సిద్ధార్దుడు సన్యసించి ఏడు సంవత్సరాలైంది. ప్రజాపతి సిద్ధార్దుడ్ని తల్చుకోని రోజే లేదు. ఇంట్లో ఉన్నప్పుడు పిలిస్తే గానీ వచ్చి తిండి తినేవాడు కాడు. ఎప్పుడూ ఆట పాటలల్లో గడపడమే. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పారో సిద్ధార్దుడి సున్నిత మనస్సు గురించి. ఇప్పుడు సన్యాసం తీసుకున్నాక కటిక నేలపై ఎలా పడుకుంటున్నాడో? యశోధర కూడా ఇక్కడ అంతఃపురంలో ఉందన్నమాటే గానీ సన్యాసిలా బతకట్లేదా? ఈ భోగాలన్నీ వెంట వచ్చేవి కాదని గ్రహించాడు కనకనే వీటన్నింటినీ వదులుకుని ధైర్యంగా వెళ్ళిపోగలిగేడు. బికార్లు సన్యసించడానికేముంది? మహరాజు అన్నీ తృణప్రాయంగా వదిలేయడం కదా సన్యాసం అంటే? ఇవే ప్రజాపతి ఆలోచనలు.
లోపలకి వచ్చిన పరిచారిక వచ్చి శుద్ధోధన మహరాజు వస్తున్నారని వార్త అందించింది. లోపలకి వస్తూనే చెప్పేడు మహారాజు,
“ప్రజాపతీ, మన సిద్ధార్దుడు బుద్ధుడయ్యాడని వేగుల ద్వారా వార్త అందింది. జనం వాడు చెప్పేది వినడానికి ప్రవాహంలా వెళ్తున్నారని వినికిడి.”
“అసితుల వారు చెప్పినవన్నీ నిజం అవుతున్నాయి మహారాజా. వెంటనే ఎవరినైనా పంపరాదా ఒకసారి రమ్మని చెప్పడానికి?”
“అవును. అంత చెప్పాలా? నేను ఈ రోజే ఒకడ్ని పంపించేను. కానీ సిద్ధార్దుడు చక్రవర్తి అయి ఉంటే నేను ఎక్కువ ఆనందించేవాడిని.”
“సరే, ఇప్పుడింక నేను యశోధరతో చెప్పి వస్తాను ఈ విషయం.” ప్రజాపతి నిష్క్రమించింది.
మొదటిసారి వెళ్ళిన వార్తాహరుడు ఎంతకీ రాకపోయేసరికి రెండోవాణ్ణి పంపించాడు మహరాజు. వాడూ ఎంతకీ రాకపోతే మూడోవాణ్ణి కూడా పంపించేడు. ఇలా పద్ధెనిమిది మంది బుద్ధుడి దగ్గిరకెళ్ళి ఆయన శిష్యులైపోయి వెనక్కి రాకపోయేసరికి కాలుదాయిని పిల్చి అడిగేడు మహరాజు.
“నేను పంపిన పద్ధెనిమిది మందీ వెళ్ళీ వాణ్ణి చేరుకున్నారు. నువ్వు, సిద్ధార్దుడూ ఒకే సమయానికి పుట్టినవాళ్ళే కదా అని నిన్ను అడుగుతున్నాను. ఓ సారి వెళ్ళి వాణ్ణి రమ్మన్నానని, నాకు వాణ్ణి చూడాలని ఉందీ అని చెప్పి వస్తావా?”
“తప్పకుండా మహారాజా. అక్కడకి వెళ్ళాక నేను కూడా సన్యాసం తీసుకున్నా సరే, మాట మాత్రం చెప్తాను. వస్తారా, రారా అనేది మాత్రం ఆయనిష్టం.”
“సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మాట చెప్పడం మర్చిపోకు సుమా.”
కాలుదాయి వెళ్ళేసరికి భగవానుడు కొద్దిమందికి ఉపన్యాసం ఇస్తున్నాడు. “ఈ ప్రపంచంలో దుఖానికి ఏది హేతువు? మీరేదో కోరుతారు. కోరిక నెరవేరవచ్చు. కాకపోవచ్చు. నెరవేరితే, సంతోషం బదులు ఇంకో కోరిక తలెత్తుతుంది. రెండో కోరిక తీరితే మూడోదీ, అ తర్వాత నాలుగోదీ మొదలౌతాయి. అంటే ఒక కోరిక తీరితే దానివల్ల సంతోషం ఒక్క క్షణం మాత్రమే ఎందుకంటే, రెండో కోరిక మొదటిదాని వెనువెంటనే వస్తోంది కాబట్టి. ఈ అంతులేని కోరికలవల్ల మనశ్శాంతి ఎక్కడా? ఒక కోరిక తీరుస్తూ చక్రం తిప్పడం ప్రారంభిస్తున్నాం. ఉత్తరోత్తరా వచ్చే కోరికల్తో ఆ చక్రభ్రమణం మరింత జోరుగా పోవడానికి బాటలు వేస్తున్నాం. అసలు కోరిక తీరలేదనుకుందాం. అప్పుడుండేది దుఃఖమే. ఇవన్నీ గమనిస్తే తెలుస్తున్నదేమిటి? మనకున్న అన్ని దుఃఖాలకి కారణం కోరిక. జ్ఞానం పొందడానికి కోరిక విడిచిపెట్టడమే మొదటి మెట్టు. దేనినీ వాంఛించ వద్దు. ఆఖరికి ఆనందం కావాలి అని కూడా కోరవద్దు. ఆనందం ఎక్కడ్నుంచి వస్తోంది? మన మనసుల్లోంచే కదా? మనమే ఆనందం అవ్వనప్పుడు, అక్కడనుంచి ఎలా ఆనందం ఉత్పన్నమౌతోంది? దీన్ని బట్టి తెలుస్తున్నదేమిటంటే, మనం నిజంగా ఆనందస్వరూపులం. మనకి కావాల్సిన ఆనందం మన దగ్గిరే ఉంది. అది కోరిక తీరడం వల్ల రాదు. ఎప్పుడైతే మనం ఈ చక్రభ్రమణాన్ని పూర్తిగా ఆపగలుగుతామో అప్పుడు మనకి ధర్మం అవగతమౌతుంది. అప్పుడు మనం జన్మ రాహిత్యం పొందగలం…”
గంభీరంగా సాగుతున్న ప్రసంగం వింటూండగానే కాలుదాయిలో అదో రకమైన మార్పు వచ్చేసింది. తానొచ్చిన పని మర్చిపోయి భగవానుడి దగ్గిర దీక్ష తీసుకుని తాను కూడా సన్యాసి అయ్యేడు.
మూడు నెలలు గడిచాయి. వసంతం ప్రారంభమైంది. ఆ రోజు భగవానుడు బయట ఉన్నప్పుడు కాలుదాయి దగ్గిరలో నుంచుని లుంబినీకి వెళ్ళే దారి ఎంతమనోహరంగా ఉంటుందో పాడటం మొదలుపెట్టేడు.
పాట విన్న బుద్ధుడు నవ్వుతూ అడిగేడు, “ఇవన్నీ నాకు తెలియదన్నట్టు ఎందుకు పాడుతున్నావు?”
“భగవాన్, నేను వచ్చిన పని సక్రమంగా నిర్వర్తించాలి కనక. మిమ్మల్ని చూడాలని శుద్ధోధన మహారాజు బాగా ఉబలాటపడుతున్నాడు. ఎంతమందిని పంపినా వెనక్కి రాలేదని నేనే వచ్చాను. నేను సర్వం త్యజించినా మాట మీకు చేరవేస్తానని వాగ్దానం చేసేను.”
“సరే అయితే రేపే బయలుదేరుదాం. వాళ్ళకి కూడా నేను ధర్మాన్ని ఉపదేశించగలను.”
అనుకున్నట్టుగానే బయలుదేరి మూడునెలల్లో కపిలవస్తు చేరుకున్నారు. మొదట కాలుదాయి వెళ్ళి మహారాజుకి వార్త అందించేడు. మహారాజు ఆనందభరితుడై, కాలుదాయికి బంగారు పళ్ళెంలో భోజనం పెట్టించేడు. కాలుదాయి భోజనం అంతా ఎత్తి జోలెలో వేసుకోవడం చూసి శుద్ధోదనుడు అడిగేడు.
“ఎందుకలా చేస్తున్నావు? ఇక్కడే తినవచ్చు కదా?”
“లేదు మహారాజా, ఈ రుచికరమైన భోజనాన్ని నేను బుద్ధుడికి ఇస్తాను. ఆయన నాకు జన్మ రాహిత్యానికి దారి చూపించినందు ఏ మిచ్చినా రుణం తీరదు.”
“లేదు, లేదు ఇది నీకే. బుద్ధుడికీ నేను మళ్ళీ మంచి భోజనం పంపిస్తాను.” కంగారుగా అన్నాడు శుద్ధోధనుడు.
మర్నాడు, బుద్ధుడు అంతఃపురంలోకి వచ్చేడు. యశోధరని పలకరించాక, ప్రజాపతి ముందుకి వచ్చి “నాయనా నువ్వు ఇలా సర్వసంగ పరిత్యాగం చేస్తావని పుట్టినప్పుడే అసిత మహాముని చెప్పారు. చాలా సంతోషం. నేను అసితుల వారు చెప్పినట్టే నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాను. మాయాదేవి నిన్ను కన్నప్పట్నుండీ నువ్వే నా కొడుకువి. అది నీకూ తెలుసు. పురుషుడివి కనక నువ్వు వెళ్ళగలిగేవు. మేమా, స్త్రీలం. మాకు ఎలాగ కుదురుతుంది?”
“లేదు అమ్మా, ధర్మం అనేది ప్రతి ఒక్కరూ, స్త్రీ, పురుష వ్యత్యాసాలు లేకుండా తెల్సుకోవచ్చు. అకుంఠితమైన దీక్ష ఉంటే చాలు.” శాక్యముని చెప్పాడు చిరునవ్వుతో.
“యశోధర ఇక్కడే సన్యాసిలా గడుపుతోంది. ఎప్పటికైనా అర్హతురాలవ్వాలనే ఆశ. ఏదో ఒకనాడు మేము నీ దగ్గిరకి వచ్చేస్తాము. అప్పటిదాకా మమ్మల్ని కాస్త గుర్తుంచుకో మరి.”
ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు బుద్ధుడి ఖ్యాతి ఖండ ఖండాలలో వ్యాపించింది. రాహులుడు, నందుడూ కూడా బుద్ధుడ్ని అనుసరించారు. తథాగతుని కుడి భుజంలా ఆనందుడు ఉండనే ఉన్నాడు. శుద్ధోధన మహారాజు స్వర్గస్తుడైనాడు. యశోధరకీ, ప్రజాపతికీ సన్యసించాలనీ, బంధాలు తెంచుకోవాలనీ ఉంది. కానీ ఎన్నిసార్లు అడిగినా బుద్ధుడు ఒప్పుకోవట్లేదు. ఆనందుడు చెప్పి చూసాడు.
“లేదు ఆనందా, స్త్రీలని మనతో పాటు ఉండనిస్తే బుద్ధుడు స్త్రీల సన్నిహిత్యం కోరుకుంటున్నాడని లోకం ప్రచారం చేస్తుంది. వాళ్ళని అక్కడనే సాధన చేసుకోమను.”
కొన్ని మాసాలు గడిచేసరికి, ఇంక ప్రజాపతి ఊరుకోలేకపోయింది. బుద్ధుడు ఒప్పుకుంటాడు గాక, పోతాడు గాక. జీవితం వ్యర్ధం చేసుకోవడం ఎందుకు. ఇక్కడే సన్యసించి నడుచుకుంటూ బుద్ధుడి దగ్గరికి వెళ్తే ఆయనే చూసుకుంటాడు. ఇదే ఆలోచనతో తాను కాషాయ బట్టలు కట్టి, బయల్దేరింది. యశోధర ఊరుకుంటుందా? తానూ వస్తానని పట్టుబట్టింది. ఒక్కసారి రాణీవాసంలో కలకలం రేగింది. ఊన్న స్త్రీలందరూ సన్యసిస్తామని బయల్దేరారు. రోజుకిన్ని మైళ్ళని నడుచుకుంటూ, పాదాల్లోంచి రక్తాలుకారుతున్నా చాలా రోజులు ప్రయాణించి బుద్ధుడ్ని చేరుకున్నారు ప్రజాపతీ, యశోధర. దారిలో అనేకానేక ప్రజలు వీళ్ళని ఆపి సహాయం చేస్తామన్నా నిరాకరించి వచ్చారు.
అప్పటికీ బుద్ధుడు ఒప్పుకోలేదు.
ఆనందుడే మళ్ళీ అడిగేడు, “స్వామీ ఎందుకు మీరు స్త్రీలంటే ఇలా వివక్షత చూపుతున్నారు?”
“లేదు ఆనందా, విశాలీ, సుజాతా నా శిష్యులే కదా. వాళ్ళు నా స్త్రీ సన్యాసినులే కదా? నేను వివక్షత చూపట్లేదు.”
అనేకసార్లు వాదోపవాదాలు జరిగేక ఆఖరికి ఒప్పుకున్నాడు భగవానుడు; అదీ వీళ్ళందరూ తాను పెట్టిన షరతులు ఒప్పుకుని జీవితాంతం పాటిస్తానంటేనే. ఒక్క షరతు కాదుకదా, వెయ్యి షరతులైనా ఒప్పుకుంటాము అన్నారు స్త్రీలందరూ. సంతోషంగా అందరికీ సన్యాస దీక్ష ఇవ్వబడింది. అనుకున్నట్టుగానే ప్రజాపతీ, యశోధరా, అకుంఠిత దీక్షతో తక్కువ వ్యవధిలో అర్హతురాలయ్యారు. బుద్ధుడు తన స్వంత శక్తితో బుద్ధత్వం సాధించినవాడు. ఆర్హతులు బుద్ధుడి సహాయంతో బుద్ధత్వం సాధించినవారు. చాల చక్రం తిరుతూనే ఉంది అవిరామంగా.
ఒక పౌర్ణమి సాయంత్రం, ప్రజాపతి బుద్ధుడి దగ్గిరలో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంది. ఏదో తెల్సినట్టు ఒక్కసారి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి భగవానుడితో అంది, “నాయనా, నేను ముసలి దాన్ని అయిపోయాను. నీకు ఇంక ఏ విధమైన సేవలు చేసే జవ సత్వాలు నాకు లేవు. నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాట్ని క్షమించేసి నన్ను ఇంక వెళ్ళనియ్యి. నాకు సమయం అయిపోయింది.”
“చింతామణి వజ్రాన్ని సాన బెట్టడం ఎంత అనవసరమో నిన్ను క్షమించడం అంత అనవసరం. నిశ్చింతగా ధర్మాన్ని తలుస్తూ ధ్యానంలోకి వెళ్ళి శరీరాన్ని విడిచేయి. నువ్వు చేసుకున్న పుణ్యం మూలంగా నీకు పునర్జన్మ అనేది లేదు. దేవతలందరూ దిగివచ్చి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు.” చెయ్యెత్తి దీవిస్తూ చెప్పాడు భగవానుడు.
ఆ రోజు రాత్రి ప్రజాపతి దేహం చాలించింది. ఆవిడతో పాటు సన్యసించిన స్త్రీలందరూ దేహ త్యాగం చేసారు. కాష్టాలు దహనం అవుతూంటే దేవతలందరూ దిగివచ్చి మహా ప్రజాపతికి స్వాగతం పలకడం ఆనందుడు చూసాడు. కళ్ళు కిందకి దించేసరికి భస్మ రాసులన్నీ ముత్యాల కుప్పలుగా మారి ఉన్నాయి. మరొక్క ఆలోచన లేకుండా వాటినన్నింటినీ దోసిళ్ళతో ఎత్తి, బుద్ధుడి భిక్షాపాత్రలో పోశాడు, ఆనందుడు.
“భగవాన్ ఇటువంటి అదృష్టం మన సన్యాసుల్లో ఎవరికైనా దొరుకుతుందా?” అడిగేడు ఆనందుడు అన్నీ అయిపోయేక.
“లేదు ఆనందా, నాతో సహా మనలో ఎవ్వరికీ ఆ అదృష్ఠం లేదు. నా తల్లులు మాయాదేవి, ప్రజాపతి ఇద్దరూ కారణ జన్ములు.”