రచయిత వివరాలు

శ్రీనివాసరావ్ బందా

పూర్తిపేరు: శ్రీనివాసరావ్ బందా
ఇతరపేర్లు:
సొంత ఊరు: విజయవాడ
ప్రస్తుత నివాసం: ఢిల్లీ
వృత్తి:
ఇష్టమైన రచయితలు: రావిశాస్త్రి, బుచ్చిబాబు
హాబీలు: సంగీతం, సాహిత్యం
సొంత వెబ్ సైటు: https://www.voicevolts.in/
రచయిత గురించి:

 

అప్పుడు చూశాను ఆయన్ని. ఆయనకి ఎనభై ఏళ్ళంటే నమ్మడం కష్టం. అరవై యేళ్ళ మనిషిలా ఉన్నాడు. చక్కటి ముఖం – అందులో తేజస్సు. నన్ను చూడగానే కూర్చోబెట్టి ఆప్యాయంగా మాటలు మొదలుపెట్టాడు. “మా ఆవిడ…” ఎదురుగా సోఫాలో కూర్చున్న ఆవిడని చూపేడు. “షీ ఈజ్ ఫ్రమ్ మదురై. తమిళియనే అయినా తెలుగు కూడా బాగా నేర్చుకుంది…” ఆయన ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. కాసేపు కూర్చొని విన్నాను – మర్యాద కోసం.

కవితలు కురవడం ఆగిపోయిన తీగ మీద సుతిమెత్తని కిరణం వాలితే ఇలాంటి సవ్వడే అవుతుందేమో! భుజం మీదినుంచి కోయిల ఎగిరిపోయినా ఇదే చుక్క జారుతుందేమో! లోపలి చూపులనుంచి వొలికే నిశ్వాసల వొరవడీ వొరిపిడీ ఇంతేనేమో. దిండ్లుగా మారిన బండల స్పృహ ఛెళ్ళుమనడం ఇలాగే తెలుస్తుందేమో! ఇవన్నీ మీరు వినాలనే అనుకుంటాను కాని, కత్తులే మొద్దుబారాయో, గుండే గడ్డకట్టిందో కాని…

మేరే ప్యారే జవానోఁ… చెరగని చిరునవ్వుతో మీరు సమర్పించిన మీ విలువైన యవ్వనాన్ని ఈ దేశమే కాదు, ఆ దేవుడు కూడా మీకు తిరిగి ఇవ్వలేడు. కొద్ది రోజుల్లో మీరు ఈ రెజిమెంట్‌కీ, భారతీయ సైన్యానికీ వీడ్కోలు పలికి, ఇన్నేళ్ళూ మీరు సగర్వంగా ధరించిన మీ యూనిఫామ్‌ని మీ ఇంట్లో హాంగర్‌కి తగిలించబోతున్నారు. భారతీయ సైన్యం నుంచి రిటైర్ అవుతున్న మీరు అందించిన సేవలకి, ఈ దేశం మీకు సదా ఋణపడి ఉంటుంది.

పాట మొదలుపెట్టడం ఆలస్యం, బ్రిగేడ్ కమాండర్ భార్య మొహం విప్పారడం అంత దూరంనుంచీ స్పష్టంగా కనపడింది. అది అప్పటికి ఎన్నోసార్లు విజయవాడలో ఎన్నో స్టేజీల మీద పాడిన పాట! పాట ముగియబోతోంది. బ్రిగేడ్ కమాండర్ భార్య లేచింది. వెంటనే కమాండింగ్ ఆఫీసర్‌తో సహా, ఆఫీసర్ల వరసల్లో కూర్చొన్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. బ్రిగేడ్ కమాండర్ కూడా లేచి, భార్యతో సహా స్టేజ్ వైపుకు నడిచి వచ్చారు.

