సాక్ష్యం

మండలం రోజులు నిరాహారిగా జ్ఞానం కోసం పరితపిస్తున్న సిద్ధార్థ గౌతముడు ఆసనంలో కూర్చోలేక కింద పడిపోవడం ఇది ఎన్నోసారి? దగ్గిరే ఉన్న అయిదుగురు శిష్యులూ మరోసారి ఆయన్ని లేపి కూర్చోబెట్టారు. పుల్లలా అయిపోయిన శరీరం ఈ సారి నిలిచేలా లేదు. సన్యసిస్తూ తాము మొదటిసారి ఈ సిద్ధార్థుడి దగ్గిరకి వచ్చినప్పుడు ఆయనలో కనిపించిన ముఫ్ఫైరెండు మహాపురుష లక్షణాలు ఇప్పుడు మచ్చుకి కూడా లేవు. ఈయన జ్ఞానమార్గంలోంచి పడిపోతున్నాడు కాబోలు. తాము వేరే దారి వెదుక్కోవడం మంచిదని తెలుస్తోంది కదా? అయిదుగురు శిష్యుల ఆలోచనా సరైనదే కాబోలనిపిస్తూ సిద్ధార్థుడి శరీరం మరోసారి ఆసనం మీద నుంచి కిందపడింది. శిష్యులు ఇంక ఏమి చేయాలో తెలియక, దూరంగా జరిగేరు.

తన శరీరం శిథిలమవడం సిద్ధార్థుడికి తెలుస్తోంది. దానికి కారణం కూడా తానే. ఏ జ్ఞానం కోసమైతే తాను అకుంఠిత దీక్షతో ఇన్నేళ్ళూ గడిపాడో ఆ సమయం అంతా వ్యర్థమే కాబోలు. మొదట్లో తనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపి మనసు కేంద్రీకరించడం నేర్పిన గురువులు కూడా పూర్ణజ్ఞానం అంటే ఏమిటో తెలియదని చెప్పాక మరి కొంతమందిని కలిసి ఒక్కొక్కరూ నేర్పిన ప్రాణాయామం, యోగం, మనస్సు నిలుపుకోవడం అనే సాధనాలన్నీ కలబోసి నిజంగా జన్మరాహిత్యం కలిగించే బోధి అనే లక్ష్యం ఉందనీ, దాన్ని తాను చేరగలడనీ నమ్ముతూ ప్రతీరోజూ సాధన పెంచుకుంటూ పోయి ఈ స్థితికి చేరాడు. ఇంత చేసినా ఇంకా తనకి జ్ఞానోదయం కాలేదు. జ్ఞానం కోసం ఆహార్యం అడ్డు అని దాన్ని విడిచిపెట్టినా ఆకలి తనని వదలడం లేదు. ఈ స్థితిలో తాను ఓ ఆసనం మీదనే స్థిరంగా కూర్చోలేడు, ఇంక జ్ఞానోదయం ఎలా? ఇప్పుడు ప్రాణం పోతే చీమూ, నెత్తురూ అనేకానేక శుధ్ధాశుధ్ధాలు కలగలిపిన మరో జన్మ ఎత్తితే ఆ జన్మ ఎటువంటిదో, అందులో ఎన్ని కష్టాలు పడాలో మళ్ళీ ఈ స్థితికి రావడానికి? ఇన్ని సంవత్సరాల కష్టం, ఇంతటి దీక్ష బూడిదలో పోసిన పన్నీరేనా?

