సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట

“నేను, భగవంతుడిని సాక్షిగా భావిస్తూ, నియమాల ద్వారా రచించబడిన భారత రాజ్యాంగానికి వాగ్దానబద్ధుడినై, భారతీయ సైన్యంలో నిజాయితీగా, విశ్వాసపాత్రుడినై సేవ చేస్తానని, భారత రాష్ట్రపతి ద్వారా అందిన ఆదేశాలను అనుసరించి భూమి మీద, నీటిమీద, ఆకాశంలో ఎక్కడికి పంపినా వెళ్తానని, నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నా, నా పై అధికారి ఆదేశాలని పాటిస్తాననీ ప్రమాణం చేస్తున్నాను.”

సూర్యుడు నవ్వుతున్నట్లు ప్రకాశిస్తున్నాడు. గాలి ప్రేమగా తడుముతోంది. నాలో ఏదో తెలియని ఉద్వేగంతో, దేశభక్తితో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎదురుగా మువ్వన్నెల జెండా, దానికి ఒక ప్రక్కన ఎర్రటి భారత సైన్య పతాకం, మరో వైపున పైన లేత నీలం, కింద ముదురాకుపచ్చల మధ్య చిక్కటి నీలం రంగు పట్టీతో మా కోర్ పతాకం ట్రైనింగ్ పూర్తిచేసి, శపథం తీసుకుని, భారతీయ సైనికులుగా మారిన మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు రెపరెపలాడుతున్నాయి. మా సరికొత్త ఆలివ్ గ్రీన్ రంగు యూనిఫారాలు, ముదురు నీలం రంగు టోపీల ఫెళఫెళలలో మా శరీరాల రంగులు, ఆకృతులు, భాషలు, కులాలు, జాతులు సమ్మిళితమైపోయాయి, సమసిపోయాయి. తనే ఏకైక వాస్తవంగా, నమ్మకంగా, అబ్బురంగా, వినయంగా రైఫిల్ కుడిచేతితో సావాసం చేస్తోంది. దానితో కలిసిపోతోంది.

సరిగ్గా అయిదునెలల క్రితంవరకూ అదో కొత్త ప్రపంచమని, క్రమశిక్షణకి మారుపేరనీ చూచాయగా తెలుసు. ఆ ప్రపంచం పేరు కూడా తెలుసు. నిజానికి, స్పష్టంగా తెలిసింది పేరొక్కటే.

సరిగ్గా అయిదునెలల క్రితం…

మొదటి గంట

మధ్యప్రదేశ్‌లో ఒక నగరపు శివార్లు. డిసెంబర్ నెల.

చీకటి ముదురుతోంది. ఖాకీ యూనిఫారమ్‌లో ఓ కుర్రాడి వెనక – సన్నటి రోడ్డుమీద, బారక్స్ వరసల పక్కనుంచి నడుస్తున్నాం. ఆ పొడవాటి పెంకుటిళ్ళ వరండాల్లో డిమ్ముగా బల్బులు. ఆ మసక చీకటిలో ఇంకో ఏడెనిమిది బారక్‌ల మధ్య, గుంపులుగా కొందరు కుర్రాళ్ళు… మాకా ప్రపంచం కొత్తగా అస్పష్టంగా కనిపిస్తో బెరుకు పుట్టిస్తోంది.

‘మేం’ అంటే – రేపటినించీ ‘రిక్రూట్లు’గా (సైన్యంలో కడగొట్టు హోదా – సిపాయి కన్నా తక్కువ) సైనిక శిక్షణని పొందబోతున్నవాళ్ళమని తెలియని – ‘సివిలియన్’ కుర్రాళ్ళం.