డిసిప్లిన్‌కి భంగం రాకుండా, తన పద్ధతిలో తనుండే ఇతన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది. యూనిఫారంలో షూస్ దగ్గర్నించీ కాప్ వరకూ, తన వీలు కోసం చేసుకున్న చిన్నా పెద్దా తేడాలేవీ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. బరాక్‌లో అతని బెడ్‌ని అటు చదువుకోవడానికీ ఇటు విశ్రాంతికీ వీలుగా, మెత్తటి దోమతెర, రీడింగ్ లాంప్‌ వంటి ఏర్పాట్లతో సౌకర్యవంతంగా మలచుకున్నాడు. అవసరమైతే తప్ప మాట్లాడడు. డ్రింక్, సిగరెట్లు ముట్టుకోడు.

థియరీ లోను, ప్రాక్టికల్స్‌ లోను, దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ అతనే టాపర్. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేట్లుండే మనిషికి అంతంతసేపు ఏకబిగిన కూర్చుని చదివే ఓపిక ఎలా వుందో అర్థమయ్యేది కాదు. బారక్‍లో లైట్‍ని ఆఫ్ చెయ్యడం లేదని రూమ్మేట్లు తరచూ కంప్లైంట్ చేస్తున్నా భట్ మాత్రం రాత్రి మూడింటివరకూ చదువుతూనే ఉండేవాడట. అతను తినేదెప్పుడో, పడుకునేదెప్పుడో కనిపెట్టడం పక్కవాళ్ళక్కూడా కష్టమయ్యేదట.

ఎదకి చెద ఎందుకు పడుతుందీ?
కట్ గ్లాసుల కళ్ళూ నోళ్ళూ తెరుచుకొనే
కనరెక్కని రుచులింకా ఆవురావురంటూనే
పొడిబారని పూరెమ్మలు బాటల్లో పూస్తూనే
మిణుగురు గుర్తులు రాత్రులని వెలిగిస్తూనే
మెత్తని వాసనలు మనసుకి సోకుతూనే ఇంకుతూనే…

పదిహేను అడుగుల వెడల్పున్న ఆ తార్రోడ్డు మీద, అడ్డంగా పరుచుకుని ఉందో నల్లటి త్రాచు. కొద్దిసేపటి క్రితమే ఏదో భారీ వాహనం దాన్ని తొక్కేసినట్లు, తోక భాగం కొద్దిగా తప్ప మిగిలిన శరీరమంతా అప్పడంలా రోడ్డుకి అతుక్కుపోయింది. తోకలో కొద్దిగా చలనం కనిపిస్తోంది ఇంకా. “మెచ్యూర్డ్ కోబ్రా” అన్నాడు మేజర్ దేవల్ దాన్ని ఒకింత జాలిగానూ, ఎక్కువ నిర్లిప్తంగానూ పరికిస్తూ. “ఏదో పెద్దదాన్నే మింగినట్లుంది. అందుకే ట్రక్కు వస్తున్నా తొందరగా రోడ్డు దాటలేకపోయింది.”

ఎడారి మధ్యలో ఉండటంతో అన్ని కనిపిస్తున్నాయి. అసలు ఇన్ని ఉన్నాయని చూస్తే తప్ప, సిటీల్లో ఆకాశాన్ని చూసినప్పుడు తట్టనే తట్టదు! ఎక్కడో చదివాను. యాభై అడుగుల పొడవూ, యాభై అడుగుల వెడల్పూ ఉన్న తెల్ల కాగితం మీద ఎక్కడైనా బాల్ పెన్‌తో ఒక్క చుక్క పెడితే, అంత ఉంటుందిట మన భూమి ఈ విశాల విశ్వంలో! అన్ని వేల గోళాల మధ్య – మనం. ఓహ్! అద్భుతం. పైగా, చల్లటి గాలి. ఎడారిమీద ప్రేమ పుట్టుకొస్తోంది.

