సోల్జర్ చెప్పిన కథలు: కాదేదీ!

ఏడాదయింది అప్పుడే!

“ఆవ్ సర్, ఆయియే ఆయియే. సభీ ఆగయే?” అడిగాడు కుక్, మా నలుగురినీ ఉద్దేశించి.

ఆశ్చర్యపోయాం. మమ్మల్ని ‘సర్’ అంటూ గౌరవంగా పిలిచేదెవరు? వెటకారమా అన్న డౌట్ కూడా వచ్చింది. ఓ! ఇంకొక్క నెల గడిస్తే ఇక్కడి ట్రైనింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం సీనియర్ స్క్వాడ్ మాదే. అందుకేనేమో!

వంటగదిలో వెలుగుతున్న గుడ్డి బల్బ్ వెలుతురు కణకణా మండుతున్న పెద్ద పొయ్యి వెలుగు ముందు మొహమాటపడుతోంది.

“సబ్ హై” అన్నాడు మణి. మాలో అతనే సీనియర్. హిందీలో మాట్లాట్టం బానే అలవాటు చేసుకున్నాడు.

“శాబాష్!” ఉబ్బిన పొట్ట మీది ఏప్రాన్‌ని సరిచేసుకున్నాడు కుక్. “దో జనే ఆటే పే లగ్ జావ్, ఇద్దరు కూరలు తరగండి” అన్నాడు ఆ వంటింటి సామ్రాజ్యం మీద తనకున్న అధికారాన్ని ఎనౌన్స్ చేస్తున్నట్లు, కూరగాయల క్రేట్స్ కేసి చూపిస్తూ.

నేనూ రెడ్డీ కూరలు తరగడానికి, విశాలమైన టేబుల్ మీదకి చేరాం. ముందు పది కిలోల బెండకాయలు. తర్వాత పది కిలోల బంగాళాదుంపలు. ఉల్లిపాయలు, కొద్దిగా మిరపకాయలు అదనంగా.

“సర్, యే, యే చాకూ హైనా, యే కాట్‌తా నై” ఫిర్యాదు చేశాడు రెడ్డి కుక్‌తో.

“చాకూ కభీ నహీఁ కాటేగా ఉస్తాద్! కోసేది ఎప్పుడూ మనిషే!” తన జోకుకి తనే పెద్దగా నవ్వాడు కుక్. పక్కన సొరుగులోంచి ఇంకో చాకు తీసి రెడ్డికి ఇస్తూ “మూడు కావస్తోంది. ఆరింటికల్లా బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోవాలి. ఉస్తాద్ లోగ్, జల్దీ జల్దీ హాథ్ పైర్ చలావ్!” హుకుం జారీ చేశాడు. “పెహ్‌లే భిండీ కాటో!” అదే స్వరంతో అటు తిరిగి అన్నాడు పిండిలో నీళ్ళు కలుపుతున్న ఇద్దరితో “ఇవ్వాళ పన్నెండు వందల పూరీలు చెయ్యాలి. జల్దీ కరో సబ్ లోగ్!”

ఈసారి కూడా జంబులింగం పిండి కలిపే పనిలోనే మునిగిపోయాడు. మనిషి పొట్టిగా ఉన్నా, ఆర్మీలోకి రాకముందు చేసిన బాడీ బిల్డింగ్ వల్ల చక్కటి షేప్‌లోకి మారిన కండల సాయంతో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్‌ని ఆడుతూ పాడుతూ పూర్తిచేశాడు. పెద్ద ముద్దగా మారిన పిండిని పంచింగ్ బాగ్ మీద కరాటే స్ట్రోక్స్ ఇస్తున్నట్లు నటిస్తూ కలుపుతున్నాడు – చూస్తున్న మా అందరికీ నవ్వు తెప్పిస్తూ. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్ని పక్కకి పెట్టి నవ్వక తప్పలేదు కుక్‌కి.

కూరలు కోయడం అయింది. నేనూ రెడ్డీ పొడవాటి బల్ల ముందుకి చేరి, మిగిలినవాళ్ళతోబాటు పిండిని పూరీలుగా వత్తి కుక్‌కి అందించాం. ఒడుపుగా వాటిని కాగుతున్న నూనెలోకి వేస్తూ, వేగినవి బయటికి తీస్తున్నాడు కుక్. రెండున్నర గంటల్లోనే పనంతా పూర్తయింది.

