సోల్జర్ చెప్పిన కథలు: ఒప్పుదల

“ముబారక్ హో రావ్, నీకు పోస్టింగ్-కమ్-ప్రమోషన్ వచ్చింది.”

“షుక్రియా సర్. పోస్టింగ్ ఎక్కడ?”

“అస్సాం. నీ డాక్యుమెంట్లన్నీ ఆర్.హెచ్.క్యూ. సిద్ధం చేస్తోంది. వెళ్ళి హెడ్ క్లర్క్‌ని కలు.”

“అలాగే సర్.”

“ఒన్స్ ఎగైన్, కంగ్రాట్యులేషన్స్!”

“థాంక్ యూ సర్!”

సెల్యూట్ చేసి, ఎడ్జటెంట్ ఆఫీసులోంచి బయటికి వచ్చాను.

అస్సాంలో, గౌహతికి దగ్గర్లోని ఒక యూనిట్లో పోస్టింగ్ వచ్చింది. ఇంజనీరింగ్ డిప్లమా కోర్స్ చేసిన రెండేళ్ళకి ‘నాయబ్ సుబేదార్’గా ప్రమోషన్ మీద. సర్వీస్‌లో పన్నెండో సంవత్సరం మొదలు కాబోతోంది.

నాలుగైదు రోజుల తర్వాత, లీవ్-కమ్-పోస్టింగ్ మీద ఆ యూనిట్ నుంచి తరలాను.


విజయవాడనుంచి హౌరాకి ఇరవై నాలుగుగంటలు, హౌరా నుంచి గౌహతికి మరో ఇరవై నాలుగుగంటల ప్రయాణం. కలకత్తా కాళి దర్శనం చేసుకుని, ఆ రాత్రికి కామరూప్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. నాలుగు కావస్తుండగా మెలకువ వచ్చింది. కిటికీ లోంచి బయటకు చూడగానే, అంతవరకూ ఎన్నడూ చూడని ప్రకృతి దర్శనమైంది.

కనుచూపు మేర ఖాళీ మైదానాలు. పట్టాల వెంబడి, రెండు వైపులా పొడవాటి నీటి కొలనులు, కొన్నిటిలో ఎర్రకలువ పూలు… ట్రైన్ గంటలకొద్దీ సాగుతున్నా, పూరి గుడిసెలే తప్ప మచ్చుకైనా కనిపించని భవనాలు, సిమెంటు కట్టడాలు.

గౌహతిలో దిగి, తిన్నగా కొత్త యూనిట్‌కి చేరుకున్నాను.

మూసివున్న గేట్ లోపలినుంచి, బయటే ఆగమంటూ సైగ చేశాడు సెంట్రీ. పోస్టింగ్ మీద వచ్చానన్నాను. మూవ్‌మెంట్ ఆర్డర్‌ని చూపించి లోనికి వచ్చాను.

“డ్రెస్ చేంజ్ కరో సర్. యూనిట్‌లోకి సివిల్ డ్రెస్‌లో వెళ్ళకూడదని సీవో సాబ్ ఆర్డర్ వేశారు.”

“ఎక్కడ మార్చుకోను?”

“ఇక్కడే”

“ఇక్కడెలా?”

గార్డ్ పోస్ట్ కేసి సూచించి, తల అటు తిప్పుకు నిలబడ్డాడు గార్డ్. ఆ నాలుగు-బై-నాలుగు అడుగుల గార్డ్ పోస్ట్ చెక్క గోడల మధ్యనే వీలైనంత మరుగుని సృష్టించుకుంటూ కేమోఫ్లేజ్ డ్రెస్ వేసుకున్నాను.

“ఆ కుడి వైపున కనిపిస్తున్న షెడ్ – ఆర్.హెచ్.క్యూ.”

“సరే. థాంక్ యూ.”

మర్నాడు.

