ఏదో ఆలోచిస్తూ రోడ్డుమీద నడుస్తూన్న ఎఫిం, ఏలీషా పిలుపు విని పక్కకి చూశాడు. సంతోషంగా నవ్వుతున్న ఏలీషాని చూస్తే కొంచెం అసూయగా అనిపించిన మాట వాస్తవం. తనకన్నా బీదవాడయ్యీ, ఇంత సంతోషంగా ఎలా ఉండగల్గుతున్నాడో? అయితే ఏలీషా మంచి స్నేహితుడవడం, మనసులో కల్మషం లేకపోవడం ఎఫింకి బాగా నచ్చే విషయాలు. తిరిగి పలకరించేడు నవ్వుతూ, “ఏమిటి ఏలీషా అంతా కుశలమేనా? ఈ మధ్య బాగా నల్లపూస అయిపోయావే?”
ఏలీషా ఉన్నచోటునుండే పిల్చేడు, “రా, రా ఇలా కూర్చో, ఏమిటి విశేషాలు?”
ఎఫిం మాట కలిపేడు. “ఏమున్నాయ్, రోజూ ఉండేవే. ఈ ఇంటిపని మొదలు పెట్టాను. రోజు రోజుకీ ఖర్చులు పెరుగుతున్నాయే కానీ తగ్గే దారి కనబడటంలేదనుకో. ఇవి కాక మా మనవడి పెళ్ళొకటీ. మా అబ్బాయి సైన్యంలో చేరాడు కదా, వాడు ఈ పాటికి రావాలి. చూస్తున్నాం. సైన్యంలో తాగుడు అలవాటైంది. దాంతో ఓ చుక్క ఎక్కువ పుచ్చుకుని ఎక్కడ పాడౌతాడో అని నా బాధ. ఇలా ఎన్నని చెప్పేది. రోజుకో కష్టం తగులుకుంటోంది…”
ఏలీషా నవ్వేడు. “ఎందుకంత గాభరా పడిపోతావ్ ఎఫిం? రేప్పొద్దున్న మనం అనుకోకుండా పోయాం అనుకో, వీళ్ళందరూ జీవితాలు సాగించరూ? ఎవరి క్రాస్ వాడిదే. అదృష్టమో, దురదృష్టమో అది మనం మోయలేము. ఎవరిది వాడు మోసుకోవాల్సిందే కదా? అన్నీ ఆ భగవంతుడికి వదిలి నిశ్చితంగా ఉండు. పనులు అవే జరుగుతాయ్, ఆయన ఎలా చేయాలనుకుంటే అలాగే చేస్తాడు కదా?”
“అవుననుకో, అయినా నా ఆరాటం నాది. వీళ్ళందరూ నేను కష్టపడి తెచ్చిన పేరు పాడు చేస్తారేమో అని. ఇప్పటి దాకా మచ్చలేకుండా బతికాను. ఇప్పుడేమౌతుందో అనే బెంగ.”
“అదిగో మళ్ళీ అదే మాటా? నన్ను చూడు. మొదట్లో ఏదో ఉద్యోగం ఉండేది. తర్వాత వడ్రంగిగా చేశాను. ఏదో రెక్కాడితే డొక్కాడదనే జీవితం. ఇప్పుడిలా తేనెపట్లు పెంచుతున్నాను. భగవంతుడి దయవల్ల ఇప్పటిదాకా గడిచిపోయింది. అనుకున్న జెరూసలం ప్రయాణం కూడా అయిపోతే జీవితంలో ఇంక అన్నీ అయ్యినట్టే. నాతో పోలిస్తే నీ జీవితం ఎంతో ఉన్నతంగా లేదూ? ఎందుకూ గాభరా?”
“నువ్వన్నది నిజమే అనుకో, కానీ చెప్పానుగా నా మనసే అంత. ఏదో ఒకటి ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకుంటూ ఉంటానేమో.”
“అయితే మనం కలిసి వెళదాం అనుకున్న జెరూసలం ప్రయాణం గురించి చేప్పావు కాదు మరి. ఎప్పుడు బయల్దేరదాం?”
“కాస్త ఆగాలి. ఈ ఇంటి పని అయిపోగానే ఆలోచిద్దాం.”
“క్రితం ఏడాది అడిగితే ఇంకేదో చెప్పావు. ఇప్పుడేమో ఈ ఇంటిపని. అంతకు ముందు ఇంకేదో వంక. ఇలా ఎంతకాలం? చెప్పొచ్చావ్ కానీ ఈ పనులు మీ అబ్బాయ్ చూడలేడా?”
“వాడా? వాణ్ణి నమ్మితే ఏట్లో ములిగినట్టే.”
“ఇంకెంతకాలం ఆగుదాం? నువ్వే చెప్పు. ఎప్పటికప్పుడు ఇలా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాం. నువ్వు వస్తానంటే నేను రేపే బయల్దేరుతా తెలుసా?”
“అన్నిడబ్బులు వెనకేశావని నాకు తెలియదే? ఎలా సంపాదించావు?” నవ్వుతూ అడిగేడు ఎఫిం.
“సంపాదించడమా? భలేవాడివే. ఇంట్లో వాళ్ళ దగ్గిర ఉన్నదంతా ఊడిస్తే ఏదో వస్తుంది. నేను జెరూసలం వెళ్తున్నానంటే వాళ్ళే ఇస్తారు డబ్బులు. వెనక్కి వచ్చాక ఇచ్చేస్తానని చెప్తాను. పక్కింటాయన నేను పెంచే తేనెపట్లు అమ్మమని అడుగుతున్నాడు చాలాకాలం నుంచీ. సగం ఆయనకి అమ్మేసి మిగతా డబ్బులు పట్టుకొస్తా. నువ్వెప్పుడు సిద్ధంగా ఉంటావో చెప్పు మరి.”
“ఇవన్నీ వదిలేసి రావడం కొంచెం కష్టం…” ఇంటికెళ్ళడానికి లేచేడు ఎఫిం.
“అవునవును, మన మనసుని, మనం అనుకున్న మొక్కుల్నీ గాలికొదిలేయడం కష్టం కాదులే,” చురక అంటించేడు ఏలీషా.
ములుకులా తగలవల్సిన చోటే తగిలింది ఈ మాట ఎఫింకి. ఇంటికి నడకసాగించేడు. ఆ రోజు రాత్రి పడుకున్నాడన్న మాటే గానీ ఏలీషా మాటలు పదే పదే గుర్తుకొచ్చాయి. ‘ఏలీషా అన్న మాట ఎంత నిజం! ఈ రాత్రి కనక తను చచ్చిపోతే వీళ్ళందరూ వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా? తనెకెందుకింత ఆరాటం? తామిద్దరం జెరూసలం వెళ్ళాలని అనుకున్నది ఏనాటి మాట? ఏలీషా అంత మంచి స్నేహితుడు మళ్ళీ దొరుకుతాడా కూడా రావడానికి?’
