న అనువ్యంజనాలతోనూ భగవానుడు అవ్వ ముందు నిలబడ్డాడు. అయితే ఆవిడ అదే సమయంలో మొహం వెనక్కి తిప్పి మరేదో చూడబోయింది. భగవానుడు ఆవిడ మొహం తిప్పిన వైపు వెళ్ళేసరికి ఆవిడ గమనించనట్టూ పైకి ఆకాశంలోకి చూసింది. సరే కానిమ్మని ఆమె దృష్టికి అభిముఖంగా భగవానుడు ఆకాశంలో నిల్చునేసరికి ఆవిడ తన చూపు కిందకి సారించి మరేదో చూస్తోంది. ఇలా కాదని భగవానుడు తన రూపాన్ని అన్నివైపులా కనిపింప చేసేసరికి ఆవిడ కంట్లో ఏదో పడ్డట్టూ తటాలున కళ్ళు మూసుకుని చేతులు అడ్డుపెట్టుకుంది.
బుద్ధుడు ఆనందుడి దగ్గిరకి వచ్చి అడిగాడు నిస్సహాయంగా, “చూశావు కదా, ఆవిడ మనసులో నా రూపం కనిపించాలంటే కనీసం ఒకసారి నా బాహ్యరూపం చూడాలి కదా. అందుకే అంత ప్రయత్నం చేశాను కానీ ఏదీ సాధ్యం కాలేదు. ఇంతకన్నా నన్నేం చేయమంటావు ఆనందా?”
“ఆవిడ గోత్రలక్షణం అలా ఉంటే మనం మాత్రం ఏం చేయగలం. రండి మన దారిలో మనం పోదాం.”
“ఇవే ముందొకసారి ప్రసంగంలో నేను చెప్పిన విషయాలు: ‘మనం ఎవరినీ బలవంతంగా మార్చలేం’ అనే మొదటి విషయం, ‘బుద్ధుడు అందర్నీ తరింపచేశాడా తన జీవితంలో’ అనే రెండో విషయం. నేను వ్యర్ధ ప్రయాస అవుతుందన్నా నన్ను ఏదో ఒకటి చేయమన్నావు కనక నా ప్రయత్నం నేను చేశాను ఆవిడ అడగకపోయినా. ఈ విషయాలు నేను జీవితం చాలించాక మరింత అవగతమౌతాయి నీకు.”
భగవానుడి మహాభినిష్క్రమణాంతరం మహాకాశ్యపుడు ఓ మహత్కార్యానికి తలపెట్టాడు. ఆ మహత్కార్యానికి ప్రేరకం కూడా భిక్షుసంఘంలోనుంచి వచ్చినదే. బుద్ధుడి పరినిర్వాణ వార్త మహాకాశ్యపుడికి చేరేసరికి ఆ విషయం అక్కడున్న అందరినీ విపరీతంగా క్రుంగదీసింది కానీ అక్కడే ఉన్న ఒక ముసలి భిక్షువు హాయి అనుభవిస్తూ “నియామకుడు పోయాడు కనక మనందరం ఆయన పెట్టిన కట్టుబాట్లు వదిలేసి ఇంక స్వేచ్ఛగా ఉండొచ్చు,” అన్న మాట కాశ్యపుడి హృదయంలో ములుకులా తగిలింది. భగవానుడి పరినిర్వాణం తర్వాత ఆయన చితి ఆరకముందే ఆయన బోధించిన ధర్మం, వినయం భ్రష్టు పడుతున్నాయే అనుకుంటూ ఆనందుణ్ణి చేరాడు ముందు చేయాల్సిన పనుల గురించి ఆలోచించడానికి.
ఆనందుడు చెప్పడం ప్రకారం భగవానుడు భిక్షుసంఘానికి ఎవర్నీ నాయకుడిగా నిర్దేశించలేదు. దీనికి రెండు కారణాలు కావొచ్చు. మొదటిది ఆయన ముఖ్య శిష్యులైన శారిపుత్ర, మౌద్గలాయనులు అప్పటికే దేహం చాలించారు. రెండోది, ఎవరికైనా నాయకత్వం కట్టబెడితే వాళ్ళు ఉత్తరోత్తరా అధికారం కోసం పాకులాడుతూ, దెబ్బలాటలతో ధర్మం గురించి పూర్తిగా మర్చిపోయే రోజులు రావడానికి అవకాశం ఎక్కువ. అందువల్లే అకాలికమైన ధర్మమే సాధించుకోవల్సిందిగా చూపించాడు. బుద్ధుడు ఏనాడూ తన తర్వాత ఏమౌతుంది అనే ఆలోచనే చేయలేదు. ఆయన చెప్పినదల్లా, ‘జీవితంలో మార్పు తప్పనిసరి. విశేషంగా బతికిన నగరాలు, జీవులూ కూడా ఏదో ఒక రోజుకి క్షీణించవల్సినదే. మార్పు లేనిది ధర్మం ఒక్కటే. అందుకే అందరికీ అదొక్కటే ఆసరాగా చేసుకోవల్సిన అవసరం. తరించడం అనేది ఎవరికివారే సాధించుకోవాల్సిన విషయం.’ భగవానుడు దారి అయితే చూపించగలడు కానీ ఎవరికోసమూ ధర్మాన్ని సాధించి అరచేతిలో పెట్టలేడు.
ఆనందుడు చెప్పినదంతా విన్న మహాకాశ్యపుడు బుద్ధుడి ఉపదేశ వాక్యాలని క్రోడీకరించడానికి దేశంలోని అందరి అర్హతులతో ఒకచోట కూడే రోజుకి ఆనందుడికి ముసలి అవ్వ ఉదంతం జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు తన అభ్యర్ధన అనుసరించి భగవానుడు ఎంత ప్రయాసతో ప్రయత్నించినా ఆవిడకేమీ చేయలేకపోవడనిక్కారణం ఆవిడ మాత్రమే. ధ్యానం చేయడం గురించి, ధర్మం తెలుసుకోవడం గురించీ చెప్తూ భగవానుడు ధర్మం అకాలికమని, ఎవరికి వారే తెలుసుకోతగ్గదనీ చెప్పినదే జీవితాంతం అంతా ఎందుకు చెప్పాడో అర్ధమైంది. కాశ్యపుడు ఇప్పుడు చేసే భగవానుడి బోధనలు క్రోడీకరించే పనితో భిక్షుసంఘం బాగుపడుతుందా అనేది ఎవరూ చెప్పలేనిది. ఉత్తరోత్తరా భగవానుడి మార్గం పాటించడానికి ఇష్టపడేవారు పాటిస్తారు; ఎవరూ ఎవరినీ బలవంతంగా ఇందులో దించాల్సిన పని లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం.