సోల్జర్ చెప్పిన కథలు: తలక్రిందులు

అంబాలా.

అస్సాం నించి నాలుగు నెలల క్రితం ఇక్కడికి వచ్చాను పోస్టింగ్ మీద.

“బాగున్నారా భట్ సార్!” ఆనందంగా పలకరించాను, ఆరోజే పోస్టింగ్ మీద వచ్చి ఆర్.ఎచ్.క్యు.లో కనబడ్డ సుబేదార్ భట్‌ని.

“అరె, రావ్‌సాబ్! బాగున్నారా! కోర్స్ తర్వాత మళ్ళీ ఇదే కలవడం…” అంతే ఆప్యాయంగా చేయి కలిపాడు భట్.

కుశలప్రశ్నల తర్వాత, ఈ ఎనిమిదేళ్ళ మధ్యలోనూ జరిగిన ఒకళ్ళ జీవిత విశేషాలు మరొకళ్ళం తెలుసుకుని ఆనందించాం. మా క్వార్టర్స్ పక్కపక్కనే. “రేపు మా ఇంటికి రండి రావ్‌సాబ్” అంటూ ఆహ్వానించాడు సెలవు తీసుకునే ముందు.

కలిసి ట్రైనింగ్ చేసినవాళ్ళలో చాలా తక్కువమందికి, మళ్ళీ ఒకే యూనిట్లో కలిసి పనిచేసే అవకాశం దొరుకుతుంది మా కోర్‌లో. పాత జ్ఞాపకాలు ఒక్కసారి బలంగా పైకి లేచాయి.

సుబేదార్ రామకృష్ణ భట్. అప్పట్లో నాయక్ ఆర్కే భట్. భట్ నాకు డిప్లొమా కోర్స్‌లో పరిచయం. ఎర్రటి ఎరుపు. ప్లాస్టిక్ స్కేల్ లాంటి రూపం. కళ్ళూ బుగ్గలూ పూర్తిగా లోపలికి పీక్కుపోయి, మూతి ముందుకి పొడుచుకొచ్చినట్లు కనిపించేది. అయినా, ఆ కళ్ళల్లో ఎంత తీక్షణత! ఎంత కుదురు!

థియరీలోను, ప్రాక్టికల్స్‌లోను, దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ అతనే టాపర్. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేట్లుండే మనిషికి అంతంతసేపు ఏకబిగిన కూర్చుని చదివే ఓపిక ఎలా వుందో అర్థమయ్యేది కాదు. బారక్‌లో లైట్‌ని ఆఫ్ చెయ్యడం లేదని రూమ్మేట్లు తరచూ కంప్లైంట్ చేస్తున్నా భట్ మాత్రం రాత్రి మూడింటివరకూ చదువుతూనే ఉండేవాడు. అతను తినేదెప్పుడో, పడుకునేదెప్పుడో కనిపెట్టడం పక్కవాళ్ళక్కూడా కష్టమయ్యేది. అనుకొన్నట్టుగానే ఎవరికీ ఏ ఆశ్చర్యమూ కలిగించకుండా, బాచ్‌లో ఫస్ట్ నిలిచాడు భట్. పైగా మైక్రోప్రాసెసర్స్ సబ్జెక్ట్‌లో, ఆరేళ్ళనుంచీ నిరాటంకంగా కొనసాగుతున్న హై స్కోర్ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు.

కోర్స్ చెయ్యడానికి వచ్చాడు కాబట్టి, గవర్నమెంటు ఇచ్చే ఫామిలీ క్వార్టర్స్ దొరకవు. అందుకని యూనిట్‌కి పక్కన పేటలో అద్దె ఇంట్లో భార్యాబిడ్డలని వుంచి, తను మాతోబాటు బారక్‌లో ఉండేవాడు. ఒక ఆదివారంనాడు వాళ్ళతోబాటు బజార్లో కనపడి, నాకూ పరిచయం చేశాడు. తర్వాత ఓరోజు ఏదో మాటల్లో, తమది ప్రేమ వివాహమని చెప్పాడు. కొడుకు పుట్టిన తర్వాత కూడా అతని తల్లిదండ్రులు ఆవిడని తమ కోడలిగా స్వీకరించడానికి సుముఖంగా లేరట.