మర్నాడు పొద్దున్నే ఏలీషా ఇంటికెళ్ళి చెప్పేడు. “నువ్వు చెప్పింది రాత్రంతా ఆలోచించాను. నువ్వు చెప్పింది సబబే అనిపించింది. నేను వచ్చే వారానికి బయల్దేరడానికి సిద్ధం. నిజంగా వస్తావా?”
“తప్పకుండా పోదాం. ఏది ఎప్పుడు చేయాలో అది వెంఠనే చేయడం మంచిది. మళ్ళీ నువ్వు మనసు మార్చుకోకముందే బయల్దేరుదాం.”
ఇంటినుంచి బయల్దేరిన కాసేపటికి ఎఫిం అడిగేడు ఉల్లాసంగా నడుస్తున్న ఏలీషాని, “ఇంట్లో మీ అబ్బాయికి, మీ వాళ్ళందరికీ నువ్వు లేనప్పుడు ఏం చేయాలో చెప్పి వచ్చావా?”
“పెద్దగా చెప్పడానికేం ఉంది? సగం తేనెపట్లు అమ్మాను కదా పక్కింటాయనకి? ఆయన్నీ వీళ్ళనీ కూర్చోపెట్టి అన్నీ ఎలా ఇవ్వాలో అలా మోసం లేకుండా ఇవ్వాలని చెప్పాను. మిగతా విషయాల్లో ఏదైనా కష్టం వస్తే ఎలా దాంట్లోంచి బయటపడాలో వాళ్ళకే తెలుస్తుంది. తెలియకపోతే నేర్చుకుంటారు పరిస్థితులబట్టి. ఆ తర్వాత భగవదేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.”
ఎఫిం కాస్త అసూయగా చూశాడు ఏలీషా కేసి. మూడు రోజులు తాను అందర్నీ కూర్చోపెట్టి ఎవరేం చేయాలో చిలక్కి చెప్పినట్టు చెప్పడం, వినేవాళ్ళ మొహాల్లో కనబడిన విసుగూ గుర్తుకొచ్చాయి. నిట్టూర్చేడు. ఏలీషా చేసినట్టు తానెందుకు చేయలేకపోతున్నాడు?
రోజుకి మైళ్ళు నడుస్తూ రష్యా చివరి భాగం చేరేసరికి ఎండలు దుర్భరంగా అనిపించడం మొదలుపెట్టాయి. ఇంతటి ఎండల్లో కూడా ఏలీషా ముక్కుపొడుం పీల్చడం మానలేదు. ఒకసారి చిరాగ్గా ఎఫిం అన్నాడు కూడా. “ఎందుకంత హైరానా పడుతూ కూడా ఆ దరిద్రం వెంట తెచ్చుకోవడం?” ఏలీషా కాస్త క్షమాపణగా చెప్పేడు. “ఈ వ్యసనం నాకన్న మొండిదైపోయింది కదూ?”
ఎండలో నడవడం కష్టంగా ఉండి ఓ ఊరి పొలిమేరల దగ్గిరకొచ్చేసరికి ఏలీషా అన్నాడు. “చాలా దాహంగా ఉంది. కాసిని మంచినీళ్ళు దొరికితే బాగుణ్ణు.”
చురుగ్గా నడుస్తున్న ఎఫిం ఆగాడు. “నాకు దాహంగా లేదు. నీకు కావాలిస్తే చూడు దొరుకుతాయేమో, ఇది బాగా కరువు ప్రాంతంలాగా ఉంది. నీ ఇష్టం మరి.”
అప్పుడు చుట్టు చూశాడు ఏలీషా. నిజంగానే కరువు ప్రాతం. ఎండిపోయిన చెట్లూ చేమలతో దారుణంగా ఉంది పరిస్థితి. “సరే అయితే, ఆ కనపడే ఇంట్లో అడిగి చూస్తాను నీళ్ళ కోసం. నువ్వు నడుస్తూ ఉండు. గొంతు తడుపుకుని కాసేపట్లో నిన్ను కలుస్తా.”
“సరే,” ఎఫిం ముందుకి సాగిపోయేడు. ఏలీషా కనిపించిన ఇంటికెళ్ళేసరికి అరుగు మీద ఎవరో పడుకుని ఉన్నారు. ముందు నీడలో పడుకున్నాడేమో కానీ ఎండ మీద పడుతున్నా లేచే సూచనలు లేవు. దగ్గిరకెళ్ళి చూశాడు ఏలీషా. పడుకున్న మనిషి కళ్ళు తెరిచే ఉన్నాడు. “కాసిని మంచినీళ్ళు ఇప్పిస్తారా? గొంతుక ఎండిపోతోంది,” అడిగేడు ఏలీషా.
సమాధానం లేదు. కాసేపు చూసి మళ్ళీ అడిగాక ఇంక లాభం లేదని ఇంటి తలుపుకొట్టేడు. అక్కడా కూడా సమాధానం లేదు. ఆగి మళ్ళీ కొట్టాక తలుపు మెల్లిగా లోపలకి తోశాడు. అక్కడ చూసిన దృశ్యం భీభత్సంగా ఉంది. ఒక బల్ల మీదొక ముసలావిడ, ఆవిడ్ని పట్టుకుని ‘ఆకలి, ఆకలి,’ అని అరుస్తున్న ఇద్దరు పిల్లలూ కనిపించేరు. ఇంట్లో తినడానికి కాదు కదా చూడడానికి కూడా ఏ వస్తువూ ఉన్నట్టు లేదు. అన్నింటికన్నా దారుణం, ఒక స్త్రీ నేల మీద పడి అటు ఇటూ పొర్లుతోంది నెప్పితో. ప్రసవవేదన కాదు కానీ ఏదో తీవ్రమైన జబ్బే. ఏలీషా ఇది చూసి దాహం మాట మర్చిపోయి అవాక్కయ్యేడు. ఇల్లు గర్భదరిద్రానికి మారుపేరులా కనబడుతోంది.
తలుపు తోసుకొచ్చిన ఏలీషాని చూసి ముసలావిడ అంది. “ఏం కావాలి? మా దగ్గిరేం లేదు. వెళ్ళు బయటకి.”
అంతటి స్థితిలోనూ ఆవిడ మాట్లాడిన తీరుకి ఏలీషా నిర్ఘాంతపోయేడు. “గొంతు ఎండుకుపోతూంటే కాసిని మంచినీళ్ళిస్తారేమో అని నేను వెళ్ళే దారిలో ఈ ఇల్లు కనపడితే ఇలా వచ్చానమ్మా,” అన్నాడు.
“ఫో బయటకి. నీళ్ళు కాదు కదా, నీళ్ళు తేవడానికి కడవ కూడా లేదు మా దగ్గిర.”
ఒక్క క్షణం ఆగి ఏలీషా అడిగేడు, “మీలో ఎవరూ ఆ కింద నేలమీద ఉన్నావిడని పట్టించుకునే స్థితిలో లేరా?”
“లేము. మా అబ్బాయి బయట అరుగు మీద చావడానికి పడుకున్నాడు. మేము ఇంట్లో లోపల చస్తున్నాం,” కరుగ్గా వచ్చింది సమాధానం. ఏలీషా ఏదో అనబోయేడు కానీ తలుపు దగ్గిర చప్పుడైతే వెనక్కి చూశాడు. అరుగు మీద పడుకున్నాయన లోపలకి తూలుతూ వచ్చాడు. గోడ ఆసరాగా నించుని చెప్పాడు. “రోగాలూ రొష్టులూ అంటుకున్నాయి మాకు. తినడానికి తిండీ లేదు, వేసుకోవడానికి మందులూ లేవు. ఈ రెండింటికీ కావాల్సిన డబ్బులూ లేవు.”
ఇదంతా చోద్యంగా చూస్తున్న చిన్నపిల్లలకేసి చూశాడు ఏలీషా. కడుపులో దేవినట్టైంది. భూజానికున్న సంచీ దింపి పెద్ద రొట్టి బయటకి తీసి ఇంటాయనకి ఇచ్చాడు. ఆయన తీసుకోకుండా పిల్లలకేసి చూపించి, “వాళ్ళ కియ్యండి,” అన్నాడు.
వెంటనే ఏలీషాకి తెలివి వచ్చినట్టైంది. వీళ్ళు ఇప్పుడు తానిచ్చిన రొట్టె తినలేరు. ముందు వీళ్ళకి తనలాగే దాహంగా ఉంది. నుయ్యి ఎక్కడుందో కనుక్కుని నీళ్ళు తెచ్చి వీళ్ళందరికీ రొట్టె, నీళ్ళు ఇచ్చాడు. పిల్లలిద్దరూ గబగబా తిన్నారు ఆకలిగా ఉండడంతో. ముసలావిడ కూడా కాస్త ఎంగిలిపడింది కానీ ఇంటాయన ఈ స్థితిలో తనేమీ తినలేనని చెప్పేడు. ఈ తతంగం అంతా జరుగుతూండగా నేలమీద స్త్రీ మాత్రం అలా పొర్లుతూనే ఉంది. ఆవిడకి స్పృహ ఉన్నట్టే లేదు. ఇదంతా చేసేసరికి మూడు గంటలు దాటింది. ఏలీషా ఊర్లోకెళ్ళి కాస్త పిండి, ఉప్పూ, సరంజామా కొని పట్టుకొచ్చేడు. సాయంత్రానికి కొంచెం పులుసూ, రొట్టే తయారు చేసి ఇంటివారికో భోజనం అందించేడు. తిండి తిని ఎన్నాళ్ళైందో కానీ పిల్లలిద్దరూ కంచాలు నాకి నాకి మరీ తిన్నారు. ముసలావిడా ఇంటాయనా కూడా కాస్త ఎంగిలిపడ్డాక ఏలీషా బయటకొచ్చి అరుగు మీద కూర్చున్నాడు ఇంటాయనతో పాటు.
“మాకు మొదట్నుంచీ డబ్బులుండేవి కాదు. క్రితం ఏడు భూస్వామి దగ్గిర అప్పులు చేసి పంట వేశాను. కరువు మూలాన సర్వనాశనం అయ్యింది. తర్వాత కొంతకాలం భూస్వామి ఆగాడు కానీ ఒక్కొక్కటే వెనక్కి తీసుకున్నాడు. దానితో ఇంట్లో ఉన్న ఆవూ, గుర్రమే కాక చెంబూ తప్పేలాలు కూడా అమ్ముకున్నాం. పొరుగింటి వాళ్ళు ఏదో ఇచ్చారు తినడానికి. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఇవ్వగలరు? ఒక్కొక్కరే తప్పుకున్నారు. తర్వాత ఊళ్ళోకెళ్ళి బిచ్చం ఎత్తాను. అది కూడా దొరక్క పోయేసరికి క్రితం వారం గడ్డి కోసుకు తిన్నాం. అప్పట్నుంచీ ఈ రోగం మొదలైంది. మా ఆవిడకి ఏం జబ్బో తెలియదు. అలా పడి ఉంది. మీరు కనక ఇవాళ రాకపొతే మా ప్రాణాలు గాలిలో కల్సిపోయి ఉండేవి.” దాదాపు ఏడుస్తున్నట్టూ చెప్పేడు ఇంటాయన.
ముసలావిడ కూడా ఆవిడ కథ చెప్పాక ఏలీషా బయటకెళ్ళి కూర్చున్నాడు. కాసేపటికి నిద్ర పట్టింది. జాము రాత్రి మెలుకువ వచ్చాక, నేను ఇప్పుడు వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ దరిద్రంలో కూరుకుపోతారు కదా, అనే ఊహే నిద్రపట్టకుండా చేసింది. అలాగ ఆ రోజుకి ఏలీషా ప్రయాణం వాయిదా పడింది.
మర్నాడు పొద్దున్నే లేచి ఆ రోజుక్కావాల్సిన తిండీ అవీ తయారు చేసి పెట్టాడు ఏలీషా. ముసలావిడా పిల్లలిద్దరూ తలో చెయ్యీ వేశారు. ఇల్లు కాస్త శుభ్రం చేసి భోజనాలు చేయగానే కాస్త సత్తువ వచ్చినట్టైంది అందరికి. ముసలావిడ పక్కింటికి వెళ్ళింది ఏవో తీసుకురావడానికి. ఇంటాయన కూడా నీరసం తగ్గి నడవగలుగుతున్నాడు. కానీ వాళ్ళావిడ మాత్రం ఇంకా పడుకునే ఉంది. ఇదిగో ఈ రోజు వెళ్ళిపోదాం, రేపు వెళ్ళిపోదాం అనుకుంటూనే ఏలీషా ఆ ఇంట్లో వాళ్ళ బాగోగులు చూస్తూ అయిదురోజులు గడిపేశాడు. అయిదో రోజుకి ఇంటావిడ జబ్బు తగ్గి మెల్లిగా నడవడం మొదలెట్టింది. ఇంటాయన భూస్వామి దగ్గిరకెళ్ళి మొరపెట్టుకున్నాడు అప్పు వచ్చే ఏడాది తీర్చేలాగ చూడమని. డబ్బులు పట్టుకొచ్చాక చూద్దాం పో, అనేసరికి మొహం వేళ్ళాడేసుకు రాక తప్పలేదు.