అతన్నెప్పుడూ లైబ్రరీలో చూడలేదు. బాచ్ లో ఈ ఎల్.ఆర్.పి. మీద పనిచేస్తూ చాలా కొద్దిమందే కనపడుతున్నారు. రాబోతున్న ఫైనల్ ఎగ్జామ్స్ మీదనే దృష్టి పెడుతున్నారు. వీళ్ళ రైటప్‌లు ఎప్పుడు తయారవుతాయో?! లేకపోతే దానికీ అడ్డదారులేమన్నా ఉన్నాయో? త్వరలోనే తెలిసింది. నూటయాభై వరకూ ఉన్న టాపిక్స్‌ లోంచే ఎంచి మార్చి మార్చి ఇస్తుంటారట! ఫైళ్ళని డిపాజిట్ చేసే స్టోర్ తాలూకు సివిలియన్ స్టాఫ్ గొంతులో రెండు పెగ్గులూ జేబులో రెండొందలూ పోస్తే…

“రైల్ టికట్ సర్కార్‌నే ఫ్రీ మే దేదియా, గోవాలో తిరిగేసి టైమ్‌పాస్ చేసేసి పోదాంలే, కోర్స్ అయిపోతుంది కదా అనుకోకండి.” కరుకుగా మోగింది కనకప్పన్ గొంతు. “ఇంకోసారి మీ స్క్వాడ్ గురించి ట్రైనింగ్ జేసీవో నాకు కంప్లైంట్ చేశాడో…” అందర్నీ కలయజూశాడు ఒకసారి. పిడికిట్లో ఏదో నులుముతున్నట్లు సైగ చేస్తూ “నిచోడ్ దూంగా! ఇంకెందుకూ పనికి రాకుండా చేసేస్తాను జాగ్రత్త!” బయటికి నడిచాడు. పీకల్దాకా మండింది అందరికీ – జిబోన్‌గాడి మీద.

ఒకచోట నీళ్ళలోకి దిగి, వేగంలేని అలలతో ఆడుతున్నాం. నాయర్‌కి ఈత వచ్చు. నాకూ ప్రకాశం బారేజ్ దగ్గరి ఘాట్‌లలో ఈదిన అనుభవం ఉన్నా, సముద్రంలో ఇదే మొదటిసారి… ఇంతలో, కొద్దిదూరంలో ముగ్గురు విదేశీ వనితలు. అంతే. మా చూపులు అటే తిరిగిపోయాయి. వాళ్ళు పరుగెడుతున్నారు. అలలకి అల్లంత దూరంలో ఉండగానే ఒక్కొక్కటిగా బట్టలు వలిచేసుకుంటూ దభేల్ దభేల్మంటూ నీళ్ళలోకి దూకారు. ఆ నవ్వులూ కేరింతలూ… నాయర్ ముఖంలో ఒక వెర్రి సంతోషం.

ఒద్దు ఒద్దనుకుంటూనే ఒక ఉత్తరాన్ని తెరిచాను. కుదురుగా ఉన్నాయి అందులోని పంజాబీ అక్షరాలు. మరో ఉత్తరం తెరిచాను. అదే చేతి రాత. అదే పొందిక. ఇంకోటి… ఆ గుర్‌ముఖి అక్షరాలు చదవడం రాదు కాబట్టి, ఆమె రాసింది నాకు తెలిసే ప్రమాదం లేదు. కానీ అవి ప్రేమలేఖలని గుర్తుపట్టడానికి, చదవాల్సిన పని లేకపోయింది! ప్రతి ఉత్తరానికీ కుడి చివరన స్పష్టంగా, సంతకానికి బదులు లిప్‍స్టిక్ రాసుకున్న పెదాలు ఒత్తిన ముద్రలు…

భయ్యావత్ సంగతేమోకాని, చూస్తున్న మాకు చిరుచెమటలు పడుతున్నాయి. ఆ పని మేం చెయ్యనందుకు ఒక రకంగా అవమానంగానూ ఉంది. ఈ పీపీ రేపట్నుంచీ పోజు కొట్టచ్చు. అసలే కొంత పొగరున్న యూపీ ‘జాట్’. ఉన్నట్టుండి మోకు ‘చిరచిర’మంది. మరుక్షణం పుటుక్కున తెగింది. మేమూ, మాతోబాటు భయ్యావత్ కూడా ఫ్రీజ్! మొహంలో భయం – ముప్ఫయ్ అడుగుల ఎత్తునుంచి పీపీ సింగ్ పిండి బస్తాలా పడిపోతున్నాడు, చేతులు గాల్లో నిరర్ధకంగా ఆడిస్తూ.

