“రామ్ రామ్ సాబ్!” అంటూ గ్లాసెత్తి, రమ్ మొదటి సిప్ చేశాడు సుబేదార్ మేజర్ ప్రకాశ్ జోసెఫ్. “రామ్ రామ్ సాబ్…” అంటూ జేసీవోలందరం కూడా సిప్ చేశాం. ట్రేలో స్నాక్స్ ముందుగా మాకు అందించి, మిగిలినవాళ్ళకి సర్వ్ చేయడం మొదలుపెట్టారు మా జెసిఓ మెస్ బాయ్స్. అది, నా చివరి యూనిట్ నాకు ఇస్తున్న ‘డైనింగ్ ఔట్’ పార్టీ. సుబేదార్ మేజర్‌తో కలిసి ఒకే సోఫాలో కూర్చొనే గౌరవం దక్కే ఒకే ఒక అవకాశం.
లేచి నిలబడ్డాడు సుబేదార్ మేజర్ జోసెఫ్. క్లబ్ నిశ్శబ్దమైంది.
“సాహెబాన్, రావ్‌సాబ్ తన ఫౌజీ యూనిఫామ్‌ని త్వరలో హ్యాంగర్‌కి తగిలిస్తున్నారు. ఈయన ఫౌజ్‌లో గడిపిన జీవితం ఎంత హుందాగా ఉందో, ఆయన రిటైర్డ్ లైఫ్ కూడా అంతకు మించిన గౌరవంగా, సుఖంగా గడవాలని ఆశిద్దాం…” ఆయన మొదలుపెట్టిన చప్పట్లకి క్లబ్‌లో జేసీవోలందరూ తాళం కలిపారు.
“మనందరం ఇంతవరకూ రావ్‌సాబ్ కంప్యూటర్ మీద పని చెయ్యడమే చూశాం. ఈయన గురించి, బహుశా మీలో ఎవరికీ తెలీని ఒక విశేషం నాకు తెలుసు. రావ్‌సాబ్ వేళ్ళు కీబోర్డ్ మీదనే కాదు – గిటార్ మీద కూడా అంతే నైపుణ్యంతో కదుల్తాయి” అంటూ సోఫాలో కూర్చున్నాడాయన.
ఆశ్చర్యంగా చూశాను.
జెసిఓ-గా ప్రమోట్ అయిన తర్వాత, అంతవరకూ నేను గిటారిస్ట్-కమ్-సింగర్‌గా ఉన్న యూనిట్ జాజ్ బ్యాండ్‌కి టాటా చెప్పేసి, జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా అస్సాంలో యూనిట్‌కి రిపోర్ట్ చేశాను. టెక్నికల్ డ్యూటీలు చేసిన ఈ పదహారేళ్ళలోనూ, ఏ యూనిట్లోనూ, నాకు మ్యూజిక్‌తో పరిచయం ఉందన్న విషయాన్ని నేనుగా ఎవరికీ చెప్పలేదు. ఈయనకెలా తెలిసింది?
నా కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూసి నవ్వేడు ప్రకాశ్ జోసెఫ్. “మీకు మోతీ జోసెఫ్ తెలుసు కదా సాబ్?” అన్నాడు అదే నవ్వు మొహంతో.
“మోతీ జోసెఫ్… అంటే – హవల్దార్ మోతీ జోసెఫ్ గురించేనా మీరు చెప్తున్నది?”
“అవును. మీ బ్యాండ్ మాస్టర్ మోతీ జోసెఫ్, మా అన్నయ్యే!”
ఆ పేరున్న జ్ఞాపకాల కెరటం భళ్ళున పగిలింది.