ఆ రోజు ఇంటాయనకీ భూస్వామికి మధ్య జరిగినవన్నీ విన్నాక ఏలీషా బయటకెళ్ళి పడుకున్నాడు చెట్టునీడలో. ఒకటే ఆలోచనలు — ‘నేను వెళ్ళాక వీళ్ళెలా బతుకుతారు? క్రితం ఏడు కరువు సరే, ఈ ఏడు బాగానే ఉంది కదా? ఇప్పుడు చేయడానికి ఏదో ఒకటి లేకపోతే పది రోజుల్లో మళ్ళీ మొదటికే మోసం రావొచ్చు. పొలం విడిపిస్తే, గుర్రం, ఆవు కావాలి కదా? లేకపోతే సేద్యం ఏం చేస్తారు? ఇవన్నీ విడిపించాలంటే… భలే సుడిగుండంలో చిక్కుకున్నావ్ నువ్వు ఏలీషా!”
ఎడతెగని ఆలోచనల్తో అలా బుర్ర బద్దలౌతూండగా, లేచి కాస్త ముక్కు పొడుం పీల్చేడు. అబ్బే! ఇలా వదిలే ఆలోచనలు కనకా? ఆలోచించే కొద్దీ, ఒకపక్క ఈ పాటికి తాను ఎఫింని కలుసుకోవడానికి బయల్దేరమంటూ మనసు తొందర చేస్తూంటే, ఇంకో పక్క వీళ్ళని అలా గాలికొదిలేసి పోవడం అమానుషం అని మనస్సు వెనక్కి లాగుతోంది బలంగా. ఆ రోజు కూడా అలాగే గడిచిపోయింది ఏమి తేల్చుకోకుండా. రాత్రి ఏలీషా పడుకున్నాడన్నమాటే కానీ నిద్ర కరువైంది.
దాదాపు తెల్లవారుతూంటే చిన్నగా కునుకు పట్టింది. నిద్రలో కల. ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు తాను మెల్లిగా లేచి సంచీ భుజాన వేసుకుని చడీ చప్పుడూ లేకుండా తలుపు తీసుకుని వెళ్ళబోతున్నాడు. కానీ సంచీ తలుపు కొక్కేనికి తగులుకుంది. దాన్ని తీస్తూంటే చిన్నపిల్లకి మెలుకువొచ్చింది కాబోలు. వెంటనే లేచి వెళ్ళిపోయే ఏలీషా చేతిని పట్టుకుని, ఆకలి, ఆకలి అని అరుస్తోంది. రెండో పిల్లవాడు ఏలీషా కాళ్ళు పట్టుకుని లాగుతున్నాడు వెళ్ళొద్దని! ఒక్కసారి అదిరిపడి లేచి కూర్చున్నాడు ఏలీషా. కల చెదిరిపోయింది. పైకే ఎవరితోనో అంటున్నట్టూ చెప్పేడు.
“పొద్దున్న లేవగానే వీళ్ళు తనఖా పెట్టిన భూమిని విడిపించి రొట్టెలక్కావాల్సిన పిండీ, గుర్రం కొనిస్తా. పిల్లలకి పాలకోసం ఆవుని కూడా కొనాలి. ఇవన్నీ చేయకుండా నా మటుక్కి నేను జెరూసలం వెళ్తే సప్తసముద్రాల అవతల ఉన్న దేముడ్ని చూడగలనేమో కానీ నాలో మానవత్వం చచ్చి ఊరుకుంటుంది. అప్పుడు నేను బతికినా చచ్చినా ఒక్కటే.”
మర్నాడు పొద్దున్నే లేచి భూస్వామి దగ్గిర తనఖా విడిపించి బజార్లోకి బయల్దేరేడు ఏలీషా. మొదట కొనాల్సింది గుర్రం. తర్వాత దానికో బండీ, సేద్యానిక్కావాల్సిన కత్తీ, కొడవలీ అన్నీ కొన్నాక ఒక బస్తా పిండి రొట్టెల కోసం కొని, ఆవుని బేరం చేయడానికెళ్ళాడు. బేరం మాట్లాడుతూంటే వెనకనుంది ఎవరో ఇద్దరు మాట్లాడుకోవడం వినిపించింది.
“మొదట్లో ఈయనెవరో ఇంటివాళ్ళకి తెలియదు. మంచినీళ్ళకోసం వచ్చాడుట. వీళ్ళ పరిస్థితి చూసి అక్కడే ఉండి ఇంటావిడ లేచేదాకా పనిచేసి పెట్టాడుట. ఈ రోజు గుర్రం, బండీ కూడ కొన్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళుంటారంటే నమ్మడం కష్టమే…”
ఈ పొగడడం విన్నాక ఇంక అక్కడ ఉండటం ఇష్టం లేక ఏలీషా వెంటనే బయల్దేరి వచ్చేశాడు. గుర్రం, బండీ చూసి ఇంటాయన ఆశ్చర్యపోయేడు, “ఎవరిదండి ఇది?”
“మనదే, చవగ్గా వస్తూంటే కొన్నాను. కాస్త గడ్డి కోసి పెట్టావంటే రాత్రికి అది తినడానికి వీలౌతుంది. ఈ బండిలో పిండి పట్టుకొచ్చాను. అది రొట్టెలకోసం సరిపోతుంది. రేపట్నుంచీ నువ్వు భూస్వామి దగ్గిరకెళ్ళు. భూమి తనఖా విడిపించాను కూడా.”
ఇదంతా విన్నాక ఇంట్లో ముసలావిడకీ, ఇంటాయనకీ, వాళ్ళవిడకీ నోటమ్మట మాటరాలేదు. ఆ సాయంకాలం ఇంట్లోంచి బయటకొచ్చి రోడ్డు మీద పోయే జనాల్ని చూస్తూ కూర్చున్నాడు ఏలీషా. కూడా తెచ్చుకున్న సంచీ, సరంజామా పక్కనే ఉంది. భోజనాలై ఇంట్లో అందరూ పడుకున్నాక జాము రాత్రి వేళ చడీ చప్పుడూ లేకుండా మెల్లిగా లేచి ఎఫింని వెతుక్కుంటూ జెరూసలం ప్రయాణంలో ముందుకి బయల్దేరి చీకట్లో కల్సిపోయేడు ఏలిషా.