“మీ కులాలు వేరువేరా?”

“అదేం లేదు. మా చుట్టాలమ్మాయే. నేనామె తండ్రికి నచ్చలేదు. ఆవిడ అందానికి నేను సరితూగనంటూ ఏవేవో కుంటిసాకులు చూపి పెళ్ళికి ఒప్పుకోలేదు.”

అప్పుడు వీళ్ళిద్దరూ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి…

ఇప్పుడు ఒకే సెక్షన్‌లో మళ్ళీ అతనితోపాటు పనిచేసే అవకాశం రావడంతో చాలా సంతోషంగా ఉంది. పైగా ఆదివారాల్లో ఒకరి ఇంటికి మరొకరం వెళ్ళడం కొత్త రొటీన్‌గా మారింది. వాళ్ళింటికి వెళ్ళిన అయిదు నిముషాల్లోపు ఓల్డ్ మాంక్ తెరుచుకునేది. చెరో రెండు రౌండ్లు. ఏవో పాతవీ కొత్తవీ కబుర్లు. భోజనం. నా రూమ్. ఇలా గడిచింది అయిదారు నెలలు.

పార్లమెంట్ మీద దాడి జరిగేంతవరకు.


నాలుగైదు రోజుల్లోనే, ఆదరాబాదరాగా ఫ్యామిలీలని ఊరికి పంపించేసి, యూనిట్ మొత్తం రాజస్థాన్ ఎడారిలో తేలింది.

ఇప్పుడు భట్టూ నేనూ షిఫ్టుల్లో పనిచేస్తున్నాం. నెలకొన్న యుద్ధ వాతావరణం, పేరుకున్న అనిశ్చితుల మధ్య, ఏ నెలకో రెంటికో, భార్యాపిల్లలతో మాట్లాడ్డం కుదిరితే కుదిరినట్టు. మిగిలిన కాలమంతా డ్యూటీ-రెస్టు-డ్యూటీ-రెస్టులలో గడుస్తోంది.

అప్పుడు తెలిసింది – మందు పడితేనే భట్ నార్మల్‌గా పనిచెయ్యగలడని. కానీ అది ఫీల్డ్. రెగ్యులర్‌గా అందుబాట్లో ఉండే లిక్కర్ కోటా అక్కడ బ్యాన్ అయింది. ఎలా ఉగ్గబట్టుకున్నాడో తెలీదు గానీ ఎప్పుడూ బయటపడలేదు.

ఆరోజు నన్ను షిఫ్ట్ నుంచి రిలీవ్ చెయ్యడానికి వచ్చాడు భట్. కళ్ళు మెరుస్తున్నాయి. నోరు ‘గుప్’ మంటోంది. ఎక్కడ ఏం సంపాదించాడో! ఇన్నాళ్ళ తర్వాత దొరికిందే చాలని తాగినట్లు తూలిపోతున్నాడు. ఇంక డ్యూటీ ఎలా? చెక్ చేయడానికొచ్చే డ్యూటీ ఆఫీసర్ సరే, ఒక్కోసారి సీవో కూడా సర్ప్రయిజ్ విజిట్స్ చేస్తుంటాడు. పట్టుబడితే? పైగా ఈయన తాగి డ్యూటీకొచ్చాడని తెలిసినా, దాన్ని రిపోర్ట్ చెయ్యకపోతే నాకూ ఇబ్బందే. తమాయించుకుని “భట్ సాబ్, మీరు వెళ్ళిపొండి. నేను చేసేస్తాను ఈ షిప్ట్” అన్నాను.

“రావ్ సాబ్, క్యా… ఏం… ఏమ్మాట్లాడ్తున్నారు? షిఫ్ట్ నాది. యూ గో!”

