సోల్జర్ చెప్పిన కథలు: క్లర్కత్వం

డిప్లొమా కోర్స్ దాదాపు పూర్తి కావచ్చింది.

చివరి సెమిస్టర్లో జరిగేది – లైబ్రరీ రిసెర్చ్ ప్రాజెక్ట్ (LRP). దాని తర్వాత ఫైనల్ టెస్ట్‌లు, చివరిగా కాన్వొకేషన్. ఆ తర్వాత కొద్ది నెలలు, మహా అయితే ఏడాది-ఏడాదిన్నరకి, ఇన్నేళ్ళనుంచీ ఎదురుచూస్తున్న ఆ ప్రమోషన్…

మా బాచ్‌కి ఇచ్చిన టాపిక్‌లలో నాకు ఎలాట్ అయిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మీద పదిహేను రోజుల్లోపు, లైబ్రరీలో పుస్తకాల్లోంచి చదివి దాని గురించిన రైటప్‌ని తయారు చేసి దఖలు చెయ్యాలి. ఆ తర్వాత అదే టాపిక్ మీద ప్రెజెంటేషన్ కూడా తయారు చేసి, మార్కులు వేసే నలుగురు ప్రొఫెసర్ల ముందర ప్రెజెంట్ చెయ్యాలి. బాచ్ కూడా ఉంటుందప్పుడు.

రైటప్‌ని తయారు చెయ్యడంలో మునిగిపోయాను. ఏదోలా కాగితాలు నలుపు చేసి ఇవ్వడం కాదు. ముందుగా టాపిక్ తాలూకు లేఅవుట్‌ని, ‘ఫ్లో’నీ నిర్ణయించుకోవాలి. దానికి సంబంధించిన పుస్తకాలని లైబ్రరీలో వెతికి పట్టుకోవాలి. అవసరమైన చోట్ల డయాగ్రమ్‌లతో సహా, నీట్‌గా గుండ్రటి చేతిరాతలోనో, టైప్ చేసో, చక్కటి ఫైలుగా రూపొందించి ప్రిసైడింగ్ ఆఫీసర్‌కి ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్ సారాంశాన్ని క్లుప్తంగా స్లైడ్‌ల లోకి చేర్చడం వేరే కథ.

రోజూ లైబ్రరీకి వెళ్తూ, పుస్తకాలని రిఫర్ చేస్తూ నోట్స్ చేసుకుంటున్నాను. రాస్తున్న కొద్దీ తెలుస్తోంది. ఒక పుస్తకంలోనుంచి కొంత నోట్స్ తయారు చేసుకున్న తర్వాత, మరో పుస్తకం చదువుతుంటే, క్రితం రాసుకున్న నోట్స్ పేలవంగా అనిపించి, మళ్ళీ తిరగరాయాల్సి వచ్చేది. అలా ఎన్నోసార్లు మార్చి మార్చి రాసుకుంటూ, బొమ్మలని నాలుగైదుసార్లు ప్రాక్టీస్ చేసి, నీట్‌గా వేసి, రైటప్‌ని ముగించాను. ట్రైనింగ్ లాబ్‌లో ఎలక్ట్రానిక్ టైప్‌రైటర్ ఉంది. ఆ లాబ్ ఇన్‌చార్జ్ – హవల్దార్ జార్జ్ కుట్టిని ‘మంచి చేసుకుని’ అడిగితే, ఆఫీస్ అవర్స్ దాటేక టైప్ చేసుకోనిచ్చాడు.

“రావ్! ఫైల్ తయ్యార్ హోగయా క్యా?”

పదింటికి బారక్‌కి వచ్చిన నన్ను, నా కోర్స్‌మేట్ ముస్తాక్ అడిగాడు దోమతెర లోంచి.

“హాఁ! బస్, హోనే వాలా హై. తేరా హోగయా?”

చిద్విలాసంగా నవ్వి అన్నాడు. “హో జాయేగా!” నా ప్రశ్నార్థకపు మొహాన్ని చూసి మళ్ళీ అన్నాడు. “హో రహా హై!”

అతన్నెప్పుడూ లైబ్రరీలో చూడలేదు. అతన్నే కాదు. బాచ్ లో ఈ ఎల్.ఆర్.పి. మీద పనిచేస్తూ చాలా కొద్దిమందే కనపడుతున్నారు. రాబోతున్న ఫైనల్ ఎగ్జామ్స్ మీదనే దృష్టి పెడుతున్నారు. వీళ్ళ రైటప్‌లు ఎప్పుడు తయారవుతాయో?! లేకపోతే దానికీ అడ్డదారులేమన్నా ఉన్నాయో?

త్వరలోనే తెలిసింది.

