సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల

ఆదివారం.

హమ్మయ్య. ఈరోజు ట్రైనింగ్ లేదు. నాలుగింటికే లేచి, పరుగెడుతూ తయారై, పరుగెడుతూనే పెరేడ్ గ్రౌండ్‌కి చేరి, లంచ్ బ్రేక్ దాకా పీటీ గ్రౌండ్‌లో మట్టినేలతో, డ్రిల్ గ్రౌండ్‌లో సన్నకంకరతో, వెపన్ ట్రైనింగ్‌లో చెక్క రైఫిళ్ళతో చేసే సావాసానికి ఈరోజు ఆటవిడుపు.

ప్రేమ్ కుమార్ చెప్తున్నాడు. “వో బోలా ‘తుమ్ కగాఁ కా రెగనే వాళా? మై బోలా ‘ఎమ్మెచ్’ కా రెగనే వాళా సర్!” చుట్టూ ఉన్న కుర్రాళ్ళు నవ్వుతున్నారు.

“ఎమ్మెచ్ అన్న ఎన్న?” ఎవరో అడిగారు. “మిలట్రీ హాస్పిటల్ డా!” వివరించాడు ప్రేమ్.

బ్రేక్‌ఫాస్ట్ చేసి, ఏడింటికి ఫాలిన్ అయాం, సివిల్ డ్రస్‌లో. మార్చింగ్‌లా కాకుండా నడిపిస్తూ తీసుకెళ్తున్నాడు ఉపాధ్యాయ్.

విశాలమైన ఆ మిలిటరీ ట్రైనింగ్ రెజిమెంట్‌కి ఒక అంచున వున్న ఒక పెద్ద ప్రాంగణం ముందర ఆపాడు మా స్క్వాడ్‌ని. అక్కడి చిన్న సైజు గోపురాలవంటి కట్టడాలు, రంగు రంగుల జెండాలని చూడగానే అర్ధమైంది. గేటు ముందర ఒక పక్కగా చెప్పుల స్టాండ్ నిండా, కిందా రకరకాల సివిల్ చెప్పుల జతలు కనిపిస్తున్నాయి.

“చలో, సబ్ లోగ్ ఏక్ సాథ్ బైఠో. అటూ ఇటూ చక్కర్లు కొట్టకండి. మందిర్ పెరేడ్ తర్వాత ఎటెండెన్స్ ఉంటుంది. వెళ్ళండి” అంటూ మమ్మల్నందర్నీ లోనికి పంపాడు.

రేకుల కప్పు కింద అడ్డంగా నిలువుగా కట్టిన చమ్కీ దండలు. తెల్లటి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలని నిలబెట్టిన ఒక పాలరాతి గూడు. దాని మీద తప్ప మరెక్కడా వెలగని బల్బులు. విష్ణుమూర్తి నవ్వుతున్నాడు. లక్ష్మీదేవి కూడా తగినట్లుగా నవ్వుతోంది. అదో గుడి అయినా, గుడిలో కలగవలసిన భక్తిభావన మాత్రం ఎందుకనో కలిగించలేకపోతోందా వాతావరణం.

మొదటి రెండు మూడు రోజుల తర్వాత, రెడ్డి నాతో కలవటం తగ్గిపోయింది. ఇవ్వాళ ఈ ‘మందిర్’లో వచ్చి పక్కనే కూర్చున్నాడు. ‘ఏం రెడ్డీ?’ అన్నాను పలకరింపుగా. అతని బిగుతైన షర్టు గుండీల మధ్యనుంచి బనియన్ తొంగి చూస్తోంది. అతని మొహంలో కాసింత దుఃఖం.

“ఏమైంది రెడ్డీ?”

“అమ్మ…” అన్నాడు. కంటినుంచి చుక్క జారబోతున్నట్లుంది.

“ఏమైంది అమ్మకి?”

“ఏం కాలా. గుర్తొస్తాండాది.”

ఏమనాలో…

“పెతీ సుక్కురారమూ గుడికి తీస్కెల్లేది అమ్మోరి గుడికి. పెసాదం పెట్టిచ్చేది గుర్తొస్తాండాది.”