“అలా కాదు. మీరు వెళ్ళండి.” ప్రాధేయపడ్డాను. “సెంట్రీ! సాబ్ కో అప్నే టెంట్ మే లేజావ్!”

“ఏయ్! ఆగు. షిఫ్ట్ నాది. తేరీ…” నోట్లోంచి బూతు జారింది. “పోరా…” అంటూ సెంట్రీని విదిలించే ప్రయత్నంలో తూలి, టెంట్ పోల్‌కి తగిలి కింద పడ్డాడు భట్. లేపడానికి వంగాను.

చటుక్కున ఎవరో టెంట్‌లోకి ప్రవేశించారు. తెల్లబోయాను. డ్యూటీ ఆఫీసర్. ఒక్క క్షణం మా ఇద్దరినీ పరికించి చూశాడు.

“రావ్ సాబ్, భట్ సాబ్‌ని అతని టెంట్‌కి తీసుకెళ్ళి దిగబెట్టి రండి” అంటూ కుర్చీలో కూర్చున్నాడా డ్యూటీ ఆఫీసర్.

“నేనంతా చూశాను.” అతని గొంతు మాములుగానే ధ్వనించింది.

“ఎస్ సర్.”

భట్ సాబ్‌ని టెంట్‌లో పడుకోబెట్టి మళ్ళీ షిఫ్ట్ ఏరియాలోకి వచ్చిన నా వైపు ఒక అథారిటీ-బెదిరింపూ కలిసిన చూపు చూసి వెళ్ళిపోయాడు డ్యూటీ ఆఫీసర్.

కాసేపటికి ఫీల్డ్ ఆంబులెన్స్ వచ్చింది. భట్‌ని ఫీల్డ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి.


పది రోజులయింది.

భట్ సాబ్‌ని డిశ్చార్జ్ చేశారని, తోడుగా ఒక కుర్రాణ్ణిచ్చి ఇరవై రోజుల సెలవు మీద యూనిట్‌కి పంపారని తెలిసింది. అతని ఫామిలీ అక్కడే క్వార్టర్స్‌లో ఉంటోంది బిక్కుబిక్కుమంటూ.

వారం గడిచాక, ఏదో టెంపరరీ డ్యూటీ మీద యూనిట్‌కి రిపోర్ట్ చేయమని నాకు ఆదేశం అందింది.

“రావ్ సాబ్, కైసే హో?” అంటూ రూమ్ లోకి వచ్చాడు భట్. ఆ రోజు ఆంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇదే చూడడం అతన్ని. మాములుగానే, ఏమీ జరగనట్లే మాట్లాడుతున్నాడు. పిచ్చాపాటీ అయింది.

“ఆవోఁ, ఘర్ చల్తే హై” అంటూ లేవదీసి ఇంటికి తీసుకువెళ్ళేడు. అంతా అదివరకటిలానే జరుగుతున్నట్లుంది.

ఓల్డ్ మాంక్ తెరుచుకుంటుంది. వాళ్ళావిడ భోజనం వడ్డిస్తుంది. తర్వాత నేను నా రూమ్‌కి వచ్చేస్తాను – అనుకున్నాను. ఓల్డ్ మాంక్ తెరుచుకుంది గానీ అది ‘ఒక్క పెగ్గే’నని వాళ్ళావిడ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతే. మాట ఇస్తూ అతను నాకు కన్ను గీటేడు.

“సారీ భట్ సాబ్. ఇప్పుడదేమీ వద్దు. భోంచేద్దాం” అన్నాను.

“తప్పకుండా రావ్ సాబ్! జస్ట్, కొంచెమే. సరేనా?” అంటూ మొహమాటపెట్టాడు భట్. “ఎంత జరిగినా బుద్ధి రాదుగదా మీకు” చిరుకోపంగా వంటింట్లోకి నడిచిందావిడ.

“ఎందుకు లెండి భట్ సాబ్. ప్లీజ్, పదండి… భోజనం చేసేద్దాం.”

ఒకసారి నావైపు కోపంగా చూసి, విసవిసా వంటింట్లోకి నడిచాడు భట్. ఆవిడ ఏడుపు వినిపించింది కానీ అతను ఓదార్చడం వినపడలేదు.

