పొద్దున్న.
దుప్పట్లో పాదాలు హాయిగా వెచ్చగా ఉన్నాయి. ‘అబ్బా ఇంకాసేపాగి లేద్దాం లెద్దూ…’
“ఏయ్ నయా హనుమాన్‌లోగ్, ఉఠో ఉఠో!” అంటూ అరుస్తున్నారెవరో. కళ్ళు తెరిస్తే మండుతున్నాయి.
కుదుపుతూ లేపుతోంది లీడర్ ఉపాధ్యాయ్. టైమ్ చూశాను. మూడుమ్ముప్పావు. ఇందాకేగా పడుకుందీ? అప్పుడే?!
పక్కమీదే కూర్చుని చూడసాగాను. లైట్లన్నీ వెలుగుతున్నాయి. వారాల తరబడి ఉతక్కుండానే తొడుక్కుంటున్న ఖాకీ సాక్స్ నించి ఒక రకమైన ముక్కవాసన దట్టంగా నిండింది బారక్‌లో. కొందరు గడ్డం గీసుకుంటున్నారు. కొందరు ప్లాస్టిక్ బకెట్లు పట్టుకుని బాత్‌రూములవైపు పరుగులు తీస్తున్నారు. మందపాటి లెదర్ సోల్స్ ఉన్న నల్లని బూట్లకి తెగ పాలిష్ పెడుతున్నారు మరికొందరు. ఇంకొందరు బెల్ట్‌కున్న ఇత్తడి బకిల్స్ మెరిసేలా బ్రాసో రుద్దుతున్నారు.
నాతోబాటు నిన్న వచ్చిన కుర్రాళ్ళలో పొట్టిగా సన్నగా ఉన్న ఒకడు వొత్తుగా ఉన్న తన జుట్టుకి అప్పుడే చక్కగా కొబ్బరినూనె రాసినట్లున్నాడు – అది నిగనిగలాడుతోంది. జుట్టులాగే అతని వొళ్ళు కూడా నల్లగా మెరుస్తోంది.
“జల్దీ కరో. దస్ మినిట్ మే బాహర్ ఫాలిన్ హై. జల్దీ కరో” గట్టిగా కేక పెట్టాడు ఉపాధ్యాయ్.
గబగబా బాగ్‌లోంచి బ్రష్, పేస్టూ తీసుకుని, రెడ్డి కోసం చూశాను. ఓర్నీ! అతనప్పటికే రెడీ అయి, ఖాకీ యూనిఫారమ్‌లో ఉన్నాడు. నన్ను చూసి సైలెంట్‌గా నవ్వుతున్నప్పుడు గమనించానతని హెయిర్ కట్‌ని. కేవలం మాడుమీద ఏదో పెద్ద మచ్చలా ఉంది జుట్టు. చుట్టూతా ఖాళీ. చేతిలో నీలిరంగు టోపీ. దాని మీది జిమ్మీ – ఇత్తడి బొమ్మ, మా కోర్ ఎంబ్లమ్ – తళతళా మెరుస్తోంది.
“యెల్లెల్లు. మళ్ళీ ఫాలిన్‌కి యిజిలేస్తాడు” అన్నాడు.
బాత్రూమ్ వైపు పరుగెత్తాను. తిరిగివచ్చేటప్పటికే కొత్త కుర్రాళ్ళు దాదాపు అందరూ బారక్ బయట ‘ఫాలిన్’ అయి కనిపించారు. గబగబా వెళ్ళి వాళ్ళలో కలిశాను. ఉపాధ్యాయ్ బయటికి వచ్చి, మమ్మల్ని లెక్కపెట్టి, బారక్ కమాండర్ గదివైపుకి వెళ్ళాడు. ‘సర్’ అన్నాడు లోపలికి వినిపించేట్లు. బయటికి వచ్చిన బారక్ కమాండర్‌తో ఏదో మాట్లాడి, మా దగ్గరికి వచ్చాడు మార్చింగ్ పద్ధతిలో చేతులూపుకుంటూ. వస్తూనే పెద్దగా గొంతెత్తేడు.
