“హలో…”
“హెలో!”
“గుడ్‌మార్నింగ్ మేడమ్. సుబేదార్ రావ్ మాట్లాడుతున్నాను.”
“తెల్ మీ రావ్ సాబ్…” అన్నారు మంగ్‌లెంబి దేవి, కల్నల్ జిబోన్ సింగ్ భార్య. మణిపురి యాస స్పష్టంగా తెలుస్తోంది ఈవిడ పలుకులో కూడా.
“కల్నల్ సాబ్‌కి ఇప్పుడెలా ఉంది?”
క్షణం నిశ్శబ్దం.
“అయాం సారీ రావ్ సాబ్. కల్నల్ జిబోన్ సింగ్ ఈజ్ నో మోర్. నిన్న రాత్రి రెండింటికి చనిపోయారు.”
“అయ్యో! సో సారీ టు నో మేడమ్. వెరీ సారీ…”
“ఇత్స్ ఒకే సాబ్. నిన్న సాయంత్రం మీరొచ్చి వెళ్ళిన కాసేపటికే లైఫ్ సపోర్త్ మీదకి చేర్చారు మీ ఫ్రెంద్‌ని… రాత్రి…”
“…” మాట పెగలడం లేదు నాకు.
“క్యా కరేఁ? గాద్స్ విల్ అలా వుంది.” నిబ్బరం పోగు చేసుకుంటూ అన్నారామె.
ఇంకో నాలుగు రోజుల తర్వాత ఈ మిలిటరీ ట్రైనింగ్ నుంచి ‘పాసవుట్’ అవుతాం. ఆ తర్వాత నెలరోజుల సెలవు. తిరిగి వచ్చి మరో ట్రైనింగ్ రెజిమెంట్లో రిపోర్ట్ చెయ్యాలి.
“స్కాట్! థమ్!” బిగ్గరగా వినిపించడంతో, రోల్‌కాల్ విజిల్ కోసం ఎదురుచూస్తూ, బారక్‌లో నులకమంచాల మీద బాతాఖానీ వేసుకుంటున్నవాళ్ళం బిలబిలా బయటికొచ్చాం.
కొత్త స్క్వాడ్ వచ్చింది. ఆరేడు వరసలుగా నిలబడ్డారు ఆ కొత్త కుర్రాళ్ళు. ఒకప్పుడు మేము నిలబడినట్లే…
సెలవలో ఉన్న ఛజ్జూరామ్ స్థానంలో బారక్ కమాండర్ డ్యూటీ చేస్తున్న హవల్దార్ ఛత్రీ, అరిచినట్టే అన్నాడు. “ఆగయే? ఆవ్ ఆవ్! మీ కోసమే చూస్తున్నా!
“యేసాలు సూడు. ఎదురు సూత్తన్నాడంట. శెత్త నాకొడుకు!” పైకే అన్నాడు రెడ్డి. మొన్నొకరోజు డ్రిల్ గ్రౌండ్‌లో, చేతిలోంచి రైఫిల్ జారిపోయినందుకు చెంప ఛెళ్ళుమనిపించినప్పట్నుంచి, ఛత్రీ కనిపించినప్పుడల్లా తిట్టుకుంటూనే ఉన్నాడు.
“లీడర్ కౌన్ హై? సామ్‌నే ఖడే హో!”
మధ్యవరస లోంచి బయటికొచ్చాడో కుర్రాడు. తెల్లగా మెరుస్తున్న చర్మం. సగటుకన్నా తక్కువ పొడవు, గూర్ఖా పోలికలు. ఆ బృందంలో అందరికన్నా అతనే బాగా పొట్టి. నవ్వు మొహం.
“క్యా నామ్ హై రే తేరా?
“లాయ్‌రెలెక్‌పోమ్ జిబోన్ సింగ్ సర్.”
ఆ పేరు పలకడానికి నోరు తిరక్క తంటాలు పడ్డాడు ఛత్రీ. “లారె… లారెలప్పా సింగ్? కహాఁ కా హై రే తూ?”
“డిస్టిక్ థౌబాల్, మనిపూర్ సర్.”
హవల్దార్ ఛత్రీ ఆదేశాలని శ్రద్ధగా విన్నాడా కుర్రాడు. తన స్క్వాడ్‌ని మాకు ఎదురు బారక్ లోకి తీసుకెళ్ళాడు.