అయిదు నిముషాలు గడిచాయి. క్షణాల్లోనే పరిస్థితి చాలా డెలికేట్‌గా, ఎంబరాసింగ్‌గా మారింది. లేచాను.

“భట్ సర్, నేను బయల్దేర్తాను. ఒక పని గుర్తొచ్చింది” అన్నాను కొంచెం బిగ్గరగా. జవాబు రాలేదు.

అతని పన్నెండేళ్ళ కొడుకు పక్క గదిలోంచి వచ్చాడు. “అంకుల్, పాపా సారీ చెప్పమన్నారు” అన్నాడు.

భట్ కోసం చూస్తూ ఒక్క క్షణం ఆగి, బయటకు నడిచాను.


“రావ్ సాబ్!’ మెస్‌లో భోజనానికి కూర్చోబోతుంటే అడిగాడు సుబేదార్ మేజర్. “భట్ సాబ్ ఇంటికి వెళ్ళేరా ఏంటి?”

“వెళ్ళాను సర్.”

“ఊఁ సరే, కొంచెం జాగ్రత్త.”

“సర్. ఆయన నా కోర్స్‌మేట్. అందుకనే…”

“ఫైన్. మీకు తెలుసుగా? ‘సైకిక్’ అని రిమార్క్ వేశారతనికి.”

ఉలిక్కిపడ్డాను. “తెలియదు సర్. ఏమైంది?”

“కైసే కోర్స్‌మేట్ హో ఆప్? అతనిది ఆల్కహాలిక్ డిపెండెన్సీ సిండ్రోమ్. అతని డాక్యుమెంట్స్ రెడీ అవుతున్నాయి. ఇంకో అయిదారు నెలలు – మహా అయితే. పర్మనెంట్‌గా వెళ్ళిపోతున్నాడు.” బాంబు పేల్చాడు సుబేదార్ మేజర్.

అప్పుడే పంపేస్తారా? నాకు తెలిసి భట్‌కి కనీసం పన్నెండేళ్ళ సర్వీస్ ఇంకా ఉంది. పేరుకే ‘ఆల్కహాలిక్ డిపెండెన్సీ సిండ్రోమ్.’ దాని అర్థం, అతను ‘మిలిటరీ సర్వీస్‌కి అర్హత కోల్పోయిన మానసిక రోగి’గా తేల్చబడ్డాడని, దానికి పర్యవసానం తొలగింపేనని…

బాధగా అనిపించింది. చదువులో మేటిగా, చక్కటి తెలివితేటలున్నవాడిగా పేరు తెచ్చుకున్నా, ఒక్క చెడ్డ రిమార్క్‌తో ఉద్యోగం పోగొట్టుకుంటున్నందుకు. అదే అన్నాను.

“ఫౌజీ సర్వీసులో అవేం పనికిరావు రావ్ సాబ్! ఫీల్డ్‌లో తాగి గొడవ చేస్తే, ఏ సీవో ఊరుకుంటాడు? పైగా ఇంతకుముందరి యూనిట్లో కూడా ఇలాగే తాగేసి, అక్కడో ఆఫీసర్ చొక్కా పట్టుకున్నాట్ట. ఆ సీవో ఎందుకో దయతలచి వదిలిపెట్టాడు. అది తెలియగానే, ఇంక టాలరేట్ చెయ్యద్దన్నాడీ సీవో. బస్!”


ఫోన్ మోగింది. మండుతున్న కళ్ళు తెరిచి చూశాను. రెండున్నర.

“హలో…”

“రావ్ సాబ్, జల్దీ ఎమ్.ఎచ్.కి వెళ్ళండి. మిసెస్ భట్‌ని ఎడ్మిట్ చేశారు” సుబేదార్ మేజర్ కంఠం కరకరలాడింది.

నిద్రమత్తు వదిలింది. “ఏమైంది సర్?”

