పొద్దున్న ఆరు.
“వాహ్! క్యా ధుంద్ ఆయా హై!” అన్నాడు లెఫ్టినెంట్ అభిషేక్, టెంట్ చుట్టూ దట్టంగా అలుముకున్న తెల్లటి పొగమంచుని చూస్తూ, చిన్నపిల్లాడల్లే సంబరంగా. ఆఫీసర్‌గా ట్రైనింగ్ ముగించుకుని, మొదటి పోస్టింగ్ మీద మా యూనిట్‌కి వచ్చి రెండు నెలలయిందేమో. సివిలియన్ కుర్రాడి ఛాయలు పూర్తిగా వదలనట్లే, ఆర్మీ ఆఫీసర్‌కి ఉండవలసిన ఠీవి ఇంకా అలవడనట్లే కనిపిస్తాడు.
ఎక్సర్‌సైజ్ మొదలై ఇవాళ రెండో రోజు.
నిన్న సాయంత్రం, బ్రీఫ్ చేస్తున్నాడు మా సెక్షన్‌ని ఫాలిన్ చేసి.
“సబ్ ధ్యాన్ సే సునో! ఎక్సర్‌సైజ్ అంటే నిజంగా యుద్ధమే అనుకోవాలి. అసలైన యుద్ధంలో ఎలా మనం ఫీల్డ్ రూల్స్‌ని పాటిస్తామో, అలాగే ఇక్కడ కూడా పాటించాలి.”
దాదాపు ముప్పయ్యేళ్ళ సర్వీస్ ఉన్న సుబేదార్ రంగప్ప, నాకేసి చూశాడు. ఆయన దాచుకున్న నవ్వు ఆ చూపులో కనిపిస్తోంది.
“రేపట్నుంచీ షిఫ్ట్‌లో నా టేబుల్ మీద, ఒక పక్క ఫోన్ ఉంటుంది. రెండో పక్క ఓల్డ్ మాంక్…” ఎఫెక్ట్ కోసం అన్నట్లు ఆగి అందర్నీ కలయజూశాడు, బింకంగా. “మీలో ఎవరెవరు ఎన్నేళ్ళ సర్వీస్ చేశారో నాకు తెలుసు. ఎవరికి ఎంత ఇజ్జత్ ఇవ్వాలో కూడా తెలుసు. అలాగే మీక్కూడా, ఎప్పుడు ఎలా ఇజ్జత్ నిలబెట్టుకోవాలో తెలుసని నమ్ముతున్నాను.”
రంగప్పతోబాటు, దాదాపు ఇరవై మంది ఉన్న సెక్షన్ అంతా నిశ్శబ్దంగా వింటోంది.
“ఇది ఫీల్డ్. డిసిప్లిన్ గురించి లెక్చర్ ఇవ్వక్కర్లేదు కదా? రంగప్పా సాబ్?”
“నై సర్.”
“అప్‌నా అప్‌నా కామ్ ఠీక్ సే కరో. కహీఁ సే కోయీ కంప్లయింట్ నహీఁ చాహియే ముఝే. ఏదన్నా తప్పు జరిగిందో, ముందు నా ఓల్డ్ మాంక్ మాట్లాడుతుంది. తర్వాత…”
“…”
“సమ్‌ఝే?”
“యస్సర్!”
“క్యా బోలా?”
“యస్ సర్!” ఈసారి గట్టిగా అరిచారు అందరూ.
“సావ్‌ధాన్. సాబ్, లైన్ తోడ్!”
“జైహింద్ శ్రీమాన్!” సెల్యూట్ చేసి, లెఫ్టినెంట్ అభిషేక్ నిలబడ్డ చోట నిలబడ్డాడు సుబేదార్ రంగప్ప. “సెక్షన్! విశ్రామ్!” చేతులు వెనక్కి కట్టుకున్నాడు.
“ఒక ముఖ్యమైన విషయం…” అందరి చెవులూ రిక్కించుకున్నాయి.