“ఇదొక పెద్ద మలుపు, మీ కెరియర్‌కి,” అన్నాడు సీవో, కల్నల్ శ్రీనివాసన్ తన చేతుల మీదుగా నా భుజాల మీదికి ర్యాంక్ బాడ్జ్‌లు తొడిగిన తర్వాత. “నిన్నటి వరకూ మీరు ఒక ఎన్‌సివో. ఇవాల్టి నుంచీ నాయబ్ సుబేదార్! వందలమంది ప్రయత్నిస్తే, పదులమందే మీలా డిప్లొమా కోర్స్‌ని పూర్తి చెయ్యగలుగుతారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

“ఈ క్షణం నుంచీ మీ బాధ్యతలు రెండింతలయ్యాయి. ఒక జేసీవోగా మీ పనితీరు, మాటతీరు, మీ టర్నౌట్, ప్రవర్తన, అన్నీ మరింత క్రమశిక్షణతోనూ, మరింత నిబద్ధతతోనూ నిగ్గుతేలాలి. మీ క్రింద ర్యాంకుల్లోని వాళ్ళకి మీరొక ఆదర్శంగా నిలవాలి.

“ఇది పీస్ టైమ్ యూనిట్ కాదు. మీకు తెలిసే ఉంటుంది. ఉగ్రవాదుల బెడద ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది. ఎస్‌ఎమ్ సాబ్, మీరు బ్రీఫ్ చెయ్యండి…” అంటూ నా పక్కనే ఎటెన్షన్లో నిలబడ్డి సుబేదార్ మేజర్‌ని ఆదేశించాడు.

“ఎస్సర్!”

“ఐ వాంట్ టోటల్ డిసిప్లిన్. ఇక్కడ కోర్ట్ మార్షల్ జరగడం చాలా తేలిక. గుర్తుంచుకోండి.” కళ్ళతోనే హెచ్చరించి, ఇక వెళ్ళవచ్చునన్నట్లు సుబేదార్ మేజర్‌కేసి చూశాడు సీవో.


చల్లటి గాలి రివ్వున మొహానికి తగుల్తోంది. సన్నటి తార్రోడ్డుకి రెండువైపులా కనిపిస్తున్న పచ్చటి నేల. చెట్లు. ఎత్తుగా పెరిగిన వెదురు పొదలు. పది అడుగులకొకటి చొప్పున పొడవాటి నీళ్ళ గుంటలు. వాటి వొడ్డున అక్కడక్కడా, ఆ నీళ్ళలోకి గాలం వేసి కూర్చొన్న మనుషులు. కనుచూపుమేరలో, దూరంగా కనిపిస్తున్న విడి విడి గుడిసెలు… ఇవన్నీ త్వరత్వరగా వెనక్కి పరుగెడుతున్నాయి.

“ఈ అస్సాంలోనే కాదు. నార్త్‌ఈస్ట్‌లో చాలావరకూ ఆడాళ్ళే మొగాళ్ళు సర్” అన్నాడు జీప్‌లో వెనకాల కూర్చొన్న హవల్దార్ ఘోష్. “ఇంట్లో మొగాళ్ళకి, పగలంతా గాలం పట్టుక్కూచోడం, సాయంత్రం కాగానే పక్కన సారా కుండ, వొళ్ళో డోలక్ పెట్టుకుని పాటలు పాడుకోడం – ఇదే పని… ఇల్లు చూసుకోవడమంతా వీళ్ళ ఆడాళ్ళ పనే. కట్టెలు కొట్టడం, చిన్న చిన్న వ్యాపారాలు చెయ్యడం దగ్గర్నుంచీ, సారా కాచి అమ్మడం దాకా…”

కొద్దిగా ఆశ్చర్యపోయాను. దుర్బలంగా కనిపిస్తూ, తలమీద తట్టలతో, పిల్లల్ని వీపున కట్టుకుని కొండబాటల్లో చకచకా నడిచే ఈ ఈశాన్య భారతదేశపు మహిళలు, కట్టెలు కూడా కొట్టగలరా! దట్టమైన ఆకుపచ్చని అడవుల మధ్య, పసుప్పచ్చని వెదురు పొదల పక్కన, వీళ్ళ శరీరపు పసిమి ఛాయ విచిత్రంగా మెరుస్తోంది. ఒక దుముకుతో ఈ యువతులు చిన్న చిన్న సెలయేళ్ళని దాటుతున్న తీరు ఆసక్తిగా ఉంది, కష్టాలకి వెరవని వాళ్ళ తీరు మీది గౌరవాన్ని పెంచుతోంది.

“ధీరే చల్ యార్… అంత తొందరెందుకూ” డ్రైవర్‌ని ఉద్దేశించి అంటున్నాడు ఘోష్ పక్కన కూర్చొన్న సిపాయి కర్తార్ సింగ్ తలపాగా సర్దుకుంటూ, దేన్నో చూసి పరవశిస్తున్నట్లుగా.