ఎక్కడా ఆగకుండా సూర్యుడు పైకొచ్చేదాకా నడిచాక ఏలీషా ఒక చెట్టు కింద కూర్చుని సంచీ బయటకి తీసేడు. ఉన్న డబ్బులు లెక్కపెడితే పదిహేడు రూబుళ్ళ ఇరవై కొపెక్కులు మిగిలాయి. కూర్చున్న చోటునుంచి ఒకవైపు, జీవితాంతం వెళ్దామనుకున్న జెరూసలం రా రమ్మని పిలుస్తోంది. ఏలీషా ఆలోచనలు పరిపరివిధాల పోయేయి. చేతిలో డబ్బులు చూస్తే వీటితో జెరూసలం వరకూ వెళ్ళగలడం అసంభవం. దారిలో భిక్షమెత్తితే మనసున్న మనుషులు ఒకరో ఇద్దరో సహాయం చేస్తారేమో. కానీ అలా అడుక్కుంటూ వెళ్ళడం కంటే వెళ్ళకపోవడమే మంచిది. పోనీయ్, ఈ జన్మలో కుదరదేమో భగవంతుడ్ని చూడ్డానికి వెళ్ళడం. కరుణామయుడైన ఆ భగవంతుడు ఈ చిన్న తప్పు క్షమించలేడా? ఎఫిం అంత దూరం వెళ్ళాక నా పేరుమీదో కొవ్వొత్తి వెలిగించకపోడు…
కాసేపు సేద తీరేక ఏలీషా జెరూసలం వెళ్ళే ఆలోచన కట్టిపెట్టి ఇంటికి వెనక్కి వెళ్ళడానికి బయల్దేరేడు. దారిలో మళ్ళీ ఈ ఇంటివాళ్ళకి కనిపిస్తే బాగుండదని ఆ ఊరు చుట్టూరా తిరిగి వేరే దారిలో తొందర తొందరగా నడుచుకుంటూ నడిచేడు. వచ్చేటప్పుడు ఎఫింతో నడవడం మొదలుపెట్టినప్పుడు అలవాటు లేక కాబోలు రోజుకి ఇరవై మైళ్ళు నడిస్తేనే గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడు రోజుకు నలభై, ఏభై మైళ్ళు నడిచి ఇంటికి చేరిపోయేడు.
ఇంట్లోవాళ్ళు ఏలీషాని చూసి కంగారుతోనూ, ఆశ్చర్యంతోనూ అతను చెప్పింది విన్నారు. “నేనూ ఎఫిం కొంతదూరం నడిచాం కలిసి. ఎఫిం నాకన్నా బాగా నడిచేవాడు. ఒకసారి అతను ముందుకెళ్ళగానే ఇద్దరం విడిపోయేం. ఆ తర్వాత నా డబ్బులు పోయేయి. అడుక్కుంటూ అక్కడెకెళ్ళడం ఎందుకని వెనక్కి వచ్చేశాను. ఏమీ ఫర్వాలేదు. అక్కడకి వెళ్ళాక ఎఫిం మన పేరు మీద ఒక కొవ్వొత్తి వెలిగిస్తాడులే.”
ఎవరేం అడిగినా ఇదే చెప్పేడు ఏలీషా. ఫలానా ఇంటిదగ్గిర ఆగాననీ ఆ ఇంట్లో వాళ్ళకి సహాయం చేశాననీ మాత్రం ఆ ఊళ్ళోనే మర్చిపోయేడు. ఇంట్లోవాళ్ళు ఏలీషా చెప్పినది విని ఆశ్చర్యపోయేరు. మొదట్లో ఇదేం మనిషి, అంత కష్టపడ్డాడు బయల్దేరడానికి ఇప్పుడేమో డబ్బులు పోగుట్టుకున్నాడా అనుకున్నారు కానీ రాను రాను అది ఎలాగోలాగ మర్చిపోయి రోజువారీ పనుల్లో పడిపోయేరు. రాబోయే చలికాలానికి అన్నీ సిద్ధం చేసుకుని ఏలీషా కొడుకుని వేరే పని చూసుకోమని పంపించేడు. తాను మటుక్కు ఇంట్లోనే ఉంటూ తేనెపట్లు చూస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయ్. ఇక్కడ ఏలీషా పరిస్థితి ఇలా ఉంటే అక్కడ ఎఫిం పరిస్థితి ఇంకోలా ఉంది.
ఏలీషా ఆగిన గుడిసె దగ్గిర్నుంచి కాస్త దూరంలో ఎఫిం ఆగేడు ఏలీషా కోసం. ఓ చిన్న కునుకు తీసి దాదాపు సాయంత్రం అయ్యేదాకా చూసేడు కానీ ఏలీషా జాడ లేదు. కాసేపు ఇటా, అటాని తర్కించుకున్నాక ఎఫిం ముందు కెళ్ళడానికే నిశ్చయించేడు, ఏమో నేను పడుకున్నప్పుడు ఏలీషా నన్ను చూడకుండా ముందుకెళ్ళాడేమో అనుకుంటూ. అసలు తమ ప్రయాణం మొదలుపెట్టిందే ఏలీషా పోరడం వల్లే కదా? ఎక్కడ దారి తప్పినా ఓడెస్సా దగ్గిర కానీ, సముద్రం దగ్గిర ఓడ ఎక్కేటప్పుడూ కానీ కల్సుకుంటాం ఎలాగానూ, అనుకుంటూ ఎఫిం ముందుకే వెళ్ళేడు.
దారిలో తలమీద టోపీతో ఇంకో ప్రయాణీకుడు కలిసేడు ఎఫింకి. ఆయన ఇది రెండో సారి వెళ్ళడంట జెరూసలంకి. ఓడెస్సా చేరాక ఎఫిం కనపడిన ప్రతీవాడినీ ఏలీషా కోసం అడిగేడు కానీ ఎవరూ అతన్ని చూసినట్టులేదు. ఓడలోకి ఎక్కడానికి టికెట్టూ పాస్‌పోర్ట్‌కి డబ్బులూ కడుతూంటే కూడా వచ్చిన ప్రయాణీకుడు డబ్బులు ఖర్చు పెట్టొద్దనీ, వెనకదారిలో ఓడలో టికెట్ లేకుండా వెళ్ళడం ఎలాగో తనకి తెలుసనీ ఎఫింకి చెప్పడానికి ప్రయత్నించేడు. కాని, ఎఫిం ఒప్పుకోలేదు. “నేను వీటన్నింటికి డబ్బులు తెచ్చుకున్నాను ముందే, అలా మోసం చేసి వెళ్ళడం ఇష్టం లేదని,” ఖరాఖండీగా చెప్పేడు.