“ఖాలో ఉస్తాద్. ఎన్ని కావాలంటే అన్ని తినండి. మీరంతా చాలా చక్కగా పని చేశారు. శాబాష్!” ఆప్యాయంగా జంబులింగం భుజం తడుతూ చెప్పాడు కుక్. ఆ బ్రేక్‌ఫాస్ట్ కన్నా, సర్, సాబ్, ఉస్తాద్, అంటూ అతను మమ్మల్ని ఆ కాసేపట్లోనూ సంబోధించిన తీరుకే సగం కడుపు నిండింది మాకు.

మెస్ లోంచి బయటపడేసరికి ఏడైంది. క్లాసులు ఎనిమిదింటికి మొదలవుతాయి.


రోల్‌కాల్.

“కంప్-ణీ! సా-వ్‌ధాణ్!” సిఎచ్ఎమ్ (కంపెనీ హవల్దార్ మేజర్) రఘుబీర్ సింగ్ గర్జించాడు. రిక్రూట్లందరం ఎటెన్షన్లోకి మారాం. “వీ-శ్రామ్!”

పది నిముషాలసేపు రఘుబీర్ సింగ్ లెక్చర్ సాగింది. ఆర్డర్లు. సమాచారాలు. జాగ్రత్తలు. బెదిరింపులు. అదిలింపులు. అందరం కిక్కురుమనకుండా వింటున్నాం.

“సర్…” అంటూ నాయక్ లాలారామ్–మెస్ ఇన్‍ఛార్జ్–అతన్ని సమీపించాడు. చుట్టూ ‘యూ’ షేప్‌లో నిలబడ్డ రిక్రూట్లెవరికీ వినబడనంత లోగొంతుకతో ఏదో చెప్పాడు. అతనివైపు వంగి, చెప్తున్నది శ్రద్ధగా విన్నాడు రఘుబీర్ సింగ్. చిన్నగా తల ఊపాడు.

“ఆజ్ సుబహ్ మెస్ వర్కింగ్ కిస్ కా థా?” గట్టిగా అడిగాడు.

మేం నలుగురం చేతులు పైకెత్తాం.

“ఆజావ్, ఆజావ్! ఇలా రండి. మీకు వీరతాళ్ళు వెయ్యాలి.”

రఘుబీర్ సింగ్ రోల్‌కాల్‌లో, ఎవరినన్నా తన ముందుకి పిలిచాడంటే ఏదో ఘోరం జరిగిందనే.

దాదాపు నెల క్రితం సంగతి గుర్తొచ్చింది. ఒక రిక్రూట్‌ని ఇలాగే పిలిచి నిలబెట్టాడు. సెలవు మీద వెళ్ళి, తిరిగి సాయంత్రం ఆరు గంటలకి రిపోర్ట్ చెయ్యాల్సి ఉండగా, రాత్రి తొమ్మిదింటికి రిపోర్ట్ చేయడం – ఆ రిక్రూట్ చేసిన నేరం. చేతులని నేలమీద ఆనించి, కాళ్ళని గోడకి తన్నిపెట్టమన్నాడతన్ని. వొంటి బరువంతా భుజాల మీద పడి, అతను చిగురుటాకులా వణకడం, మూడు రోజులవరకూ భుజాలు సవరించుకుంటూ తిరగడమూ గుర్తొచ్చింది.

ఆయన ముందు నిల్చున్నాం. ఆరడుగుల నాలుగంగుళాల పొడవున్న రఘుబీర్ విగ్రహం, వెనక గోడకున్న ట్యూబ్‌లైట్ వెలుతుర్లో నల్లగా కనిపిస్తోంది.

“క్యా కియే థే యే?” ప్రశ్నని లాలారామ్ వైపు విసిరాడు.

“బెండకాయలు తరిగారు సార్. అన్నీ పురుగులే!”

పురుగులా? ఆ గుడ్డి వెలుతుర్లో బెండకాయలతోబాటు వాటిని కూడా కోసి పడేశామా!?

“ఫిర్?”

“బ్రేక్‌ఫాస్ట్‌ని టేస్ట్ చేయించడానికి ఎస్సెమ్ సాబ్ దగ్గరికి తీసుకెళ్తే, అక్కడ కనిపించాయి. ఒక్కో పురుగూ ఇంతంత లావుంది. (చిటికెనవేలు చూపించాడు.) ఈ గాడిదలు కళ్ళు మూసుకుని తరిగినట్టుంది. ముప్పై కిలోల కూరా పారేశాం.” వివరించాడు లాలారామ్.

