కొన్ని పెళ్ళల్ని పోగుచేసుకొని నువ్వూ గూడు కట్టుకుంటావు
కొన్ని నెర్రెల్ని మూటగట్టుకుని వాడూ నవ్వుతుంటాడు పైకి
పల్చటి నీలిమబ్బుకింద నువ్వో రెండు చుక్కలని
పసిగట్టి మరీ చప్పరిస్తుంటావు
గుప్పెడేసి ఉప్పు సముద్రాల్ని ఔపోసన పడుతుంటాడు వాడు
దర్జాగా అట్టహాసాలని పెట్టెల్లో నింపుకుంటుంటావు
నిత్యం జనద్వీపాలకి వారధి ఔతుంటాడు వాడు
ఎన్నో త్రాగి త్రేనుస్తావు
ఒక్క థాంక్స్‌తో వడగడుతుంటాడు వాడు
అలా అలా కొద్ది దీపాల వెలుతుర్లో
నువ్వు కొన్ని రాజ్యాలేలుతుంటే
కనుసన్నల్లోంచే నిన్నూ నన్నూ తూకం వేస్తుంటాడు వాడు
ఒక దురదృష్టప్పొర కింద –
వెంటిలేటర్ విసనకర్ర కాబోతున్న క్షణంలోనే
నిన్నూ అందర్నీ తడిమేసి
చకచకా నింగిలో నిచ్చెన మెట్లెక్కెస్తాడు వాడు
వానలో ఎండి వగర్చడాన్ని మనకి మిగిల్చి…
ఇప్పుడు చెప్పు
ఆత్మీయుడెవరో!