తలుపు

ఆయనతో పెద్దగా పరిచయం లేదు నాకు.

ఇరవయ్యేళ్ళ అంతరం ఉంది మా ఇద్దరి మధ్యా. మా ఆవిడకి దూరపు చుట్టం ఎవరికో ఆయన బీరకాయ పీచు బంధువు. మేమిక్కడ అప్పుడప్పుడూ చేసే క్యాటరింగ్ పని గురించి తెలిసి, మా చుట్టం మా నెంబర్‌ని ఆయనకి ఇచ్చిందట. ఆయన ఫోన్ చేశాడు.

“ఫలానా ఆయనే మాట్లాడుతున్నారండీ?” అంటూ మొదలైంది ఫోన్‌లో మా సంభాషణ.

“నా పేరు ప్రకాశ శర్మ. ఇండియన్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా చేసి రిటైరయ్యాను. ఇంతవరకూ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇదిగో, ఈ మూడునాలుగు నెలలనుంచీ ఒంట్లో బాగుండటల్లేదు.”

“అయ్యో, ఏమైందండి?” మర్యాద కోసం అడిగాను.

“ఏముందండీ, ఇచ్చినవన్నీ తీసేసుకుంటాడాయన. ముందు జుట్టు, తర్వాత చూపు, ఆ తర్వాత ఓపిక, ఇలా. మొన్నొక రోజు మా వాడు చెకప్‌కి తీసుకెళ్ళాడు. బైల్ డక్ట్‌లో ఏదో యాప్సిస్ ఉందని, బహుశా కాన్సర్ కావచ్చనీ డాక్టర్ అనుమానపడ్డాడు. వచ్చే సోమవారం ఇంకో టెస్ట్ ఏదో చేస్తాను, రమ్మన్నాడు. సరే, ఎనభై ఏళ్ళొచ్చాక తప్పేదేముంది లెండి…”

“…” ఏమనాలో తోచలేదు.

“అక్కడంటే, మాకు కావలసినవన్నీ చక్కగా చేసి పెట్టేందుకు మనిషి ఉండేవాడు. ఇక్కడివాళ్ళకి ఆ వంటలు తెలియవు. రాజ్‌మా, లోబియా – అసలీ పప్పుల పేర్లే నేనెప్పుడూ వినలేదు. అవే వండి పెడుతుంది మా వంట మనిషి. అవేమో నాకు అరగవు, పడవు.”

“ఊఁ…”

“అసలు దోసకాయ పప్పు తిని ఎన్నాళ్ళయ్యిందో! సాంబార్ చెయ్యండర్రా అంటే అందులో ఏవేవో కూరలు కోసి వేసేస్తున్నారు. అయ్యా, ఒక్క మాటలో చెప్పాలంటే, కడుపు నిండా తిండికి మొహం వాచిపోయానండీ.”

“ఊఁ…” ఇంకేమీ తోచలేదు.

“మీరు కొంచెం సాయం చేయగలరా? ఒక వారం పాటు ఒక కూర, ఒక రోజువారీ పచ్చడి, ముక్కల పులుసు, పప్పు, చారు పంపించగలరా?”

పంపించగలను. కానీ…

“ఇక్కడ శరవణ భవన్ నుంచి తెప్పించుకుంటే, మా ఇద్దరికీ కలిపి ఫోర్ ట్వెంటీ ఫైవ్ అయ్యేది. ఆ రేటుకి కాస్త అటూ ఇటూగా మీకు వీలైతే చెప్పండి. రేపటినించీ పంపిద్దురు గాని.”

“అంటే అండీ…” కొంచెం తటపటాయించాను. చేసేవాళ్ళకి శ్రమ ఎక్కువ, తీసుకునే వాళ్ళకి ఖరీదెక్కువగా పరిణమించగల వ్యవహారం ఇది.

ఫోన్‌ని చేత్తో మూసినట్టు అలికిడయింది. రెండు క్షణాలాగి “మా అబ్బాయి వస్తున్నట్టున్నాడు. ఇదంతా వింటే కోప్పడతాడు ‘ఇంకా ఏంటి నాన్నా ఈ తాపత్రయం’ అని” చటుక్కున ఫోన్ పెట్టేశాడాయన.

ఆలోచించాను. పాపం, పెద్దాయన ‘తిండికి మొహం వాచింది’ అనడం ఎక్కడో గుచ్చుకుంది. కొన్ని లెక్కలు చకచకా వేసుకుని ఒక అంకెని ఫిక్స్ చేసుకున్నాను – ఈసారి ఆయన ఫోన్ చేస్తే చెప్పడానికి.