దాదాపు నెల క్రితం సంగతి. ఒక ట్రైనీని ఇలాగే పిలిచి నిలబెట్టాడు. సెలవు మీద వెళ్ళి, తిరిగి సాయంత్రం ఆరు గంటలకి రిపోర్ట్ చెయ్యాల్సి ఉండగా, రాత్రి తొమ్మిదింటికి రిపోర్ట్ చేయడం – ఆ ట్రైనీ చేసిన నేరం. చేతులని నేలమీద ఆనించి, కాళ్ళని గోడకి తన్నిపెట్టమన్నాడా ట్రైనీని. వొంటి బరువంతా భుజాల మీద పడి, అతను చిగురుటాకులా వణకడం, మూడు రోజులవరకూ భుజాలు సవరించుకుంటూ తిరగటం గుర్తొచ్చింది.

ఓరి నాయనో! చాలామందికి ఒళ్ళు జలదరించింది. ఇప్పుడు ‘బడా పిట్ఠూ’తో సహా రావాలంటే, అవన్నీ తగిలించుకోవడానికి కనీసం పది నిముషాలు పడుతుంది. తప్పేదేముంది! పరుగు పెట్టాం బారక్ లోకి. అసలెందుకు ధగ్లారామ్ మమ్మల్నందరినీ పరుగులు తీయిస్తున్నాడు? అతనికి ఇంత కోపం రావడం మాలో ఎవరమూ ఎప్పుడూ చూడలేదు. తగిలించుకుంటున్నాం. బూట్లు తొడుక్కుంటున్నాం. బయటికి వచ్చి ఫాలిన్‍లో చేరేసరికి పది నిముషాలు పట్టింది.

మతిమరుపుతో నా మెదడు మీదా
గాలివిసుర్లతో తన వరండాల మీదా
దుమ్ము పేరుకొంటోంది
విప్పలేకపోయిన ఒక్కొక్క ముడినీ
ఒప్పుకొంటూ నేనూ
పుచ్చుకి దారిచ్చి పడిపోతున్న
కొయ్య స్తంభాలతో తనూ.

ఇప్పుడు ఏంటి? ఎక్కడికెళ్ళాలి? టైమ్ ఎంతైందో! బహుశా తొమ్మిది. మిగిలిన కొద్దిమందిమీ బారక్ వైపుకి నడవడం మొదలెట్టాం. సినిమా హాల్ దగ్గరికి రాగానే దాదాపు అందరూ దాని వెనక్కి దారి తీశారు. ‘వెట్ క్యాంటీన్’ ఉందక్కడ. తమిళ కుర్రాళ్ళందరూ జంబులింగం చుట్టూ చేరి వడలూ టీలూ ఆర్డర్లు ఇప్పించుకొంటున్నారు. ఆ టీ-స్టాల్ లోంచి బయటపడి బారక్ చేరుకున్నాను. ట్రంక్ పెట్టెలోంచి ఒక ఇన్లాండ్ లెటర్ తీసి, రాయడం మొదలుపెట్టాను.

“ఉఠో! ఉఠో జల్దీ! దో మినట్ మే బాహర్ ఫాలిన్!” అప్పుడే తెల్లారిందా? దిండుకింద పెట్టిన వాచీ తీసి చూశాను. కళ్ళు మండుతున్నాయి. రెండు కావస్తోంది. రిక్రూట్లందరూ మేలుకుంటున్నారు. ఎందుకు లేపుతున్నాడో తెలీకపోయినా, ఛజ్జూరామ్ కేకలకి తత్తరపడుతూ లేస్తున్నారు. దోమతెరలోంచి బయటికొచ్చి, చకచకా ఫాంటూ షర్టూ స్వెట్టరూ తొడుక్కుని, కింద పీటీ షూస్ తగిలించుకుని బారక్ బయటికి నడిచాను.

