వొహ మొహం

కాలినడకల్లో కట్టెగా మారినదాన్ని
నీళ్ళ పాకెట్‌ని ఖిచిడీ ముద్దని
గుంపు మీదికి చిమ్మిన డిసిన్ఫెక్టెంట్‌ని
అమ్మానాన్నా ఇంకా రాలేదేమని చూసే చిన్నారిని

కాపాడగల సూదిని మాత్రని మాస్క్‌ని స్కాల్‌పెల్‌ని
గోపురం ముందు నదీప్రవాహంలో విరిగిన వంతెన కింద
తొడతొక్కిడిలో నొక్కుకుపోయిన పసిమొహాన్ని
జోడించిన చేతులని విడదీసి
తొడలమీదకి పడిన చేతుల మోసాన్ని

తీర్థంలో రంగరించి పోసిన మత్తుని
ఇంకో మతం మీద సందేహాన్ని పిడిగుద్దుని
తిరగబడ్డ చక్రాలకి వేళ్ళాడిన మాంసం ముద్దని
ఉపగ్రహం చూపించిన భూచక్రాన్ని
విరిగిపడ్డ అలని – పెనుగాలికి ఎగిరిపోయిన రేకుని
గల్లంతైన బెస్తని

క్యూలో కుప్పకూలిన పాతనోట్ల కట్టని
పాసయినట్లు తెలీక తన్నేసుకున్న స్టూల్‌ని
బువ్వ తినిపిస్తూ జార్చుకున్న మూడో అంతస్తు బిడ్డని
చేతులుమారిన వోటుని – పారిన సారాని
పెరిగిన బొజ్జని – కబ్జాని – నల్లని గన్‌మాన్ల మధ్య తెల్లని టోపీని
విడిగా మోగిన మాటని – వడిగా తొక్కిన బాటని – బిడ్డలమీద పేలిన తూటాని

నిజంగా…
పైకెత్తని వేలుని – ప్రశ్నించని గొంతుని
గోడల మధ్య నీడల్లో గుట్టుగా పీల్చే శ్వాసని
వీపుమీది వాతలని మర్చిపోతుండే మధ్యతరగతిని
కళ్ళు మూసుకున్న కలాన్ని
అవున్నేనే బిచ్చగాణ్ని
ఇండియాగేట్‌లో లేని అనామకుణ్ని