“స్క్వాడ్! దహినే ముడ్! తేజ్ ఛల్!”
చూస్తున్న ఛజ్జూరామ్ ఆపమన్నట్లు చేత్తో సైగ చేసి, “అరే, యే నయే హై. ఇవాల్టికి అలా వెళ్ళనీ. ఏయ్ బచ్చే లోగ్! సరిగ్గా నడవాలి. అడ్డదిడ్డంగా కాదు. ఠీక్ హై?” అన్నాడు. తలలూపి కదిలాం. ఈసారి గుంపుగా కాకుండా, ముందు ముగ్గురు, వాళ్ళ వెనక మరో మూడు వరసల్లో మిగిలినవాళ్ళం. తమిళనాడు కుర్రాళ్ళు మళ్ళీ ఏదో గుసగుసలుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు.
గోడౌన్ లాంటి ఓ చిన్న కట్టడం అది. లోపలికి వెళ్ళాక, అందులో గుడ్డి వెల్తుర్లో ముందుగా కనపడిందో కుర్చీ. కళ్ళు ఆ మసకచీకటికి అలవాటు పడ్డ తర్వాత – గోడకానించిన అద్దం. ఓ!
“ఆజావ్. బైఠో” అంటూ వినిపించేక గానీ అక్కడో మనిషి ఉన్నాడని తెలియలేదు. ఒక కుర్రాడు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
అంతే. రెండున్నర నిముషాల్లో అతని రూపం మారిపోయింది. పక్కల్లో జుట్టుని మిషన్‌తో పూర్తిగా తీసేసి, నడినెత్తిన అరచేతి మేర శాంపుల్ కోసం అన్నట్లు మిగిల్చాడా మంగలి. రెండో కుర్రాడిమీద పని మొదలైంది. ఇప్పుడు అతనూ రెడ్డిలాగే అనిపిస్తున్నాడు. అద్దంలో చూసుకున్న మొదటి కుర్రాడు లేచొచ్చి, మా పక్కన నిలబడ్డాడు. అంత మసక వెల్తుర్లోనూ అతని మొహం మరింత రంగు తగ్గడం స్పష్టంగా తెలుస్తోంది.
మూడు, నాలుగు… నేను. మెడ వెనక మిషన్ ఐస్ ముక్కలా చల్లగా తగిలి టకటకమంటోంది. మూడు నిముషాల తర్వాత అద్దం ముందు నిల్చున్నాను. ఏమీ కనపడలేదు. అద్దం వుందని తెలుస్తోంది. మొహమేదీ?
ఆ గుడ్డివెల్తుర్లో కాసేపు వెతుక్కోగా, పైభాగం దాదాపు బోడిగా, బుగ్గలు కొద్దిగా ఉబ్బిన ఒక జోకర్ వంటి రూపం అందులో తెలిసింది. అది నా మొహమే అయినా, ఒకటి రెండు క్షణాలకన్నా ఎక్కువసేపు చూడలేకపోయాను. అయిదారు నిముషాలపాటు అద్దం ముందు ఇష్టంగా దువ్వుకునే జుట్టు, కళ్ళమీద పడ్డప్పుడల్లా తలని వెనక్కి విదిలించి పైకి చేర్చే జుట్టు, ఆడపిల్లల్ని చూడగానే అప్రయత్నంగా సవరించుకునే జుట్టు, రెండ్రూపాయలు ఎక్కువిచ్చి మరీ స్టయిలుగా కట్ చేయించుకునే జుట్టు ఇప్పుడు నిర్లిప్తంగా, నిర్జీవంగా నేలకి రాలి, కుర్చీ చుట్టూ పరుచుకున్న కుప్పలో కలిసిపోయింది.