ఒక బారక్ దగ్గర నడక వేగం తగ్గించి, వెనక్కి తిరిగి కాస్త కరుకుగా “ఏయ్, ఛుప్!” అన్నాడు లీడర్ ఉపాధ్యాయ్. చెప్పిన సమయానికి ట్రైనింగ్ రెజిమెంట్ హెడ్ క్వార్టర్స్‌కి చేరుకున్న మా చిన్న గుంపుని, మా స్క్వాడ్ చేరబోతున్న కంపెనీకి మార్చ్ చేయించి తీసుకెళ్ళే బాధ్యతని, డ్యూటీ హవల్దార్ నించి అందుకున్నవాడు మా లీడర్. అంతవరకూ తమిళంలో గుసగుసలాడుకుంటూ చిన్నగా నవ్వుకుంటున్నవాళ్ళు సైలెంటయారు. వరండాలో దర్జాగా కూర్చున్న ఒకతని ముందుకి వెళ్ళి ఎటెన్షన్లో నిలబడ్డాడు లీడర్.

“జైహింద్ సర్!”

అతను తల పంకించాడు. “కిత్నే హై?”

“సర్, పన్నెండుమంది.” జవాబిచ్చాడు ఉపాధ్యాయ్ వినయంగా. ఇందాకటి కరుకుదనం లేదిప్పుడు.

‘అచ్ఛా!’ అంటూ లేచాడా వ్యక్తి. “శబాష్! భారతీయ సేనా మే ఆప్ సబ్‌ కా స్వాగత్ హై!” ఖంగుమంది గొంతు.

అందరం నిశ్శబ్దంగా విన్నాం, అస్పష్టంగా కనిపిస్తున్న అతన్ని చూస్తూ.

“అందర్ చలో. అందరూ భోజనం చేశారా?” సస్పెన్స్‌ని తేలికపరుస్తూ అడిగాడతను.

నిశ్శబ్దం.

పెదాల మీద అదే చిరునవ్వుతో “ఇస్ మే మద్రాసీ కిత్నే హై? హాథ్ ఉఠావ్?” అడిగాడు.

“…”

“చేతులు. చేతులు పైకెత్తండి.” చెయ్యి పైకెత్తి చూపించాడు.

ఈసారి దాదాపు పది చేతులు పైకి లేచాయి.

“అయ్యొ! తంబీ సాపిట్టా?” అన్నాడు చేత్తో సైగలు చేస్తూ. అర్థమైనట్లు మొహాలు చాటంత చేసుకొని కొందరు తలాడించేరు.

“దేఖా! తిండి అంటే అందరికీ తెలుస్తుంది. కోయీ బాత్ నై. లీడర్! వీళ్ళని తీసుకెళ్ళి, చక్కగా కడుపునిండా భోజనం చెయ్యమను.” లీడర్ తలూపాడు.

“దానికి ముందు…” ఆగేడతను. మా అందర్నీ కలయజూస్తూ అన్నాడు. “పూరే వరండే మే ఫస్ట్ క్లాస్ ఝాడూ లగావ్. ఒక్క పుల్లముక్క కూడా కనిపించకూడదు. శాబాస్. చలో.”

ఏంటి? ఊడవమంటున్నాడా? మమ్మల్నే!? లీడర్ ఉపాధ్యాయ్ బారక్ లోపలికి వెళ్ళి, అయిదారు తాటాకు చీపుళ్ళు తెచ్చి మాకిచ్చేడు. “చలో షురూ కరో. జల్దీ!” అథార్టీగా అన్నాడు.

చటుక్కున ఎవరిమీదో తెలియని కసి, ఆ మొత్తం పరిస్థితి మీదే అసహ్యం చుట్టుముట్టేయి.

ఇవి – గిటార్ వాయించే చేతులు. పాడిన పాటకి చప్పట్లు కొడుతున్న జనాలని, ఫ్లడ్ లైట్ల వెలుగు తెర వెనకనుంచి చూస్తూ జోడించే చేతులు. ‘ఈ మ్యూజిక్కూ గీజిక్కూ తిండి పెట్టవు. జీవితాంతం తాతయ్యా అమ్మమ్మల దగ్గరే ఉంటానంటే కుదరదు. నిన్ను మిలట్రీలో చేర్చుతున్నాను. చేరిపో, బాగుపడాలని ఉంటే,’ అంటూ బాబాయ్ ఇచ్చిన ప్రోత్సాహపు చివాట్ల వానలో తడిసి, బయటికొచ్చి టీ గ్లాస్‌ని పట్టుకున్నప్పుడు వణికిన చేతులు.