“ఆజారే – మై తో కబ్ సే ఖడీ ఇస్ పార్, యే అఖియాఁ – లుట్ గయీ పంథ్ నిహార్… ఆజారే…”
హవాయియన్ గిటార్ మీద అలవోకగా, అద్భుతంగా వాయిస్తున్నాడు హవల్దార్ మోతీ జోసెఫ్. ఆ పాటలో లతా మంగేష్కర్ గొంతులో పలికిన గమకాలన్నీ అతని వొళ్ళోని గిటార్ తీగ మీద, స్టీల్ బార్ సాయంతో యథాతథంగా పలుకుతున్నాయి. ఎంతో సాధన చేస్తే గానీ అలవడని చాతుర్యం అది. ఆయనతోబాటు స్టేజ్ మీద ఉన్న నలుగురం, మా ‘కోర్ డే’ ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రిగేడ్ కమాండర్, మా యూనిట్ ఆఫీసర్లు, జేసీవోలతోబాటు ఆ గ్రౌండ్‌లో ఉన్న దాదాపు ఎనిమిది వందలమంది జవాన్లూ వారి కుటుంబాలూ ఆ వాద్యాన్ని వింటూ మైమరచిపోతున్నారు.
పాట ముగిసింది.
మా కంపెనీ జేసీవో సైగనందుకుని, మైక్ చేతిలోకి తీసుకుని మొదలుపెట్టాడు మోతీ జోసెఫ్. “ఆప్ సబ్‌కో కోర్ డే కే అవ్‌సర్ పర్ బహుత్ బహుత్ ముబారక్…”
అందరూ చప్పట్లు కొట్టారు.
“ఇప్పుడు మీ ముందుకి, ఒక పాటతో వస్తున్నాడు సిపాయ్ బీ కే రావ్…” అంటూ గిటార్‌తో కూర్చొన్న నాకేసి చూసి ముందుకి రమ్మన్నట్టు తల వూపేడు.
గిటార్‌ని అమర్చుకుని, చిరునవ్వుతో మైక్ ముందు నిలబడ్డాను.
“వన్, టూ, వన్-టూ-త్రీ-ఫోర్…” స్టేజ్ మీద ఉన్న మాకు మాత్రమే విన్పించేలా అన్నాడు మోతీ జోసెఫ్, లయబద్ధంగా.
“లాఖోఁ హై యహాఁ దిల్ వాలే, ఔర్ ప్యార్ నహీ మిల్‌తా, ఆంఖోఁ మే కిసీ కే వఫా కా, ఇక్‌రార్ నహీఁ మిల్‌తా…” వాయిస్తూ పాడడం మొదలుపెట్టాను. స్వరం వెంట సంగీతం ప్రవహించసాగింది.
“మెహ్‌ఫిల్ మెహ్‌ఫిల్ జా దేఖా – హర్ దిల్ మే సమాకర్ దేఖా – హర్ సాజ్ పే గా కర్ దేఖా…” పాడుతూ ప్రేక్షకులని కలయజూస్తున్నాను. చేతిలో జ్యూస్ గ్లాసుని పట్టుకుని తదేకంగా చూస్తూ, శ్రద్ధగా పాట వింటోంది బ్రిగేడ్ కమాండర్‌గారి భార్య. పక్కన కూర్చొన్న భర్తతో ఏదో చెప్పింది.
“అజి జో కుఛ్ భీ హమ్ హై తుమ్హారే హీ యహాఁ” చివరిసారి పల్లవి పాడి, పాటని ముగించాను. బ్రిగేడ్ కమాండర్, మా కమాండింగ్ ఆఫీసర్‌తో ఏదో చెప్పడం కనిపించింది. తల పంకించిన సీవో సైగనందుకుని, పరుగులాంటి నడకతో చేరుకున్నాడు ఎడ్జుటెంట్. ఆయనేదో చెప్పడం కనిపించింది. ఎడ్జుటెంట్ అదే వేగంతో స్టేజ్ దగ్గరకొచ్చాడు.
“మోతీ, ‘హై అప్‌నా దిల్ తో ఆవారా’ పాడమంటున్నారు బ్రిగేడ్ కమాండర్ సాబ్. జల్దీ సే షురూ కరో” అంటూ నాకేసి తల తిప్పి నవ్వు మొహంతో, “శబాష్ రే బచ్చే” అనేసి చకచకా వెళ్ళి సీవో సాబ్ కనుసైగ అందేంత దూరంలో నిలబడ్డాడు.