నూటయాభై వరకూ ఉన్న టాపిక్స్‌ లోంచే ఎంచి, బాచ్‌కి ముప్ఫయ్యేసి చొప్పున మార్చి మార్చి ఇస్తుంటారట! ట్రైనీలు తయారు చేసిన ఫైళ్ళని డిపాజిట్ చేసే స్టోర్ తాలూకు సివిలియన్ స్టాఫ్ గొంతులో రెండు పెగ్గులూ జేబులో రెండొందలూ పోస్తే, కావలసిన టాపిక్ ఉన్న పాత బాచ్ వాళ్ళ ఫైల్‌ని తెచ్చుకుని, కాపీ కొట్టి కవరూ పేరూ మార్చి…!

ఓ! అంత అడ్డదారి నడక నావల్ల కాదు.

చక్కటి ఫైల్ మీద, అందమైన చేతిరాత ఉన్న ఒకతన్ని బతిమిలాడి, టాపిక్ పేరు, నా పేరు రాయించి, మర్నాడు దాన్ని సబ్మిట్ చేశాను.

“ఓకే” అంటూ తీసుకున్నాడు మా ప్రిసైడింగ్ ఆఫీసర్. బాగుందనీ బాలేదనీ అనలేదు.


ఇవ్వాళ పిక్చర్ డే. రేపే ప్రెజెంటేషన్.

స్లైడ్‌లన్నీ సిద్ధం. ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చెయ్యాలి. అది ఇవ్వాళ రాత్రి మాత్రమే కుదురుతుంది. ప్రాక్టీస్ లేకపోతే ప్రొఫెసర్ల ముందు మాట పెగలకపోవచ్చు. తప్పులు దొర్లవచ్చు. మార్కులు తరగవచ్చు.

“రావ్, పిక్చర్ దేఖ్‌నే చల్ రహే హో?” అడిగాడు ముస్తాక్, అద్దంలో చూసుకుంటూ.

“నహీ యార్. కల్ కా ప్రెజెంటేషన్ కో ప్రాక్టీస్ కర్నా హై.”

మళ్ళీ అదే చిద్విలాసంగా నవ్వాడు ముస్తాక్. “కరో కరో. అచ్ఛీ బాత్ హై…” నవ్వుకుంటూనే బయటికి నడిచాడు.

వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసేశారా? ఏమో?

ఫైల్ కాపీని చేతిలోకి తీసుకున్నాను. బారక్ వరండాలోని నిలువెత్తు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అయిదు నిముషాలు గడిచాయో లేదో, వడివడిగా బారక్ లోకి వచ్చాడు మా బాచ్ లీడర్ ఠాకూర్.

“అరే రావ్, యహా క్యా కర్ రహే హో అభీ తక్? డ్యూటీకి వెళ్ళలేదేంటి?” అన్నాడు ఒకింత కోపంగా.

విస్తుపోయాను. “డ్యూటీయా? ఇవ్వాళ నాకు డ్యూటీ వెయ్యలేదే!”

“నీది కాదులే. దాస్‌ది. కానీ అతనికి ఒంట్లో బాగాలేదని చెప్పాడు. అతని బదులు నిన్ను వేశాను, అఫ్సర్ మెస్‌లో.” చేతిలోని డైరీ చూపెడుతూ అన్నాడు. “తొందరగా వెళ్ళి, దాస్‌ని అక్కణ్ణించి రిలీవ్ చెయ్యి” ఆర్డర్ వేసేసి వచ్చినంత స్పీడుగానూ వెళ్ళిపోయాడు.

ఇంకేముంది? ఆఫీసర్ మెస్‌లో నైట్ డ్యూటీ అంటే క్షణం తీరిక ఉండదు. చెక్ చేసే ప్రతి డ్యూటీ ఆఫీసరూ వేరే చోట్లకి వెళ్ళి చూసినా చూడకపోయినా, అక్కడికి మాత్రం తప్పకుండా వెళ్తాడు.

ఇక ప్రాక్టీస్ కుదిరే పనే లేదు. రిలీవ్ అయి, హాయిగా సైకిలెక్కి వెళ్ళిపోతున్న దాస్‌ని చూస్తుంటే, ఒంట్లో బాగా లేదన్నది సాకు మాత్రమే అని తెలిసిపోతోంది. బాచ్ లీడర్‌తో ఇతనికున్న దోస్తీ ఇలా పనికొచ్చింది.

తర్వాత, డ్యూటీ ఆఫ్‌లో, మర్నాడు ఇవ్వవలసిన ప్రెజెంటేషన్‌ని మననం చేసుకోబోయాను. కుదరలేదు. బుర్ర మొరాయిస్తోంది. ఒకటి రెండు వాక్యాలకి మించి ఏమీ గుర్తు రావడంలేదు. పదే పదే ప్రయత్నించి, విఫలమౌతున్నాను.