ప్రాణాలు కడగడుతున్నాయేమో అనే ఆలోచనల్లో పరిసరాలు గుర్తించలేకుండా ఉన్న సిద్ధార్థుడికి దూరాన్నుంచి ఏదో పాట వినిపించసాగింది. మనసులోంచి వచ్చేదా, లేకపోతే నిజంగా బాహ్యప్రపంచం నుంచి చెవులకి వినిపించేదా? దూరం నుంచి వెళ్ళే గొల్లవారి పాట కాబోలు. కళ్ళు మూసుకున్న గౌతముడికి వినబడే పాటకి అర్థం ఏదో తెలిసీ తెలియకుండా ఉంది… వీణ తంత్రులు బాగా సాగదీస్తే అవి తెగిపోయి అసలు శబ్దమే రాదు. మరీ వదులుగా ఉంటే శబ్దం వచ్చినా అది బాగుండదనీ కాబోలు… నోటికొచ్చిన గాలిపాట పాడుతున్నారా, లేకపోతే పాపం ఏవో కష్టాల్లో ఉండి పాడుకుంటున్నారో? ఇంతకీ నన్ను లేవదీసి కూర్చోబెట్టిన శిష్యులేరీ? అయినా పూర్తి జ్ఞానం ఇంకా లభించని తాను వాళ్ళకి చేసే సహాయం ఏపాటిది? ముందు తాను ఏ గమ్యం కోసం అయితే సన్యసించాడో అది తెలుసుకోవాలి. ఇన్నేళ్ళ సాధనలో ఏదో కొంత ముందుకెళ్ళినట్టనిపించినా నేతి నేతి నేతి. ఇంకా ఏదో మిగిలి ఉంది. ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదో అది మాత్రం తనకి అందకుండా ఊరిస్తూ దూరంగానే ఉంది. తెలియనిది మాత్రం అది అడుగు దూరమా, ఆమడ దూరమా అనేదే. ఇంతకీ అసలు తాను ఉంది అనుకునే జ్ఞానం నిజంగా ఉందా లేకపోతే అది ఉందని తనని తాను మభ్యపెట్టుకుంటున్నాడా? ఇంత కష్టపడ్డం కన్నా రాజ భవనంలో కూర్చుని హాయిగా మధురమైన పదార్థాలు భుజిస్తూ సేవకులు వీణ వాయిస్తూ పాడే పాటలు వింటూ… వీణ పాట, తంత్రులు, సాగదీయడం, వదులుగా… ఏమిటీ గొల్లవారి పాట? వీణ తంత్రులు బాగా సాగదీస్తే అవి తెగిపోయినప్పుడు శబ్దమే రాదు. మరీ వదులుగా ఉంటే శబ్దం వచ్చినా అది బాగుండదనీ… హఠాత్తుగా మబ్బులు చెదిరిపోయి చంద్రోదయం అయినట్టూ ఒక్కసారి ఏదో అర్థమైనట్టూ తెలిసి వచ్చింది సిద్ధార్థుడికి. అంతటి నీరసంలోనూ ఒక్కసారి మొహంలో చిరునవ్వు.

తాను చేసినది ఎంత తప్పు? పోనీ ఇప్పటికైనా చేసినది తప్పు అని తెలిసింది కదా? తన శరీరమనే వీణకి తంత్రులు వదులుగా ఉన్నట్టు ఎంచి, మంచి పాట పలకడం కోసం అన్నట్టూ, జ్ఞానం కోసం తన శరీరాన్ని ఉపవాసాల్తో కష్టపెట్టి చివరికి ఈ ప్రాణం పోయే స్థితికి లాగాడు. తెలిసో తెలియకో తాను మర్చిపోయినది శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అని. తనకి జ్ఞానం లభించే మార్గంలో ఈ శరీరం నిలిచి ఉండడం అత్యంతావశ్యకం. తాను ఎప్పుడైతే తన కాళ్ళమీద స్వంతంగా నిల్చోగలడో అప్పుడే కదా జ్ఞానం సంపాదించడమో మరొకటో ఏదైనా చేయగలడు? అలాగని వీణ తంత్రులు మరీ వదులుగా ఉండకూడదని పాట చెప్పేది తెలుస్తూనే ఉంది, అతి తిండి పనికిరాదు, అతి ఉపవాసమూ పనికిరాదు. మధ్యస్థంగా ఉండడమే అసలైన దారి. ఆసనం మీద కుదురుగా కూడా కూర్చోలేని తాను ధర్మం ఏమిటో, దానికి మూలం ఏమిటో ఎలా తెలుసుకోగలడు? ధర్మాన్ని తెలుసుకోవడమే తన గురి అయినప్పుడు దాన్ని చేరుకునే మార్గాన్ని ధ్వంసం చేసుకోవడం ఏం ఉత్తమం? మరోసారి చిరునవ్వు. తల పక్కకి కదిలించాడు అంతటి నీరసంలోనూ.

