దించుకున్న సముద్రం

ఏమైనా కావచ్చు బహుశా…

కొన్ని ఆలోచనల ఉండలు ఇన్ని జ్ఞాపకాల బండలు
ఏమైనా కావచ్చు
నలిగిన పేజీలు. నలిపిన రోజులు.
వేడెక్కని మోజులు. పగలని గాజులు.

సరే నిన్ను చూసిన మొదటిసారే
టపాటపా రెక్కలు పంజరానికి తగిలి
గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్నా…
ఆదిమ సమ్మోహాస్పద స్పర్శేదో చుర్రుమన్నా…

ఎవరైనా చూశారేమో బహుశా
వేగం పెరిగిన శ్వాసలనీ
వెనక సీట్లో వేడిమినీ నీరెండలో ముంగురులనీ
గోళ్ళ చివర్ల నెత్తుటి ఎరుపునీ తిరిగిపోయే తారల మెరుపునీ
పల్చగా జారిన విశ్వాసాల కొనకంటి చూపులనీ

ఏమైనా కావచ్చు బహుశా
ఆఖరి కలతా కలలూ కానీ
లయా లావణ్యమూ లేని రోజువారీ పుస్తకాల్లో
ఒత్తుకుపోయిన సిల్వర్ ఫిష్ కానీ

అవన్నీ – ఎక్కడా విప్పని ఇంకొన్నీ
మట్టిపురుగుల్లోనూ గడ్డిపూల్లోనూ
ఏనాడో కలిసి మొలిచి మసై
నిశిగా నింగికెగసిపోయే ఉంటాయి

తనకిప్పుడు వినపడదింకేమీ మిగిలీ ఉండదు
తనని తడిమే నివాళీ లేదు.

ఏమైనా కావచ్చు బహుశా…