“ఎక్సర్‌సైజ్‌లో ఉన్నామని గుర్తుంచుకోండి. టైముకి షిఫ్ట్‌లు మారాలి. ఆలస్యం చేస్తే ఊరుకోను. లీవ్ అప్లికేషన్ల గురించి మర్చిపోండి. కోయీ ఛుట్టీ నహీఁ మిలేగా. యూనిట్‌కి వెళ్ళిన తర్వాతే అన్నీ. ఎప్పుడు వెళ్తామని మళ్ళీ నన్నే అడక్కండి.” చిన్నగా నవ్వులు వినపడ్డాయి.
“కొంచెం పెందరాళే నిద్ర లేవండి. బాటిల్ పెరేడ్‌కి వెళ్ళి రావడానికే కనీసం గంట పడుతుంది. వెళ్ళిన వాళ్ళు దారి గుర్తు పెట్టుకోండి. ఈ రాజస్థాన్ ఎడారిలో గనక దారి తప్పారంటే సీధా లాహోర్‌లో తేల్తారు. ఇక అన్నీ వాళ్ళే కడుగుతారు.” మళ్ళీ కిసుక్కుమంటూ నవ్వులు.
“ధ్యాన్ సే కామ్ కరో. సెక్షన్-లైన్ తోడ్. సీధా అప్నీ అప్నీ జగహ్ చలో.”
అందరూ కదిలారు.
చిన్న పిల్లాడెవరో వజ్రాల బస్తాని తన్నేసి విరజిమ్మేసినట్లు నల్లని ఆకాశం నిండా మిలమిలా మెరుస్తున్నాయి నక్షత్రాలు. మా ట్రక్ పైకప్పు మీద, దరీ పరుచుకుని, రగ్గు కింద వెల్లకిలా పడుకుని వాటి అందాన్ని అబ్బురంగా చూస్తున్నాను.
ఎడారి మధ్యలో ఉండటంతో అన్ని కనిపిస్తున్నాయి. అసలు ఇన్ని ఉన్నాయని చూస్తే తప్ప, సిటీల్లో ఆకాశాన్ని చూసినప్పుడు తట్టనే తట్టదు! ఎక్కడో చదివాను. యాభై అడుగుల పొడవూ, యాభై అడుగుల వెడల్పూ ఉన్న తెల్ల కాగితం మీద ఎక్కడైనా బాల్ పెన్‌తో ఒక్క చుక్క పెడితే, అంత ఉంటుందిట మన భూమి ఈ విశాల విశ్వంలో! అన్ని వేల గోళాల మధ్య – మనం. ఓహ్! అద్భుతం.
పైగా, చల్లటి గాలి. అప్పటివరకూ ‘ఎడారి’ అనగానే స్ఫురించే మండుటెండలు, ఎండు వాతావరణం – అన్నీ ఆ గాలి తగిలే సరికి ఎటో కొట్టుకుపోయి, ఎడారిమీద ప్రేమ పుట్టుకొస్తోంది.
“అల్లాజీ!” అంటూ గట్టిగా కేక పెట్టారెవరో.
ఉలిక్కిపడి లేచాను. పక్క ట్రక్ మీద పడుకున్న రంగప్ప సాబ్ కూడా లేచాడు.
వెచ్చటి ఇసకలో దుప్పటి పరుచుకుని పడుకున్న లాన్స్ నాయక్ ఆలమ్ అదాటుగా లేచి, మెలికలు తిరుగుతున్నాడు. “అల్లా… అల్లా…” అంటూ. మోచెయ్యి దగ్గర చూసుకుంటున్నాడు. అతని పక్కన పడుకున్న ఇంకో ఇద్దరు ముగ్గురు వెంటనే లేచారు.
“కోన్ హై? క్యా హువా?” అంటూ చకచకా కిందకి దిగి ఆలమ్ దగ్గరికి చేరేడు సుబేదార్ రంగప్ప. “రేయ్, టార్చ్ మారో! జల్దీ!”
“క్యా హువా?”
“ఏదో… మమ్మీ… కుట్టింది సర్.” బాధతో మూలుగుతూనే చెప్పాడు ఆలమ్. “అల్లా! మంట. మంట!”
“లే! పక్క దులుపు. చూడనీ” ఆలమ్ లేవగానే అతను పడుకున్న దుప్పటిని ఎత్తి దులిపారొకరు. టార్చ్ వెలుతుర్లో, ఇసక మీద జర్రున పారిపోతూ కనపడింది గోధుమరంగు తేలుపిల్ల.