“ఎస్సెమ్ సాబ్ నే క్యా బోలా?”

రఘుబీర్ ప్రశ్నకి లాలారామ్ ఇచ్చిన జవాబేమిటో అందరికీ చెప్పకుండానే అర్థమైంది.

ఓ! అందుకేనా ఇవాళ లంచ్‌లో బెండకాయల కూర కనపడలేదు.

“బెండ్!” అనుకున్నట్లే అయింది. నలుగురం నేలకి తగలకుండా ముందుకు వొంగాం. ఇప్పుడేంటి? రెండు నిముషాలు గడిచాయి. సస్పెన్స్ పెరుగుతోంది.

ఛెళ్ళుమంది మోత.

బెత్తెడు వెడల్పు, రెండడుగుల పొడవున్న చెక్కతో మొదటి దెబ్బ పడింది, జంబులింగం పిర్రల మీద. “స్‌స్స్!” అని ఓర్చుకున్నాడు వాడు.

మళ్ళీ అదే మోత. ఈసారి మణి చిన్నగా అరిచాడు. “అమ్మే!” వాణ్ని దాటుకుని రఘుబీర్ సింగ్ నా పక్కన నిలబడ్డం తెలిసింది నీడ కదలికతో.

ఒక్కసారిగా మంట నషాలానికెక్కింది. “ఉఁమ్.” చేత్తో తడుముకోవడానిక్కూడా లేదు.

నా తర్వాత వాడిక్కూడా వడ్డన అయింది. మరోసారి. ఇక ఇట్నుంచి మొదలుపెట్టాడు రఘుబీర్ సింగ్. చివరి దెబ్బ మళ్ళీ జంబులింగం మీద.

“దఫా హో బేవకూఫోఁ! ఈ సారి కళ్ళు తెరుచుకుని పని చెయ్యండి. సమ్‌ఝే?”


కొత్త యూనిట్లో.

“హాన్జీ బోలో.” బరకదారాల రగ్గు చుట్టలా ఉబ్బిన ‘క్లోతింగ్’ స్టోర్ కీపర్ స్వామి – గుమ్మానికి అడ్డంగా వేసిన టేబుల్ వెనక నిలబడి అడుగుతున్నాడు. ఇక్కడ పాతుకుపోయిన కొద్దిమంది సివిలియన్ స్టాఫ్‌లో సీనియర్.

స్టోర్ లోంచి కలరా ఉండల వాసన ఘాటుగా తగుల్తోంది.

“సర్, క్లోతింగ్ లేనా హై.” కార్డ్ అందిస్తూ చెప్పాను.

“లాయియే” అంటూ కార్డ్ తెరిచి, అందులో అంతకుముందు ఇష్యూ అయిన క్లోతింగ్ ఐటమ్‌లని, వాటి లైఫ్‌ని లెక్కలు వేస్తూ మొదలుపెట్టాడు.

“ఆప్ కా – కోట్ డ్యూ హై, యూనిఫారమ్ డ్యూ హై, జూతే, మగ్, స్పూన్, లేసెస్, పీటీ షూ… లేదు. పీటీ షూ వచ్చే నెల్లో డ్యూ అవుతుంది.”

ఆత్రంగా చూస్తున్నాను. ఇవన్నీ, ఇంకా కొన్నీ డ్యూ అయి చాలా రోజులైంది. డ్యూ అయిన తర్వాత వీలయినంత త్వరగా తీసుకునే బాధ్యత సోల్జర్లదే.

పైనున్న ఆ స్వామి సంగతేమోగానీ, కిందున్న ఈ స్వామి మాత్రం అంత తేలిగ్గా కరుణించడని పేరు. ఎప్పుడొచ్చినా ‘ఆడిట్ జరుగుతోంది, రెండ్రోజులు ఆగి రమ్మం’టాడు. చాలా ఐటమ్‌లు ‘లేవు లేవం’టూ, పెద్దగా ఉపయోగంలోకి రాని షూ లేసులు, మగ్గు ఇలాంటివి మాత్రమే ఇవ్వజూపుతుంటాడు. నాలుగైదుసార్లు అతన్ని దర్శించుకుని ‘ప్రసన్నం’ చేసుకుంటే గానీ యూనిఫారం లాంటి ముఖ్యమైన క్లోతింగ్ ఐటమ్‌లని ఇష్యూ చెయ్యడని విన్నాను.