ఆయన పది నిముషాల్లో ఫోన్ చేశాడు. చెప్పిన అంకెకి ఒప్పుకున్నాడు కూడానూ. ఆ మర్నాడే ఆయనకి కావలసిన పదార్థాలు చేసి, స్వయంగా నేనే తీసుకువెళ్ళి అందించాను – వేరే ఎవరి చేతనో పంపడం ఎందుకనో నచ్చక.

అప్పుడు చూశాను ఆయన్ని.

ఆయనకి ఎనభై ఏళ్ళంటే నమ్మడం కష్టం. అరవై యేళ్ళ మనిషిలా ఉన్నాడు. చక్కటి ముఖం – అందులో తేజస్సు. వీల్‌చెయిర్లో ఉన్నా, మంచి ఒడ్డూ పొడుగూ ఉన్నట్లు అర్థమవుతోంది. నన్ను చూడగానే కూర్చోబెట్టి ఆప్యాయంగా మాటలు మొదలుపెట్టాడు.

“మా ఆవిడ…” ఎదురుగా సోఫాలో కూర్చున్న ఆవిడని చూపేడు. “షీ ఈజ్ ఫ్రమ్ మదురై. తమిళియనే అయినా తెలుగు కూడా బాగా నేర్చుకుంది. ఈ మధ్యనే కొలోన్ కాన్సర్ వచ్చి తగ్గింది. నేనేదయినా అడిగితే ఓపిక చేసుకుని మరీ చేసిపెడుతోంది. అయినా అక్కడి (హైదరాబాద్) సుఖం వేరు, ఇక్కడ వేరు…” ఆయన ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. కాసేపు కూర్చొని విన్నాను – మర్యాద కోసం.

ఆ సాయంత్రం ఆయన కూతురు ఫోన్ చేసింది. తను పుణేలో ఉంటుందట. “తెలుగులో మాట్లాడేవాళ్ళు దొరికితే చాలంకుల్! మా నాన్నగారి నోటి వెంట మాటలు అలా వచ్చేస్తుంటాయి. మిమ్మల్నేమన్నా విసిగించారా?”

“అబ్బే, అదేం లేదమ్మా. పైగా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినడం నాకూ ఇష్టమే.”

“హమ్మయ్య. అన్నట్లు, థాంక్స్ అంకుల్. చాలా రోజుల తర్వాత నాన్న తృప్తిగా భోంచేశారని అమ్మ చెప్పింది. మీరు పంపినవి బాగా నచ్చాయట.”

“ఓఁ!”

“సరే అంకుల్. ఉంటాను. తర్వాత కావాలంటే నాన్న మళ్ళీ మీకు చెప్తారు. ఓకే? థాంక్స్ ఎ టన్ అంకుల్.” ఫోన్ పెట్టేసింది.


“మిమ్మల్ని చూస్తుంటే మా తమ్ముడు గుర్తొస్తున్నాడు…” అన్నాడాయన ఆ మర్నాడు. ‘కదూ!’ అన్నట్లు పక్కనున్న భార్యకేసి చూశాడు. ఆవిడ ‘మరే’నన్నట్లు తల పంకించింది.

“వాడూ మీలాగే పొడవు. చిన్నప్పుడు ఆ మాటే అని ఆట పట్టిస్తుండేవాడు నన్ను. హైద్రాబాద్‌లో ఉన్నన్నాళ్ళూ నాకిష్టమైనవన్నీ చేయించి తీసుకొస్తుండేవాడు. మా మరదలు కూడా శ్రమ అనుకోకుండా చేసి పెట్టేది…” ఉన్నట్టుండి ఆయన గొంతుకేదో అడ్డం పడ్డట్లయింది. “ఇద్దరూ వెళ్ళిపోయారు – కార్ యాక్సిడెంట్లో. రెండు నెలల క్రితం.”

“అయ్యో…” ఆయన బాధని పంచుకొంటూ అన్నాను.

లోపలి గదిలోనుంచి కొడుకు బయటకొచ్చేడు. ఒక్క క్షణంపాటు మమ్మల్ని చూసి, ఏదో గుర్తొచ్చినట్లు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేడు.


“నాన్నని వచ్చే సోమవారంనాడు మళ్ళీ చెకప్‌కి తీసుకెళ్తారట. అప్పటిదాకా – అంటే ఇంకో నాలుగు రోజులపాటు మీరిలాగే ఫుడ్ పంపండి. ఆ చెకప్ నాలుగైదు రోజులు పట్టొచ్చట.” ఫోన్‌లో చెప్పింది ఆయన కూతురు.

ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయనే ఫోన్ చేశాడు. “మీరు రేపట్నుంచీ అదివరకటిలానే భోజనం పంపించండి.”

“సరేనండీ…” సందేహిస్తూనే అడిగాను. “డాక్టర్‌గారు ఏమన్నారండి?”

