లీలా లీలా…

అడుగులో అడుగేస్తూ రెండుమూడక్షరాలు
నీడల్లే తోడుంటూ ప్రవహిస్తూ
పట్టుకోలేని అలల్లా కొన్నీ పట్టుకున్నా జారే
రేణువుల్లా కొన్నీ
ఉద్విగ్నార్గాజమ్‌లలోకూడా వెన్నంటే ఉండేవి కొన్నీ

వెన్నెల్లోనూ వేడిలోనూ చుక్కలోనూ చుక్కల్లోనూ
మెత్తటి గుచ్చుకోటాల్లోనూ తేనెలద్దిన
కత్తుల చిక్కటి కోతల్లోనూ
పీచు పరుపులోకి ఆగకుండా ఇంకుతుండే
రకరకాల తుక్కుల్లోనూ

సత్యం నిజం నిక్కం కళ్ళు తెరిచినా
మూసినా కఠోరంగా కర్మగా వెనకే తెర్లుతూండే
పొర్లుతూండే ఆవిర్లు కక్కుతుండే అతి సులువైన వాస్తవం

అందించలేని అందలేని చేతులకంటని తడి
అతి వీరుడైనా పరమ నీచుడైనా
రుచి చూడక తప్పని వేడి
చేతులు జోడించినా చెంప ఛెళ్ళుమనిపించక మానని వాడి

దాసోహమన్నా ఋషిలా మూలిగినా
చేతులూ గుండె కవాటాలూ అన్నీ అప్పగించినా
మెలికలు తిరగటం ఆపేస్తానని
పేగులు మెలియబెడుతూ చెప్పే పచ్చి ఎర్రటి క్షణం

వింజామరల రేకలు రాలే తనం.
చాచిన నాలుకల్లోకి చేరే తనం.
మరోసారి అంటూ లేనితనం.
మనిషికింకా పట్టుబడనితనం.