“దేఖో రావ్‌గారూ” అన్నాడు స్వామి. రావ్ అని పేరున్న నాలాంటి సిపాయిలతో ‘గారూ’ చేర్చి మాట్లాడతాడల్లే ఉంది. “కోట్ హై, మగ్ హై, లేసెస్ హై. యూనిఫారం ఇంకా రాలేదు” అంటూ కోట్ తెచ్చిచ్చాడు లోపలినుంచి.

అనుకున్నట్లే, అది నాకు సరిపోయే సైజ్‌లో లేదు. అదే అన్నాను.

“అరే భాయ్ ట్రై కరో! సరిపోకపోతే టైలర్‌తో ఠీక్ చేయించుకో.” తీసుకోక తప్పదన్నట్టు చెప్పేడు. ఈసారి గొంతులో విసుగు మోగింది.

వీటిని ఏ టైలరూ సరిచెయ్యడు. అది అతనికీ తెలుసు. కానీ చలికాలం రాబోతోంది. కోట్ తప్పనిసరిగా కావాలి.

“సర్, దేఖియే. దూసరా హో తో…” బతిమాలేను.

“అరె యార్, మహా ఇబ్బంది పెడతారయ్యా మీ కుర్రాళ్ళంతా! సరే చూస్తాను” అంటూ లోపలి వెళ్ళినట్టే వెళ్ళి తిరిగొచ్చాడు. “రావ్‌సాబ్, మీ సైజ్ కోట్ ఉంది కానీ, దాన్ని మీ ఎస్సెమ్ సాబ్ తన కోసం రిజర్వ్ చేసి ఉంచమన్నాడు. క్యా కరేఁ…”

నిరాశగా మొహం పెట్టిన నాకేసి చూసి, దగ్గరికి రమ్మన్నట్లు తలూపి, రహస్యం చెప్పబోతున్నట్లు ముందుకి వంగేడు. చకచకా అటూ ఇటూ చూసి – “రావ్‌గారూ, మా దామాద్ వచ్చాడు. పార్టీ కావాలంటున్నాడు. ఏక్-దో బోతల్ విస్కీ దిలాదో నా కాంటీన్ సే. డబ్బిచ్చేస్తా” ప్రాధేయపడుతున్నట్లే అనిపించినా, నిజానికి తనని ‘ప్రసన్నం’ చేసుకోమంటున్నాడు.

“ఎస్సెమ్ సాబ్‌కి నేనేదో చెప్పి దాటేస్తాలెండి. మీకోసం ఆమాత్రం చెయ్యలేనా…” అన్నాడు నవ్వుతున్నట్టు మొహం పెట్టి. ఆ నవ్వు అతక్కపోవడం స్పష్టంగా తెలుస్తోంది.

సోల్జర్లకిచ్చే కోటా లిక్కర్‌ని సివిలియన్స్‌కి ఇవ్వడం నిషేధం. ఫుల్ బాటిల్ ఖరీదు బజార్లోకన్నా కాంటీన్‌లో చాలా తక్కువ. చాలామంది సివిలియన్ స్టాఫ్ ‘ఇలా’ కొని బయట అమ్ముకుంటారు.

తల అడ్డంగా ఊపి “ఆ చిన్న కోటే ఇచ్చెయ్యండి సర్. మళ్ళీ ఇప్పట్లో రాలేను” అన్నాను. మొహం ముడుచుకుని సణుక్కుంటూ మిగిలినవి తెచ్చి, కార్డ్‌లో ఎంట్రీలు వేశాడు స్వామి. “తో, విస్కీ నహీఁ?”

“మాఫ్ కరో సర్” అంటూ ఇచ్చినవి తీసుకుని, ఆ ఘాటు వాసనలోంచి బయటపడ్డాను.


“రావ్, హెడాఫీస్‌కి వెళ్తున్నావా?” సైకిలెక్కుతున్న నన్ను చూసి అడిగాడు లాన్స్ నాయక్ సెంగర్.

“యస్ సర్.”