మళ్ళీ పెరేడ్‌. పీటీ తర్వాత బ్రేక్ ఎనభై నిముషాలు. కానీ, ఆ గ్రౌండ్‌లోనుంచి బారక్స్‌కి చేరి, తర్వాతి పీరియడ్‌కి అనుగుణంగా డ్రెస్ మార్చుకుని, మెస్‌‍లో బ్రేక్‌ఫాస్ట్ చేసి, మళ్ళీ స్క్వాడ్‍లో అందరమూ ఒక తీరైన గుంపుగా తయారై క్లాస్ జరిగే మరో ట్రైనింగ్ గ్రౌండ్‌కి చేరడానికి బొటాబొటీగా సరిపోయింది. వగర్చుకుంటూ డ్రిల్ షెడ్ ముందర నిలబడ్డాం. డ్రిల్ మాస్టర్ హవల్దార్ మా కోసమే ఎదురుచూస్తున్నాడు కోపంగా.

ఒక బారక్ దగ్గర నడక వేగం తగ్గించి, వెనక్కి తిరిగి కాస్త కరుకుగా “ఏయ్, ఛుప్!” అన్నాడు లీడర్ ఉపాధ్యాయ్. చెప్పిన సమయానికి ట్రైనింగ్ రెజిమెంట్ హెడ్ క్వార్టర్స్‌కి చేరుకున్న మా చిన్న గుంపుని, మా స్క్వాడ్ చేరబోతున్న కంపెనీకి మార్చ్ చేయించి తీసుకెళ్ళే బాధ్యతని, డ్యూటీ హవల్దార్ నించి అందుకున్నవాడు మా లీడర్. అంతవరకూ తమిళంలో గుసగుసలాడుకుంటూ చిన్నగా నవ్వుకుంటున్న వాళ్ళు సైలెంటయారు. వరండాలో దర్జాగా కూర్చున్న ఒకతని ముందుకి వెళ్ళి ఎటెన్షన్లో నిలబడ్డాడు లీడర్.

గుప్పెడేసి ఉప్పు సముద్రాల్ని ఔపోసన పడుతుంటాడు వాడు
దర్జాగా అట్టహాసాలని పెట్టెల్లో నింపుకుంటుంటావు
నిత్యం జనద్వీపాలకి వారధి ఔతుంటాడు వాడు
ఎన్నో త్రాగి త్రేనుస్తావు
ఒక్క థాంక్స్‌తో వడగడుతుంటాడు వాడు

తీర్థంలో రంగరించి పోసిన మత్తుని
ఇంకో మతం మీద సందేహాన్ని పిడిగుద్దుని
తిరగబడ్డ చక్రాలకి వేళ్ళాడిన మాంసం ముద్దని
ఉపగ్రహం చూపించిన భూచక్రాన్ని
విరిగిపడ్డ అలని – పెనుగాలికి ఎగిరిపోయిన రేకుని

తను రాస్తాడు. ఇవ్వాళే మొదలుపెడతాడు. చివరికొచ్చేసరికి స్ట్రాంగ్‌గా మారుతోంది ఆఫ్టర్‌ లంచ్‌ సిగరెట్. అరుంధతీ రాయ్ అన్నట్లు. మానెయ్యాలి. అరుంధతీ రాయ్‌నా? జోకులా? సిగరెట్లు. కాలిస్తే బాగుంటుంది. కాల్చకపోతే, తపనని తట్టుకోవడం కష్టం. అసలైనా ఇష్టమైంది, ఈరోజు చేస్తున్నది ఎప్పుడూ ఎందుకని నచ్చదు? ఒకప్పటి జులపాల, బెల్‌బాటమ్‌ల రోజులే బాగున్నాయనిపిస్తాయేం? అవన్నీ తర్వాత. ముందు రాయాలి. ఇవాళ్టినుంచీ. రాస్తాడు. రాయగలడు తను.