తప్పేది లేదు. ఊడుస్తున్నాం. దుమ్ము లేస్తోంది. ఆర్డర్ వేసినతను అక్కడే నుంచుని చూస్తున్నాడు. అతని పక్కన లీడర్. ఆ వ్యక్తి అంటున్నాడు. “అబ్ యే స్క్వాడ్ పూరా హోగయా. మీతో కలిపి ఇరవై తొమ్మిది. ఔర్ ఏక్ లడ్‌కీ భీ హై…” చెవులు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. ఆడపిల్లలా!?

క్షణం ఆగి అతను నవ్వాడు. కొద్దిగా ఎకసెక్కెంగా. లీడర్ సౌండు లేకుండా ఇకిలించాడు. వరండా చివరకి వచ్చాం. “బస్. బహుత్ అచ్ఛా” అన్నాడతను నవ్వుతూ.

“శాబాష్. ఇక పదండి. వెళ్ళి భోజనం చెయ్యండి.”

“ఝాడూ ఆ మూల పెట్టాలి.” ఉపాధ్యాయ్ సూచించాడు.

గుంపు బారక్‌లోకి ప్రవేశించింది. లోపలున్న కొందరు కుర్రాళ్ళు చుట్టుముట్టారు మమ్మల్ని. “కహాకా రెహ్‌నే వాలా?” అంటూ ఒక్కొక్కళ్ళనీ ఊరూ పేరూ అడుగుతున్నారు.

“మహారాష్ట్ర.”

“బిహార్.”

“వెస్ట్ బెంగాల్.”

“ఆంధ్రా.” అన్నాను.

‘మిల్ గయా. మేరా గాఁవ్ కా మిల్ గయా!’ సంతోషంగా కేకేశాడా గుంపులో ఓ కుర్రాడు. వెడల్పుగా నవ్వుతూ నా ముందుకొచ్చి, “నీ పేరేం పేరు?” ఆరా తీశాడు. “రావ్” జవాబిచ్చాను. ఇంకా చేతిలో చీపురున్నట్లే అనిపిస్తోంది.

‘దా, కుచ్చో’ అంటూ తన పక్క పరిచిన చోటికి తీసుకెళ్ళేడు. నేలమీద, మందపాటి నల్లని గొంగళ్ళ మీద పరచిన నీలం రంగు జంపఖానా. తలవైపు మడతపెట్టిన ఖాకీ దోమతెర. కాళ్ళవైపు నల్లని ట్రంకు పెట్టె…

“నా పేరు యెంకటేసులు రెడ్డి. కర్నూలు. మీదేవూరు?”

“విజయవాడ”.

“అంటే యిజీవాడ డిస్ట్రిక్టా?”

“కాదు. విజయవాడే. కృష్ణా డిస్ట్రిక్ట్.” జవాబిచ్చాను.

“లడ్‌కీ ఉందన్నాడా ఛజ్జూరామ్?” నవ్వుతూ అడిగాడు. ఇందాకటి వ్యక్తి మా బారక్ కమాండర్‌ట. “శెతుర్లాడుతుండాడు. మాతోనూ అట్లే శెప్పాడు.” గుట్టు విప్పాడు రెడ్డి.

తనొచ్చి పదహైదురోజులైందంట. బానే ఉండాదంట. కొద్దీగ కస్టమే గానీ మిలట్రీ మంచిదేనంట. ట్రైనింగు జాగర్తగ శేస్కోవాలంట. మాటల్లో ఓ అరగంట గడిచింది. చీకటి ముదిరింది. “ఇయ్యాల మీటుంటది” అన్నాడు సంతోషంగా. “ముందు మెస్‌కెల్దాం పా, మల్లా ఖానా అయిపోద్ది. యెల్తా మాట్లాడుకుందాం. అన్నీ జెప్తాలే” అంటూ నాకో స్టీల్ కంచం ఇచ్చి బయల్దేరాడు. పెద్దగా ఆకలిగా లేకపోయినా అతనితోబాటే నడిచాను. ఇంకా ఏదో చెప్తున్నాడు రెడ్డి.