తాను శోష వచ్చి పడి ఉండడం చూసి ఎవరో పాత్రలో ఏదో ఆహారం అందిస్తున్నట్టుంది. ఓపిక తెచ్చుకుంటూ ఆ పాత్రలో ఉన్నదాన్ని నోటిలో చప్పరించాడు. క్షీరాన్న పాయసం. ప్రాణం కుదుటపడుతున్నట్టూ మరి కాస్త ఓపిక. ఈ ఓపిక వచ్చాక తెలిసి వచ్చిన మరో సత్యం, ఇంతటి ప్రాణం పోయే స్థితిలో కూడా జ్ఞానం అనేది ఉంది, దానిని తెలుసుకోవడానికి మార్గం ఉంది అంటూ ఎవరో–వీణ తంత్రుల పాటతోనో మరో విధంగానో–తనకి సూచన ప్రాయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. తన శరీరం నిలుపుకోవడానికి ఆ దారిలో లభించినదే ఈ పాయసం. అంటే తనకి త్వరలో ధర్మం అనేది పూర్తిగా అవగతమవడానికి దశదిశల్లోంచీ సహాయం అందుతోంది. తనని ధర్మం తెలుసుకోలేకుండా అడ్డుకునేది ఏదీ ముల్లోకాలలో లేదు గాక లేదు.

ఈ ఆలోచనతో సిద్ధార్థుడికి మరింత పట్టుదల, ఓపిక అంకురించాయి. గిన్నెలో పాయసం పూర్తిగా తిన్న కాసేపటికి, ఆహారం తిన్న తనని జ్ఞానమార్గంలోంచి భ్రష్ఠుడైనట్టు భావించి దూరంగా కదిలిపోతున్న అయిదుగురు శిష్యులూ కనిపించారు. మరోసారి చిరునవ్వు గౌతముడి మొహంలో. పోనీయ్. ఈ జీవితంలో తాను జ్ఞానం సంపాదించనంతవరకూ ఎవరికీ ఏ ఉపదేశం చేయలేడు. ఎవరికెవరు? ఏ జ్ఞానం కోసం అయితే తాను అహర్నిశలూ పాకులాడుతున్నాడో అది తనకి అందనంతవరకూ తనకి తానే ఏమీ కాడు కదా? కోహం? కోహం? ఇదీ తాను మొదట తాను తెలుసుకోవల్సినది.

ఆసనం మీద కూర్చునేంత ఓపిక వచ్చిన సిద్ధార్థుడు తలపైకెత్తి ఆకాశంలోకి చూశాడు. పౌర్ణమి దగ్గిర పడింది కాబోలు, చంద్రోదయం అయినా పూర్ణచంద్రుడికి మరో కొన్ని గంటల సమయం ఉన్నట్టుంది. తనకి జ్ఞానమార్గంలో కలిగిన ఆటంకాలు ఇప్పటికి తొలగిపోయాయనుకుంటే, తనకి ఇప్పటివరకూ కనిపించిన నిదర్శనాలు నిజమే అయితే తాను ధర్మాన్ని తెలుసుకోవడానికి ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నాడు; ఆమడ దూరంలో కాదు. అసలు ప్రపంచాన్ని శాసించే ధర్మమే లేదు అనునుకుంటే, సరే సరి; అదైనా తెలుస్తుంది ఈ సారి. తాను మనసులో ఇంకా ఉన్న ద్వందాలకి అతీతుడై తీరాలి. వాతావరణం కూడా అనువుగా ఉంది. తనకి ఇప్పుడు ఉండవలసినది అకుంఠితమైన పట్టుదల, దృఢమైన నిశ్చయం. పట్టు పట్టరాదు, పట్టివిడువరాదు.

ఇహాసనే శుష్యతు మే శరీరం, త్వగస్థి మాంసం ప్రళయం చ యాతు
అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం నైవాసనాత్కాయమతశ్చలిష్యతే

నా శరీరం శుష్కించిపోయి, చర్మం, మాంసం, ఎముకలు మట్టిలో కలిసిపోనీయి గాక, అనేకానేక కల్పాలు కష్టపడినా అందుకోలేని దుర్లభమైన బోధిని పొందకుండా ఈ ఆసనం మీదనుంచి లేచేది లేదు. ఈ సారి మరింత పట్టుదలతో ఆసనంమీద కూర్చుని మనసు కేంద్రీకరించాడు గౌతముడు.