నాకున్న కల్పనా సామర్థ్యమంతా, విజిటింగ్ కార్డులని తయారు చెయ్యడంలో చూపిస్తుంటాను. నా ప్రింటింగ్ వర్క్‌లో, నా అడ్రస్ కార్డ్‌లు నేనే తయారుచేసి, ఊళ్ళో నాకు కనపడ్డవాళ్ళందరికీ ఇచ్చాను. వాటికున్న ప్రయోజనాన్ని కూడా విప్పి చెప్పాను. మెల్లిమెల్లిగా మా పేటలోవాళ్ళే కాకుండా, చుట్టుపక్కల పేటల్లోనివాళ్ళు కూడా తమ విజిటింగ్ కార్డ్‌లని నా దగ్గర ప్రింట్ చేయించుకోవడం మొదలుపెట్టారు.

ప్రాపంచిక మాలిన్యంతో
పాలిపోయిన రహస్యాలని
చెట్టుకో పుట్టగా తంతూ
ముడికో చుక్క చొప్పున హుక్కు చొప్పున
దోసిట్లోంచి వాకిట్లోంచి చీకట్లోంచి
వాణ్నీ దాన్నీ చూసి తరించి

అతను కాదు ఆమె కాదు
ఎగసిన మోహార్ణవం జీవనవనాన్ని దహించబోగా
నిజాయితీ కన్నీళ్ళు కొన్నీ
టీచర్స్ హైలాండ్ క్రీమ్ బొట్లు కొన్నీ
కలిసిపోయి రంగులు వెలిసిపోయి
కలిసి తెలుసుకుని మరీ తెలిసి కలుసుకొని

ఇలాగే ఇందుకే ఉన్నామనుకుంటూ
గుర్తులు చెక్కుకుంటూ
వత్తులు దిద్దుకుంటూ
వలయాల్లోని వలయంలోకి
విజయాల్లోని విలయంలోకి
ఒకింత మరి కాస్తంత కించిత్పూర్తిగా
విలుప్తమై వినీలంలో విలీనమైపోతూ

దప్పిగొన్నప్పటి ఫోటో వేళ్ళాడేస్కుని
దీనంగా ఆవులించినా
కంటి చివర్ల నుంచి చూస్తూ
పట్టాలని బెదిరించడం తప్ప
రైలేనాడేనా ఎక్కించుకుందా
నిన్ను దక్కించుకుందా!

చిరువలయాల్లోంచి చదరాల్లోకీ సూటిగీతల్లోంచి
పేరుకునే నురగలకింది శూన్యపు ఉరవడుల్లోకీ
మలుపుల తలపుల్లోకీ రూపాల్లోంచి పాపాల్లోకీ
జారబోయినప్పుడల్లా పట్టుకోబోయి జార్చుకున్న బొమ్మే.

గుణింతాలనుంచి పిళ్ళారి గీతాలదాకా
పూనిన బాలూ నుంచి పేలిన శివమణి దాకా
గ్రక్కున మింగిన మది గుక్కలనుంచీ
(సీ-తమ్మకు చేయిస్తీ చింతాకూ పతకమూ రామచంద్రా)
ప్రక్కకి పిలిచిన అన్-కోని అల దాకా…

కన్నీరు జారి చార కట్టడం
రెప్పల వెనుక మెలకువని
తట్టి నిద్ర లేపడం
లబ్‌డబ్‌లతో పెనవేసి చాచిన
చేతిని విదుల్చుకోవడం
శ్వాసల మధ్య నీరవాన్ని
గుర్తించి గౌరవించడం

ఇంతకీ ఎదటి వాహన చోదక బాధ్యతలు నెరవేర్చుతున్నదెవడు లేక ఎవతి? చోదకుణ్ణి స్త్రీలింగంలో ఏమంటారో? ఓ! అంకుల్‌గారు… మెల్లగా, ప్రపంచంలోని టైమంతా తనకే ఉన్నట్లు రోడ్డుమీద స్పెండ్ చేస్తున్నారు. అబ్బ పోనిద్దూ. ట్రాఫికే అంత మెల్లిగా పాకుతుంటే ఆయన మాత్రమేం చేస్తాడు? ఒరే చైల్డూ, నువ్వు కాసేపు గోల చెయ్యకు. నన్ను డ్రైవ్ చెయ్యనీ! అయామోకే, యూ ఆర్ ఆల్సో ఓకె!