ఒక పక్కనుంచి హార్మోనియం, డోలక్ మోగసాగాయి. ఏదో భజన పాడుతున్నారు. ఏడెనిమిదిమంది గొంతులు కలిసి రకరకాల శ్రుతుల్లో వినిపిస్తోందా భజన. ఒక్క ముక్కా అర్థం కావడంలేదు. మోకాళ్ళ చుట్టూ చేతులు కట్టుకుని కూర్చుని వింటున్నాడు రెడ్డి. ఏడుపునాపుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘పండిత్‌జీ’ వచ్చాడు. కింద పంచ, పైన లాల్చీ, దాని మీద నల్లని శేర్వానీ. ముఖాన గంధం బొట్టు. తల వెనక పిలక. ఆయన సైగనందుకుని భజన బృందం పాడటాన్ని ఆపింది. మైకు పట్టుకుని ఆయన మొదలుపెట్టాడు. “భక్త్ గణోఁ! ఆజ్ ఇత్‌వార్‌కా కా శుభ్‌దిన్ హై…” పది నిముషాల సేపు ఆదివారానికున్న ప్రాముఖ్యతని వివరించాడు. “అబ్ ఆరతీకా సమయ్ హో చలా హై. అందరం ఆ భగవంతుడి మీద ధ్యాస నిలిపి, భక్తితో పాడదాం.”

“ఓం జయ్ జగదీశ హరే. స్వామి జయ్ జగదీశ హరే!’ పాట పాడుతూ పండిత్‌జీ హారతి ఇస్తున్నాడు. అందరూ లేచి నిలబడ్డారు. ఆ హాల్లో ఉన్నవాళ్ళలో చాలామంది ఆ ‘ఆరతీ’ని పాడటం మొదలుపెట్టారు. నాతోబాటు రెడ్డి, వెనకాల కూర్చున్న తమిళ కుర్రాళ్ళూ లేచి నిలబడ్డాం. అంతకు ముందెప్పుడూ వినని ఆ పాటని వింటున్నాం. పాట అయిపోయింది.

“ధర్మ్ కా…” అన్నాడు పండిట్‌జీ.

“విజయ్ హో!” అన్నారందరూ.

“అధర్మ్ కా…”

“నాశ్ హో!” జవాబిచ్చారందరూ.

“ప్రాణియోఁ మే…”

“సద్భావనా హో!”

“విశ్వ్ కా…”

“కళ్యాణ్ హో!”

“బోలో శియావర్ రామ్‌చంద్ర కీ…”

“జై!” హాలు మారుమోగింది.

“పవన్ సుత్ హనుమాన్ కీ…”

“జై!”

“హర్ హర్ మహాదేవ్!”

అందరూ మోకాళ్ళ మీద ప్రణమిల్లారు. భజనలు పాడిన బృందం ప్రసాదం పంచారు. పూజ మొత్తం ఇరవై నిముషాల్లో ముగిసింది. బయట పడ్డాం. చెప్పులు తొడుక్కుని, పక్కనే ఇంకో హాల్లో స్థాపించిన గురుద్వారా గేటు ముందు విడిచాం. మైక్‌లోంచి కీర్తనలేవో వినిపిస్తున్నాయి.

లోపల ఒకరిని చూసి ఒకరం అనుకరిస్తూ ‘ఆది గ్రంథ్ సాహిబ్’ ముందు మోకరిల్లి, ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాం. పదిహేను ఇరవై నిముషాలసేపు ‘గ్రంథీ’ సాబ్, ప్రార్థనను ఆలపించేడు. పూర్తిగా పంజాబీ భాషలో ఉన్న ప్రార్థన. సంస్కృత మంత్రాల్లాగా నోరు తిరగనివి కావనిపించింది. ప్రసాదం ఒక పిండి ముద్ద. పిండితే నెయ్యి చుక్కలుగా కారేలాంటి హల్వా. తియ్యగా.

ఈసారి మరి కాస్త ఎక్కువ దూరం నడిపించాడు ఉపాధ్యాయ్. రెజిమెంట్ మసీదుకి. ఆ ప్రాంగణమంతా శుభ్రంగా ఉంది.

ముల్లాజీ వృద్ధుడు. తెల్లటి గడ్డం. తలమీద ఆకుపచ్చని, గుండ్రటి టోపీ. ‘ఆవ్ బచ్చే ఆవ్’ అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. ‘వజూ కరో’ అంటూ ఒక పక్కన చదరంలో కట్టిన కొలనుని చూపాడు. ఒకళ్ళిద్దరు సీనియర్ రిక్రూట్లని చూసి మేం కూడా కాళ్ళూ చేతులూ కడుక్కున్నాం. మందిర్ ముందర ఉన్నన్ని చెప్పుల జతలు ఇక్కడ లేవు.