తమిళ కుర్రాడు చిన్నగా ఏడుస్తున్నాడు. వెంట్రుకల కుప్పని చూస్తూ నోరు నొక్కుకుంటూ వెక్కుతున్నాడు.
అందరి(కీ) క్షవరం అయింది. జుట్టుతోబాటు ఇంకా ఏవో చాలా తెగిపోయి, పగిలిపోయినట్లనిపించింది. ఆ ఉమ్మడి వేదనని నిశ్శబ్దంగా పంచుకున్నాం. మలుపు తిరిగిన కొత్తజీవితాన్ని మొదలుపెట్టామని మరోసారి బోధపడింది, అద్దంలో మా కొత్త ముఖాలు కనపడగానే!
అప్పటికి మరి కొంత తెల్లవారింది. స్టోర్‌లో ఇచ్చిన బట్టలు వేసుకున్నాం. అవి సరిగ్గా ఫిట్ అయింది చాలా తక్కువమందికే. ఖాకీ స్వెట్టర్ చలిని పెద్దగా ఆపలేకపోతోంది. వాటితోనే, ఉపాధ్యాయ్ నాయకత్వంలో డ్రిల్ గ్రౌండ్‌కి చేరుకున్నాం. రెండు ఫుట్‌బాల్ మైదానాలంత విశాలంగా ఉంది ఆ గ్రౌండ్. దానికి ఆ వైపు పొడవునా పెద్ద పెద్ద చెట్లు. పొగమంచు తెర ఇంకా తొలగిపోలేదు. మధ్యలో పొడవాటి ఫ్లాగ్ పోస్ట్, గంభీరంగా కదుల్తున్న త్రివర్ణ పతాకం. దానికి రెండు పక్కలా మరో రెండు జెండాలు. ఫ్లాగ్ పోస్ట్ ముందో చిన్న అరుగు.
తొందర్లోనే, నలభై స్క్వాడ్‌లు నిలబడిన ఆ గ్రౌండ్ సద్దుమణిగింది. వరుసల్లో రిక్రూట్లు. జట్టు కుడిపక్కన ట్రైనర్. జట్ల ముందు, ఒకే వరుసలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు. “జేసీవోలంటే, ఆళ్ళు ఆపీసర్లకి, మనకీ మద్దిలో ఉండేవోళ్ళు. ఆర్మీలో ఇరవయ్యేళ్ళ పైన సర్వీస్ శేసినోల్లే అంతా,” రెడ్డి క్లుప్తంగా గుసగుసల్లో వివరించాడు. ఇరవయ్యేళ్ళే? అమ్మో!
ఒకతను గ్రౌండ్ పక్కనుంచి పరుగెత్తుకుంటూ వచ్చి, అరుగు దగ్గర, స్క్వాడ్‌లకి ఎదురుగా నిలబడ్డాడు. ఎటెన్షన్లోకి మారి, బిగ్గరగా కమాండ్ చేశాడు. “రెజిమెంట్! సావ్-ధాన్” గొంతు గ్రౌండ్ గోడకి తగిలి ప్రతిధ్వనించింది.
అందరూ ఒక్కపెట్టున ఎడమపాదాన్ని కుడిపాదానికి పక్కన బలంగా తాడించి, ఎటెన్షన్‌లోకి వచ్చారు. చూసి మేమూ అలానే చేశాం. జేసీవోల పంక్తి ఇంకా ‘ఎట్ ఈజ్’ లోనే ఉంది.
“రిపోర్ట్” అన్నాడతను అదే గొంతుతో. అక్కడ ఉన్న మూడు ‘కంపెనీ’ల నుంచీ ఒక్కొక్కరుగా అతని దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి, రిపోర్ట్ ఇచ్చి, తిరిగి తమ స్థానంలో నిలబడ్డారు. వాళ్ళు సీనియర్లుట.