వెనక కూర్చొన్నవాళ్ళ మాటలు ఆగాయి. రియర్ వ్యూ మిర్రర్లో చూశాను. రోడ్డు పక్కనే వరసగా నడుస్తూ అయిదారుగురు గిరిజన మహిళలు. ముదురు రంగుల లుంగీలు, జాకెట్ల వంటి వస్త్రధారణ. ఒకరిద్దరి చేతిలో చిన్న సైజు పారలవంటి పనిముట్లు.

ముందు వెళ్తున్న జీప్ ఆగబోతున్నట్లు సైగ చేసి, ఆగిన వెంటనే అందులోంచి కిందకి దిగాడు మేజర్ తర్లోచన్ సింగ్ దేవల్. ఆ సైగతో, కొద్ది దూరంలో ఫాలో అవుతున్న మేమూ ఆగాం. కిందకి దిగాను. చక చకా రెండు జీపుల్లోంచీ ఎకె-47లని సర్దుకుంటూ కిందకి దిగారు మా గార్డులు.

పదిహేను అడుగుల వెడల్పున్న ఆ తార్రోడ్డు మీద, అడ్డంగా పరుచుకుని ఉందో నల్లటి త్రాచు. కొద్దిసేపటి క్రితమే ఏదో భారీ వాహనం దాన్ని తొక్కేసినట్లు, తోక భాగం కొద్దిగా తప్ప మిగిలిన శరీరమంతా అప్పడంలా రోడ్డుకి అతుక్కుపోయింది. తోకలో కొద్దిగా చలనం కనిపిస్తోంది ఇంకా.

“మెచ్యూర్డ్ కోబ్రా” అన్నాడు మేజర్ దేవల్ దాన్ని ఒకింత జాలిగానూ, ఎక్కువ నిర్లిప్తంగానూ పరికిస్తూ. “ఏదో పెద్దదాన్నే మింగినట్లుంది. అందుకే ట్రక్కు వస్తున్నా తొందరగా రోడ్డు దాటలేకపోయింది.”

పరీక్షగా చూసి అన్నాడు. “మింగిందీ ఇంకో పాముని. తన జాతికే చెందిన జీవాన్ని కూడా మింగేసేది ఈ కోబ్రా జాతి ఒక్కటే…” తలూపాను.

చూశాం. నలిగిపోయిన పొట్ట భాగంలో మరో పాము జాడలు తెలుస్తున్నాయి.

“ఇదే లక్షణం ఇంకో జాతికి కూడా ఉంది.” చెవులు ఆసక్తిగా రిక్కించాను.

“మనదీ అదే జాతి…” సన్నటి నిర్వేదపు పొర కదిలి మాయమైంది మేజర్ దేవల్ ముఖంలో. “చలియే సాబ్. చీకటి పడకముందే కోక్రాఝార్‌ని టచ్ చెయ్యాలి” తమాయించుకుని అంటూ జీప్ ఎక్కాడు.

“యస్ సర్” అని వెనకాలి జీప్ వైపు కదలబోయాను. “సునో సాబ్…” పిలిచాడు మేజర్ దేవల్.

“యస్సర్?”

“కోక్రాఝార్ గురించి వినే ఉంటారు మీరు. అయినా మరోసారి చెప్తున్నాను. అది ఈ అస్సాంలో తీవ్రవాదానికి మూలస్థానం. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏమైనా జరగొచ్చు. మీ జానీలందరూ ఎలర్ట్‌గా ఉండాలి.”

“సర్…”

“చలో…” వెనక జీప్ కూడా కదిలింది.


బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్.

దాదాపు అయిదొందల గజాల విస్తీర్ణంలో కట్టిన రెండంతస్తుల మేడ. ధనవంతుల ఫార్మ్ హౌస్ అని తెలుస్తోంది చూడగానే. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో ఒక వైపున, మరో రెండంతస్తుల కట్టడం. అస్సాంలోని దిగువ మధ్యతరగతి ఇళ్ళలా, వెదురు స్తంభాలతో కట్టిన తీరు. ఒకే ప్రాంగణంలో ఆ మేడ పక్కన ఈ కట్టడం – అస్సలు అతకడం లేదు.