కళ్ళముందు అపజయం కత్తిలా వేలాడుతోంది. ఫెయిలయితే… ఇక్కడ రెలిగేషన్లు కూడా ఉండవు. నేరుగా కోర్స్ లోంచి డిస్మిసే! డిస్మిస్ అంటే, ఎంత అవమానం? కోర్స్‌కి సెలెక్టయినందుకే కుళ్ళుని బాహాటంగా బయట పెట్టిన కొలీగ్స్, అందులోంచి తొలగించబడి యూనిట్‌కి తిరిగి వస్తే తలెత్తుకోనిస్తారా? సూటిపోటి మాటలతో కుళ్ళబొడవరూ!


కొత్త యూనిఫారాలు, టోపీలు, బెల్ట్‌లు, బూట్లు ధరించి మెరిసిపోతున్న బాచ్‌మేట్లు అందరూ ఆడిటోరియంలో కుర్చీల్లో కూర్చున్న తీరులో మిలిటరీ డిసిప్లిన్ ఉట్టిపడుతోంది. స్టేజ్ ఎదురుగా నాలుగు కుర్చీల్లో ప్రొఫెసర్లు కూర్చుని ఉన్నారు.

మొదటి పేరు హవల్దార్ ఠాకూర్. కోర్స్ లీడర్, పైగా సీనియర్ కూడా. చెప్పాల్సిన నాలుగు మాటల్నీ బిగుసుకుపోయి చెప్పి, ఏదోలా ప్రెజెంటేషన్ అయిందనిపించాడు.

ఒక ప్రొఫెసర్ ఏదో ప్రశ్న వేశాడు. దానికి ఠాకూర్ తొట్రుపడుతూ జవాబు ఇస్తుండగానే మధ్యలో అడ్డుకుని, మరో ప్రొఫెసర్ ఇంకో ప్రశ్న వేశాడు. తడబడ్డా తమాయించుకున్న ఠాకూర్ దానికీ జవాబిచ్చాడు.

“నెక్స్ట్!” మరొక బాచ్‌మేట్ లేచి స్టేజ్ వైపు బయల్దేరాడు. ఇతను ఒక్కొక్క పదాన్నే గుర్తు చేసుకుంటున్నట్లు, ఆగి ఆగి చెప్తున్నాడు. అతను చివరి స్లైడ్ లోకి రాక ముందరే తగులుకున్నారు ప్రొఫెసర్లు. వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పడానికి ప్రయత్నించినా, చెప్పలేకపోయాడతను. సైలెంట్‌గా చూస్తూ ఎటెన్షన్‌లో నిలబడ్డాడు.

రెండు క్షణాలు ఆగి “నెక్స్ట్” అన్నాడో ప్రొఫెసర్.

ఒక్కొక్కరి ప్రెజెంటేషన్ ముగుస్తోంది. వాళ్ళు అంతగా ప్రాక్టీస్ చెయ్యలేదని తెలిసిపోతోంది.

నా వంతు వచ్చింది. స్టేజ్ ఎక్కాను. ఎదురుగా బాచ్ మేట్ల వరుసల మధ్యలో ముస్తాక్… ఇప్పుడూ అదే చిరునవ్వు.

స్క్రీన్ మీద మొదటి స్లైడ్ ఫ్లాష్ అయింది. ఉపోద్ఘాతం. తర్వాత రెండో స్లైడ్.

అంతే.

ఏదో స్విచ్ ఆన్ అయినట్లు, ఎటువంటి ఆటంకమూ లేకుండా ప్రతి స్లైడ్ లోని విషయాన్నీ చక్కగా అందిస్తోంది మెదడు. రాత్రి డ్యూటీలో ససేమిరా అన్న మెదడు ‘చివరి నిముషంలో ప్రాక్టీస్ చెయ్యనంత మాత్రాన, అన్ని రోజులూ పడ్డ శ్రమ వృధా అయిపోదు’ అని నిర్ధారించింది.

రెండో స్లైడ్. మూడో స్లైడ్. స్లైడ్‌లు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. హాల్లో నా గొంతు బిగ్గరగా, స్పష్టంగా, కాన్ఫిడెంట్‌గా వినిపిస్తోంది, నాకే ఆశ్చర్యకరంగా. ప్రెజెంటేషన్ ముగించాను.

ఆడిటోరియం ఇంకా నిశ్శబ్దంగానే ఉంది.

అంతవరకూ స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నలు వేసి తిప్పలు పెట్టిన ప్రొఫెసర్లు చూస్తూ ఉన్నారు.

