రోజూ కనిపిస్తే ఊరికే వినిపిస్తే
మర్చిపోవడం దృష్టి మరల్చుకోవడం
ఖాయమే కానీ…
అర్థం కానట్టి కవితామర్మమేదో హఠాత్తుగా తట్టినట్లు
రణగొణలో సంతూర్ సడి చెవిలో సుడి తిరిగినట్లు
మల్లెలు చుట్టిన వీవన మౌనపు రాగం తడిమినట్లు
నవ్విన సౌందర్యమే తనా?
…బాహ్య-అంతర రూపాల మధ్య ఇంత సయోధ్య సాధ్యమా?
అందుకోవాలని లేదు అంతులేనిదనీ కాదు
ఆశువుగా చిప్పిల్లిన అలవిగాని ముదమేదో
అంతటా నిండి అలరిస్తుంటే…
చేతివేళ్ళు కలుపుకుని కాళ్ళకేసి చూసుకుంటో
మర్యాదల మధ్య మధ్య చూడ్డానికి ప్రయత్నిస్తో
తనెక్కడా నేనెక్కడా బేరీజులు వేసుకుంటో
తెలిసిన జవాబులే మళ్ళీ ప్రశ్నలకి సంధించుకుంటో
…దోసిట్లో అమృతం చుక్క ఆవిరి కారాదన్న బెంగ ఓ పక్క
ఎన్నో దశలనుంచీ తొక్కిపడుతున్న లేత రెక్క
విప్పుకున్నప్పటి సంబరమింకో పక్క.
స్నేహానందానికింకో నిట్టూర్పు!