హఠాత్తుగా ‘టుటుర్ టుటుర్ టుటుర్’ అంటూ విజిల్ మోత వినబడసాగింది. ఏదో చెప్పడానికి నోరు తెరిచిన రెడ్డి చటుక్కున తన కంచాన్ని నా చేతిలో పెట్టేశాడు. “ఆగ్ ఆగ్ ఆగ్” అని అరుస్తూ పరుగు తీశాడు. పక్క బారక్‌ల నుంచి కూడా అలాంటి అరుపులే వినిపించసాగాయి.

టకటకమంటూ లైట్లారిపోతున్నై. చాలామంది పరుగులు తీస్తున్నారు.

మంటలా? ఇళ్ళేమైనా తగలబడుతున్నాయా? విజయవాడలో ఎండాకాలంలో ఫైరింజన్ల గణగణ గంటలు గుర్తొచ్చాయి.

ఇనపబకెట్లతో కొందరు, వెనకాలే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు మోసుకుంటూ మరికొందరు పరిగెట్టేరు. ఛజ్జూరామ్ గొంతు గట్టిగా వినిపిస్తోంది. “జల్దీ కరో! నిప్పంటుకుంది మెస్ దగ్గర… ఇక్కడేం చేస్తున్నారు? భాగో భాగో…”

అందరితోబాటు పరిగెడుతూ విశాలమైన నలుచదరపు గుంటలాంటి గ్రౌండ్లోకి చేరాను. చాలామంది గ్రౌండ్ చుట్టూ జట్లు జట్లుగా నిలబడుతున్నారు. మధ్యన ఖాళీ జాగాలో ఒక చిన్న గడ్డి కుప్ప వేశారు. కొన్ని జట్ల ముందు వరసగా ఎర్రని ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, బకెట్లు. ఒక జట్టులో కలిశాను. పక్కన కుర్రాడు నా చేతిలోని రెండు కంచాలని చూసి నవ్వుకున్నాడు.

‘టుటుర్ టుటుర్ టుటుర్’మంటూ కూస్తున్న విజిల్ ఆగిపోయిందిప్పుడు. చివరగా ఒక్కసారి పొడుగ్గా మోగింది. లైట్లు వెలిగాయి. గ్రౌండ్‌లో ఒకే ఒక్క మూలనున్న లైట్‌తో సహా. అంతమంది ఉన్నా, గ్రౌండ్ పూర్తి నిశ్శబ్దంగా ఉంది. వయసులో కొంచెం పెద్దవాడిలా ఉన్న ఒకతను నేరుగా గ్రౌండ్ మధ్యలోకి వచ్చాడు. ఉపోద్ఘాతమేదీ లేకుండా మొదలుపెట్టాడు.

“ఆజ్ కా ఇస్ ఫైర్ ఫైటింగ్ ప్రాక్టీస్ మే, ఆప్ లోగోనే జో ప్రదర్శన్ దియా హై, వో బహుత్ ఘటియా కిసమ్‌కా హై.”

ఆఁ? ప్రాక్టీసా!?

“అందరికంటే ముందుగా చేరుకోవలసిన ఫైర్ ఫైటింగ్ టీమ్ మూడో స్థానంలో చేరుకుంది. ముందు కార్డన్ టీమ్ వచ్చింది. ఆ తర్వాత…” అంటూ తల తిప్పి అందర్నీ చూస్తూ పెద్ద గొంతుకతో మొదలుపెట్టాడు. ఏమంటున్నాడో? ఎందుకు తిడుతున్నాడో? రెడ్డిని అడగాలి. ఏడీ?

చుట్టూ అందరూ ఖాకీ స్వెట్టర్లలో ఉన్నారు. ముందు లైన్లో నలుగురైదుగురి తర్వాత… రెడ్డేనా? “స్ స్ రెడ్డీ,” అన్నాను గుసగుసగా. వెంటనే పక్కనుంచి “ష్” అంటూ అదిలించారెవరో.

“కోన్ దిఖా సక్‌తా హై?” అంటున్నాడు ఆ లెక్చరిస్తున్నతను. ఇప్పుడా చెత్తకుప్పనుంచి మంట పైకి లేస్తోంది.