“దీని ఓనర్ బెంగాలీట. అతనితో సహా ఆ కుటుంబాన్నంతటినీ ఉగ్రవాదులు చంపేసిన తర్వాత, ఈ భవనాన్ని ఆర్మీకి అప్పగించింది అప్పటి ప్రభుత్వం. ఆ పక్కన కనిపిస్తోందే, అదే బ్రిగేడ్ కమాండర్ ఆఫీసూ ఇల్లు.” అంతకు ముందెప్పుడో అక్కడ ఒక టెన్యూర్ గడిపిన ఒక జవాన్ చెప్తున్నాడు.

ఎప్పుడో ఎండిపోయిన లాన్‌లో పరిచిన నీలి రంగు ‘దరీ’ల మీద, వరసనే పేర్చిన రైఫిళ్ళు. వాటిని విడి భాగాలుగా విప్పి శుభ్రం చేస్తున్న జవాన్లు.

లోపలికి – ఒక పెద్దసైజు హాల్లోకి నడిచాం…

ఆ హాల్లో, విస్తళ్ళు పరిస్తే దాదాపు నలభైమంది, అయిదారు వరసల్లో కూర్చొని భోజనాలు చెయ్యడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం, అడుగున్నర ఎడంలో అమర్చిన ‘బంక్ బెడ్’లతో ఆ హాల్ పూర్తిగా నిండిపోయింది. కొన్ని బెడ్‌లకి కోంబాట్ డ్రస్‌లు వేలాడుతున్నాయి. బెడ్‌ల మధ్య ఖాళీని ఆక్రమించుకున్న నల్లటి మిలిటరీ ట్రంక్‌లు. ఇక్కడ్నుంచి ఆ మూలనున్న బంక్ బెడ్‌కి చేరాలంటే, చిన్నప్పుడు ఆడుకున్న పజిల్‌లోలా, నాలుగైదు మలుపులు తిరగాలి – కాళ్ళకి ట్రంక్ పెట్టెల అంచులు తగలకుండా కాపాడుకుంటూ.

“సాబ్ లోగ్, ఏ బెడ్ ఖాళీగా ఉంటే దాని మీద పడుకోండి. కానీ, పెట్రోలింగ్ షిఫ్ట్‌వాళ్ళు తిరిగొస్తే మాత్రం, వాళ్ళ బెడ్లు వాళ్ళకిచ్చేసి, వేరే ఖాళీ బెడ్ల మీదికి మారండి దయచేసి. ఆరున్నరకి మెస్ తెరుస్తాం. ఏడున్నరలోపే మీ అందరి డిన్నర్ అయిపోవాలి. ఎనిమిదింటికి లైట్స్ డౌన్. మెస్‌తో సహా మొత్తం బిల్డింగ్ అంతా, అన్నీ క్లోజ్.” చెప్తున్నాడు ఎస్‌సెమ్ సాబ్. “జేసీవో మెస్ అంటూ విడిగా ఏం లేదు. యే ఫీల్డ్ హై. అందరం ఒక చోటే తింటున్నాం. తక్లీఫ్ కే లియే మాఫీ చాహతేఁ హై.”

“పర్వాలేదు సర్” ఎకె-47ని ఖాళీగా ఉన్న ఒక బెడ్‌కి ఆనించాను.

బెడ్ అంటే, వెదురుబద్దలని దగ్గరగా బిగించిన ఫ్రేమ్. బద్దలమీద రెండు మందపాటి రగ్గులు పరిస్తేగానీ పడుకోడానికి అనువు కాదు. మా గార్డులు ఖాళీ బెడ్లలోకి సర్దుకుంటున్నారు.

“రామ్ రామ్ సాబ్!” అంటూ లేచాడు పక్క బెడ్‌లో కునుకు తీస్తున్నట్లున్న ఒక నాయబ్ సుబేదార్. ఫీల్డ్ యూనిఫారంలోనే ఉన్నాడు. బెల్ట్, టోపీ తప్ప. ‘ఎ ఘోడ్కే’ అని చెప్తోంది అతని నేమ్ ప్లేట్. ఆ రెండూ తగిలించుకుంటూ అడిగాడు. “స్వాగత్ హై ఆప్ కా. కోక్రాఝార్ మే. ఏ యూనిట్ నించి?”

చెప్పాను.