“బిచ్ఛూ! బిచ్ఛూ కా పిల్లా. ఏదీ? సరిగ్గా చూపించు ఎక్కడో…”
విలవిల్లాడుతూనే రంగప్పకి కుడి మోచెయ్యి చూపించాడు ఆలమ్.
“రావ్ సాబ్, ఆప్ ఇస్‌కో ఫీల్డ్ అంబులెన్స్ లే చలో. మై ఓసీ సాబ్ కో ఇన్ఫార్మ్ కర్తా హూ” అంటూ చకచకా అడుగులేస్తూ ఓసీ టెంట్ వైపు కదిలాడు రంగప్ప.
చిన్న సైజ్ ట్రక్‌లో ఆలమ్‌ని కూర్చోబెట్టి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని “పద” అన్నాను. పది నిముషాల్లో ఫీల్డ్ అంబులెన్స్‌ని చేరేం.
తోడొచ్చిన సిపాయితోబాటు ఆలమ్‌ని వరండాలో కూర్చోబెట్టి, చకచకా వెళ్ళి డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కి విషయం చెప్పాను. పేషెంట్ ని లోపలి తెచ్చి పడుకోబెట్టమన్నాడు ఆ కెప్టెన్.
“దిఖావ్?” అంటూ ఆలమ్ మోచేతిని పరిశీలించాడాయన. వెంటనే నర్సింగ్ అసిస్టెంట్‌కి చెప్పి, తేలు కుట్టిన చోట శుభ్రం చేయించాడు. చెయ్యి ముట్టుకుంటేనే లబలబలాడుతున్న ఆలమ్‌ని “అరే ఏం లేదు…
స్కార్పియన్ బైట్. అంతే. పది నిమిషాల్లో తగ్గిపోతుంది. కహాఁ కా రెహనే వాలారే తూ? సర్వీస్ ఎంత అయింది?” అంటూ అథార్టీగా పరామర్శించాడు.
“అయిదేళ్ళు సర్.”
“గుడ్. అబ్ జ్యాదా నాటక్ మత్ కరో. మందు వేస్తున్నాను. సైలెంట్‌గా పడుకో. సోల్జర్‌వి! నీకేం కాదు. ఠీక్ హై? శాబాష్!” అని “సాబ్, ఇతను ఇవ్వాళ రాత్రి ఇక్కడే ఉంటాడు. మీ పార్టీ అక్కడ, ఆ వెయిటింగ్ రూమ్‌లో కూర్చోండి. పొద్దున్నే డిశ్చార్జ్ చేస్తాం.”
“సరే సర్.”
“షుకర్ కరో, కోబ్రా నహీఁ థా. ఇక్కడ వాటికీ తక్కువేం లేదు. రెండ్రోజులకో స్నేక్ బైట్ కేస్ వస్తోంది. ఆరుబయట ఇసుకలో పడుకోవడాన్ని ఎవాయిడ్ చెయ్యమనండి మీ హీరోలని.”
“యస్సర్.”
“అల్లాజీ…” మూలిగాడు ఆలమ్. అతనివైపోసారి చూసి, ఏ భావమూ కనపడనివ్వకుండా నావైపుకి చూసి తన రూమ్ లోకి నడిచాడు డ్యూటీ మెడికల్ ఆఫీసర్.
వారం గడిచింది. రోజు-రోజున్నర గడిచే ముందే మరో కొత్తచోటికి మూవ్ అవుతున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినవన్నీ పీకి అక్కడ స్థాపించడం, మళ్ళీ ఎక్కే షిఫ్ట్-దిగే షిఫ్ట్-అందుకునే రిపోర్ట్-ఇచ్చే రిపోర్ట్!
ఆలమ్ ఇప్పుడు తను షిఫ్ట్‌లో ఉన్నప్పుడు పనిచేసే ట్రక్ లోపలే పడుకుంటున్నాడు. సర్దుకుని, ముడుచుకుని!