ఒక కుర్రాడు ముందుకొచ్చాడు. ఒక ఎక్స్‌టింగ్విషర్ని పైకెత్తి, అమాంతం తలక్రిందులుగా తిప్పి నేలమీద కొట్టాడు. దాని నాజిల్ లోంచి తెల్లని ద్రవం బుస్సుమంటూ బయటికి చిమ్మింది. మంటకి అయిదారడుగుల దూరంలోకి వచ్చి నిలబడి, ఆ ద్రవాన్ని మంట మీదికి తిప్పాడతను. క్షణాల్లో మంట ఆరిపోయింది.

“ఠీక్ హై.” అన్నాడు లెక్చరిస్తున్న వ్యక్తి. “ఓయ్ సీహెచ్చెమ్!” (కంపెనీ హవల్దార్ మేజర్) అంటూ పిలిచాడు.

అంతవరకూ ఒక పక్కన నిలబడ్డ ఛజ్జూరామ్ పరుగులాంటి నడకతో అతని ముందుకి వచ్చాడు. రెండు క్షణాలు ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. శ్రద్ధగా తలూపుతూ వింటున్నాడు ఛజ్జూరామ్. వినడం అయిన వెంటనే బిగ్గరగా అరిచాడు.

“కంప్‌ణీ. సావ్‌ధాన్!” ఎటెన్షన్‌లో నిలబడి, మడమలు పైకెత్తి కిందకి దించాడు. ఆ వ్యక్తి కూడా ఎటెన్షన్‌లో నిలబడి, హుందాగా తలపంకించి, గ్రౌండ్ లోంచి బయటకి నడిచాడు.

“కంప్‌ణీ. వీశ్రామ్! ఎక్కణ్నించి తెచ్చిన సామాన్లు అక్కడే పెట్టేయండి. డిస్పర్స్” ధాటీగా ఆదేశించాడు ఛజ్జూరామ్.

అందరూ బారక్‌ల వైపుకి కదిలారు. రెడ్డి ప్రత్యక్షమయ్యాడు.

“ఆ వచ్చింది ఎవరు రెడ్డీ?”

“ఎస్‌జెసీవో సాబు.”

“అంటే?”

“అంటే సుబేదార్ సాబు. మన కంపినీ కాదు. చార్లీ కంపినీ సాబు అనుకుంటా,” అన్నాడు రెడ్డి, ‘ఎస్‌జెసివొ’ అంటే ఏమిటో?

“ఫైర్ ఫైటింగ్ సరిగ్గా లేదంట. ఇంగ ఛజ్జూరామ్ ఊరుకోడు.” అన్నాడు రెడ్డి భయంగా.

బారక్‌కి తిరిగివచ్చాక, నా చేతిలోంచి ప్లేటు తీసుకుని “పా” అంటూ దారితీశాడు రెడ్డి. మళ్ళీ ఇందాకటి గ్రౌండ్‌ లోకి చేరాం. మసక చీకటి. అటుపక్క ఒక హాల్. “అదే మన అల్ఫా కంపినీ మెస్సు. అడుగో అక్కడున్నాడే మీసాలోడు. ఆడే మెస్ కమాండ్రు. నాయక్ యాదవ్. శాన దొం…” ఓ బూతుమాటతో అతన్ని పరిచయం చేశాడు రెడ్డి.

ఒక పక్కనున్న నీళ్ళ టాంక్ దగ్గర కంచాన్ని కడిగాడు. చాలామంది కంచాలతో గుంపులు గుంపులుగా గ్రౌండ్లోకి చేరుకుంటున్నారు.

“ఫైర్ ఫైటింగ్ ప్రాక్టీస్ ఎప్పుడుంటాదో శెప్పేస్తే ఎవురూ రారు! ఇందాకట్లా ‘టుటుర్ టుటుర్’ అని యిజిల్ మోగ్గానే అందరూ యెల్లి గ్రౌండ్‌లో ‘ఫాలిన్’ కావాల.” తనే నాకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు వివరిస్తున్నాడు రెడ్డి.

“ఖానా ఆగయా. ఖానా ఆగయా.” అంటూ హడావిడి మొదలైంది.