“ఫైర్ యాక్సిడెంట్. నైన్టీ పర్సెంట్ బర్న్‌స్. భట్ జాగ్రత్త. ఏ అఘాయిత్యం చెయ్యకుండా చూసుకోండి.”

దిమ్మెరపోయి తేరుకుని, చకచకా తయారై మిలటరీ హాస్పిటల్‌కి చేరాను. బర్న్‌స్ వార్డ్.

అపస్మారకంలో భట్ భార్య. మేల్ వార్డ్‌లో భట్. అతని రెండు చేతులకీ కట్లు. బెడ్ దగ్గర సెంట్రీ.

“భట్ సర్! ఏం జరిగింది?”

“…”

అతన్ని ఇంకా రెట్టించదల్చుకోలేదు. అవసరమైన ఫార్మాలిటీలు పూర్తిచేసి తిరిగి వచ్చాను.


యూనిట్లో టెంపరరీ డ్యూటీ ముగించుకుని, మళ్ళీ ఫీల్డ్ డ్యూటీలో చేరాను.

“భట్ సాబ్ ఇంత పని చేస్తాడనుకోలేదు సర్…” మొదలుపెట్టాడు హవల్దార్ చంద్ర, ఆరోజు రెస్ట్ టైమ్‌లో. ఏమిటన్నట్లు చూశాను. “మీరక్కడే ఉన్నారట కదా సర్, మీకు తెలిసే ఉంటుందిగా అంతా.”

జవాబివ్వకుండా సీరియస్‌గా చూశాను.

“తాగద్దని ఆవిడా, తాగుతానని ఈయనా బాగా గొడవ పడ్డారట సార్. ఆవిడ కిరసనాయిలు పోసుకుని చచ్చిపోతానని బెదిరించిందట. వాళ్ళు అంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు దానిగురించే పెద్దగా గొడవ పడ్డారట. ఆ బెదిరింపుని పట్టించుకోకుండా ఈయన మేడమీదికి పోయి తాగడం మొదలెట్టాట్ట. దాంతో ఆవిడ నిజంగానే…”

మంటల్లో కాలిపోతున్నా, ఆవిడ ముఖంలో పట్టుదల ఒక్కసారి నా కళ్ళ ముందు మెదిలింది.

“కొడుకు కేకలకి సాబ్ దిగొచ్చి, గబగబా మంటల్ని ఆర్పి, ఆవిడకో దుప్పటి చుట్టి స్కూటర్ మీద దగ్గర్లోని సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశాట్ట. కానీ ఇది మెడికో-లీగల్ కేసని, అయిదువేలివ్వకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాననీ డిమాండ్ చేశాట్ట ఆ డాక్టర్. సాబ్ ఇవ్వలేదట. ఊరుకున్నట్టే నటించి, ఆవిడని ఎమ్.ఎచ్.కి తీసుకెళ్ళమని, వీళ్ళిట్లా బయల్దేరగానే ఆ డాక్టర్ అన్నంత పనీ చేశాట్ట. పోలీసులు ఎమ్.ఎచ్.కి వెళ్ళిన విషయం సీవోకి తెలిసి, మండిపడ్డాట్ట. కేసు జీవోసీ (జనరల్ ఆఫీసర్ కమాండింగ్) దాకా వెళ్ళక తప్పలేదు. చివరికి…”

“ఇప్పుడెలా ఉంది ఆవిడకి?”

“పర్వాలేదంటున్నారు సార్. భట్ సాబ్ ఇంకా అక్కడే ఉన్నారు. పోలీస్ కస్టడీలోకి తీసుకుపోకుండా అతి కష్టం మీద ఆపగలిగేరట.”

మరో రెండు రోజుల తర్వాత, ఆవిడ మరణవార్త అందింది.

ఆవిడ ఇచ్చిన మరణ వాఙ్మూలం: ‘గుడ్డకి నిప్పంటించి వంటింట్లో తేనెపట్టుని కాల్చడానికి ఎత్తి పట్టుకోగా, అది నామీద పడి వొళ్ళు కాలింది. మంటలు ఆర్పింది మా ఆయనే…’