అతను మళ్ళీ బిగ్గరగా “రెజిమెంట్, వీ…శ్రామ్” అన్నాడు. అందరూ ‘ఎట్ ఈజ్’ లోకి వచ్చారు.
వెంటనే మళ్ళీ కమాండ్ “రెజిమెంట్, సా…వ్‌ధాన్”.
రెజిమెంట్ మళ్ళీ ఎటెన్షన్‌లోకి.
అతను ‘రెజిమెంట్ హవల్దార్ మేజర్’ అట. అందరికన్నా సీనియర్ హవల్దార్. అతని రాంక్ తర్వాత జేసీవో రాంక్‌లు మొదలౌతాయట.
ఇంతలో అతని వెనుక, వయసులో పెద్దవాడిలా కనిపిస్తున్న ఒక జేసీవో వచ్చి నిలబడ్డాడు. ఎటెన్షన్‌లో నిలబడి రిపోర్ట్ తీసుకున్నాడు. ఆయన ఈ రెజిమెంట్‌కి ‘సుబేదార్ మేజర్ సాబు’ అని చెప్పాడు రెడ్డి. ఆయన కూడా ఒక్కొక్కసారి చొప్పున రెజిమెంట్‌ని సంబోధించి ‘ఎటెన్షన్’, ‘స్టాండ్ ఎట్ ఈజ్’ చేయించిన తర్వాత, ఆయన వెనుక మరొకతను వచ్చి నిలబడ్డాడు. వీళ్ళిద్దరికన్నా అతను చాలా కుర్రవాడిలా, స్పురద్రూపంతో ఉన్నాడు. అతని పీటీ యూనిఫారమ్ కొంత స్టయిలిష్‌గా ఉంది. అతను మేజర్! అంటే ఆఫీసరట!
సుబేదార్ మేజర్ అందర్నీ ఎటెన్షన్‌లోకి తెచ్చి, గిరుక్కున వెనుదిరిగి, మేజర్ ముందు నిలబడి, సెల్యూట్ చేసి రిపోర్ట్ ఇచ్చాడు. ప్రతిగా సెల్యూట్ చేసి, రిపోర్ట్ తీసుకుని, బిగ్గరగా కమాండ్ ఇచ్చాడా మేజర్!
“రెజిమెంట్! దహినే ముడ్!”
అందరూ కుడివైపుకి – తొంభై డిగ్రీల కోణంలో తిరిగారు. మేమూ తిరిగాం.
“దౌడ్‌కే ఛల్!” జాగింగ్ మొదలైంది.
ఒక్కొక్క అడుగూ వేస్తున్న కొద్దీ శరీరం వేడెక్కుతోంది. కలిసి పరుగుపెడుతున్న స్క్వాడ్. కలిసి చెమటోడుస్తూ. కొత్త కొత్త స్నేహాలని పేనుకుంటూ. అందులో ఏ ఒక్కరి ప్రపంచమూ మరొకరితో పోలదు బహుశా. కానీ ఇప్పుడు మాదంతా ఒకే బతుకుబాట. ఆ లయ, ఆ వేగంలో వొళ్ళు వెచ్చబడుతున్న కొద్దీ ఒక కొత్త హుషారు, కొత్త సంతోషం మేల్కొనసాగింది. ఇదే, ఇదే నా దారి అని, ఇందులోనే కొనసాగాలనీ స్పష్టమైంది.