అందరూ చకచకా వరసలుగా నిలబడసాగారు. ఒక్కొక్క వరసా ఒక్కొక్క స్క్వాడ్‌ట. ఒక్కళ్ళు కూడా తక్కువకాకుండా స్క్వాడ్‌ మొత్తం క్యూ కడితేగానీ ఆ స్క్వాడ్‌కి ‘ఖానా’ ఇవ్వరట. ఒక పాత్ర వెనుక ఒక కుర్రాడు నిలబడి, ముందుకి చాస్తున్న కంచాల్లో కూర వడ్డిస్తున్నాడు. నాయక్ యాదవ్ చేతిలో ఒక నోట్‌బుక్‌తో నిలబడి, “ఎంత కావాలంటే అంత తినండి. ఏం పర్వాలేదు” అంటున్నాడు ప్రోత్సహిస్తున్నట్లు. నవ్వుతూ కొందరిని పలకరిస్తున్నాడు.

“ఓయ్! ఉపాధ్యాయ్, తేరా స్కాట్ పూరా హోగయా క్యా?”

“హా సర్. ఆజ్ హోగయా.” నవ్వుతూ జవాబిచ్చాడు ఉపాధ్యాయ్.

“ఎందరున్నారిప్పుడు?”

“ముప్పై సర్.”

“అందరూ వచ్చారా ఇక్కడికి?”

“యస్ సర్.”

“ఠీక్ హై. శాబాష్. ఖానా లేలో. ఆజావ్.” అన్నాడు లెక్కపెట్టకుండానే!

క్యూలు కదులుతున్నాయి. గ్రౌండ్‌లో, కంచాలు నేలమీదే పెట్టుకుని తింటున్నారు. సివిల్ డ్రెస్సుల్లో ఉన్న మమ్మల్ని “నయా స్క్వాడ్ హై క్యా? ఆగే జావ్” అంటూ లైన్ తప్పించి ముందుకి పంపించారు. రెడ్డి తర్వాత, వడ్డిస్తున్న కుర్రాడు, ముందుకి చాచిన నా కంచంలో వడ్డించాడు. మాంసం కూర.

“నై. మీట్ నై” అన్నాను కొంత బెరుగ్గా…

“తినవా? పర్లేదు. ఇవాళ తినెయ్” అంటూ తర్వాతి వాళ్ళకి వడ్డించడంలో బిజీ అయిపోయాడతను.

“నాకిచ్చేయ్‌లే. ఇంద. దాల్ యీడుంది. తీస్కో” అంటూ నాకు పల్చటి పప్పుని చూపించాడు రెడ్డి. కూర నా కంచంలోంచి అతని కంచంలోకి మారింది. అన్నం సరిగ్గా ఉడికినట్లనిపించలేదు. కూర ఏమిటో తెలీదు. ‘దాల్’ని కూడా గుర్తుపట్టలేకపోయాను. ఇంతకు ముందెప్పుడూ చూసిన పప్పు కాదది. తింటున్నాను.

మాట్లాడుతూనే గబగబా తింటున్నాడు రెడ్డి. ఇందాక మాట్లాడిన ఛజ్జూరామ్‌ – హవల్దార్‌ట. అంటే, మూడు v షేపు గీతలుంటాయిట. చొక్కా కుడి భుజమ్మీద. లీడర్ పేరు ‘ఉపాధ్యాయ్‌’ట. యూపీ వాడుట. మాలాగే రంగ్‌రూటేట. అంటే రిక్రూటేనట. పది నిముషాలైందో లేదో మళ్ళీ గట్టిగా విజిల్. “రోల్‌కాల్‌ యిజిల్ ఇది” అన్నాడు రెడ్డి.

ఈసారి గ్రౌండ్‌లో మా స్క్వాడ్ అందరికన్నా ఎడమవైపు అంచున నిలబడింది. ప్రతి స్క్వాడ్‌కీ ముందు దాని లీడర్. మాకు ఎదురుగా నిలబడింది ఈ కంపెనీలోకెల్లా సీనియర్ స్క్వాడ్ అట. ఇరవై వారాల ట్రైనింగ్ పూర్తయి, కొద్దిరోజుల్లో ‘పాసవుట్’ అయి – అంటే తర్వాతి పన్నెండు నెలల ట్రైనింగ్ చెయ్యడానికి- మరో రెజిమెంట్‌కి వెళ్ళిపోతార్ట వాళ్ళంతా. ఆ స్క్వాడ్‌ని చూస్తే కొంచెం ఈర్ష్యగా అనిపించింది. గ్రౌండ్ గట్టుమీద పొట్టిగా ఉన్న ఒకతను వచ్చి నిల్చున్నాడు. మరోసారి గట్టిగా విజిల్ వేశాడు.