“సర్! ఎనీ క్వశ్చన్స్?” నేనే అడిగాను.

“నో. యూ కెన్ గో. గుడ్!”

“థ్యాంక్ యూ సర్!”


“వెల్ డన్ రావ్!” ప్రొఫెసర్ శర్మ అన్నాడా మర్నాడు.

“థ్యాంక్ యూ సర్. కానీ మీరేమీ అడగనే లేదే?!”

నా ప్రశ్నకి జవావిబివ్వలేదాయన. “నీ స్కోర్ చూశాను! యూ నో రావ్, యూ టాప్‌డ్ ఇన్ ఎల్.ఆర్.పి.”

“థ్యాంక్ యూ ఒన్స్ ఎగైన్ సర్!” సంభ్రమం! నిజమా?!

“దట్స్‌ ఓకే. గుడ్ ప్రిపరేషన్. ఫైనల్స్‌లో ఇంకా బాగా చెయ్యి. బెస్టాఫ్ లక్” అంటూ నడిచాడాయన.


“రావ్, ముబారక్ హో!” క్యాంటీన్లో కనబడి పలకరించాడు నాయక్ లల్లన్ దూబే, మా యూనిట్‌కి హెడ్ క్లర్కు.

“థాంక్ యూ సర్!”

“మంచిది. మరి తొందరగా ‘పార్ట్ టూ ఆర్డర్స్’ చేయించేస్తే, తర్వాతకి పనికొస్తుంది. దాని గురించి నేను వేరే చెప్పకర్లేదుగా.”

“అలాగే సర్. చేయిస్తాను.”

“అన్నట్లు, ఆ మధ్య ఏదో కంప్యూటర్ కోర్స్ చేశావు కదూ. దాని పార్ట్ టూ ఆర్డర్స్ చేయించావా?”

“క్రితం నెలలోనే చేయించాను సర్. మీరు సెలవులో ఉన్నారు. మీ జూనియర్ క్లర్క్ సార్‌కి చెప్తే, ఆయన చేశారు.”

“ఆఁ. పార్ట్ టూ ఆర్డర్స్ చేయించటం చాలా ముఖ్యం. లేకపోతే మీకు రావలసిన ఎలవెన్సులూ అవీ క్రెడిట్ కావు. పైగా టైమ్ బార్ అయిపోతే మళ్ళీ శాంక్షన్లూ అవీ తీసుకోవాలి. అదో తలనొప్పి. అందుకే ప్రతి ‘సైనిక్ సమ్మేళన్’ లోనూ సీవో సాబ్ అడుగుతుంటారు. మీ పార్ట్ టూ ఆర్డర్స్ అన్నీ అప్‌-టు-డేట్‌గా ఉన్నాయా అని.” అందరికీ తెలిసిన విషయాలే ఏదో కొత్తగా చెప్తున్నట్లు వివరించాడు.

“అవును సర్. నిజమే.” ఈ క్లర్క్ జాతితో సఖ్యంగానే మెసులుకోవాలి.

“అన్నట్లు, నీ లెక్కలు చూశాను రావ్. కిందటి యూనిట్లో నీకు రావలసిన ఎలవెన్సులూ ఇక్కడి ఎలవెన్సులూ అన్నీ కలిపి – దాదాపు అరవైవేల వరకూ తేలింది. తెలుసా?” రహస్యమేదో విప్పుతున్నట్లు చెప్పాడు లల్లన్ దూబే.

ఆశ్చర్యపడ్డాను. ““అది సరే సర్. అరవై వేలా? నేనింకా ఏ ముప్ఫై వేలో వస్తుందనుకున్నాను.”

“అదే మీకూ మాకూ తేడా. మీకు తెలీని చాలా లెక్కలు మా ‘క్లర్క్’లకి తెలుస్తాయి. అరవయ్యేంటి? ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మరి, డాక్యుమెంట్లు తయారు చేసెయ్యనా?”

“చెయ్యండి సర్! అంతకన్నానా!”

నవ్వాడు దూబే. “చేస్తాను. నా పనే అది కదా!” ఏదో అస్పష్టంగా మోగింది ఆ నవ్వులో.

“సర్…”

“నా పని నేను చేస్తాను. నీ పని నువ్వు చెయ్యాలి.”

“…?”

“అయిదువేలు. ఎప్పుడు తెచ్చిస్తే అప్పుడు పనైపోతుంది.” ఖాళీ కప్పుని వదిలి లేచాడు.

ఇవ్వాల్సిందేనా? ‘వద్దూ!’ అని గట్టిగా జవాబొస్తోంది లోపల్నించి.

మరి నా అరవై వేలు?