“హై అప్‌నా దిల్ తో ఆవారా, న జానే కిస్ పే ఆయేగా…” అంటూ పాట మొదలుపెట్టడం ఆలస్యం, బ్రిగేడ్ కమాండర్ భార్య మొహం విప్పారడం అంత దూరంనుంచీ స్పష్టంగా కనపడింది. అది అప్పటికి ఎన్నోసార్లు విజయవాడలో ఎన్నో స్టేజీల మీద పాడిన పాట!
పాట ముగియబోతోంది.
బ్రిగేడ్ కమాండర్ భార్య లేచింది. వెంటనే కమాండింగ్ ఆఫీసర్‌తో సహా, ఆఫీసర్ల వరసల్లో కూర్చొన్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. బ్రిగేడ్ కమాండర్ కూడా లేచి, భార్యతో సహా స్టేజ్ వైపుకు నడిచి వచ్చారు. బాగా దగ్గరకొచ్చిన తర్వాత కనపడింది ఆయన నేమ్ ప్లేట్ మీద పేరు – “పి వి రమణ.”
హుందాగా నడిచి, నేరుగా స్టేజ్ ముందు ఆగిందావిడ. ఆవిడతో బాటు మా సీవో, వెనక ఎడ్జుటెంట్, మిగిలిన బలగమంతా…
పాట ముగించాను. అప్పటికే లేచి నిలబడ్డారు మా బృందమంతా. హవల్దార్ మోతీ స్టిఫ్‌గా అడుగు ముందుకేసి నా పక్కకి వచ్చి నిలబడ్డాడు. “జైహింద్ శ్రీమాన్!” బిగ్గరగా అంటూ బ్రిగేడియర్‌గారికి ఠక్కున సెల్యూట్ కూడా చేశాడు.
ఇదంతా క్షణాల్లో.
“హీ ఈజ్ ఎ న్యూకమర్ టు ది బ్యాండ్ సర్. వెరీ టాలెంటెడ్” అంటూ బ్రిగేడియర్‌కి చెప్పాడు మా కమాండింగ్ ఆఫీసర్.
“వెరీ గుడ్. చాలా బాగా పాడావు. ఇంత బాగా పాడగలిగిన వాడివి, ఆర్మీలో ఏం చేస్తున్నావోయ్?” నవ్వుతూ ప్రశ్ననీ, పలకరింపునీ కలిపి అడిగారు బ్రిగేడ్ కమాండర్‌గారి భార్య.
నా నవ్వు మరింత వెడల్పుగా మారింది. “థ్యాంక్ యూ మేడమ్.”
“రమణ్, హీ డిజర్వ్‌స్ ఏ డ్రింక్. డోంట్యూ థింక్ సో!?” అందావిడ.
“యాఁ యాఁ ష్యూర్!” అని “ఆర్ యూ తెలుగూ?” అడిగాడు బ్రిగేడియర్ పి వి రమణ, తెలుగులో. “యస్సర్” అన్నాను. ‘ఎక్కడ?’ అన్నట్లు తల ఎగరేశాడు.
“విజయవాడ సర్.”
“ఓ! మా ఊరే. గుడ్…” ‘రా’ అన్నట్లు సైగ చేసేడు.
స్టేజ్ దిగి ఆయనని సమీపించాను. ఆ లోపే బేరర్ ట్రేతో సిద్ధంగా ఉన్నాడు. అందులో ఒక పెగ్ రమ్ పోసివున్న గ్లాసు ఉంది. దాన్ని అందుకుని, నాకేసి తిరిగాడు బ్రిగేడియర్. ఇంక చెప్పనవసరం లేకపోయింది. నోరు తెరిచాను. గ్లాస్‌ని నా నోట్లోకి వంపేశాడాయన. నోట్లో ద్రవం చిరు చేదుగా అతి వగరుగా గొప్ప ఘాటుగా గొంతులోకి దిగింది. చుట్టూతా గలగలా చప్పట్లు మోగాయి.
గొంతులోంచి రమ్ పూర్తిగా కిందకి దిగాక తేరుకుని చూసేసరికి బ్రిగేడ్ కమాండర్, ఆయన భార్య, సీవో వగైరాలందరూ తమ తమ సీట్లలోకి చేరబోతున్నారు. చప్పట్లు ఆగాయి.