జాగింగ్ చేస్తోంటే డ్రిల్ గ్రౌండ్‌లో పరచిన సన్నటి కంకరరాళ్ళమీద, మేం తొడుక్కున్న మందపాటి లెదర్ సోల్డ్ బూట్ల శబ్దం ‘ఠక్-ఠక్-ఠక్-ఠక్’ అంటూ లయబద్ధంగా వినిపిస్తోంది. స్క్వాడ్ మొదటి వరస పక్కనే పరుగెడుతున్న ‘ఉస్తాద్’ గట్టిగా మొదలుపెట్టాడు. ‘ఏక్-దో-ఏక్, ఏక్-దో-ఏక్, బోలో జోర్ సే… ఎడమ మీద ‘ఏక్, కుడి మీద ‘దో’. మళ్ళీ ఎడమ మీద ‘ఏక్’. తర్వాత కుడి మీద ‘ఖాళీ’. అందరం గట్టిగా అనడం మొదలుపెట్టాం. ‘ఏక్-దో-ఏక్. ఏక్-దో-ఏక్. ఏక్-దో-ఏక్. ఏక్-దో-ఏక్.’ గ్రౌండ్‌కి ఒక వైపున్న గోడకి తగిలి మా గొంతులు మాకే మళ్ళీ వినిపిస్తున్నాయి.
తమిళ కుర్రాళ్ళు ‘యేక్ తో యేక్. యేక్ తో యేక్’ అంటూ నవ్వుకుంటూ పరుగెడుతున్నారు.. ఉస్తాద్ వాళ్ళకేసి కరుకుగా చూశాడు. నవ్వులు ఆగిపోయాయి. అలా పలుకుతూ పరుగెత్తుతున్నప్పుడు మధ్యలో ఊపిరి తీసుకోవడానికి తక్కువ అవకాశం దొరికి, ఆ అరక్షణంలోనే ఎక్కువ ఊపిరి పీలుస్తుండటంతో శరీరం తొందరగా వేడిని సంతరించుకుంటోంది.
ఇప్పుడు ఒక రకమైన మజా. ఇబ్బంది మెల్లిమెల్లిగా తొలగిపోతోంది. చిరుచెమట మొదలై, పెట్టుకున్న టోపీ తల చుట్టూ టైట్‌గా ఉండడంతో లోపలే ఇంకిపోతోంది. నాకు ముందు పరుగెత్తుతున్న రిక్రూట్ బనియన్ పూర్తిగా తడిసినట్లు, టక్ చేసిన షర్ట్ మీద బెల్ట్ దగ్గరా, బెల్ట్ కింద ఉన్న నిక్కర్ మీదా ఆ తడి ఛాయ స్పష్టంగా తెలుస్తోంది.
నాదీ అదే పరిస్థితి.
అలా గ్రౌండ్ అంచు వెంబడి నాలుగైదు రౌండ్లు కొట్టిన తర్వాత, దిగ్గారుతున్న చెమటల మధ్య, డ్రిల్ పీరియడ్ మొదలైంది. డ్రిల్ కమాండ్స్ సరిగ్గా వంటబట్టక, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కాళ్ళూ చేతులూ ఊపాం. పొడవుగా విజిల్ వినిపించింది. గ్రౌండ్ లోని జట్లన్నీ గేట్ వైపుకి వరసగా పరుగుతీశాయి.
రెడ్డి నా పక్కకి చేరాడు. “ఇయ్యాల మల్లా రెండు పిరీడ్లు డ్రిల్ ఉంటాది” అన్నాడు. మళ్ళీ గ్రౌండ్ చుట్టూ పరుగెత్తాలన్నమాట.
“బాత్‌చీత్ నై!” గద్దించాడు ఉపాధ్యాయ్. పరుగెడుతూ బారక్స్‌కి చేరుకున్నాం. నిన్న ఇచ్చిన తెల్లటి మగ్గూ ప్లేటూ పట్టుకుని చకచకా మెస్‌కి పరుగెత్తాం. నాలుగు పూరీలు, దాల్, మగ్గునిండా బురదనీళ్ళరంగులో చాయ్.
“రెడ్డీ, ఆఫీసర్లు కూడా మనలాగే ఈ రెజిమెంట్లోనే ట్రైనింగ్ చేస్తారా?”
“యేమో, నాకూ తెలీదు.”