“అక్కడ ఎకౌంట్స్ సెక్షన్లో హవల్దార్ రాజ్‌భర్ అని ఉంటాడు. ఆయన్ని కలిసి, నేను సాయంత్రం వస్తానన్నానని చెప్పు.” ఫ్రెండ్లీగానే పురమాయించాడు సెంగర్.

ఏడాదిన్నరపాటు ట్రైనింగ్ పూర్తయాక, రెండు వారాల క్రితం నేనీ యూనిట్‌కి పోస్టింగ్ మీద రాగానే పరిచయమైన మొదటి వ్యక్తి. ఎప్పట్నుంచో నన్ను ఎరిగున్నవాడిలా ఆ యూనిట్ గురించి, అక్కడి లైఫ్ గురించి వివరించాడు. క్యూ స్టోర్ నుంచి ఒక కొత్త ప్లాస్టిక్ నవారు మంచం, వార్నీష్ వాసన ఇంకా వదలని ఓ కొత్త బెడ్ సైడ్ లాకరూ నాకు ఇష్యూ అయేలా సాయపడ్డాడు. కావడానికి సీనియరే అయినా ప్రమోషన్లు అందుకోవడానికి చెయ్యవలసిన కోర్స్‌లేవీ చెయ్యలేదు. ఎందుకూ అని అడిగితే, తమది గుజరాత్‌కి చెందిన ఒక రాజవంశమని, అనుకోకుండా ఆర్మీలో చేరడం వాళ్ళవాళ్ళెవరికీ ఇష్టం లేదని, పదిహేనేళ్ళ కనీస సర్వీస్ పూర్తి కాగానే, ఇంటికి వెళ్ళిపోతాననీ చెప్పాడు.

“సరే సర్.”

గోడలు కనబడకుండా నిలబడ్డ ఫైలింగ్ కాబినెట్ల ముందు కుర్చీకి ఎక్కువగా, టేబిల్‌కి తక్కువగా కూర్చుని టైప్ చేస్తున్నాడు హవల్దార్ రాజ్‌భర్. పొట్టిగా, బొద్దుగా ఉన్న వేళ్ళు. అతని భారీకాయం ముందు టైప్ మిషన్ చిన్నదిలా అనిపిస్తోంది.

“రామ్ రామ్ సర్!”

“కౌన్?” టైప్ చేస్తూనే అడిగాడు – ఏం దొంగిలించబోతున్నావన్నట్లు!

“కొత్తగా పోస్టింగ్ మీద వచ్చాను సర్. నాయక్ సెంగర్ సర్ నే భేజా హై.”

సెంగర్ పేరు వినిపించిన తర్వాతే తలెత్తి చూశాడు రాజ్‌భర్. “ఓ! రావ్.” నేమ్ ప్లేట్ చదివాడు. “ఠీక్ హై. సరేనని చెప్పు సెంగర్‌కి. నువ్వూ రా.”

నా సందేహపు చూపు చూసి, మొహంలోకి కొద్దిగా నవ్వు తెచ్చుకున్నాడు.

“సరే సర్! వస్తాను.” నవ్వి బయటపడ్డాను.


“బందా కామ్‌కా లగ్ రహా హైఁ” అన్నాడు రాజ్‌భర్, మూడో గ్లాసులో రమ్ పోస్తూ. “అందుకేగా మీ ఇంటికి తీసుకొచ్చాను” అంటూ నవ్వుతూ నా వైపు చూశాడు సెంగర్. “తీసుకో రావ్…”

“ఫర్లేదు సర్, వొద్దు!” కంగారు కలిసిన మర్యాదతో చెయ్యి అడ్డు పెట్టాను.

“ఇక్కడ నువ్వు నా దగ్గర ఫ్రీగా ఉండొచ్చు. సీనియర్-జూనియర్ – అలాంటి ఫౌజీ గొడవలన్నీ ఆఫీస్‌లోనే. ఇక్కడ మనందరం భాయ్ భాయ్! సమ్‌ఝే?”

“…”

“అరే, తీస్కో తీస్కో. ఆంధ్రావాలా తాగడంటే నేన్నమ్మను” అంటూ బలవంతంగా గ్లాసు చేతిలో పెట్టాడు రాజ్‌భర్. అది మొదటిసారి.