ఆరేళ్ళ తర్వాత…
సుబేదార్ కనకప్పన్ క్లాస్ లోకి అడుగుపెట్టడం ఆలస్యం, స్క్వాడ్ మొత్తం నిశ్శబ్దమైంది. “కయిసే హో, మేరే బహాదుర్ జవానోఁ?” నవ్వు లేకుండా పరామర్శించాడు.
“ఠీక్ హై సర్!” అన్నాం అందరం.
“శాబాష్. కానీ, మీ స్క్వాడ్ ఇంత తొందరగా బద్నామ్ అయిపోతారని, మీ స్క్వాడ్‌కి ఇన్‌ఛార్జి జేసీవోని కాబట్టి నన్ను కూడా బద్నామ్ చేస్తారనీ అనుకోలేదు!”
గతుక్కుమన్నాం. ఏమైంది? మొన్న అవుట్ పాస్‌ల మీద బయటికి వెళ్ళినప్పుడు, మాలో ఎవరన్నా ఏదన్నా తప్పు చేశారా? అలాంటిదేం లేదే? స్క్వాడ్ జేసీవో దృష్టిలో మా తీరు సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బందులొస్తాయి. అప్‌గ్రేడింగ్ కోర్స్ చేస్తున్న మమ్మల్ని అసలే చెప్పు కింద తేళ్ళలా తొక్కి ఉంచుతున్నారు. ఇప్పుడీ ఉరుములేని పిడుగేమిటో?
“మీకు వస్తున్న మార్కులని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. మాథ్స్‌లో అంటే పోనీలే అనుకోవచ్చు. చిన్న చిన్న సర్క్యూట్ బొమ్మలు గీయడానిక్కూడా మీ వేళ్ళు పనికిరావడం లేదా? ఇంకెందుకా వేళ్ళు? లెట్రిన్‌లో తప్ప ఇంకెందుకూ వాడరా వాటిని??” గద్దిస్తున్నట్లు అడిగాడు.
“…”
“డేయ్! వో లాస్ట్ బెంచ్ వాలా. నీ నోట్స్ తీసుకురా!”
ఆ కుర్రాడు తెచ్చిన లాంగ్‌నోట్‌బుక్‌లో పేజీలని రెండు క్షణాలు తిప్పి చూసి, దాన్ని అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకున్నాడు సుబేదార్ కనకప్పన్.
“చూడండి. ఒక్క సర్క్యూట్ డయాగ్రమ్ కూడా లేదు. ట్రైనింగ్ జేసీవో సాబ్ చెప్పింది నిజమే. మీది చాలా చెత్త స్క్వాడ్.” కుర్రాడివైపు తిరిగేడు. “ఏరా, డయాగ్రమ్‌లు ఎందుకెయ్యలేదు ఇందులో?”
“సర్… చోటు లేదు సర్…”
“చోటు లేదా? సాలే. నేను చూపిస్తా చోటు. వెళ్ళి పక్కేసుకుని పడుకుందువుగాని!”
“…”
“జిబోన్ సింగ్ ఎవరు?”
మొదటి బెంచీలో కూర్చొన్న జిబోన్ స్టిఫ్‌గా లేచి నిలబడ్డాడు. “షర్.”
“నీ నోట్స్ ఇటివ్వు.”
ఈ నోట్‌బుక్‌ని కూడా పేజీలు తిప్పి చూసి, పైకెత్తి పట్టుకున్నాడు కనకప్పన్. “చూడండి! ఏం కనిపిస్తోందిక్కడ?”
చూశాం. ప్రతి లెసన్ లోనూ, ఆ లెసన్‌కి సంబంధించిన డయాగ్రమ్‌ని విడిగా గీసిన కాగితం, మార్జిన్‌లో నీటుగా అంటించి ఉంది. చక్కటి హెడ్డింగ్‌లు. పొందికైన చేతిరాత. చూసినకొద్దీ చూడాలనిపిస్తోందా నోట్‌బుక్.
“రెండ్రోజులు టైమిస్తున్నాను. మీ అందరి నోట్‌బుక్సూ ఇలా కావాలి నాకు. నేనే స్వయంగా చెక్ చేస్తాను.”
చచ్చాం. రెండువందల పేజీల నోట్‌బుక్‌ని రెండ్రోజుల్లో తయారు చెయ్యాలంటే…
“రైల్ టికట్ సర్కార్‌నే ఫ్రీ మే దేదియా, గోవాలో తిరిగేసి టైమ్‌పాస్ చేసేసి పోదాంలే, కోర్స్ అయిపోతుంది కదా అనుకోకండి.” కరుకుగా మోగింది కనకప్పన్ గొంతు. “ఇంకోసారి మీ స్క్వాడ్ గురించి ట్రైనింగ్ జేసీవో నాకు కంప్లైంట్ చేశాడో…” అందర్నీ కలయజూశాడు ఒకసారి.