దాసోహమన్నా ఋషిలా మూలిగినా
చేతులూ గుండె కవాటాలూ అన్నీ అప్పగించినా
మెలికలు తిరగటం ఆపేస్తానని
పేగులు మెలియబెడుతూ చెప్పే పచ్చి ఎర్రటి క్షణం

వింజామరల రేకలు రాలే తనం.
చాచిన నాలుకల్లోకి చేరే తనం.

ఇంకా ఇంకేదో ఇంకాలని
ఇంకో వంకలోకి వంపు తిరగాలని వొలికి చూడాలని
మరో ముక్తాయింపులో ముక్తిని వెతకాలని

కొత్త పుస్తకాన్ని తెరిచి పుటలని వాసన చూసినంత
చేయి అలా నిమిరి కొన్ని చుక్కలని చప్పరించినంత
మెత్తగా లేతగా

నిన్నూ నన్నూ దాటాలని చూస్తూనే
టపటప మోగుతున్న పెదవులని
రెపరెపలాడుతున్న ఎడదలని
మాటల చివరన విడుదలని
గొంతు లోతుల్లో మార్చుకుంటూ
నటిస్తున్నాం విభ్రమని

ఓ చేత్తో బల్లలమీది ఎంగిలి ప్లేట్లు తీస్తూనే చూస్తున్నాడు సర్వర్. బిల్లు చెల్లిస్తున్న కస్టమర్ ఒకసారి చూసి తల తిప్పుకున్నాడు మళ్ళీ చూసేముందు. టీ తాగడం అవగానే సిగరెట్ వెలిగిస్తూ చూసిన కాలేజీ కుర్రాడి నోట్లో ఊరింది బూతుపాట. పంక్చరేస్తున్న పదిహేనేళ్ళ బుడత, బొమ్మకి బ్లౌజ్ తొడుగుతున్నతను, పరుపుల కొట్లో బేరమాడుతున్న పెద్దాయన… కాలేజీ కుర్రాడి బూతుపాటతోబాటు ఫోన్‌లోకి ఎక్కుతున్నాయి ఆమె నడకలోని కదలికలన్నీ…

ఎన్నోసార్లు అలానే కళ్ళప్పగించి మూగగా పరిభ్రమించాను. అన్నిసార్లూ తను మరో వైపు చూపు తిప్పుకుంది. ఎన్నో అక్షరాల మాలలు చుట్టి తన పడవలో పరిచాను. అన్నిసార్లూ తను మరో తీరానికి సాగిపోయింది. ఎన్నోసార్లు అడగకనే అగ్నిలో ప్రవేశించాను. అన్నిసార్లూ తను ఉడెకొలోన్ అద్దుకుంటూ పరవశించింది.

విలక్షణమైన రచనాపటిమ, ప్రత్యేకమైన శైలి-శిల్పాలతో కలాన్ని మంత్రదండంగా మార్చిన కథా రచయిత చంద్ర కన్నెగంటి. ఆయన వ్రాసిన కథల్లోంచి పన్నెండు ఆణిముత్యాలు, శ్రీనివాస్ బందా స్వరంలో వినండి.

“అమ్మనిచ్చి పెళ్ళి చెయ్యమని నువ్వు తాతయ్యనడిగావ్. నీకంటే రెండేళ్ళు పెద్దదని వాళ్ళు వద్దన్నారు. మీ ఇద్దరికీ వేరే చోట్ల పెళ్ళయినా, నువ్వు అమ్మని వేధిస్తోనే ఉన్నావ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా. పైగా పెళ్ళయిన రెండేళ్ళకే అమ్మ తల చెడి పుట్టింటికి తిరిగొచ్చిందాయె. నీ ప్రయత్నాలు ఫలించకుండా ఎలా ఉంటాయి?!” ఆయన తల అడ్డంగా తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అతనికి తెలుస్తోంది.