“ఈ సెంగరూ నేను లంగోటీ యార్‌లం. బేసిక్ నుంచీ మా ఇద్దరిదీ ఒకే స్క్వాడ్. పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడ కలిశాం. నేను ఏ కోర్సూ వదలకుండా చేసి హవల్దార్ అయ్యాను.”

“ఇన్నేళ్ళు లాగాను చాల్లెండి సార్” అన్నాడు సెంగర్.

“సార్ అంటావేంట్రా నాలాయక్! చూడు రావ్, మంచో చెడో, సైన్యంలోకి వచ్చి పడ్డాం. అందినంతా తీసుకోనివాడు గాడిద కిందే లెక్క. ఏం? అదీ నే చెప్పేది.” మళ్ళీ గ్లాసు నింపుకున్నాడు. నాది నింపడం మర్చిపోలేదు.


“ఒక్కడివే అంటున్నావ్, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ ఎవరూ లేరా నీకు? నిజంగానే?” ఆశ్చర్యపడాలి కాబట్టి పడుతున్నట్టు అడిగాడు రాజ్‌భర్ – గ్లాసు అందిస్తున్న ఐదో శనివారంనాడు. మధ్యలో సెంగర్ కేసి ఒక చూపు విసిరాడు.

చెప్పక తప్పలేదు. చిన్నప్పుడే అమ్మానాన్నా ఏక్సిడెంట్‌లో చనిపోతే, అమ్మమ్మ-తాతయ్యలు పెంచడం, ఇంటర్ చదువుతుండగా ఒకరోజు కుతూహలం కొద్దీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ దగ్గర కనబడ్డ లైన్లో నిలబడడం, సెలెక్ట్ కావడం…

“వచ్చీ వచ్చీ ఫౌజ్‌లోకి వచ్చి పడ్డావేంటి రావ్?” ఉలిక్కిపడ్డాను ఆ ప్రశ్నకి.

“సర్లే గానీ, రేపు ఏ సియాచెన్ గ్లాసియర్‌లోనో పోస్టింగ్ వస్తుంది. వెళ్తావ్. ఖుదా-న-ఖాస్తా అక్కడ ఏ ఫ్రాస్ట్‌బైటో వచ్చిందనుకో, చెయ్యో కాలో తీసేస్తారు. అదీ నీ కిస్మత్ బాగుంటే. చాలామంది చచ్చేపోతారు. తెలుసా?”

తెల్లబోయాను. ఏదో అడగబోయేలోపే మళ్ళీ అన్నాడు రాజ్‌భర్. “ఇప్పుడు నీకేమైనా అయితే మీ అమ్మమ్మా తాతయ్యా ఏమవుతారు?”

అప్పటికి రమ్ పని మొదలెట్టి, ప్రశ్నని మరికొంత గుచ్చింది. అవును ఏమవుతారు? ఏమైపోతారు వాళ్ళు?

“మరీ భయపెట్టెయ్యకండి సర్, దిగిపోతుంది కుర్రాడికి!”

“నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. అందుకే, నీకో ఉపాయం చెప్తున్నా విను. నీ చేతికో లక్ష రూపాయలొచ్చాయనుకో. పనికొస్తాయా రావా?”

“లక్ష రూపాయలా!?” ఆశ్చర్యంగా అడిగాను.

“అవును. పదిహేనేళ్ళ సర్వీస్ అయేసరికల్లా ఎటూ వెళ్ళిపోతావు. తాతయ్యనీ అమ్మమ్మనీ చూసుకోవాలిగా. డబ్బు కావాలి. కద?”

“అవును సర్” మందు తలకెక్కింది. తాతయ్య, అమ్మమ్మ…

“ఏమీ చెయ్యకుండా ఊరికే వచ్చే డబ్బు ఎవరికైనా రుచే. అర్థమైందా?”

“…”

“ఓ మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పిస్తాను, తీసుకో. పదిహేనేళ్ళు కాగానే ఠక్కున లక్ష రూపాయలు నీ చేతిలోకొచ్చి పడతాయి. ఆర్మీనుంచి అందే డబ్బులెటూ వస్తాయి. ఒకవేళ, ఈ లోపే నీకేదైనా అయిందనుకో, మీ తాతయ్యకీ అమ్మమ్మకీ ఆ లక్షా అందుతాయి – వారం రోజుల్లోపే. ఏం?”