పక్కన కూర్చున్న జంబులింగం అందుకున్నాడు. “వాళ్ళు ఆఫీసర్ మెస్‌లో ఉంటారు. వాళ్ళ ట్రైనింగ్ ఇక్కడ కాదు. ఇండియన్ మిలిటరీ ఎకాడెమీ అని ఉంది డెహరాడూన్లో. అక్కడ ట్రైనింగ్ చేశాక, లెఫ్టినెంట్ రాంక్ ఇస్తారు. ఆ తర్వాత కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్…”
“ఇవన్నీ నీకెలా తెలుసో?” మధ్యలోనే అడిగాడు రెడ్డి.
“మా మామ బ్రిగేడియర్. అంటే ఈ రెజిమెంట్‌కి సీవో ఉన్నాడే, ఆయనది కల్నల్ రాంకు. ఆయన కన్నా పై రాంక్ మా మామది.”
“మరి నువ్వు రిక్రూటేంటి?”
“అదంతే. ఆఫీసర్ అవడం అంత తేలిగ్గాదు. ముందు…
“చలో చలో! పెరేడ్ టైమౌతోంది” అంటూ కేకేశాడు లీడర్. ఎప్పుడూ జోకులేస్తూ, చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తున్నా, చాలా విషయాలు తెలుసే ఈ జంబులింగానికి!
మళ్ళీ పెరేడ్. పీటీ తర్వాత బ్రేక్ ఎనభై నిముషాలు. కానీ, ఆ గ్రౌండ్‌లోనుంచి బారక్స్‌కి చేరి, తర్వాతి పీరియడ్‌కి అనుగుణంగా డ్రెస్ మార్చుకుని, మెస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి, మళ్ళీ స్క్వాడ్‌లో అందరమూ ఒక తీరైన గుంపుగా తయారై క్లాస్ జరిగే మరో ట్రైనింగ్ గ్రౌండ్‌కి చేరడానికి బొటాబొటీగా సరిపోయింది. వగర్చుకుంటూ డ్రిల్ షెడ్ ముందర నిలబడ్డాం. డ్రిల్ మాస్టర్ హవల్దార్ మా కోసమే ఎదురుచూస్తున్నాడు కోపంగా.
“ఆవ్ రాజాబాబూ – ఆవ్!” వెటకారంగా స్వాగతం పలికాడు హవల్దార్. ఉపాధ్యాయ్ గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు. స్క్వాడ్ లీడర్ కాబట్టి, సీనియర్లు మాట్లాడేది అతనితోనే.
“రిపోర్ట్ ఎవడిస్తాడ్రా? నీ బామ్మర్దా?”
“సర్! అల్ఫా సిక్స్టీ – ట్వెంటీ నైన్ అవుటాఫ్ థర్టీ సర్. ఏక్ బారక్ సెంట్రీ సర్!” రొప్పు ఆపుకుంటూ చెప్పాడు ఉపాధ్యాయ్.
“క్యోఁ రే, నయా స్క్వాడ్? అభీ హోష్ మే నహీ ఆయా హై? కాళ్ళకి మెహెందీ పెట్టుకొచ్చారా? నా బారాత్ కొచ్చార్రా మీరంతా?” వెక్కిరిస్తున్నట్లు మరాఠీ యాసతో హిందీలో అడుగుతున్నాడు హవల్దార్ మోరే.
ఉపాధ్యాయ్ గుటక మింగాడు.
“పూరే చార్ మినట్ లేట్ హై!”
“…”
“ఓయ్ మోరే, యే అభీ తక్ ఖడే క్యోం హై? తోలెయ్ ఈ గాడిదలందర్నీ… తోలు వలిచేయ్ ఒక్కొక్కడికీ!” షెడ్ లోంచి డ్రిల్ సెల్ ఇన్-ఛార్జ్ జేసీవో గట్టిగా అదిలించాడు.