రాత్రి ఓడ బయల్దేరాక చిన్న తుఫానులాంటిదొచ్చినా ఏ కష్టం లేకుండా మొత్తానికి ఆ దరి చేరేడు ఎఫిం. అక్కడ్నించి జెరూసలంకి కాలినడకే మళ్ళీ. దారిలో పాస్‌పోర్ట్ మీద ముద్ర వేయించుకుని కనపడిన గుళ్ళన్నీ చూస్తూ ఎఫిం, కూడా తగులుకుంటూ వచ్చిన ప్రయాణీకుడూ నడిచేరు. కనపడిన ప్రతీ గుడి గురించీ, వాటిల్లో జరిగే తంతుల గురించీ విడమర్చి చెప్పేడు తోటి ప్రయాణీకుడు ఎఫింకి. ఎక్కడెక్కడ ఎంతెంత దక్షిణ ఇవ్వాలో అంతా ఎఫిం చేత ఇప్పించేడు కూడా. మధ్యాహ్నం దాకా తిరిగి వచ్చి భోజనం చేసి నడుం వాలుస్తూంటే ఎఫిం కూడా వచ్చిన ప్రయాణీకుడు, తన పర్సు పోయిందని ఏడవడం మొదలుపెట్టేడు.
ఎంత వెతికినా పోయిన పర్సు దొరికింది లేదు. అందరూ పడుకున్నాక ఎఫిం అనుకున్నాడు, “ఇన్ని చోట్ల నా చేత డబ్బులు, దక్షిణా ఇప్పించేడే, ఒక్కసారైనా జేబులోంఛి డబ్బులు తీసిన పాపాన పోయేడా? ఇంకా నా దగ్గిరే ఒకటో రెండో రూబుళ్ళు అప్పు కూడా అడిగేడు కదా? ఇప్పుడేమో పర్సు పోయిందంటున్నాడే? వీడి చేతిలో ఎప్పుడూ పైసా లేదు…”
ఈ ఆలోచన రాగానే ఎఫిం ఒక్కసారి సిగ్గుపడి తనని తానే తిట్టుకున్నాడు, “ఇతని గురించి నాకు తెల్సిందే తక్కువ. ఇలా ఆలోచించడానికి నాకేం అధికారం ఉంది? అలా ఆలోచించడం తప్పు.” కానీ ఏ ఆలోచనైతో మనస్సులోకి రానీయకూడదనుకున్నాడో అదే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది. ఆఖరికి పడుకుంటూ ఒక నిర్ణయానికొచ్చేడు, “వీడి దగ్గిర డబ్బులేమీ లేవు. పర్సు కొట్టేయడం అవీ ఇతని కట్టుకధలే.”
రాత్రి ప్రార్ధనకి ఎఫిం బయల్దేరేక ఆ రోజు తోటి ప్రయాణీకుణ్ణి వదిలించుకోవడానికి నిశ్చయించుకున్నాడు కానీ వెళ్ళిన ప్రతీచోటా ప్రయాణీకుడు ఎఫింని బంకలా అంటి పెట్టుకునే ఉన్నాడు. చూసిన ప్రతీ చోటా ఎఫిం ఒక కొవ్వొత్తి వెలిగించాడు. చర్చిలన్నింటిలోనూ విపరీతమైన జనసందోహం. ఒకచేయి పర్సు మీద ఉంచి, మనసు దేముడి మీద లగ్నం చేయడానికి ప్రయత్నం చేసేడు కానీ కోతి మనసు పర్సు మీద నుంది బయటకొస్తే కదా? నిన్న తోటి ప్రయాణీకుడి పర్సు పోయింది. ఈ రోజు తనది పోతే? అనే ఆలోచనే ఎఫిం ఆందోళనకి గురిచేసింది.
ప్రధానమందిరం లోకి వెళ్ళేక అశేష జనసముద్రం మీదనుంచి లోపలకి చూసేడు ఎఫిం. దీని కోసమే కాదూ అష్టకష్టాలకోర్చి ఇక్కడకొచ్చింది? అలా చూస్తూండగానే ఎఫింకి ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. సరిగ్గా మందిర ముఖద్వారం దగ్గిర అందరికన్నా ముందు వరుసలో, బూడిద రంగు కోటు వేసుకుని, బట్టతలతో మోకాళ్ళమీద ప్రార్ధిస్తున్న ఏలిషా!
ఒక్కసారి ఎఫిం ఒళ్ళు గగుర్పొడిచింది, స్నేహితుణ్ణి చాలా కాలం తర్వాత చూసినందుకు. నేను ఓడలో అందర్నీ కలిశానే, అక్కడ ఎక్కడాలేని ఏలిషా ఇక్కడికెలా వచ్చాడబ్బా? అనుకుంటూ ఎఫిం ముందుకి వెళ్ళడానికి ప్రయత్నించేడు. ఒక్క అంగుళం కూడా ముందుకి కదల్లేని పరిస్థితి.
ఉన్నచోటునుండే, మూడు ప్రణామాలు చేయడం మొదలుపెట్టేడు — ఒకటి ఎదురుగానున్న భగవంతుడికీ, రెండోది తోటి భక్తుల తలో వైపుకీ. అలా అందరూ చేస్తూంటే ఎఫిం ఈసారి సరిగ్గా గుర్తించేడు. అవును ముందున్నది ఏలీషానే! స్నేహితుణ్ణి చూసి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతూండగా అనుకున్నాడు ఎఫిం, “భలేవాడివయ్యా ఏలిషా, ఏమైతేనేం ముందుకు తోసుకెళ్ళావు. బయటకెళ్ళగానే నిన్ను కల్సుకుంటాను ఈ సారి.”
ప్రార్ధన అవ్వగానే ఎఫిం గబగబా గుమ్మం దగ్గిరకెళ్ళి బయటకొచ్చే ప్రతీ ఒక్కర్నీ నిశితంగా చూడ్డం మొదలుపెట్టేడు – ఏలీషాని పట్టుకోవడం కోసం. అయితే ఏలిషా జాడ లేదు. చాలా సేపు వెదికి వేసారి వెనక్కి వచ్చేశాడు ఎఫిం.
ఇంక ఎఫింని అంటిపెట్టుకునుంటే డబ్బులు రాలవు అనుకున్నాడో, మరొకటో తెలియదు కానీ కూడా వచ్చిన తోటి ప్రయాణీకుడు మళ్ళీ కనపళ్ళేదు. మర్నాడు ఎఫిం మళ్ళీ చర్చికి వెళ్ళేడు. జనం అంతమంది లేకపోయినా ప్రార్ధన చేస్తూంటే సరిగ్గా ఏ చోటైతే క్రితం రోజు కనిపించాడో అదేచోట ఏలిషా మళ్ళీ కనిపించేడు – అదే కోటూ, అదే బట్టతలతో. “నిన్నైతే తప్పించుకున్నావు కానీ, ఈ రోజు ఎలాగైనా నిన్ను కల్సుకుంటాను,” అనుకుంటూ వెంటనే ఎఫిం ముందుకెళ్ళేడు కానీ ఏలీషా కనపడలేదు.