“కరెక్ట్ సర్. సరైన సలహా ఇచ్చారు. సర్వీస్ మొదట్లోనే ఇలా జాగ్రత్తపడాలి.” సెంగర్ చప్పట్లు కొట్టినంత పనిచేశాడు. “అప్పట్లో మాకు చెప్పేవాళ్ళెవరూ లేకపోయారు రావ్. నీకు మేమున్నాం. లక్కీ నువ్వు.”

కరెక్టేనా? అయినా అంత సీనియర్ చెప్తుంటే అందులో అబద్ధమేముంటుంది?

“పీర్‌లెస్ అని ఓ కంపెనీ ఉంది. అందులో పాలసీ తీసుకో. పనికొస్తుంది. ఏదో ఓ రోజు నువ్వే వచ్చి, ‘సర్, మీరు చేసిన మేలు మర్చిపోలేను’ అనకపోతే, నీకు మందు కొట్టించి మరీ మీసాలు గొరిగేసుకుంటాను.”

“కానీ సర్…”

“పేపర్లు రెడీ చేసేస్తాను. రేపు సాయంత్రం వచ్చెయ్యి.”

“వస్తాను సర్. కానీ…” పేపర్లూ అవీ ఇప్పుడే వద్దూ అనబోయాను. వాటిని ఎక్కిళ్ళు అడ్డుకున్నాయి. “నీకేమన్నా డౌటుగా ఉంటే సెంగర్ని అడుగు. మా కళ్ళముందే ఇద్దరు చాకులాంటి కుర్రాళ్ళు చచ్చిపోయారు. ఒకడిది మా జిల్లానే. ఇక్కడే, ఈ యూనిట్లోనే పోయాడు. మలేరియాతో. ఇంకో కుర్రాడయితే, ఇదో నీలానే ఒక్కడే కొడుకు. ఒక్క చిన్న చెల్లి. తండ్రి లేదు. తల్లి కూలిపని చేసి పెంచింది. వీడు ఫౌజీ అయి, ఇక్కణ్ణించి లేహ్‌కి వెళ్ళాడు. వెళ్ళిన మూడు నెల్లకే ఫ్రాస్ట్‌బైట్ తగిలింది. కాలు తీసేశారు. అయినా ఆ తర్వాత నెలకూడా బతకలేదు.”

విస్తుపోయి వింటున్నాను.

“జిందగీ ఐసా హీ హై రావ్. ఏమీ చెప్పలేం. ఫౌజ్‌లో మరీనూ. ఎప్పుడు ఏం జరుగుతుందో! చెయ్యగలిగిందల్లా మన జాగ్రత్తలో మనముండటమే.”

“షక్ మత్ కరో రావ్. సర్ చెప్పేది నీ మంచికే.” సెంగర్ వత్తాసు పలికాడు. అభ్యంతరమేదీ తోచలేదు నాకు. తలూపాను.

మర్నాడు సాయంత్రం రెండు మూడు కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని, “ముబారక్ హో రావ్. లఖ్‌పతీ బన్ గయే హో!” అన్నాడు హవల్దార్ రాజ్‌భర్, మితంగా నవ్వుతూ. “ఎనిమిది వందలివ్వు. మూడు నెలల ప్రీమియం కట్టేస్తాను. తర్వాతనుంచీ ప్రీమియం మూడు నెలలకోసారి నీ శాలరీలోంచే కట్ అయిపోతుంది. రెండు మూడు వారాల్లో పాలసీ పేపర్లు వచ్చేస్తాయి. వాటిని భద్రం చేసుకో,” అన్నాడు అదే నవ్వుతో.

అనుమానాలని పక్కన పెట్టి డబ్బిచ్చాను. సీనియర్లు ఇలా కూడా హెల్ప్ చేస్తారన్నమాట.

రెండు నెలలు గడిచాయి. నేను నెలరోజుల సెలవుమీద వెళ్ళి వచ్చేసరికి, లాన్స్ నాయక్ సెంగర్, హవల్దార్ రాజ్‌భర్ ఇద్దరూ పోస్టింగ్ మీద వెళ్ళిపోయారని తెలిసింది. రావలసిన పాలసీ పేపర్ల గురించి తర్వాతెప్పుడో గుర్తొచ్చినా, వివరాలేవీ?

మరి కొన్నాళ్ళకి యూనిట్ మారింది. నా లక్ష రూపాయల పాలసీ ఎక్కడో ఉండే ఉంటుంది!