పిడికిట్లో ఏదో నులుముతున్నట్లు సైగ చేస్తూ “నిచోడ్ దూంగా! ఇంకెందుకూ పనికి రాకుండా చేసేస్తాను జాగ్రత్త!” బయటికి నడిచాడు.
పీకల్దాకా మండింది అందరికీ – జిబోన్‌గాడి మీద. వాడు వెనక్కి తిరిగి మా అందరినీ నవ్వుమొహంతో చూస్తున్నందుకు కాదు.
రాత్రీ పగలూ కష్టపడి నోట్ బుక్స్‌ని తయారుచేశాం అందరం.
వాటిని చూడకుండానే, ఎవరినీ నులిమేయకుండానే కనకప్పన్ రెండు నెలల ‘ఆన్యువల్ లీవ్’ మీద వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వచ్చేసరికి మా కోర్స్ ముగిసి, అందరం తిరిగి మా మా యూనిట్లకి చేరుకున్నాం. ఏడెనిమిది నెలలు గడిచాయి.
డిప్లొమా కోర్స్ ఇవాళ మొదలైంది. కొన్ని కొత్త మొహాలు, కొన్ని పాత మొహాలు. “హేయ్ రావ్! నువ్వూ ఉన్నావా ఈ కోర్స్‌లో!? అరే, లాన్స్ నాయక్ కూడా అయావే! ముబారక్ హో!” సంతోషంగా పలకరించాడు జిబోన్, అదే నవ్వు మొహంతో.
“అరె, జిబోన్! థ్యాంక్యూ. నువ్వు కూడా ఈ బాచేనా! భలే! చాలా సంతోషం. ఇంట్లో అందరూ బాగున్నారా!” “బాగున్నాం. బాగున్నాం. మీరు?” కబుర్లు మొదలయాయి.
కనకప్పన్‌ని గుర్తు చేసుకుని గౌరవంగా తిట్టుకుని మరీ నవ్వుకున్నాం. తనకి ఈ మధ్యనే పెళ్ళయిందట. ఫోటో చూపించాడు. “మంగ్‌లెంబి. లవ్ మేరేజ్!” చెప్పాడు. ఫోటోలో యువతి, మణిపురి నృత్య భంగిమలో మరింత అందంగా కనిపిస్తోంది.
“సో నైస్ జిబోన్! పార్టీ కబ్ దోగే?”
“మెస్ తెరవనీ!” తడుముకోకుండా చెప్పాడు. నవ్వొచ్చింది ఆ చెప్పిన తీరుకి.
“సరేగానీ జిబోన్, మాథ్స్‌లో కొంచెం హెల్ప్ చెయ్యవా?” అడిగాను. మాథ్స్‌లో ఆ సబ్జెక్ట్‌లో అతడికున్న ప్రావీణ్యం మా అందరికీ గోవాలోనే తెలిసింది.
“ఫీజ్ కడతావా మరి?”
“ఎంత?”
“ఇష్యూ ఉన్నప్పుడల్లా ఒక పెగ్!” నవ్వుతున్నాడు.
“తప్పకుండా!”
“అంతేకాదు రావ్, నాలిక మీద బొచ్చు మొలిచింది” అన్నాడు జిబోన్.
గట్టిగా నవ్వాను. “ఎందుకని?”
“కాంత్రాక్తర్ మర్ గయా… మా యూనిత్‌కి మతన్ సప్లై ఆగి తెన్ దేస్.” పది రోజులైందట వాళ్ళ యూనిట్లో నాన్-వెజిటేరియన్ ఫుడ్ రావడం ఆగిపోయి.
“ఓహో! అంతేనా!? దాంతోబాటు ‘ఇంకా’ ఏమైనా కావాలా?”
మళ్ళీ నవ్వుకున్నాం.
కొన్నేళ్ళ తర్వాత…
“యే లడాయీ కమ్ సే కమ్ ఛే మహీనే ఔర్ చలేగీ. చూస్తుండండి రావ్ సాబ్” అంటూ నడుస్తున్నాడు మేజర్ యు. ఎన్. తివారీ.