మూడో రోజు కూడా ఇదే తంతు. కానీ ఎఫిం మూడోరోజు గుమ్మం దగ్గిరే కాపలా కాసి ఎంత జాగ్రత్తగా చూసినా ఏలీషా కనబడలేదు. ఎఫిం జెరూసలంలో ఆరువారాలు గడిపేడు. వెళ్ళిన ప్రతిచోటా ఒక కొవ్వొత్తి వెలిగించేడు తన పేరు మీద, తమ పూర్వీకుల మీదాను. తర్వాత జోర్డాన్ నదికి వెళ్ళి ఒక సీసాలో నీళ్ళు పట్టుకున్నాడు ఇంటికి తీసుకెళ్ళడానికి. ఎనిమిది పవిత్రమైన స్థలాలలో తన పేరు రాయించుకున్నాడు కూడా. ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టేసి జఫ్ఫా దాకా వచ్చేక ఓడ ఎక్కి ఓడెస్సాలో దిగేడు. అక్కడనుండి అంతా నడకే ఇంటికి, వచ్చినదారిలోనే.
వచ్చిన దారే అయినా ఇప్పుడంతా వింతగా కనిపించింది ఎఫింకి. చాలా మార్పు వచ్చినట్టుందే అనుకుంటూ నడక సాగించేడు. పైర్లు బాగా పెరిగి ఉన్నాయి. తాను మొదట వచ్చినప్పుడున్న కరువు ఇప్పుడున్నట్టు లేదు. బాగా వర్షాలు పడుతున్నాయి కాబోలు. ఏడాదిలో ఎంత తేడా?
ఓ రోజు సాయంకాలం అయ్యేసరికి ఎఫిం ఎక్కడైతే ఏలీషాని విడిచి ముందుకి సాగిపోయాడో సరిగ్గా అక్కడికే వచ్చేడు. ఒక పాప వచ్చి “రండి, రండి మా ఇంటికి రండి,” అంటూ స్వాగతం పలికింది.
పాపని పట్టించుకోకుండా ముందుకి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఎఫిం కానీ ఆ పాప వదలదే! సరే కాసేపు కూర్చుని చూద్దాం, ఏలీషా ఇటుపేపు వచ్చాడేమో తెలుస్తుంది కూడా అనుకుంటూ ఎఫిం పాప కూడా వెళ్ళేడు.
ఇంట్లోకి వెళ్ళింది మొదలు ఎఫింకి ఇంటివాళ్ళు రాచమర్యాదలు చేయడం మొదలుపెట్టేరు. కాస్త ఇబ్బందిగా ఉన్నా పోనీ వాళ్ళు ఏమనుకుంటారో అని ఊరుకున్నాడు ఎఫిం. ఎఫిం వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూంటే ఇంటావిడ చెప్పింది.
“వద్దు, అలా అనకండి. మేము ఇలా వచ్చే పోయే ప్రయాణీకులకి సహాయం చేయడానికి బలమైన కారణం ఉంది. జీవితం అంటే తినడం పడుకోవడం అనుకుంటూ ఉండేవాళ్ళం మేము. దాదాపు అన్నీ పోగొట్టుకుని చావు దగ్గిరకొచ్చేసరికి భగవంతుడు కరుణించి ఒక ప్రయాణీకుణ్ణి ఇక్కడకి పంపించేడు మమ్మల్ని దారిలో పెట్టడానికి. తిండి లేని దరిద్రంలో కొట్టాడుతూంటే ఆయన వచ్చేడు ఇక్కడకి. మీలాంటివాడే ఆయనాను. కాసిని మంచినీళ్ళిస్తారా అని అడిగాడు. భగవంతుడు ఎంతటి కృపాళువు కాకపోతే మా దగ్గిరకి అటువంటి దేవతని పంపిస్తాడు? మా దగ్గిరకి నీళ్ళకోసం వచ్చినాయనకి మంచినీళ్ళివ్వడం అటుంచి పొమ్మని కసిరాము. ఆయన మమ్మల్ని చూసి జాలిపడి మాకు తిండీ నీరూ అమర్చాడు. ఆ తర్వాత మా కాళ్ళ మీద మేము నించోడానికి గుర్రం కొనిపెట్టి పొలం తనఖా విడిపించి మమ్మల్ని దారిలో పెట్టేడు. వచ్చినాయన మనిషో, దేవతో? ఇలాంటి దుర్గంధంలో ఉన్నామని మమ్మల్ని అసహ్యించుకోలేదు, మంచినీళ్ళవ్వలేదని ఏవగించుకోలేదు. అంతటి కరుణార్ద్ర హృదయుడాయన. ఎంతటి సిగ్గులేని జీవితం మాది — వచ్చినాయన మంచి నీళ్ళవ్వమని అడిగితే పొమ్మని కసురుకున్నాం. అవన్నీ లెక్కచేయక మమ్మల్ని లేపి మా కాళ్ళ మీద నించోపెట్టేడు. భగవంతుడున్నాడో లేదో మాకు సరిగ్గా తెలియదు కానీ ఆ వచ్చినాయన మాత్రం సాక్షాత్తూ భగవంతుడు పంపిన దేవతే.”
ఆవిడలా చెప్తూంటే, ఇంటిలో పిల్లా పెద్దా అందరూ పోటీపడి చెప్పడం మొదలుపెట్టేరు — ఇక్కడ ఆయన సంచీ పెట్టేడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ ముక్కుపొడుం పీల్చేవాడు, అంటూ. రాత్రి పొద్దుపోయేదాకా ఇవే కబుర్లు చెప్పారు ఎఫింకి ఇంటిల్లపాదీ.
రాత్రి ఎక్కడ పడుకోవాలో చూపించాక అందరూ పడుకున్నారు కానీ ఎఫింకి నిద్ర పట్టలేదు. ఎంత బయటకి తోసేద్దామన్నా ఏలీషా ఆలోచనలే. ప్రతిచోటా చర్చ్ లోనూ, ప్రతీ ప్రార్ధనా మందిరం లోనూ తాను చూసిన ఏలీషా ముందు వరుసలో ఎందుకున్నాడో అర్ధమయ్యీ కానట్టు ఉంది ఈ రోజు దాకా. ఇప్పుడు ఈ ఇంటివాళ్ళ కధ విన్నాక తెల్సింది — భగవంతుడు తన ప్రయాణానికి సంతోషపడ్డాడో లేదో కానీ ఏలీషా ప్రయాణానికి మాత్రం చాలా సంతోష పడ్డాడనేది వాస్తవం. అదన్న మాట తాను వెళ్ళిన ప్రతీచోటా ముందు వరుసలో ఏలీషా కనబడడానికి కారణం.