“సాబ్, జిందగీ మే… ఇలాంటి రోజులు కూడా చూస్తాననుకోలేదు. జేసీవో అయాక కాస్త నయంగా ఉంటుందిలే అనుకుని, కష్టపడి ఈ రాంక్ సాధించాను ఇరవయ్యేళ్ళ సర్వీస్ తర్వాత. కానీ సాలా, పాతికేళ్ళ క్రితం ట్రైనింగ్ రెజిమెంట్లో పరుగెత్తినట్లే ఇవ్వాళ కూడా పరుగెత్తుతున్నాం. పదహారు గంటల పెట్రోలింగ్ తర్వాతగానీ బెడ్ దర్శనం కాలేదు. వచ్చి ఆరు గంటలు కాలేదు, మళ్ళీ పెట్రోలింగ్ డ్యూటీ అన్నారు. నోరు మూసుకుని వెళ్ళాల్సిందే” అంటూ బెల్టూ టోపీ తగిలించుకుని దిగులు ముఖంతో బయటకు నడిచాడు, జవాబేదీ ఆశించకుండానే.

మనసు దోచే ఈశాన్య భారతపు ప్రకృతి అందాల మీదినుంచి, ఈ ఉగ్రవాదపు నీలి ఛాయలెప్పుడు తొలగుతాయో!?

చూస్తుండగానే కొత్త యూనిట్లో ఆరు నెలలు గడిచిపోయాయి. నన్ను డివిజన్ హెడ్‌క్వార్టర్స్‌కి రిపోర్ట్ చెయ్యమన్నారు. అక్కడ ముప్ఫైకి పైగా ఉన్న కంప్యూటర్లన్నీ సరిగ్గా పనిచేసేట్లు చూడడం, వాటి లోకల్ ఏరియా నెట్‌వర్క్, దానికి చెందిన పరికరాలూ అన్నీ నా బాధ్యతలే.


దసరాలు. ఆ రోజు మహర్నవమి. “తొమ్మిదింటికల్లా పీటీ గ్రౌండ్‌లో పూజ మొదలవుతుంది, అందరూ హాజరు కాగలరు.” ఆర్డర్ అందింది ముందు రోజు.

గ్రౌండ్ మధ్యలో, ఇరవై అడుగుల వ్యాసంలో గుండ్రగా, చదును చేసి, జేగురురంగు మట్టితో నున్నగా అలికి వుంది. గ్రౌండ్‌కి చేరుతుంటే దార్లో ‘మందిర్’ పక్కన ఒక గేదె కట్టేసి ఉండటం చూశాను. ఒక పక్కన ఆఫీసర్లు, వాళ్ళకి కొంచెం పక్కన జీసీవోలు నిలబడ్డారు. వలయంలో మిగిలిన జాగా అంతటా గూర్ఖా రెజిమెంట్ ర్యాంకులు నిండారు.

జీవోసీ రాకతో పూజ మొదలైంది. గూర్ఖా యూనిట్‌లోని పండిట్‌జీ, జీవోసీనుంచి లాంఛనంగా అనుమతి తీసుకుని, గేదెకి బొట్టు పెట్టాడు.

మూడు ఢాక్‌లు (పెద్ద నగారా వంటి వాయిద్యం) మోగడం మొదలైంది. వాటి శబ్దం యూనిట్ గోడలకి తగిలి ప్రతిధ్వనిస్తోంది. వాటి ధ్వని పండిట్‌జీ చదువుతున్న మంత్రాలని మింగేస్తోంది.

అప్పుడు చూశానా గూర్ఖా రెజిమెంట్ సిపాయిని. చిన్న సైజు కొండలా ఉన్నాడు. నుదుటిన ఎర్రటి బొట్టు. పెరిగిన జుట్టు. బొద్దుగా ఉన్న మోహంలో ఒక గీత గీసినట్లు కళ్ళు. అతనికి హెయిర్ కటింగ్ మినహాయింపు ఇచ్చినట్లుంది. పెరిగిన జుట్టు మొహం మీద పడకుండా నుదిటిన ఎర్రటి గుడ్డ కట్టాడు. అతని చేతిలో పొడవాటి, వంపు తిరిగిన పెద్ద కత్తి. దాని అంచు అప్పుడే పదును పెట్టినట్లు మెరుస్తోంది.