“ఆ వెళ్ళాంలెండి! మరీ అర్ధరాత్రి మూడింటికే లేపి కార్లో కుదేస్తారు. ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు అది చూద్దాం ఇది చూద్దాం అంటూ హడావుడి పెడతారు. అయినా ఎక్కడ చూసినా అవే పరాఠాలు, అదే బటర్ చికెన్. ఏ లోకానికెళ్ళినా మీకు మాత్రం మందు పడాల్సిందే. మీ మందు కార్యక్రమం అయ్యేదాకా మేమంతా డిన్నర్ కోసం చూస్తూ చొంగలు కార్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు చూళ్ళేదూ?”

ఎవరైనా చూశారేమో బహుశా
వేగం పెరిగిన శ్వాసలనీ
వెనక సీట్లో వేడిమినీ నీరెండలో ముంగురులనీ
గోళ్ళ చివర్ల నెత్తుటి ఎరుపునీ తిరిగిపోయే తారల మెరుపునీ
పల్చగా జారిన విశ్వాసాల కొనకంటి చూపులనీ

సర్వస్వాన్ని శ్రవణేంద్రియంగా మార్చుకుని
సర్వదా పదాల ముద్రలు వేసుకుని
శ్రోతగా హోతగా
తియ్యని కన్నీటిచుక్కలని జార్చుకుంటూ
త్వమేవాహమై తన్మయిస్తూ…

మళ్ళీ… నవ్వేయాల్సొస్తుంది
గడ్డకట్టిన ముఖాన్ని చీల్చుకుని
నుదుటిమీద జీవితం తుఫుక్కున
ఉమ్మిన తడి నిజాలు జారిపోతుండగా
మళ్ళీ… ముడి విప్పాల్సొస్తుంది
ఛెళ్ళున తగిలిన చెంపదెబ్బ
మనసుని మండిస్తుండగా

ప్రేమని వివరించాలని ఆపేక్షని పూయాలని
నువ్వంటే నాకిష్టమని అంతా నీకోసమేనని
మొత్తం కళ్ళతోనే సంపూర్ణంగా
ఆర్తిగా చూస్తూ ఆర్ద్రంగా అల్లుకుంటూ
అప్పుడప్పుడూ గింజలకని గూట్లోకి చేరీ
పక్కగదిలోకెళ్ళినా శక్తికొద్దీ పిలుస్తూ
అదే పనిగా కూస్తూ అన్న మాటలు అప్పగిస్తూ…

రోజూ కనిపిస్తే ఊరికే వినిపిస్తే
మర్చిపోవడం దృష్టి మరల్చుకోవడం
ఖాయమే కానీ…
అందుకోవాలని లేదు అంతులేనిదనీ కాదు
ఆశువుగా చిప్పిల్లిన అలవిగాని ముదమేదో
అంతటా నిండి అలరిస్తుంటే…

ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత

చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన

ఆహ్!నా లిబిడో పసిగట్టిన శరీరం! అమ్మాయి మంచి పట్టుగా ఉంది. ఉంటే ఏంటటా? పదడుగుల వెనక అబ్బాయి. బాడీబిల్డరల్లే ఉన్నాడే! ఇద్దరూ నల్ల టీషర్టులే. కూడబలుక్కుని వేసుకున్నారా? మొగుడూ పెళ్ళామేమో. కాకపోతే మాత్రమేం? అమ్మాయి టీషర్టుమీద రాసుంది. మాంగో. ఓహో! అంటే? ఏమనుకోవాలి? పెద్ద పెద్ద తెల్లటి అక్షరాలు. కింద? ఛీ. ఛీ. మర్యాద మర్యాద. అదేంటి?

దూరం
బహుశా కొలుస్తున్నావేమో
దూరం
బహుశా మోస్తున్నావేమో
దూరం
నించి బహుశా చలిస్తున్నావేమో
దూరం
నించి బహుశా నువ్వూ కదుల్తున్నావేమో…