“ఏమోనండీ, వాళ్ళు నాతో ఏమీ చెప్పరు పెద్దగా. మా అబ్బాయిని పిలిచి చెప్తారు. అయినా నేనూ పెద్దగా పట్టించుకోను…” అంతకంటే పొడిగించలేదాయన. నేను కూడా.

మర్నాటినుంచీ భోజనం అందించడం మొదలుపెట్టాను. దారి అలవాటయింది, ఆయన మాటలూ అలవాటయాయి. నాలుగో రోజున ఆయన కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. బిల్ ఎంతయిందో కనుక్కుని, ట్రాన్స్‌ఫర్ చేస్తే పర్లేదు కదా అని అడిగి, చేసేశాడు. “మళ్ళీ మండే ఇంకో టెస్ట్ ఉంది డాడీకి. ఫుడ్ కావాలంటే ఫోన్ చేయిస్తాను. ఓకే?” అన్నాడు.


వారం దాటుతున్నా ఫోన్ రాలేదు. ఆ విషయం మమ్మల్ని బాదర్ చెయ్యడం ఆగిపోతుండగా, మా చుట్టం అందించింది ఆయన మరణవార్తని.

మనసుని దిగులు ఆవరించింది. డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా ఆయన కూర్చోబెట్టి మరీ ఆపేక్షగా చెప్పే కబుర్లు గుర్తొచ్చాయి. పెద్దగా పరిచయం లేకపోయినా, ఏమిటో ఒక పెద్దదిక్కులా అనిపించేవాడాయన. మా వంటకాలని తృప్తిగా తినేవాడట. పాపం. భోజనం పెట్టి డబ్బు తీసుకోవడంతో ముగియని మరేదో ఆత్మీయానుబంధం ఏర్పడింది ఆయనతో, ఆ కొద్ది రోజుల్లోనే. అటువంటి మనిషి మరి లేడనేసరికి…


వాళ్ళ ఇంటి బెల్ కొట్టాను. ఇప్పుడు చేతులు ఖాళీ.

కొడుకే తలుపు తీశాడు. లోపలెవరెవరో ఉన్న అలికిడి. నన్ను చూసి కొద్దిపాటి చిరాకు దాచుకున్నట్టు తోచింది. “బాలెన్స్ ఏమన్నా క్లియర్ చెయ్యాలా?” అంటూ ఫోన్ తియ్యబోయాడు. “అబ్బే, అదేం లేదు. విషయం తెలిసి, పలకరిద్దామని వచ్చాను.”

“ఓహ్!” అతను లోపలికి రమ్మనలేదు. క్షణం నిశ్శబ్దం.

“యూ నో, డాడీకి కాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని నెల క్రితమే చెప్పారు డాక్టర్. అంతకుముందంతా ఆయన డయట్ గురించి మేం చాలా కేర్‌ఫుల్‌గా ఉండేవాళ్ళం. బయటి తిండిని అస్సలు ఎలో చేసేవాళ్ళం కాదు. ఇక చివరలో…” మొహాన్ని వీలైనంత బ్లాంక్‌గా ఉంచేడు. “…ఆయనకి ఇష్టమయినవే తిననిద్దామని, పర్సనల్‌గా నాకు ఇష్టం లేకపోయినా మీ డెలివరీలకి అబ్జెక్ట్ చెయ్యలేదు… సో…”

“…” ఎబ్బెట్టుగా చోటు చేసుకున్న నిశ్శబ్దం.

“ఎనీవే, థాంక్స్ ఫర్ కమింగ్. బై!” తలుపు మూసుకుంది – కనీసపు చిరునవ్వు జాడయినా లేకుండా.


“నేనంకుల్… అదే, పొద్దున్న మీరొచ్చిన సంగతి ఇప్పుడే తెలిసింది నాకు. కనీసం లోపలికి కూడా రమ్మనలేదట కదా అన్నయ్య. ఫెల్ట్ వెరీ బాడ్ అబౌటిట్. వాడింకా నాన్నగారు పోయిన ట్రామాలోనే ఉన్నాడు. అఫ్‌కోర్స్… అందరమూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే అనుకోండి. మేమూ అదే ఇదిలో ఉన్నాం…” ఫోన్లోనే అయినా కూతురి గొంతులో నిజాయితీ స్పష్టంగా తెలుస్తోంది.

“పర్వాలేదమ్మా. ఐ కెన్ అండర్‌స్టాండ్…”

“థాంక్స్ అంకుల్. సారీ వన్స్ ఎగైన్… నో హార్డ్ ఫీలింగ్స్ ప్లీజ్.”

ఇప్పుడా తలుపు మూసుకుంది. మృదువుగా.