ధ్యానంలో సిద్ధార్థుడికి మనసు లోపలి పొరల్లోంచి ఇంకా పూర్తిగా పోని ద్వంద్వమైన ఆలోచనలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. మొదటిది, ‘బోధిని తెలుసుకునేలోపు తన ప్రాణం పోవచ్చేమో’ అనే చింత. దానికి తావిస్తే అది మహా వృక్షంలాగా పదే పది నిముషాల్లో పెరిగి తనని కాటేయడానికి సిద్ధమౌతుంది. నేతి నేతి. మరోవేపు దానిని అణుస్తూ మరో ఆలోచన. తన జ్ఞానోపార్జనావిధిలో తన దేహం ఏపాటిది, తన ప్రాణం ఏపాటిది? అయినా ఈ రోజు తన కఠోర నిశ్చయం అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం… ప్రాణం పోయినా సరే బోధిని తెలుసుకోవాల్సిందే.

ఈ ద్వంద్వాలోచనలు పూర్తిగా మనసులోంచి తొలగించి, ఏ మాత్రం సన్నటి దారి ఇచ్చినా వటవృక్షంలా బహిర్గతం అవబోయే మనసుని లోపలకి లాగి అక్కడే ఉంచగలిగితే, అదేనా బోధి? చంచలమైన మనసులోంచి ఇంకా పూర్తిగా పోని మరో ఆలోచన, ‘ఈ ఉపవాసాలు, తపస్సులు దండగ. అసలు బోధి అనేదీ, ధర్మం అనేవీ లేనే లేవు, పోయి మహారాజులా జీవించు, లే, ఇప్పటిదాకా శరీరాన్ని కష్టపెట్టి ఏం బావుకున్నావో చూశావు కదా? ప్రాణం పోబోయేసరికి మహారాజువై ఉండీ ఎవరో పెట్టిన పాయసం భిక్షాన్నంగా స్వీకరించాల్సి వచ్చింది, లే ఆసనం మీదనుంచి. మహారాజులా సుఖించు.’ మహారాజులా సుఖించు–మహారాజు అయితే అంతా సుఖమేనా? ఆ రాజ్యం, సంపదలూ పోతే? పోనీ ఆ సంపదంతా రక్షించుకోవడానికి మనో వ్యథా, ఎవరెక్కడినుండి యుధ్ధానికొస్తారో అనే చింతా ఉన్నప్పుడు సంతోషం ఎలా కలుగుతుంది? లేదు లేదు, అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం… ఇక్కడనుంచి లేచేది లేదు.

వీటిని అధిగమించాక నీరసిస్తున్న మనసులో మొలకెత్తే గింజలా మరో ఆశ. ‘చక్రవర్తి అయి, రాజ్యం పోకుండా ఉంటే జీవితాంతం సుఖించవచ్చు; సంపదలతో సుఖ సంతోషాలు అమర్చుకోవచ్చు.’ జననం మరణం అనేవి ఒక్కటే నిజం. ప్రాపంచిక జీవితంలో సుఖం అనేది కాకి కొవ్వు అనేది తెలిసి వచ్చినదే కదా? వద్దు, అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం… ఈ రోజు బోధిని తెలుసుకోకుండా ఇక్కడనుంచి లేచేది లేదు, ప్రాణం పోయినా సరే.

ఇంకా తనని బయటకి లాగుతున్న మనస్సు. ‘బోధి అనేదే లేదు, ఈ తపస్సు మాని వెనక్కి వెళ్తే, ఊర్వశీ తిలోత్తమలవంటి అప్సరసలని తలదన్నే అందమైన ఆడవారితో, రాజభవనాల్లో ఎన్నటికీ తరగని సంపదల్తో సుఖించవచ్చు.’ దేనికీ కూడా ముగింపు లేకుండా ఉండదు కదా, ఈ అప్సరసలు కూడా చివరకి శరీరం చితికిపోయాక పోవాల్సినవారే. ఏ సంపద అయినా సరే నా శరీరం పడిపోయాక కూడా వచ్చేది కాదని తెలుస్తూనే ఉంది. చీమూ నెత్తురూ ఓడుతున్న ఈ అప్సరసల శరీరాలు. నేతి నేతి. అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం నైవాసనాత్కాయమతశ్చలిష్యతే.