“కంప్‌ణీ, సావ్‌దాణ్!” గట్టిగా కమాండ్ చేశాడు. గ్రౌండ్‌లో నిల్చున్నవాళ్ళందరూ ఎడమకాళ్ళు చటుక్కున ఎత్తి కుడికాళ్ళకి దగ్గరగా శబ్దం వచ్చేట్లు ‘స్టాంప్’ చేశారు.

“రిపోర్ట్!”

“అల్ఫా థర్టీ సెవన్?”

మాకు ఎదురుగా నిల్చున్న స్క్వాడ్ లీడర్ గట్టిగా రిపోర్ట్ చెప్పాడు. “ట్వెంటీ ఫోర్ అవుటాఫ్ ట్వెంటీ ఫోర్ సర్.”

“ఫార్టీ టూ?”

“ట్వెంటీ సెవెన్ అవుటాఫ్ ట్వెంటీ సెవెన్ సర్.”

“ఏక్ తుమ్హారా ఎమ్మెచ్ (మిలిటరీ హాస్పిటల్) మే థా నా? వాడొచ్చేశాడా?”

“వచ్చాడు సర్.”

“మరి చెప్పవేరా? నిద్రపోతున్నావా హరామ్‌ఖోర్?” గద్దించాడతను. ఎఫెక్ట్ కోసం అన్నట్లు రెండు క్షణాలాగాడు. ఆ స్క్వాడ్ లీడర్ నోరు మూతపడింది.

“ఫార్టీ ఎయిట్?”

“ఫిఫ్టీ వన్ – ట్వెంటీ ఎయిట్ అవుటాఫ్ ట్వెంటీ నైన్ సర్.”

“ఇంకోడెక్కడ చచ్చాడు?”

“బారక్‌లో సర్.” అన్నాడు లీడర్.

“అక్కడేం చేస్తున్నాడు? గుడ్లు పెడుతున్నాడా?”

“నై సర్. వాడికి ఒంట్లో బాలేదు సర్.”

“ఏమైంది?” పెన్నూ ప్యాడూ కిందికి దించి అడిగాడు.

“వాంతులవుతున్నాయి సర్.”

“కడుపుతో ఉన్నాడా, సాలా?”

“…” నవ్వులు.

“బారక్‌లోనే ఉన్నాడా? లేకపోతే డోక్కోడానికి దేక్కుంటూ దేక్కుంటూ వాళ్ళ వూరికెళ్ళిపోయాడా?”

కొందరు నవ్వారు. గుసగుసలుగా. పారిపోయాడా అని అడుగుతున్నాడా?

“హై సర్. బారక్ మే హీ హై.” లీడర్ జవాబిచ్చాడు.

“కిలియర్‌గా చెప్తాను వినండొరేయ్. సీజన్ మారుతోంది. టైం దొరగ్గానే ‘వెట్ కాంటీన్’‌లో దూరి ఇష్టమొచ్చినవన్నీ మింగకండిరా తెలివితక్కువ నాయాళ్ళలారా. పొట్ట పగలా తింటే వాంతులేం, విరేచనాలు కూడా పట్టుకుంటాయి. అప్పుడు రండి నా దగ్గిరికి. మైఁ కర్తా హూఁ ఉస్ కా ఇలాజ్ అఛ్ఛే సే.”

“అల్ఫా సిక్స్టీ! మీ స్క్వాడ్ పూర్తయిందిరా?”

“నహీ సర్” అని తడబడి “ఇవాళే అయింది సర్” అంటూ సర్దుకున్నాడు మా లీడర్ ఉపాధ్యాయ్.