తెల్లవారడానికి ముందునుంచీ గజం దూరంలోని మనిషి కూడా కనిపించనంత దట్టంగా వ్యాపించే పొగమంచు, పదిగంటలకల్లా పూర్తిగా కరిగిపోతోంది. ఎండలో వేడి వేగంగా పెరిగి, సాయంత్రంవరకూ ఫెళ్ళున కాస్తోంది. మళ్ళీ చీకటి పడుతున్న కొద్దీ చలి మొదలై పెరుగుతోంది, ఒక రాత్రివేళ అయ్యేసరికి వణుకు పుట్టిస్తోంది.
వీస్తున్న గాలిలో, తాగే నీళ్ళలో, తింటున్న ఆహారంలో కూడా సన్నటి ఇసుక రేణువులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కానీ అవేవీ గుర్తుండటం లేదు. పనిలో, పరుగుతీతల్లో!
పొద్దున్నే అయిదింటికి, మసక చీకటిలోనే దట్టమైన పొగమంచులోనే బయల్దేరాను. వెలుతురు వచ్చాక వెళ్ళడం కష్టం. ఒక చేతిలో టార్చ్. రెండో చేతిలో నీళ్ళ బాటిల్. రైఫిల్ తప్ప, పూర్తి యూనిఫారంలోనే ఉన్నాను, దళసరి ‘కోట్ కోంబాట్’ చలిని బాగానే ఆపుతోంది. తలకి టోపీ బదులు మంకీ క్యాప్ తొడిగాను.
టార్చ్ వెల్తురు పుంజం అయిదారడుగుల వరకే పడుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న గడ్డి పొదలు దాటుకుంటూ, కింద ఇసుకలో పాదముద్రలని, ఇతరుల మాలిన్యాలనీ తప్పించుకుంటూ నడుస్తున్నాను. దుర్వాసనని అరికట్టే దారేదీ లేదు. మా టెంట్లకి దాదాపు కిలోమీటర్ దూరానికి చేరానని నమ్మకం కుదిరేక, వెంట తెచ్చిన ట్రాన్సిస్టర్‌ని ఆన్ చేశాను, గొంతుక్కూర్చునే ముందు. ఏవేవో శబ్దాలు చేస్తోందది. పర్వాలేదు. దాని ప్రయోజనమే అంత. ఇక్కడొక మనిషి ఉన్నాడని ఇటువైపు వచ్చేవాళ్ళని హెచ్చరించడం! మా మరుగు, పొగమంచే!
ఏదో శబ్దం. కాదు ఎన్నో శబ్దాలు. బిగుసుకుపోయాను.
రెండు క్షణాల తర్వాత, పది అడుగుల దూరంలోనుంచి, దాదాపు యాభై-అరవై లేళ్ళ గుంపు నా కుడి వైపు నుంచి పరుగెత్తుతూ ఎడమవైపుకి పారిపోయింది. లేళ్ళని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. ఆ అనుభవం అంతా కలిపి బహుశ నిముషం పట్టిందేమో! వాటి పరుగుకోసమే అన్నట్లు విచ్చుకున్న పొగమంచు తెర మళ్ళీ మూసుకుంది, నిశ్శబ్దాన్ని కప్పుకుంది.
నాకు ఎడమవైపు కొంత దూరం నుంచి ఎవరో బిగ్గరగా పాడుతున్న తమిళ పాట కూడా కాసేపు ఆగి, మళ్ళీ మొదలైంది. అతని దగ్గర ట్రాన్సిస్టర్ లేదన్నమాట!
…
చల్లటి నీళ్ళు తగిలిన వేళ్ళు ఒకటి రెండు క్షణాల్లోనే మొద్దుబారేయి. బాటిల్ ఖాళీ అయింది.
లేచి, డ్రస్ సరిచేసుకొని వచ్చిన దారినే వెనక్కి తిరిగాను. పొగమంచు ఇంకా దట్టంగానే ఉంది. కింద ఇసుకమీది తడి పొరని చిందరవందర చేస్తూ గుంపులుగా బూట్ల ముద్రలు. కొంత దూరం తర్వాత ఒక్కొక్కటిగా చీలిపోతున్నాయి. కురుస్తున్న మంచు పొర వాటిని మసకబారుస్తోంది.
నడుస్తున్నాను. చుట్టుపక్కల వస్తున్న శబ్దాలని విని గుర్తుపడుతూ, మా టెంట్లని చేరేందుకు ప్రయత్నిస్తున్నాను.