లోపలికి వెళ్ళాం. మందిర్‌ లోనూ, గురుద్వారా లోనూ కనబడ్డ లైట్లు గానీ, ఇతర అలంకారాలు గానీ ఇక్కడ లేవు. ఎదురుగా తెల్లటి గోడ. అన్ని గోడల్లానే. ఆకుపచ్చని చమ్కీ గుడ్డలమీద అరబిక్ అక్షరాల తోరణాలు చుట్టూతా మెరుస్తున్నాయి. సీనియర్ రిక్రూట్లని అనుకరించాలేమో అనుకున్నాను గానీ, కొద్దిసేపట్లోనే ఆ నిశ్శబ్ద ప్రార్థన ముగిసింది.

బయటికొచ్చాం. రెడ్డి ఏడీ? ఎప్పుడు జారుకున్నాడో!

ఇప్పుడు ఏంటి? ఎక్కడికెళ్ళాలి? టైమ్ ఎంతైందో! బహుశా తొమ్మిది.

మిగిలిన కొద్దిమందిమీ బారక్ వైపుకి నడవడం మొదలెట్టాం. సినిమా హాల్ దగ్గరికి రాగానే దాదాపు అందరూ దాని వెనక్కి దారి తీశారు. ‘వెట్ క్యాంటీన్’ ఉందక్కడ. తమిళ కుర్రాళ్ళందరూ జంబులింగం చుట్టూ చేరి వడలూ టీలూ ఆర్డర్లు ఇప్పించుకొంటున్నారు. ఆ టీ-స్టాల్ లోంచి బయటపడి బారక్ చేరుకున్నాను. ట్రంక్ పెట్టెలోంచి ఒక ఇన్లాండ్ లెటర్ తీసి, రాయడం మొదలుపెట్టాను.

“డియర్ కిరణ్…”


‘ఎవ్వరూ అక్కర్లేదు బాస్, నేను బాంగో డ్రమ్స్ తెస్తాను. నువ్వెటూ గిటార్ వాయిస్తూ పాడతావు. నాలుగైదు హిందీ పాటలు ప్రాక్టీస్ చేద్దాం. అంతే, ఒక ఊపు ఊపేద్దాం!’ రోటరీ క్లబ్‌లో పది నిముషాలపాటు ‘షో’ చేసే అవకాశం మా ఇద్దరికీ వచ్చినప్పుడు ధైర్యం చెప్పిన కిరణ్…

‘బాస్, ఈ సీనియర్ ఆర్టిస్ట్‌లని ఎంత అడిగినా చెప్పరు గానీ, మనమే వెళ్ళి ఆలిండియా రేడియోలో ఆడిషన్ ఇచ్చేద్దాం!’ దన్నుగా తానున్నానన్న కిరణ్…

‘ఈ మ్యూజిక్ కాదు గానయ్యా, దీనెమ్మ దీని ముందు లవరైనా బలాదూరేనయ్యా!’ అంటూ స్పష్టంగా ఇష్టాన్ని ప్రకటించిన కిరణ్…

జ్ఞాపకాల దొంతరను పక్కకి నెడుతూ రాస్తున్నాను. అయాం ఎబౌట్ టు కంప్లీట్ ఎ మంత్ ఆఫ్ ట్రైనింగ్! కెన్ యూ ఇమాజిన్? వన్ మంత్! ఇట్ ఈజ్ అన్‌బిలీవబుల్ ఫర్ మీ టూ… చకచకా రాసుకుంటూ పోతున్నాను.

ఎవరో వచ్చి పక్కన నిలబడ్డారు. గోహిల్. తోటి రిక్రూట్. గుజరాతీ.

“అరె వా, అంగ్రేజీ! ఇంగ్లీష్‌లో ఉత్తరం రాస్తున్నావా?” ఆశ్చర్యం పట్టలేనట్లు అడుగుతున్నాడు.

‘అయితే?!’ అన్నట్లు చూశాను అతనికేసి.

“అరే, ఇస్‌కే పాస్ బొహోత్ అంగ్రేజీ హై!” అంటూ అరుస్తున్నట్లు ప్రకటించాడు. తోటి గుజరాతీ రిక్రూట్ గోధారాని చెయ్యి పట్టుకు లాక్కొచ్చి మరీ నన్ను చూపించాడు గోహిల్. “అరె బాప్‌రే, ఇంత ఇంగ్లీష్ తెలిసి నువ్వు ఫౌజ్‌లోకి ఎందుకొచ్చావ్? పాగల్ హై క్యా?’