మళ్ళీ నా స్థానంలోకి చేరాను. ఈసారి ఒక ఇంగ్లీష్ పాట వినిపించింది మా బృందం. మళ్ళీ చప్పట్లు. రమ్ పని మొదలెట్టింది.
కోర్ డే సెలెబ్రేషన్ ముగిసి, బ్యారక్‌కి చేరాం. సీవో సాబ్ తరఫునుంచి రెండు రమ్ బాటిల్స్ బహుమతి. మొదటిది తెరుచుకుంది. మోతీ జోసెఫ్ చాలా సంతోషంగా ఉన్నాడు. “రావ్, ఇవ్వాళ అదరగొట్టేశావ్!” అన్నాడు నవ్వుతూ.
“థ్యాంక్ యూ సర్.”
…ఏవో మాటలు. చెణుకులు. మిలిటరీ జోకులు. నవ్వులు.
“అసలు నువ్వు ఆర్మీలో ఉండాల్సిన వాడివి కావురా రావ్. చెప్తున్నా విను, వదిలెయ్. వెళ్ళిపో. నీలాంటి వాళ్ళకి బాంబేలో మంచి ఫ్యూచరుంటుంది. నువ్వు పాడగలిగీ వాయించగలిగీ, ఇక్కడెందుకు వేస్ట్ కావాలి? ఏంటి? వింటున్నావా?” నాలుగో రౌండ్ తర్వాత అన్నాడు మోతీ. నేను విజయవాడ ఆకాశవాణిలో కాజువల్ ఆర్టిస్ట్‌గా పనిచేసినట్లు అతనికి తెలుసు.
“అసలు నిన్నిక్కడికి పిలిచిందెవడు? అయినా కిస్మత్‌లో ‘ఫౌజీ దాల్-రోటీ’ రాసుంటే, వీడు బాంబేలో ఎలా తేల్తాడు మోతీ సార్?” త్రేన్పుని నవ్వులో కలిపేసి, మళయాళీ యాసతో అన్నాడు మా బ్యాండ్‌లో సీనియర్ డ్రమ్మర్, లాన్స్ నాయక్ పిళ్ళయ్. ఒకప్పుడు కేరళలో చండ వాయించిన అనుభవం ఉండడంతో, మూడేళ్ళనుంచీ ఈ బ్యాండ్‌లో డ్రమ్మర్‌గా చలామణీ అయిపోతున్నాడు. జోక్‌లా అనడానికి ప్రయత్నించినా, అందులో నా మీద ఉన్న ఈర్ష్య ఘల్లున మోగింది. ఇలా ఒక బ్రిగేడ్ కమాండర్ స్వయంగా వచ్చి జాజ్ బాండ్‌లో ఎవరినీ మెచ్చుకోవడం ఇంతవరకూ జరగలేదట. అదీ కేవలం రెండు నెలల క్రితమే ట్రైనీ రిక్రూట్ నుంచి సిపాయిగా మారిన నాలాంటివాడిని!
“లేదు పిళ్ళయ్. అసలు సంగతి చెప్తా విను” అన్నాడు మోతీ జోసెఫ్. “పైప్ బ్యాండ్ గానీ బ్రాస్ బ్యాండ్ గానీ ప్రోగ్రాం చేసినప్పుడు, ఆ రోజు అక్కడున్న సీనియర్ మోస్ట్ ఆఫీసర్, ఆ బ్యాండ్ మాస్టర్ చేత ఇలా స్వయంగా డ్రింక్ తాగిస్తారు. అదేం మిలిటరీ రివాజు కాదు కాని, నచ్చితేనే అలా చేసి గౌరవిస్తారు. అర్థమైందా?” అన్నాడు. అతను ఒకప్పుడు మా కోర్ తాలూకు బ్రాస్ బ్యాండ్‌లో ట్రంపెట్ ప్లేయర్.