పండిట్‌జీ పసుపు కుంకుమలు చల్లుతూ కొద్దిసేపు గేదె చెవిలో మంత్రాలు చదివాడు. ఈలోపు, గేదె కొమ్ములకి చుట్టి వున్న తాడుని లాగి పట్టుకున్నారు ఇద్దరు గూర్ఖా జవాన్లు. ఆ తర్వాత సైగ చేశాడు. సైగని అందుకున్న సిపాయి ఇప్పుడు గేదె మెడకి దగ్గరగా నిలబడి, రెండు చేతులతోనూ కత్తిని దృఢంగా పట్టుకుని పైకెత్తాడు. గట్టిగా ఊపిరి పీల్చి బిగబట్టి, పైకెత్తిన కత్తిని వేగంగా కిందకి దించాడు. ఆ ఒక్క వేటుకే ‘ఝఫ్’ మన్న శబ్దంతో మెడ తెగి, కళ్ళు పెద్దవి చేసిన గేదె తల నేల వాలింది. చివ్వున నెత్తురు పొంగింది. క్షణం పాటు నిలబడిన మొండెం ముందరి మోకాళ్ళ మీద కూలబడి, స్లో మోషన్‌లో, ధబ్బుమంటూ పక్కకి వాలిపోయింది. తాడుని పట్టుకున్న జవాన్లు గేదె తలని ఒక బుట్టలోకి చేర్చారు.

సరిగ్గా వేటు పడే సమయానికి అనుకోకుండా చూసిన నాకు, జీవోసీ – మేజర్ జనరల్ రామచంద్రన్ రెండు సెకండ్లపాటు కళ్ళు మూసుకుని తెరవడం కంటపడింది.

పండిట్‌జీ బిగ్గరగా నినాదాన్ని వెలువరించాడు. “కాళీ మాతా కీ జై!” అందరూ ‘జై’ తో శ్రుతి కలిపారు. మరోసారి, ఇంకోసారి, దిక్కులు పిక్కటిల్లేయి.

వెంటనే నలుగురు సిపాయిలు ముందుకొచ్చారు. వేగంగా, నిరర్ధకంగా తన్నుకుంటున్న గేదె వెనుక కాళ్ళకి తాడు కట్టి ఈడుస్తూ, పండిట్‌జీ ముందుండి దారి తీస్తుండగా ఆ గుండ్రంలో మూడుసార్లు తిప్పారు. నెత్తుటితో తడిసి, జేగురు రంగు ఇప్పుడు నల్లగా కనిపిస్తోంది. ఆ తర్వాత దాన్ని మెస్‌కి చేర్చారు. ఇవాళ ఆ ప్రసాదాన్ని రెజిమెంట్ అంతటా పంచుతారు.


కొద్ది రోజుల తర్వాత, ఓ ఆదివారం పొద్దున్నే పండిట్‌జీ వచ్చాడు జేసీవో మెస్‌కి. “రామ్ రామ్ సాబ్, రామ్ రామ్ సాబ్” అంటూ చేతులు జోడిస్తున్నాడు. నమస్కారాలకి ప్రతినమస్కారాలు అందుకుంటున్నాడు.

“పండిట్‌జీ…” నమస్కారం చేస్తూ పిలిచాను.

“హా హుజూర్, బోలియే” అంటూ ఆగాడు పండిట్‌జీ.

“మొన్న గేదెని బలి ఇచ్చారు కదా, దాని గురించి ఒక చిన్న సందేహం. అడగనా?”

“హుజూర్, నిస్సంకోచంగా అడగండి.”

“నాకు అంతగా తెలియదు కనక మిమ్మల్ని అడుగుతున్నాను పండిట్‌జీ. అన్యథా అనుకోకండి. జీవహింస చెయ్యకూడదూ అని అన్ని మతాలతోబాటూ హిందూమతం కూడా చెప్తోందనే నమ్ముతాను. మరి, బలి ఇవ్వడం అంటే ఒక నిండు ప్రాణాన్ని బలవంతంగా లాగేసుకోవడమే కదా? అది పాపం కాదా?”

చిరునవ్వుతో వివరించడం మొదలుపెట్టాడు పండిట్ జీ. “మేం దాని చెవిలో, దాని ప్రాణాన్ని కాళీమాతకి అర్పిస్తున్నామని చెప్పి, దానికి ఇష్టమేనా అని అడుగుతాం. అది ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాతే దాన్ని బలిస్తాం.”

“అది ఒప్పుకున్నట్లు ఎలా చెప్తుంది? నోరు లేదు కదా?”

చిరునవ్వు చెదరకుండా చెప్పాడు పండిట్‌జీ. “ఒప్పుకుంటేనే, ఒక్క వేటుకి తల తెగిపడుతుంది. లేకపోతే తెగదు. అదే గుర్తు.”