నాకూ ఆశ్చర్యంగానే అనిపించింది. ఇంగ్లీష్‌లో ఉత్తరం రాయడంలో గొప్పేముంది?

“మేరే పాస్ ఇత్నా అంగ్రేజీ హోతా నా, మై తో బాబూజీ బన్ కే బైఠూఁ!”

“లిఖో భాయ్ లిఖో. ఇక్కడ ఇద్దరు గుజరాతీ భాయిలు ఉన్నారని రాయి. రామ్ రామ్ చెప్పారని రాయి. ‘మై తో పాగల్ హూ, ఈ ఫౌజ్ నన్నింకా పాగల్ చేస్తుందీ’ అని రాయి. ఠీక్ హై?” ఇద్దరూ నవ్వుతున్నారు.

నాకు ఏమని జవాబివ్వాలో తెలియలేదు. ఇంతలో గోహిల్ అందుకున్నాడు. “అరే భాయ్, మెస్ తెరిచారా? ప్లేట్ల చప్పుడవుతున్నట్లుంది?”

“అప్పుడేనా? ఇంకా పన్నెండు కూడా అయి ఉండదు” అన్నాడు గోధారా. “అప్పుడే నీకు ఆకలేస్తోందా?”

“వచ్చిందే తినడానికి! పాగల్ బన్ నే నహీఁ!” నవ్వుకుంటూనే వెళ్ళిపోయారు.

ఉత్తరాన్ని అంటించి, మొదటి బారక్ దగ్గరున్న పోస్ట్‌బాక్స్‌లో వేశాను. ప్లేట్ తీసుకుని మెస్‌కి వెళ్ళి చూశాను. గిన్నెలు, రొట్టెల తట్టలూ అప్పుడే పెట్టారు. క్యూలో మూడోవాడు గోహిల్. వెనకే గోధారా. రెడ్డి ఇంకా రాలేదు.

కాషాయ రంగు కలిపిన అన్నం, పూరీలు, సాంబార్, గుమ్మడికాయ కూర, అప్పడాలు, కేరెట్ హల్వా – ఆదివారం అని గుర్తు చేశాయి.

దాదాపు అరగంట తర్వాత, నా భోజనం సగం అయాక వచ్చాడు రెడ్డి. నిండుగా ఉన్న ప్లేట్‌తో నా దగ్గరకొచ్చి కూర్చొని, మౌనంగా తినసాగాడు. మొహంలో ఇందాకటి దిగులు లేదు.

గోహిల్ కూడా వచ్చి మా దగ్గర కూర్చొన్నాడు. అతని ప్లేట్ మళ్ళీ నిండుగా ఉంది. ఆశ్చర్యంగా చూశాను. అదేం పట్టించుకోకుండా తినడం మొదలుపెట్టాడు. మళ్ళీ తింటానో లేదో అన్నట్లు ఆవురావురుమంటూ వేళ్ళు జుర్రుకుంటూ…

తమిళ కుర్రాళ్ళు ఎవరూ కనబడలేదు. వెట్ క్యాంటీన్ లోంచి బయటపడ్డారో లేదో. బారక్‌కి వచ్చాక తెలిసింది. హఠాత్తుగా కుప్పకూలిన ప్రేమ్ కుమార్‌ని ‘ఎమ్మెచ్’కి తీసుకెళ్ళారని.

రెండు రోజుల తర్వాత రోల్‌కాల్‌లో హవల్దార్ ఛత్రీ ప్రకటించాడు. “దిల్ కా దౌరా పడ్ గయా థా ఉస్ కో. రంగ్రూట్ ప్రేమ్ కుమార్ జె. ఆత్మకి శాంతి కలగాలని, రేపు పొద్దున్న సీవో సాబ్ మందిర్ పెరేడ్‌కి ఆదేశించారు. ఏడింటికి ఫాలిన్. పూరా కా పూరా మందిర్ మే చాహియే. రేపు ట్రైనింగ్ క్లాసులు జరగవు. అవసరమైన డ్యూటీలు మాత్రం యథావిథిగా జరుగుతాయి.”

వింటున్న మాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. ప్రేమ్ కుమార్… చనిపోయాడా!?

అతనితో పెద్దగా పరిచయం లేకపోయినా, అందర్లోకీ లావుగా, పొడవుగా నవ్వుమొహంతో కనిపించే ప్రేమ్ మరి లేడనేసరికి, మనసుని ఒక రకమైన దిగులు ఆవరించింది.