‘నీ తపస్సు సిధ్ధిస్తుందనే ఆశ తప్ప మరో ఋజువు లేదు. నీకు ప్రాణాయామం, యోగం నేర్పిన గురువులకి కూడా బోధి అనేది ఉంటే సిద్ధించి ఉండేది కదా? పాయసాన్నం తిని ఉండకపోతే ఈ పాటికి ప్రాణం పోయి ఉండేది. ఇప్పుడైనా ఆసనం మీదనుంచి లేవకపోతే మృత్యువు నీ ప్రాణాలని తీయబోతోంది’. మహా బోధిని, నిర్వాణం పొందడంలో ఎన్ని జన్మలెత్తానో ఇప్పటివరకూ, ఇప్పుడున్న ఈ మానవ జన్మ ఏ పాటిదీ, ఈ ప్రాణం ఏపాటిది? ‘ఇహాసనే శుష్యతు మే శరీరం, త్వగస్థి మాంసం ప్రళయం చ యాతు …’ ఇక్కడనుంచి లేచేది లేదు.

‘అసలు బోధి అనేది ఉంటే దాన్ని తెలుసుకోవడానికి ఎన్ని జన్మలెత్తినా ప్రతీ జన్మలోనూ తనకు మాలిన ధర్మం అనుసరించినట్టు సాక్ష్యం కానీ, ఋజువు కానీ ఉందా? ఆ సాక్ష్యం లేని నాడు మరో జన్మ ఎత్తవల్సిందే.’ ఇది మనసు తనమీద ప్రయోగించిన ఆఖరి అస్త్రమేనా? తాను ఇప్పటికి ఎన్ని జన్మలెత్తాడో తనకే తెలియదు. తనకు తెలిసిన, తాను నమ్మిన విషయం మాత్రం ఎన్నో జన్మలనుంచీ తాను ధర్మం తప్పకపోవడం వల్లే ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ బోధి అనబడే నిర్వికల్పసమాధికి అతిచేరువగా వచ్చాడు. అయితే క్రితం జన్మ ఏమిటో? అందులో తానేమిటో అనేది ప్రస్తుతానికి తెలియదు, అది తెలియనవసరమూ లేదు. క్రితంసారి జన్మనిచ్చిన ఆ మాతృమూర్తి ఎవరో తెలియనప్పుడు దాని క్రితం జన్మలూ అవీ తెలిసేదెలా, వాటికి ఋజువు చూపించేదెలా? ఇంతకీ అవి మానవ జన్మలేనా? లేకపోతే తాను ఏ జంతువో, పశుపక్ష్యాదులలో ఎలా పుట్టాడో? ఆ విషయాలే తెలియనపుడు సాక్ష్యం, ఋజువూ ఏముంటాయి? పశుపక్ష్యాదులలో పుట్టినా, మానవుడిగా పుట్టినా ఏ దేశకాల వ్యవస్థల్లో పుట్టాడో తాను? పుట్టిన దేశంలో ఏ ఆహారం భుజించాడో? ఈ రోజు తిన్న పాయసంలా ఆ ఆహారం ఎవరు పెట్టినదో, ఎక్కడ పుట్టినదో? అయితే ఒకటి నిజం. తాను ఎక్కడ మానవుడిగా ఏ మాతృమూర్తి కడుపున పుట్టినా, ఏ జంతువుగా పుట్టినా, ఏ ఆహారం ఆరగించినా ఆ ఆహారం ఈ పుడమి మీద పుట్టినదే కదా? అంటే తాను ఈ బోధిని సాధించే క్రమంలో ఎన్ని జన్మలెత్తినా ఈ పుడమి మాత్రం మారకుండా అలాగే ఉన్నట్టుంది. అయితే ఇదే సమాధానం, సాక్ష్యానికి అన్నట్టూ సిద్ధార్థుడు కుడి చేయి చాపి భూమి మీద ఆనించాడు. అవును ఇదే, ఈ పుడమి తల్లే సాక్ష్యం తనకి.