మాకేదో కీడు మూడినట్లుంది.
“అభీ కర్తే హై సర్!” జవాబిచ్చాడు హవల్దార్ మోరే. “పీఛే ముడ్!” వెనక్కి తిరిగాం.
“వో బర్కత్ కా పేడ్ దిఖ్ రహా హై?”
చూశాం. గ్రౌండ్ అంచు అవతల, చెట్లు కనిపిస్తున్నాయి. వాటిలో ‘బర్కత్ కా పేడ్’ ఏది?
“దాన్ని ముట్టుకుని రావాలి. స్క్వాడ్ మొత్తం నిమిషంలో ఇక్కడుండాలి. జో లేట్ ఆయేగా వో…” ఆగాడు మోరే.
ఏం చెప్పబోతున్నాడో. “…వాడితో రోజంతా గ్రౌండ్ చుట్టూ చక్కర్లు కొట్టిస్తా. సమ్‌ఝే? రెడీ – గో!”
ఒక్కసారిగా అందరం పరుగందుకున్నాం. తమిళ కుర్రాళ్ళకి మరాఠీ యాస నిండిన మోరే హిందీ ఎంతవరకు అర్థమయిందో తెలియదు కానీ వాళ్ళు కూడా పరుగందుకున్నారు. సగం దూరంలోనే మోరే గొంతు వినిపించింది.
“వాపస్!”
వెనక్కి పరిగెట్టాం. ఈసారి ఇంకో మూలనున్న మరో చెట్టుని తాకి రావాలన్నాడు. మళ్ళీ పరుగు.
“ఫాలిన్! తీన్ ఆగే బాకీ పీఛే!” నిలబడ్డాం ఒగరుస్తూ.
మొదటి లైన్లో మొదటి రిక్రూట్ ముందుకొచ్చి నిలబడి, అతన్ని కిందనుంచి పైకి తేరిపారజూశాడు హవల్దార్ మోరే. రిక్రూట్ పెట్టుకున్న బెల్ట్‌ని పట్టుకుని ముందుకీ వెనక్కీ ఊపేస్తూ కరుకుగా అన్నాడు “టైట్ కరో బెల్ట్ కో!” రిక్రూట్‌ని కూడా బెల్ట్‌తో బాటు ఊపేస్తూ. పక్క రిక్రూట్ ముందుకొచ్చాడు.
“బటన్ కోన్ బంద్ కరేగారే? తేరా బాప్?” గద్దిస్తూ ఆ రిక్రూట్ వేసుకున్న షర్ట్ కాలర్‌ని పట్టుకుని గుంజాడు. రిక్రూట్ కంగారుగా పై బటన్ పెట్టుకున్నాడు.
పక్కన నిలబడ్డ నేను నా షర్ట్ బటన్లన్నీ మనసులోనే తనిఖీ చేసుకున్నాను. సరిగ్గానే ఉన్నాయి. హమ్మయ్య! ఇంక మోరే నన్నేమీ అనడులే.
మోరే నాముందు నిలబడ్డాడు. కిందనుంచి పైకి పరికించి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు రెండు క్షణాలు.
“బైఠో రే హీరో. నీచే, నీచే బైఠ్!” చటుక్కున చతికిలబడ్డాను సన్న కంకర మీద.
“ఓహోహోహో ప్యారే, భోజనానికి కూర్చున్నావా? అరే, వీడికెవరన్నా లడ్డూ తెచ్చి పెట్టండిరా!” ఎక్కిరించాడు మోరే.
“ఘుట్నోం పే బైఠ్ బెహన్‌చోద్! ఘుట్నోం పే” ఉరిమాడు.
మోకాళ్ళ మీద కూలబడ్డాను. వేడెక్కిన చిన్న చిన్న కంకరరాళ్ళు ఖస్సున గుచ్చుకున్నాయి.