“కంప్‌ణీ. వి-శ్రామ్!” అని అందరితోబాటు అతను కూడా ‘స్టాండ్ ఎట్ ఈజ్’ పొజిషన్‌లో నిల్చున్నాడు. ఆ తర్వాత లెక్చర్ మొదలైంది. దాదాపు అరగంటసేపు అతను అదో రకమైన యాసలో, పెద్ద గొంతుకతో మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఏదో వివరిస్తున్నట్లు, కొన్నిసార్లు గద్దిస్తున్నట్లూ తెలుస్తోంది.

అలా చివాట్ల స్వరం పెంచి ఉన్నట్టుండీ “బెండ్. బెండ్ నీచే. హరాంఖోరో!” అన్నాడు. చటుక్కున గ్రౌండ్లో నిలబడ్డ వాళ్ళందరూ నేలమీద బోర్లాపడుకున్నారు. నేనూ పడుకున్నాను.

ఇది ఆర్మీలో ఇచ్చే పనిష్మెంటా? అన్నం తిన్న తర్వాత, బట్టలకి మట్టి అంటేలా పడుకోబెట్టడం? గడ్డం నేలకి ఆనుతోంది. నా ముందర మట్టిలో పల్చటి ఎముక ముక్క. వాసన.

కమాండర్ గొంతు ధాటిగా వినిపిస్తూనే ఉంది. చివరికి, “ఖడే హోజావ్. సిగ్గులేని వెధవల్లారా!” అన్నాడు. అంతా లేచి నిలబడ్డారు. మళ్ళీ లెక్చర్. అదిలింపులు. బెదిరింపులు. మరో పావుగంట.

“కంప్‌ణీ, సావ్‌-ధాణ్! లైన్ తోడ్!” అన్నాడు చివరికి. రోల్‌కాల్ ముగిసింది. కట్టు విడిచిన వాళ్ళలా అందరూ తమ తమ బారక్‌ల వైపుకి దార్లు తీశారు.

“యీడు హవల్దార్ ఛత్రీ. దొంగలంజకొడుకు. సాలా జాగర్తగుండాల. పద.” రెడ్డి ఇతన్ని కూడా ఒక తిట్టుతో పరిచయం చేసి, ఫ్రెండ్లీగా వార్నింగిచ్చాడు. “ఇప్పుడేంటి?” అడిగాను. “ఇప్పుడింకేం లేదు. పడుకోవాల.”

పడుకున్నాం. తమిళనాడు కుర్రాళ్ళు లోగొంతుకలతో ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు.

“ఏయ్ ‘కుడ్ కుడ్’ లోగ్! పడుకుంటారా లేదా? నాలుగింటికి లేవాలి.” దోమతెరలోంచే గట్టిగా అదిలించాడు ఉపాధ్యాయ్. లైట్లన్నీ ఆఫ్ అయి, బారక్‌ నిశ్శబ్దమైంది.

బలవంతంగా మూసుకున్న కళ్ళకింద అనేక ప్రశ్నలు.

ఇది నేను విన్న, సినిమాల్లో చూసిన సైన్యమేనా? వాస్తవం ఇలాగే ఉంటుందా? న్యూస్ రీళ్ళలో చూపించే రిపబ్లిక్ డే పెరేడ్‌లో డ్రిల్ చేసేవాళ్ళు వీళ్ళేనా? మిలట్రీవాళ్ళంటే మొరటుగా ఉంటారేమో అనుకున్నా. అలా లేరే! ఇక్కడ అందరూ నాలాగే ఉన్నారే? ట్రైనింగ్ ఎలా ఉంటుంది? కష్టమా? నావల్ల అవుతుందా?

ఎక్కడి నా వూరు! ఎక్కడ ఈ వూరు! జీవితపు మలుపు తిరిగినట్లేనా అయితే? మళ్ళీ గిటార్ ఎప్పుడు పట్టుకుంటానో?

అవన్నీ తర్వాత. నాలుగింటికే లేవాలంటే వెంటనే నిద్రపోవాలి. రెండు రగ్గులు పరచి వాటి మీద దుప్పటి పరచినా కట్టె చలి వేగంగా చుట్టుముడుతోంది.

నిద్ర రాదేం?