కొన్ని మెట్లు పైకెక్కి చిత్రం చూసుకుని గీసుకుని
ఎండిన మోవిబావి నుంచి ఇంకా ఏదో చేదుకుంటూండగా
వీచెడు ధీరసమీరం బొచ్చెడు బంధాల భారం.
కలం-కళ్ళ మీద అక్షరాల మీద ట్లుప్ ట్లుప్‌మని
తెగిపడుతున్న అల-జడి వాన
పగిలిన పెదాలమీద అద్దిన సాంత్వనల సోన
కాన్వాస్స్వప్నమ్మీదనూ కవుకు దెబ్బలమీదనూ…
గుణింతాలనుంచి పిళ్ళారి గీతాలదాకా
పూనిన బాలూ నుంచి పేలిన శివమణి దాకా
గ్రక్కున మింగిన మది గుక్కలనుంచీ
(సీ-తమ్మకు చేయిస్తీ చింతాకూ పతకమూ రామచంద్రా)
ప్రక్కకి పిలిచిన అన్-కోని అల దాకా…
ఓ వయొలిన్‌నీ దరువునీ
జీర్ణించుకుని మేల్కొలిపించుకుని
గొంతు పిసుక్కుని చించుకుని
దేహాంతరాలలోనుంచి హృదాంతరాలలోకి
బార్ బార్ చార్ చార్ బారలతో…
కలం కలుపుతున్న పేజీలనీ కుంచెల నిండు నాట్యాన్నీ
నిండిన మనసుతో చూస్తూ
అంచెలు దాటుతున్న రాయంచలకి రంగులు పూస్తూ
శృతికందని చేతికి తగలని
కొత్త కొత్త మౌనాల భ్రమణాలని పరికిస్తూ
అసమాన కాంతిలోకి
అవిశ్రాంత సమాధిలోకి…