“మన జాజ్ బ్యాండ్‌కి మిలటరీలో అసలు ఆథరైజేషనే లేదు. ఇదంతా బ్రిగేడ్ కమాండరూ, సీవో చేతుల్లో, లోకల్‌గా ఉండే ఏర్పాటు. ఆథరైజ్డ్ బ్యాండ్‌లు అంటే పైప్స్ అండ్ డ్రమ్స్, బ్రాస్ బ్యాండ్. ఈ రెండే!” మళ్ళీ గ్లాసులో రమ్ పోసుకున్నాడు.
“అయినా బ్యాండ్ అంటే బ్రాస్ బ్యాండే. ఆ తళతళ మెరిసే వాయిద్యాలు, డ్రమ్స్ వాయిస్తూ ఆ డ్రమ్మర్లు చేసే విన్యాసాలు, అవన్నీ నేను మిస్ కాని రోజంటూ లేదు. అదృష్టం కలిసి రాక నేను పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ కోర్స్‌కి సెలెక్ట్ కాలేదు. అయి ఉంటేనా, ఈపాటికి సుబేదార్ అయుండేవాణ్ని. ఏం చేస్తాం. కిస్మత్. అంతే…” అన్నాడు మోతీ జోసెఫ్, రమ్ సాయంతో పాత రోజుల్లోకి జారిపోయి.
“సర్, అయితే మీరు పైప్ బ్యాండ్‌లో కూడా పని చేశారా?” అడిగాను.
“అరే రావ్, మోతీ సర్‌ని పగలు అడగాల్సినవన్నీ రాత్రి అడుగుతున్నావు” అన్నాడు గిటారిస్ట్ గోవర్ధన్. అతను తాగడు. ఆకలేస్తున్నట్లుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి మెస్‌లో వాలదామా అన్నట్లుంది అతని వాలకం.
“అబే భోసడీకే!” మందువల్ల పొంగిన ఆప్యాయతతో నవ్వుతూ అన్నాడు మోతీ జోసెఫ్. “చదువుకున్నావ్ కాబట్టి టెక్నికల్ ట్రేడ్ వచ్చింది నీకు. నీది ఏ-గ్రూప్ జీతం. అందరికంటే ఎక్కువ. పాపం ఆ పైపర్స్, డ్రమ్మర్స్ నీలా చదువుకున్నవాళ్ళు కాదురా. అన్ పడ్, తీస్రీ-చౌథీ పాస్. వాళ్ళ ట్రేడ్సే అవి. పైపర్, డ్రమ్మర్. వాళ్ళ పనే అది. వాయించడం, వినిపించడం… వాళ్ళది ఈ-గ్రూప్ జీతం. ఇవ్వాళ నీకొచ్చే దాంట్లో సగం కూడా ఉండదు. సమ్‌ఝే…” క్లాస్‌కి కామా పెట్టి, గ్లాస్ అందుకున్నాడు.
టెక్నికల్ ట్రైనింగ్ పూర్తి కాగానే మొదటి పోస్టింగ్‌గా నేను ఈ ‘మిలిటరీ ట్రైనింగ్ రెజిమెంట్’కి వెళ్తున్నానని తెలిసిన ప్రతివాడూ కళ్ళు పెద్దవి చేసి చూసింది అందుకేనన్నమాట!
“కానీ, ఒకటి మాత్రం గుర్తుంచుకో…” మోతీ స్వరం కొంచెం గంభీరంగా మారింది. “ఫౌజ్ ఎంత తొందరగా ఆదరిస్తుందో, అంతకన్నా తొందరగా అసహ్యించుకోగలదు కూడా. ఏదో నీకు గిటార్ వాయించడం, పాటలు పాడడం వచ్చు అన్న సంగతి తెలిసింది కాబట్టి, నిన్ను ఈ జాజ్ బ్యాండ్‌లో పోస్ట్ చేశారు. హెయిర్ కటింగ్ మాఫీ అయింది కదా, క్వార్టర్ గార్డ్ డ్యూటీలు పడవు కదా, ఇక మనమే హీరోలం కదా అనుకుంటూ విర్రవీగకు. ఎప్పుడైనా సెలవనుంచి గంట లేటుగా వచ్చి చూడు. బస్. ఇక్కడ తంతే యే లేహ్-లద్దాఖ్ లోనో తేల్తావ్” అంటూ నవ్వాడు.