మా యూనిట్ అంతా ఆపరేషన్ పరాక్రమ్‌లో పాల్గొంటూ ఫీల్డ్‌లో ఉంది. రెజిమెంటల్ కమీషన్డ్ ఆఫీసర్ తివారీ ఇక్కడ మిగిలిన రియర్ యూనిట్‌కి ఇన్‌ఛార్జ్. ఆపరేషన్ పరాక్రమ్ మొదలై ఆరునెలలు దాటాక, ఏదో పని మీద నన్ను రియర్‌కి పంపారు.
మాట్లాడుకుంటూ యూనిట్ ప్రవేశ ద్వారం దగ్గరకొచ్చాం.
“రోకో రిక్షా. సైద్ మే ఖదా కరో.” పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి అందులోంచి దిగి, గేట్ బయటే ఆగి, స్టిఫ్‌గా ఎటెన్షన్‌లోకి మారి నోరు తెరిచాడు.
“నాయబ్ సుబేదార్ లాయ్‌రెలెక్‌పోమ్ జిబోన్ సింగ్. రిపోర్టింగ్ సర్ర్!” అన్నాడు ర్-ని నాలుక మీద దొర్లిస్తూ.
“అరె ఆజావ్ సాబ్, ఆజావ్. మీ పోస్టింగ్ ఆర్డర్ నిన్ననే చూశాను. ఠీక్ ఠాక్ పహుంచ్‌గయే నా ఆప్? ఆఁ. రావ్ సాబ్, సాబ్‌ని తీసుకెళ్ళండి” అంటూ జిబోన్‌ని నాకు అప్పగించి, వెనక్కి తిరిగాడు మేజర్ తివారీ.
ఒక్క క్షణం ఒకర్నొకరు చూసుకుని, పెద్ద నవ్వులతో కౌగలించుకున్నాం ఇద్దరం.
“జిబోన్, డిప్లమో తర్వాత మళ్ళీ ఇదేగదా మనం కలవడం?” సామాన్లు చెరి సగం మోస్తూ జేసీవో లైన్స్ వైపు నడుస్తున్నాం.
“హా యార్! టుమ్ బీ టో మోటా హో గయా!” అన్నాడు జిబోన్.
“మేడమ్, బచ్చే ఎలా ఉన్నారు?”
“అంతా బాగున్నారు. ఇక్కడికి తేవాలనుకున్నాను. కానీ కంబక్ట్…”
“కంబక్ట్ కాదు, కంబఖ్త్!” సరి చేశాను.
“అదేలే, కంబక్ట్ పరాక్రమ్‌నే, ప్లాన్ బడల్ డియా.”
“ఈ మేజర్ టివారీ సాబ్, నేను మూడేళ్ళ క్రితం పనిచేసిన యూనిత్‌లో సుబేదార్. రెజిమెంతల్ కమీషన్ అక్కడే వచ్చింది ఆయనకి!” చెప్పాడు జిబోన్.
“అలాగా! అందుకే తేలిగ్గా గుర్తుపట్టాడు నిన్ను. అయినా నిన్ను ఒకసారి చూసినవాడు ఎవడైనా ఎలా మర్చిపోతాడు?” నవ్వుకున్నాం!
ఆ మర్నాడే జిబోన్ మళ్ళీ ప్రయాణమయ్యాడు. మేజర్ తివారీ పుణ్యమా అని, టెక్నికల్‌గా నాయబ్ సుబేదార్ జిబోన్ సింగ్‌కున్న మంచి పేరు వేగంగా ప్రయాణించినట్లుంది. వెంటనే ఫీల్డ్‌కి రమ్మని ఆదేశం అందింది అతనికి.
మరో నాలుగు నెలలకి ఆపరేషన్ పరాక్రమ్ ముగిసి, యూనిట్ అంతా వెనక్కి తిరిగివచ్చింది. ఫీల్డ్‌లో ఉండగానే జిబోన్, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్‌కి అప్లయ్ చేశాడని, సెలెక్ట్ అయాడని, ప్రస్తుతం ‘జంటిల్మన్ కేడెట్’గా ఆఫీసర్ ట్రైనింగ్ చేస్తున్నాడనీ తెలిసింది! మొదటి ప్రయత్నంలోనే సఫలమై, ఆర్మీలో క్లాస్-వన్ గెజిటెడ్ ఆఫీసర్ అయాడు జిబోన్. కెరియర్ పరంగా అతనికి – ఆమాటకొస్తే ఎవరికైనా – అదో పెద్ద ముందడుగు. నాలుగేసిసార్లు ప్రయత్నించినా సెలెక్ట్ కాని వాళ్ళని, సెలెక్ట్ అవుతామన్న నమ్మకంతో బోర విరుచుకుని తిరిగి, కాకపోయేసరికి తోక ముడిచి, బోర్డ్‌ని తిట్టుకునే వాళ్ళని కూడా చూశాను.