పౌర్ణమి ఘడియలు ప్రవేశించిన చంద్రుడు స్వచ్ఛంగా ప్రకాశించడం మొదలుపెట్టాడు సిద్ధార్థుడి జ్ఞానోదయం అయిందని సూచిస్తున్నట్టూ.

మనసులో మిగిలిపోయిన చివరి సందేహాలు పోయి అది లోపల ఐక్యమవడంతో, అంతర్గతంగా మేలుకున్న తథాగతుడికి బాహ్యప్రపంచం అంతరించి బోధి అవగతమై ముల్లోకాలనీ శాసించే ధర్మం తేటతెల్లమవడం తెలుస్తోంది. దాన్ని అర్థంచేసుకుంటూ ఆ తర్వాత ఇరవై ఒక్కరోజులు సమాధిలో గడిపిన సిద్ధార్థుడికి తెలిసిన విషయాలు ఇవి. తాను పుడమిని చేత్తో తట్టి చూపించిన సాక్ష్యం మహోన్నతమైనది. తాను దర్శించిన ధర్మం గంభీరమూ, అకాలికమూ, అది దేశకాలాలని బట్టి మారేది కాదు. అలాగని మరొకరెవరో ఇస్తే తీసుకోగలిగేది కాదు. ఎవరికి వారే తెలుసుకోదగ్గది. ఈ కనుక్కోబడిన ఆధ్యాత్మ సత్యాలు ఎవరో రాసిపెట్టినవి కావు; అలాగని ఎవరో సృష్టించినవీ కావు, తాను కొత్తగా కనిపెట్టినవీ కావు. పూర్వకాలపు బుద్ధులూ, సమకాలీన బుద్దులూ, రాబోయే బుద్ధులూ తెల్సుకునేవి. ఈ బోధిని దర్శించిన బుద్ధులలో తాను మొదటివాడూ కాదు చివరివాడూ కాదు. ఇప్పుడు చేయవల్సినది తనకి అవగతమైన బోధిని ఇతరులకి చెప్పడానికి ధర్మచక్రం తిప్పడం. దానికన్నా ముందు తాను చేయాల్సింది తన కాలంలో బుద్ధులెవరైనా మిగిలి ఉంటే వారిని కలుసుకుని తనకు అవగతమైనదాన్ని బోధిగా ధృవీకరించుకోవడం. ధ్యానంలో లోకాలన్నీ పరికించి చూశాడు తథాగతుడు. అప్పుడు తెలిసిన విషయం తన కాలంలో మరో బుధ్ధుడు లేడు. ఇంక తాను ప్రణామం చేయదగింది తాను దర్శించిన ఆ ధర్మం ఒక్కటే.

తాను ఇంతకాలం కూర్చున్న చెట్టు కిందనుంచి లేచి కృతజ్ఞత చెప్పుకుంటూ దాని చుట్టూ తిరిగి ప్రణామం చేశాక తాను దర్శించిన ధర్మాన్ని గురించి చెప్పడానికి అర్హులెవరా అని కళ్ళు మూసుకుని ధ్యానంలో చూడబోయేడు తథాగతుడు. తనకి మొదట్లో దీక్ష ఇచ్చిన గురువులెవరూ బతికిలేరు. ఇంక మిగిలినది అసంఖ్యాకంగా రాబోయే ముందుకాలపు శిష్యులు. ఇందులో మొదటి విడతగా తనని ఇప్పటివరకూ సేవించిన అశ్వజిత్తుతో కూడిన అయిదుగురు శిష్యులూను. పరికించి చూస్తే వీళ్ళు వెళ్ళినది వారణాసి వైపు అయి ఉండవచ్చు. అటుకేసి వెళ్ళి వాళ్ళని చూడడమే మంచిది. ఆసనం మీద నుంచి లేచి, ధర్మచక్ర పరివర్తనకి తథాగతుడు వారణాసి వేపు నడక సాగించాడు.