నిముషాలు గడుస్తున్నాయి. ఎండ పొడ కొద్ది కొద్దిగా బలాన్ని పుంజుకుంటూ గెలుస్తోంది.
ఉన్నట్టుండి కింద ఇసుకలో పాదముద్రలన్నీ మాయమై, దాన్ని అప్పుడే ఎవరో చదును చేసినట్లు ప్లెయిన్‌గా కనిపించసాగింది. మా టెంట్ల దగ్గిర ఇలా, ఇంత నీట్‌గా వుండదే!?
ఏదో అనుమానం వచ్చింది. అయినా మరో రెండు నిమిషాలు నడిచాను సూటిగా.
ఉన్నట్లుండి మంచులోంచి ప్రత్యక్షమయ్యారా మిలిటరీ పోలీస్ జవాన్లిద్దరూ. ఓజీ యూనిఫారం మీద తెల్లటి బెల్టులు. తలమీద ఎర్రటి ‘బెరే’లు. వాళ్ళ వెనకాల మంచులో లీలగా తెలుస్తోందో విశాలమైన టెంట్.
“థమ్ థమ్… కౌన్ హో సాబ్? ఇటెక్కడికి?”
“సారీ. ఫోర్ లీమా ఫోర్‌కి వెళ్ళాలి. మంచులో దారి తెలీక…”
“తెలీకపోతే? సీదా జనరల్ సాబ్ టెంట్‌లో దూరతారా? మళ్ళీ ఎప్పుడూ తోడు లేకుండా వెళ్ళకండి బాటిల్ పెరేడ్‌కి. చలియే. పీఛే ముడియే. అటు… కుడివైపుకి వెళ్ళండి. మీ జనరేటర్ సౌండ్ వినిపిస్తుంది.” జవాన్ల వెనకనించి వచ్చి నిలబడ్డ మిలిటరీ పోలీస్ సుబేదార్ సాబ్ తీక్షణంగా చూస్తూ సూచించాడు.
“రావ్ సాబ్, మీ ఉత్తరం…” అంటూ పిలుపు వినబడింది. టెంట్ లోంచి బయటికి వచ్చి, ఆర్దర్లీ నుంచి ఉత్తరాన్ని అందుకున్నాను.
పిన్ని దగ్గర్నుంచి. “బాగున్నావని తలుస్తున్నాను. నువ్వొచ్చి వెళ్ళి ఆర్నెల్లు దాటుతోంది. తాతయ్య పూర్తిగా మంచానికి అంటుకుపోయారు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. నిన్ను చూడ్డానికే ఇంకా కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకున్నట్లుంది. ఒక్కసారి వచ్చి చూడుబాబూ…”
ఉత్తరం మీది తేదీని చూశాను. దాదాపు రెండు వారాల క్రితం పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎక్సర్‌సైజ్ లో రోజుకో చోటికి మారిపోతుండడం వల్ల, వుత్తరం తిరిగి తిరిగీ నన్ను కలిసేసరికి ఇన్ని రోజులు పట్టింది. అసలు చేరడమే ఆశ్చర్యం. వెంటనే పిన్నికి ఉత్తరం రాయాలి.
కిట్ బాగ్ లోంచి ఆర్మీ ఇష్యూ చేసిన ఇన్లాండ్ లెటర్ ఒకటి తీసి రాయసాగాను. “పిన్నీ! ఒకటి రెండు రోజుల్లో లీవ్ దొరికేలా ఉంది. వెంటనే బయల్దేర్తాను…”
“అరే రావ్‌గారూ, లెటర్ వెటర్ ఛోడో… మీకు తెలుసా? పార్లమెంట్ మీద దాడి జరిగింది నిన్న. ఆర్మీ మొత్తం మూవ్ అవుతోందిట.” వార్తని ప్రకటించాడు సుబేదార్ రంగప్ప.
“ఎక్సర్‌సైజ్ కూడా మళ్ళీ కొత్తగా మొదలవుతుంది బహుశా. ఇంకో అయిదారు నెల్లపాటు ఈ ఇసక మేస్తూ పడుండాల్సిందే.”