మిగిలిన ఆదేశాలు కూడా చదివి నోట్‌బుక్ మూసేసి, చేతులు వెనక్కి కట్టుకు నిలబడ్డాడు హవల్దార్ ఛత్రీ. క్షణం ఆగి అన్నాడు.

“అందుకే చెప్తున్నాను. యే లెట్రిన్ మే బైఠ్‌కే సుట్టా మార్నా, బీడీ పీనా బంద్ కరో సాలోఁ!”


ఉదయం నాలుగింటికి నిద్ర లేవడంతో మొదలయి, రాత్రి పదింటికి కానీ ఆగని పరుగుల మధ్య నెలరోజులు ఎప్పుడు గడిచిపోయాయో తెలియనే లేదు.

“రెడ్డీ, మధ్యాహ్నం తిన్నది ఏ కూర?” అడిగాను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ.

రెడ్డి బుర్ర గోక్కున్నాడు. “మజ్జానమా? అదీ… ఆలూ. ఆహహ కాదు. ఆలూ నిన్న తిన్నాం. ఆఁ! ఇయ్యాల సొరకాయల కూర!” గర్వంగా నవ్వు మొహం పెట్టాడు.

ఉపాధ్యాయ్ వచ్చి, ఎదురుబొదురు మంచాల వరసల మధ్య నడుస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. “ఏయ్, సబ్ సునో. ఆర్ హెచ్ క్యూలో ఫాలిన్. సరిగ్గా ఆరింటికి…” ఎందుకో సంతోషంగా కనిపిస్తున్నాడు.

“క్యోఁ?”

“చెప్పింది చెయ్యడమే. ఫౌజ్‌లో ఎందుకూ అని అడగకూడదు. దస్ మినిట్ మే బాహర్ చాహియే సబ్!”

“లీడర్, పూరే హై?” మా ఆల్ఫా కంపెనీ హెడ్ క్లర్క్, సుబేదార్ సాబ్ అడిగాడు.

“హై సర్.”

“అందరూ ఇలా సింగిల్ లైన్లో నించోండి. మీ ఆర్మీ నెంబర్లు మీకు తెలుసుగా? ఆ నెంబర్ల వారీగా నిలబడాలి. ఊఁ! జల్దీ కరో!”

నిలబడ్దాం. లైన్లో మూడోవాడు రెడ్డి. నా ముందు శక్తి దాస్ మండల్. వెనుక జంబులింగం.

“సునో రే, లీడర్! ‘నామినల్ రోల్’ ప్రకారం ఒక్కొక్కళ్ళనీ లోపలి పంపించు. ఒకడు బయటికి వచ్చాకే తర్వాతివాడు లోపలికి రావాలి. బయటికొచ్చినవాడు ఇందాక నిలబడ్డ చోటే నిలబడాలి. నువ్వు అందరికన్నా చివర్లో రావాలి. మార్చింగ్ చేసుకుంటూ రావాలి. మార్చింగ్‌తోనే వెళ్ళాలి. ఢీలా ఢాలాగా మార్చింగ్ చేశారంటే లోపల కంపనీ కమాండర్ సాబ్ తోలు వలిచేస్తాడు. ఠీక్ హై?” అంటూ ఆఫీస్ గదిలోకి నడిచాడు సుబేదార్ సాబ్.

“వన్-ఫైవ్-థిరీ-సిక్స్-ఫోర్-టూ-ఎఫ్ రిక్రూట్ మహేందర్ యాదవ్!” బిగ్గరగా మొదటి పేరు పిలిచాడు లీడర్. యాదవ్ మార్చింగ్ చేస్తూ లోనికి నడిచాడు. అయిదు నిముషాల తర్వాత బయటికొచ్చాడు.

“వన్-ఫైవ్-థిరీ-సిక్స్-ఫోర్-థిరీ-డి రిక్రూట్ కే పీ రాణా!” ఒక్కొక్కరే లోపలి వెళ్తున్నారు. ఈసారి రెడ్డి. బయటికి వచ్చి నన్ను చూసి ‘పైసలు’ అన్నట్టు సైగ చేశాడు.

నా పేరు పిలిచాడు లీడర్. ఆఫీస్ గదిలో సుబేదార్ సాబ్ ఒక పక్కన నిలబడి ఉన్నాడు. ఆ గదిలో ఉన్న టేబుల్ వెనక కుర్చీలో, ఆ రోజు డ్రిల్ గ్రౌండ్‌లో చూసిన ఆఫీసర్!