మోరే నా పక్క రిక్రూట్‌ని సమీపించాడు. అతన్ని ‘బెండ్’ అవమన్నాడు – నిన్న రోల్‌కాల్‌లో లాగా, ఆ రిక్రూట్ టోపీ సరిగ్గా పెట్టుకోలేదని. అలా ఒక్కొక్కరినీ పలకరిస్తూ, గదమాయిస్తూ, వెటకారంగా వెక్కిరిస్తూ నడుస్తున్నాడు. తొడల నుంచి కంకరరాళ్ళ మీదికి చెమట ధారలు నాకు. గడిచింది అయిదు నిముషాలే అయినా అరగంటలా అనిపిస్తుండగా, ఉక్రోషాన్ని ఊరుకోబెడుతున్నాను.
“ఖడే హోజావ్!” లైన్ చివరినుంచి ఆజ్ఞాపించాడు మోరే. నిలబడ్డాను.
కోపం ఎటు పోయిందో గాని, నొప్పి నుంచి రిలీఫ్ ఎంత తియ్యగా ఉంటుందో మొదటిసారిగా, అప్పుడు తెలిసింది.
“ఓయ్ హీరో, మూఛే ఠీక్ కర్ కే ఆనా కల్. లేదూ, నేనే చేత్తో గొరిగేస్తా జాగ్రత్త!” అంటూ నా మీసాన్ని మునివేళ్ళతో పట్టుకుని, ఒక్క లాగు లాగాడు.
అది మొదటి క్లాస్. నాకు చివరి పాఠం. మీసాల గురించి.
సైరన్ మోగింది. టీ బ్రేక్‌ని సూచిస్తూ.
“స్క్వాడ్! డిస్పర్స్!”
పరుగుతో అందరం గ్రౌండ్ అంచుల్లో ఉన్న చెట్ల నీడల్లోకి చేరాం. డ్రిల్ పీరియడ్లకి రాకుండా బారక్‌లో ఉండిపోయిన సెంట్రీ, పెద్ద సత్తు కెటిల్‌లో టీ తెచ్చాడు. ఆవిరి బయటకి పోకుండా మూత చుట్టూతా చపాతీల పిండిని అతికించాడు. ఇంకో ముద్దతో కొమ్ము చివరని మూశాడు. రెండో చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ సంచీనిండా పకోడీలు, ఏడెనిమిది మగ్గులూ. గబగబా మగ్గులు అందుకున్నాం. పకోడీలు చేతికందిన వాళ్ళ మొహాలు చూడాల్సిందే. వజ్రాలు దొరికినట్లే ఉన్నాయి. వేస్తున్న ఆకలి అలాంటిది.
రెడ్డి మగ్గు ఖాళీ చేసి నాకు ఇచ్చాడు. నేను తాగిన వెంటనే అది ఇంకో రిక్రూట్‌కి, అక్కణ్ణించి అలా అలా ఐదారుగురికి చేరిందది. తాగేముందు దాన్ని కడగాల్సిన అవసరం మర్చిపోయిన హడావుడి స్నేహపు వాతావరణం అది.
టీ త్రాగిన వెంటనే తర్వాతి పీరియడ్ డబ్ల్యూ టీ – వెపన్స్ ట్రైనింగ్ – కోసం చకచకా డ్రస్ మార్చుకున్నాం. ఆ క్లాస్ జరిగే చోటు ఈ గ్రౌండుకి అర కిలోమీటరు దూరం. పరుగుతో చేరుకున్నాం. తర్వాతి పీరియడ్ పీటీ. మళ్ళీ డ్రస్ మార్చుకున్నాం. ఈసారి నిక్కర్, టీ షర్ట్, కాన్వాస్ షూస్. చివరి రెండు పీరియడ్లు ఎడ్యుకేషన్! హమ్మయ్య. కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. క్లాసులో సివిలియన్ టీచరు చెప్పేది విన్నా, వింటున్నట్లు నటించినా!