విజయం

“నీకో విజయాన్నివ్వడానికొచ్చాను బాబాయ్!”

ఐ.సి.యు.లో వెంటిలేటర్ సాయంతో సగం తెలివితో, సగం మగతగా చివరి నిచ్చెన మెట్లెక్కబోతున్న ఆయన అతనికేసి చూశాడు గాజుకళ్ళతో… ఆ మేనత్త మనవడి మాటలకి అంతగా చలించలేదు. బహుశా, ఆయన చలించినట్లు అతనికి తెలియలేదు.

“నాకు తెలుసు బాబాయ్. నేను చూశాను.”

“…”

“ఆ రోజు, నువ్వు మా ఇంటికొచ్చిన రోజు. నాకింకా గుర్తుంది బాబాయ్.”

ఆయన కొద్దిగా కదిలాడు. ‘ఎప్పుడు?’ అడుగుదామనుకున్నాడు కానీ అది ఆక్సిజన్ పైప్‌లో కలిసిపోయింది.

“ఆ రోజు నువ్వు మా యింటికొచ్చావ్. ఎప్పుడూ వచ్చే బాబాయిలానే. వెళ్ళేటప్పుడు నవ్వుతూ పదిరూపాయలిచ్చి ఏమైనా కొనుక్కోమన్నావు కూడా.”

“…”

“నేను చూశాను బాబాయ్.”

“ఏం చూశావ్‌రా?” ప్రశ్న ఆయన మెదడులో మగతని తరిమికొట్టి, ప్రతిధ్వనించింది నిశ్శబ్దంగా.

“నా గదిలోంచే చూశాను. నువ్వు పెనగులాడుతున్నావు… అమ్మతో…”

“…”

అతను తదేకంగా, ఆసక్తిగా చూస్తున్నాడాయన కళ్ళలోకి. ఏమని సమాధానం ఈయగలడీయన?

“అమ్మని క్షమించాను బాబాయ్. ఎప్పుడో తెలుసా? ఆపరేషన్ పరాక్రమ్‌లో, ఎడారి మధ్యన, మండుతూ దిగిపోతున్న సూర్యుడితోబాటు కూర్చున్నప్పుడు…”

“…”

“నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు బాబాయ్. అది పెనగులాట కాదూ అని. అంతేగా. అప్పుడు పద్దెనిమిదేళ్ళ కుర్రాణ్ని. ఆమాత్రం అర్థంచేసుకోలేనా బాబాయ్?” అన్నాడతను సౌమ్యంగా.

ఆయన ముఖంలో ఇప్పుడు బాధ మరింత తీవ్రమైంది. ఏదో చెప్పాలనుకుంటున్నట్లు, ఆక్సిజన్ మాస్క్‌లో పెదవులు వణుకుతున్నాయి. శ్వాస వేగం పెరిగినట్లు పక్కనున్న మానిటర్ నెత్తీ నోరూ కొట్టుకుంటోంది.

“అమ్మనిచ్చి పెళ్ళి చెయ్యమని నువ్వు తాతయ్యనడిగావ్. నీకంటే రెండేళ్ళు పెద్దదని వాళ్ళు వద్దన్నారు. మీ ఇద్దరికీ వేరే చోట్ల పెళ్ళయినా, నువ్వు అమ్మని వేధిస్తోనే ఉన్నావ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా. పైగా పెళ్ళయిన రెండేళ్ళకే అమ్మ తల చెడి పుట్టింటికి తిరిగొచ్చిందాయె. నీ ప్రయత్నాలు ఫలించకుండా ఎలా ఉంటాయి?!”

ఆయన తల అడ్డంగా తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అతనికి తెలుస్తోంది.

“కంగారుపడకు బాబాయ్. ఇప్పుడు తాతయ్య లేడుగా. అమ్మ కూడా లేదు. మీ రహస్యం నేనూ బయటపెట్టనులే.”

“…”

“మనుషుల బలహీనతలు తెలుసుకున్నాను బాబాయ్. తెలియడానికి నాకు చాలా యేళ్ళు పట్టింది. ఇప్పుడు నాకు నీమీద కోపమేమీ లేదు.”

ఆయన తల అటూ ఇటూ కదిలింది. కొంచెం. ఏదో మాట్లాడదామని తపిస్తున్నట్లు అర్థమౌతోంది కానీ పెదవులూ, కంఠమూ సహకరించలేదు.

“అహహ. వొద్దు. నేనిదంతా నీకీ డెత్ బెడ్‌ మీద వినిపిస్తున్నది నీ క్షమాపణకోసం కాదు. నాకు తెలుసూ అని చెప్తున్నానంతే. అప్పుడు నువ్వు పెట్టిన మంట వేడి, ఎవరికీ తగల్లేదనుకుంటూనే ఇన్నేళ్ళూ బతికి ఇప్పుడు కళ్ళుమూద్దామనుకుంటున్నావు కదూ?”

“…”

“ఇన్నేళ్ళూ ఎందుకూరుకున్నానంటావా? చెప్తా. చెప్పడానికే వచ్చానసలు. చచ్చిపో బాబాయ్. హాయిగా చచ్చిపో. నేనూ నిన్ను క్షమించాను. అంతే. అది చెప్దామనే అంత దూరంనుంచి వచ్చాను. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. నాకు తెలిసిన నీ రహస్యం–నీకు చెప్పాను.”

ఆయన కళ్ళు కొద్దిగా పెద్దవౌతున్నాయిప్పుడు.

“తెలిసినా ఇన్నేళ్ళూ ఎవరికీ చెప్పకపోవటం, ఇప్పుడు నేను నీకిస్తున్న కొత్త విజయమే కదా బాబాయ్!”

“…”

“జాగ్రత్త బాబాయ్. ఉంటాను.”

అతను ఐ.సి.యు. లోంచి బయటికి నడిచాడు.

ఆయన కళ్ళింకా అలా పెద్దవిగానే ఉన్నాయి. ఆనాటి దృశ్యం ఆ కళ్ళలో మెదిలింది–తగినంత స్పష్టంగా.

ఆరోజు డాబామీద ఎదురుబొదురుగా పడుకున్నారు తనూ, జానకీ. ఏవేవో కబుర్లు చెప్పుకుని పన్నెండు దాటుతుండగా నిద్రలోకి జారుకుంటున్నారు.

డాబా మీదికి వాలిన ములగచెట్టు కొమ్మల్లో పెట్టిన పిచ్చుకగూడు మీదికి పాకిన పాము, గబుక్కున జారి జానకి పక్కన పడింది. పడ్డ వెంటనే జానకి నడుము మీదికి తిరిగింది. కాటు వెయ్యబోయింది. ఒక్క ఉదుటున తను చెయ్యి విదిలించి దాన్ని దూరంగా తోసెయ్యడం… ఆ విదిలింపు జోరుకి జానకి కిందా, తను మీదా అవడం…

ఎక్కడో బలంగా తలుపు మూసుకున్న చప్పుడు విన్నట్లే గుర్తు…

బారెడు దూరంలో పడిన పాము మళ్ళీ కనపడలేదు.

కాటు పడింది!