ఒసే/ఒరే విశ్వం,
నిన్నే పిలుస్తున్నా
ఒక్కొక్కటిగా టిక్కులు లెక్కేసుకుంటూ
ఈ చీకట్లలోంచి కట్లలోంచి
పెనుగాట్లలోంచి పెనుగులాటల్లోంచి
ఇంతవరకూ మృదంగాన్ని మ్రోగిస్తూ
జటలొక్కొక్కొటే విడదీసుకుంటూనూ
ఒక్కోసారి పెనవేసుకుంటూనూ
గుక్క గుక్కగా పీల్చేస్తూ నీకోసం
రిక్కలు రాల్చుకుంటూనూ
లెక్కలెన్ని వేసుకున్నా కుదరనూ లేదు
చిక్కులెన్ని తీసినా ముడివీడనూ లేదు
నువ్వొక్కటేననుకున్నా నేనెన్నిట్లో
చిక్కుకున్నానో ఎక్కుతున్నానో
ఒక్కటైనా తెలియనూలేదు
ఒరే/ఒసే విశ్వం,
నాలోకి నువ్వూ నీలోకి నేనూ
పరస్పరం మనలోకి మనమూ
గలగలా వలవంతలా పారుతూ
పలకరింతలమై పలవరింతలమై
పుట్లకొద్దీ పూసుకున్న పుటల్లోని చుక్కలమై
ఆత్మదర్శనం పరస్పర్శాజనితమైన
మహదానందపుటంచులమీంచి
జారె వొంపులోకి
జారిన చుక్కలమై జాలువారిన తారలమై
ఇలాగే ఇందుకే ఉన్నామనుకుంటూ
గుర్తులు చెక్కుకుంటూ
వత్తులు దిద్దుకుంటూ
వలయాల్లోని వలయంలోకి
విజయాల్లోని విలయంలోకి
ఒకింత మరి కాస్తంత కించిత్పూర్తిగా
విలుప్తమై వినీలంలో విలీనమైపోతూ
మరొకసారి కోసం
నైరూప్యవేణీవిలాసంలోకి…