ట్రైనింగ్ పూర్తయి, యూనిట్‌కి వచ్చాడు జిబోన్. ఇప్పుడు తన భుజాల మీద లెఫ్టినెంట్ రాంక్ – రెండు స్టార్‌లు తళతళ మెరుస్తున్నాయి. మొహంలో అదే ఆప్యాయత, అదే నవ్వు. “రావ్, టుమ్ భీ కమీషన్ కేలియే త్రై కరో!” ఎంకరేజ్ చేశాడు.
“తప్పకుండా.”
వారం తర్వాత లెఫ్టినెంట్ జిబోన్ సింగ్ మరో యూనిట్‌కి పోస్టింగ్ వెళ్ళిపోయాడు.
మరో రెండేళ్ళకి.
“హే రావ్! కైసే హో మాన్!” పరిచయమైన గొంతు విని తిరిగి చూశాను. అతని నవ్వు ఆప్యాయతతో అదివరకటి లానే వెడల్పవుతోంది. అదే పొట్టి విగ్రహం. “జిబోన్!” అంటూ ఆప్యాయంగా కౌగలించుకున్నాను. అతని భుజంమీది మూడు స్టార్స్ కింద ఎరుపు-పసుపు రంగుల రిబ్బన్ లేదు. ఆఫీసర్ రాంక్.
“నువ్వేంటిక్కడ?” అడిగాను, కెప్టెన్ జిబోన్‌ని.
“తెంపొరరీ ద్యూతీ యార్. కల్ శలే జావుంగా. అవునూ, ట్యాగరాజ్ కూడా ఇక్కడే ఉన్నాడని విన్నాను?”
“అవును. ఫోన్ చేస్తానుండు. కలుద్దాం. అన్నట్లు, మన సత్తిగాడు కూడా ఇక్కడే ఉన్నాడు. వాడు కూడా సుబేదార్ అయాడు.”
“యూ మీన్ సట్యన్? వాతె సర్ప్రైజ్! ఫోన్ చెయ్. సాయంత్రం కలుద్దాం. నా నెంబర్ నోత్ చేసుకో.”
ఆ సాయంత్రం అందరం కలుసుకున్నాం.
“అరేయ్, ఎన్నేళ్ళయిందిరా మనం కలిసి?”
“పదేళ్ళు దాటింది…”
“ఒక స్క్వాడ్ వాళ్ళం, నలుగుర్లో ఇద్దరు ఆఫీసర్లు, ఇద్దరు జేశీవోలు! క్వయిత్ గుద్!” మెచ్చుకోలుగా అన్నాడు జిబోన్.
“మేమూ ట్రై చేశాంరా. అదృష్టం బాగుండి మీరిద్దరూ ఆఫీసర్లయారు. మేం జేసీవోలుగానే మిగిలిపోయాం.” సత్యన్ మూడో పెగ్గు మాట్లాడింది.
“అలా కాదు సట్టీ, ఆఫీసర్, జేశీవో… ఇన్ సే క్యా ఫరక్ పడ్తా హై? మనమందరం ఫ్రెండ్స్! మన బాంద్ అది… దతీజ్ గ్రేత్! ట్యాగా, నేనూ ఆఫీసర్లమైనా, మీరిద్దరూ జేశీవోలైనా, మనం ఇన్నేళ్ళ తర్వాత ఇలా కలుసుకుంటున్నామంటే ఏంటి? వుయ్ ఆల్ ఆర్ మోర్ దాన్ ఫ్రెంద్స్. కదా!”
“అవును. నో డౌట్!” అన్నాను. “అంతకన్నా ఇంకేం కావాల్రా?”
“వీలైనప్పుడల్లా ఇలా కలుస్తూనే ఉందాం! కోర్ రీ-యూనియన్ ఎప్పుడైతే ఏంటి? మన రీ-యూనియన్ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడే చేసుకుందాం!”
“వెల్ సెడ్!”
“రావ్ ఒక ఫోటో తీస్తావ్?!”
ఫ్లాష్ వెలిగింది.
అప్పుడు తెలియలేదు, జిబోన్‌తో మా ముగ్గురికీ ఉన్న అనుబంధానికి అదే చివరి జ్ఞాపకంగా మిగులుతుందని.