“బోలో” అన్నాడు సుబేదార్ సాబ్.

“…”

“నెంబర్, రాంక్, నేమ్ బోలో. మూగవాడివా?” గద్దించాడు సుబేదార్ సాబ్.

ఆఫీసర్ కళ్ళెత్తి చూశాడు.

“వన్-ఫైవ్-త్రీ-సిక్స్-సిక్స్-ఎయిట్-ఎల్ రిక్రూట్ బీ కే రావ్.”

“పూరా బోల్! నెంబర్, రాంక్, నేమ్‍కే బాద్ ‘శ్రీమాన్’ బోల్‌నా హై. బోలో జోర్ సే!”

“వన్-ఫైవ్-త్రీ-సిక్స్-సిక్స్-ఎయిట్-ఎల్‍ రిక్రూట్ బీ కే రావ్ శ్రీమాన్!” బిగ్గరగా చెప్పాను.

“ఊఁ. బస్ బస్. కాన్ మత్ ఖా. సంతకం చెయ్” అంటూ టేబుల్ మీదున్న ఓ ఫార్మ్‌ని కళ్ళతో సూచించాడు మేజర్. నా పేరుకి ఎదురుగా ఉన్న చదరంలో అంటించిన రెవిన్యూ స్టాంప్ మీద సంతకం చేశాను.

“చలో, అవుట్!” వెళ్ళమన్నాడు ఒక అతి చిన్న తల కదలికతో.

చీకటి పడింది. ఆఫీసు వరండాలోనూ, మేము నిలబడ్డ చోటా లైట్లు వెలిగాయి. చివరగా లీడర్ కూడా బయటికొచ్చిన పావుగంట తర్వాత సుబేదార్ సాబ్ బయటికొచ్చాడు. కూడా ఇంకో జేసీవో క్లర్క్.

“స్క్వాడ్, సావ్-ధాన్! బాయేఁ ముడ్!”

ఇప్పుడు ఒకళ్ళ పక్కన మరొకళ్ళంగా అయ్యాం. ఒక్కొక్కళ్ళ దగ్గరికీ వచ్చి, చేతిలో నోట్లు పెట్టసాగాడు సుబేదార్ సాబ్.

“లెక్క పెట్టుకోండి. తొమ్మిది వందలు. ఎవరికైనా ఎక్కువొస్తే, నిజాయితీగా నాకిచ్చెయ్యండి.”

లెక్కపెట్టుకున్నాం. చేతిలో ఇప్పుడున్న నోట్లు కూడా రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో లెక్కగా తీసుకునే నాలుగు పూరీల్లానే తగిలాయి.

“లీడర్, సబ్‍కా పైసా ఠీక్ హై?”

“ఠీక్ హై సర్.”

“యే ఆప్ కా పెహలా తన్‌ఖా హై. జాగ్రత్త చేసుకోండి. డబ్బులు గుమ్ అయితే ఏం చేస్తార్రా? లీడర్?”

లీడర్ నోరు తెరిచే లోపే “మీరు కూడా గుమ్ అయిపోవాలి. నా దగ్గరికి రాకూడదు!” అంటూ హెచ్చరించాడు సుబేదార్ సాబ్.

“ఓయ్ మద్రాసీ! ఏం చేస్తావీ డబ్బుని?” నిగనిగలాడే జుట్టుని కోల్పోయిన దుఃఖాన్ని ఆలస్యంగా మర్చిపోయిన కథిరవన్‌ని అడిగాడు.

పక్క రిక్రూట్ సాయం చెయ్యగా “గర్ బేజూంగా సర్” అంటూ బదులిచ్చాడు కథిరవన్. ఈసారి లీడర్ని అదే ప్రశ్న అడిగాడు సుబేదార్ సాబ్.

“క్యోఁ రే, లీడర్, తుమ్ క్యా కరేగా?”

“సాడీ ఖరీదేంగే సర్.” కూసింత సిగ్గుతో చెప్పాడు ఉపాధ్యాయ్.

“చెల్లెలికా?”

“బీవీ కో సర్.”

“ధత్‍ తెరేకీ! బిహార్ కా నామ్ బద్నాం కియా.”

“…”

“మొదటి జీతంతో చీర కొనాల్సింది అమ్మకిరా, అడ్డగాడిదల్లారా!”