నా తెల్లమొహం చూసి, “అబే ఘబ్రావ్ మత్ సాలే! మై హూఁ నా!?” అన్నాడు బిగ్గరగా నవ్వుతూ.
అదే నిజమైంది. మరో రెండు వారాల తర్వాత మరో పెద్ద యూనిట్ తాలూకు జాజ్ బాండ్ కోసం నన్ను వేరే వూరికి పోస్ట్ చేశారు. హవల్దార్ మోతీ జోసెఫ్ మళ్ళీ ఎక్కడా తారసపడలేదు, జ్ఞాపకాల్లో తప్ప.
“కహాఁ ఖోగయే హో సాబ్!” పక్కనుంచి సుబేదార్ మేజర్ పలకరింపుతో ఇక్కడికొచ్చిపడ్డాను.
“మోతీ సర్ ఇప్పుడెలా ఉన్నారు సర్? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?” అంటూ అడిగాను.
“ఆయన పెన్షన్‌కి వెళ్ళి పదిహేనేళ్ళు దాటింది. మా ఊరు జల్‌గాఁవ్. మీకు తెలుసుగా. అక్కడే ఉన్నాడు. ఇప్పుడేమీ చెయ్యడం లేదు. మొన్నీ మధ్యనే స్ట్రోక్ వచ్చి, ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నాడు. వదిన అక్కడే ఏదో స్కూల్లో టీచర్‌గా చేస్తోంది” చెప్పాడాయన.
“ఓఁ…” కొంచెం బాధగా అన్నాను.
“అచ్ఛా, అవన్నీ సరే. మళ్ళీ మిమ్మల్ని కలిసే ఛాన్స్ వస్తుందో రాదో. అందుకని…” అని అందర్నీ ఉద్దేశించి అన్నాడు పెద్దగా “సాబ్ లోగ్, ఇవ్వాళ మనకి రావ్ సాబ్ ఒక చక్కటి పాటని వినిపిస్తారు. లేకపోతే మూవ్‌మెంట్ ఆర్డర్ ఇవ్వను.”
అందరూ నవ్వారు.
“ఆయియే సాబ్, ప్లీజ్. షురూ కరియే.”
ఇష్టమైన ఆ తప్పనిసరి పిలుపునందుకుని, లేచి నిలబడ్డాను. ఎన్నో ఏళ్ళ క్రితం ఆగిపోయిన పాట ఇవ్వాళ మళ్ళీ పెగులుతుందా? తెలియదు.
లైట్లన్నీ కలిసిపోయి ఒకటిగా మారిన కాంతి పుంజం నన్ను వెలిగిస్తోంది. సుబేదార్ మేజర్ – క్లబ్‌లో కూర్చొన్న జేసీవోలు, మెస్ బాయ్స్ – అందరూ పొగమంచు లాంటి మేఘంలో కరిగిపోతూ క్రమంగా ఫేడౌట్ అయిపోయారు.
…ఎడం పక్కన, వొళ్ళో హవాయిన్ గిటార్‌తో మోతీ జోసెఫ్, కుడి పక్కన బేస్ గిటార్‌తో గోవర్ధన్, తబలా మీద ఘోష్, నా వెనకాల జాజ్ డ్రమ్స్ మీద పిళ్ళయ్… మెడలో గిటార్… ముందర మైక్… ఎదురుగా కూర్చొన్న బ్రిగేడియర్ రమణ, ఆయన భార్య…
“వన్, టూ, వన్-టూ-త్రీ-ఫోర్…” నాకు మాత్రమే వినిపించింది మోతీ జోసెఫ్ ఇచ్చిన లయబద్ధమైన ఆజ్ఞ. పాడడం మొదలుపెట్టాను.
“హై అప్‌నా దిల్ తో ఆవారా, న జానే కిస్ పే ఆయేగా…”
స్వరం ప్రవహించసాగింది.
సజావుగా.
ఒంటరిగా.