మర్నాడు ఎఫిం వద్దంటున్నా ఇంటివాళ్ళు కొన్ని తినుబండారాలు, అవీ సంచిలో పెట్టి ఇచ్చేరు. అవి పట్టుకుని మళ్ళీ నడక సాగించేడు ఎఫిం. ఎఫిం ఇంటికి చేరేసరికి బయల్దేరిన రోజుకి దాదాపు ఏడాది గడిచింది; కొడుకు ఇంట్లో లేడు. వచ్చేసరికి తాగి వచ్చాడులా ఉంది నోరంతా వాసన. చెప్పినవన్నీ సరిగ్గా చేశాడో లేదో అడగడం మొదలుపెట్టేడు ఎఫిం. చివరకి తెల్సింది ఏమిటంటే కొడుకు నాన్న లాంటి వాడు కాదు. తనిష్ట ప్రకారం తాను బతికేడు. నాన్న తిట్టడం మొదలుపెడితే దీనికి దీటుగా సమాధానం చెప్పేడు కొడుకు, అసలే తాగి ఉన్నడేమో. “అన్నీ నీ ఇష్టం ప్రకారం జరగాలంటే నువ్వే ఇక్కడుండి చూసుకోలేకపోయేవా? నీ ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్తావు డబ్బులు పట్టుకుని. వెనక్కొచ్చి నా మీద ఎగరడం దేనికీ?”
ఎఫింకి కోపం వచ్చి కొడుకుని కొట్టేడు. మర్నాడు ఊర్లో పెద్దలదగ్గిరకి బయల్దేరేడు కొడుకు గురించి చెప్పి వాణ్ణి కాస్త మందలించమని చెప్పడానికి. దారి ఏలిషా ఇంటి ముందునుంచే. ఏలీషా లోపలున్నాడేమో, వాళ్ళావిడ పలకరించింది, “రండి, రండి ఎప్పుడొచ్చారు జెరూసలం నుంచి? ప్రయాణం సుఖంగా జరిగిందా?”
ఎఫిం చెప్పేడు, “నిన్ననే వచ్చానమ్మా. భగవంతుడి దయవల్ల అంతా బాగానే జరిగింది. మీ ఆయన కనిపించకుండా పోయేడు దారిలో అదేమిటో. ఆయన వెనక్కి వచ్చాడా?”
“ఆయనెప్పుడో వచ్చేశాడు. అనకూడదు కానీ ఆయన జెరూసలం వెళ్ళడం మాకెవరికీ ఇష్టం లేదు. వచ్చేసినందుకు ఎంత సంతోషించామో. ముసలాయన అయిపోయేడు సరే కానీ ఆయన ఇంట్లో లేకపోతే ఎవరికీ తోచదు. ఆఖరికి మా అబ్బాయి కూడా అదే అన్నాడు – అమ్మా నాన్న ఇంట్లో లేకపోతే ఏమీ బావోలేదే అని.”
“ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా? బయటకెళ్ళేడా పనిమీద?”
“ఇక్కడే ఉన్నాడు. అలా పెరట్లోకి రండి చూద్దాం. తేనెపట్ల మీదే కాబోలు కూర్చున్నాడు. ఈ ఏడు తేనె బాగా వస్తోంది. మన పాపాలకి తగినట్టూ ఇది సరైన శిక్ష కాదేమో, అని అంటాడు ఆయన.”
ఎఫిం పెరట్లోకి వెళ్ళేసరికి కనిపించేడు ఏలీషా – బూడిద రంగు కోటూ, బట్టతలా – జెరూసలంలో చర్చి ముందు ఎలా కనిపించాడో అదే మొహం. ఒకటే తేడా – ఇప్పుడు మొహం చుట్టూ తేనేటీగలు పువ్వు చుట్టూ తిరుగుతున్నట్టూ. మొహంలో అదోరకమైన వెలుగు, చీకూ చింతా లేని సంతోషం వల్లేమో!
“ఇదిగో మీ స్నేహితుడొచ్చాడు,” చెప్పింది ముసలావిడ.
ఏలీషా పైకి చూసి ఎఫింని అడిగేడు నవ్వుతూ. “క్షేమంగా వెళ్ళావా జెరూసలం?”
ఎఫిం నిట్టూర్చేడు. “నేను అక్కడికి క్షేమంగానే వెళ్ళానులే. జోర్డాన్ నదిలోంచి నీళ్ళు తెచ్చాను. మా ఇంటికోసారి రా ఇస్తాను. నా ప్రయాణం భగవంతుడికి నచ్చిందో లేదో కానీ …”
“సంతోషం. భగంతుడుకి కృతజ్ఞతలు చెప్పుకో. ఆయన ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది కాదూ?”
“నేనక్కడికెళ్ళడం నిజమే అనుకో. కానీ నా మనసంతా ఇక్కడే ప్రాపంచిక విషయాల మీద తిరిగింది…” ఇంక ఏదో చెప్పబోయే ఎఫింని వారించి అన్నాడు ఏలీషా. “అవన్ని భగవంతుడు చూసుకుంటాడు కదా? నీ పని నువ్వు చేశావు అంతే చాలు.”
“వచ్చే దారిలో నువ్వు మంచినీళ్ళ కోసం ఆగిన ఇంటిలో ఆగాను నేను…”
ఇంకా ఏదో చెప్పబోయే ఎఫింను కంగారుగా వారించి అన్నాడు ఏలీషా, “ఆగాగు. అదంతా భగవంతుడు చూసుకుంటాడని చెప్పానుగా. ఇలా రా. ఈ తేనెపట్లు చూడు. కాసేపు కూర్చున్నావంటే ఒక సీసాలో మంచి తేనె ఇస్తాను.”
ఎఫిం నిట్టూర్చేడు. మళ్ళీ ఎక్కడా, ఎప్పుడూ కూడా ఏలీషా ఆగిన గుడిసె గురించి గానీ తనకి జెరూసలంలో ఏలీషా ఎలా కనిపించాడో కానీ ఎవరికీ చెప్పలేదు. అయితే ఒకటి మాత్రం అర్ధం అయింది. జీవితంలో మనం చేయగలిగేది ఏమిటంటే భగవంతుడి ఇష్ట ప్రకారం మనగలగడమే. బతికినంత కాలం తోటి వారికి మంచి చేయడంలోనే ఉంది జీవితానికి అర్ధం.
(మూలం: Two old men – Leo Tolstoy)