“ఫెలో ఆఫీసర్స్, జేసీవో సాహెబాన్, ఔర్ మేరే ప్యారే జవానోఁ…” కల్నల్ జయంత్ పింగళే గొంతు హాల్లో నిశ్శబ్దాన్ని తరిమేస్తూ మోగింది.
“ఇన్నేళ్ళూ మీరందరూ, నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా, విశ్వాసంగా చేసిన సేవలకిగాను, భారతదేశం మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తోంది. సర్వీస్‌లో మీరు అనేక రకాల త్యాగాలు చేశారని నాకు తెలుసు. ఎన్నో సుఖాలని చిరునవ్వుతో వదులుకున్నారని, మీ పై అధికారులు ఇచ్చిన ఏ ఆదేశాన్నీ బేఖాతరు చెయ్యకుండా, అక్షరం పొల్లుపోకుండా పాటించారని, విధి నిర్వహణలో మీ శరీరాలు శిథిలం కాబోయినా, ఒక్కోసారి మీ ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితులని ఎదుర్కోవాల్సివచ్చినా మీరు వెనక్కి తగ్గలేదనీ నాకూ, నా టీమ్‌కీ తెలుసు…”
హాల్లో పూర్తిగా నిండి, నిశ్శబ్దంగా తన మాటలని వింటున్న సైనికులందర్నీ పరికించాడు కల్నల్.
“మీరు చలించకుండా, మీ వ్యక్తిగత సమస్యలన్నీ పక్కకి పెట్టి, మీకు అప్పగించిన డ్యూటీలన్నిటినీ సక్రమంగా, సంతృప్తికరంగా నిర్వహించారని నేను నమ్మకంగా లోకానికి చెప్పగలను!” దృఢంగా చెప్పాడు.
“చెరగని చిరునవ్వుతో మీరు సమర్పించిన మీ విలువైన యవ్వనాన్ని ఈ దేశమే కాదు, ఆ దేవుడు కూడా మీకు తిరిగి ఇవ్వలేడు. కొద్ది రోజుల్లో మీరు ఈ రెజిమెంట్‌కీ, భారతీయ సైన్యానికీ వీడ్కోలు పలికి, ఇన్నేళ్ళూ మీరు సగర్వంగా ధరించిన మీ యూనిఫామ్‌ని మీ ఇంట్లో హాంగర్‌కి తగిలించబోతున్నారు. భారతీయ సైన్యం నుంచి రిటైర్ అయిన మీరు, మీ కొత్త జీవితాలని ప్రారంభించడానికి ముందు, అవసరమైన లాంఛనాలని పూర్తి చేసేందుకు ఈ డిపో రెజిమెంట్ మీకు సాయపడబోతోంది. మీకు రావలసిన మొత్తాలని పైసా పైసా లెక్కగట్టి మీకు అప్పగించి, సగౌరవంగా మిమ్మల్ని సాగనంపబోతోంది! మీరు అందించిన సేవలకి, ఈ దేశం మీకు సదా ఋణపడి ఉంటుంది.
“…కానీ బయటకి వెళ్ళాక ‘ఏం చెయ్యాలి?’ ‘ఎలా బతకాలి?’ ‘ఇంతవరకూ అలవాటైన సంపాదనలో సగమే వస్తుంది, దాంతో కుటుంబ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించగలమా?’ ఇలాంటి ప్రశ్నలు మీలో ఎన్నో తలెత్తి ఉంటాయి ఈ పాటికి. మీలో చాలామంది పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉండొచ్చు. కొందరి పిల్లలు పెళ్ళికెదిగి ఉండవచ్చు. ఆర్మీలోలా, మిమ్మల్ని అన్ని విధాలా సంరక్షించేవాళ్ళు ఇకపై ఎవరా అని మీరు అధైర్యపడుతుండవచ్చు…
“అటువంటి అనుమానాలతో, బెంగలతో మీ మనసుని తూట్లు పడనివ్వకండి. మీలో చాలామంది మిలిటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లని పెంచుకునే ఉంటారు. అటు సివిల్ డిగ్రీలు కూడా సాధించి ఉంటారు. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తోబాటు అవి కూడా ఇప్పుడు మీకు అండగా నిలుస్తాయి. వాటిని జాగ్రత్తగా, సక్రమంగా వినియోగించుకోండి. మీ మీ కుటుంబాలతో ఆనందంగా గడపండి. ఇక్కడ కొన్ని ఉద్యోగాలు, వ్యాపారావకాశాల గురించి కూడా మా టీమ్ మీకు వివరిస్తుంది.
“మీకు న్యాయంగా రావలసిన ఏ పైసనీ వదలకండి. అందుకు మొహమాటపడనక్కర్లేదు. అలాగని, మీకు చెందని ఎలవెన్సులకోసం, ‘ఫాల్స్ క్రెడిట్ల’ కోసం తాపత్రయపడొద్దు. దస్తావేజుల్లో చేతివాటం చూపించో, క్లర్కులకి లంచం తినిపించో ఏదోలా మీరు వాటిని దక్కించుకున్నా, ఏదో ఒక రోజున అంతకు అంతా, వడ్డీతో సహా వెనక్కి తీసుకోగలదు ప్రభుత్వం. అవమానం, పరిహారాలు అదనం.
“గుర్తుంచుకోండి. ఫెన్సింగ్ బయట, మీ ఇన్నేళ్ళ కష్టార్జితాన్నీ క్షణంలో కాజేసే దుర్మార్గులున్నారు. మోసగాళ్ళున్నారు. జాగ్రత్త. వాళ్ళ జిత్తుల్లో చిక్కుకోకుండా, చెమటోడ్చి సంపాదించిన సొమ్ముని కోల్పోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి…”
అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు.
“రెజిమెంట్! సావ్-ధాన్ బైఠ్!” బిగ్గరగా కమాండ్ ఇచ్చాడు సుబేదార్ మేజర్ సాబ్. బయటికి నడుస్తున్న కల్నల్ పింగళేని రెండు అంగల్లో చేరుకొని, వెంట కదిలాడు.
అప్పటిదాకా బిగబట్టిన ఊపిరిని వదిలి రిలాక్స్ అయారు ఆ గదిలో శ్రోతలందరూ.
సీవో సాబ్ కూర్చొన్న జీప్ కదిలే ముందు స్టిఫ్‌గా సెల్యూట్ చేసి, అది వెళ్ళిపోయాక హుందాతనాన్ని మళ్ళీ నింపుకుంటూ హాల్లోకి వచ్చాడు సుబేదార్ మేజర్. నిలబడే మాట్లాడ్డం మొదలుపెట్టాడు అందర్నీ ఉద్దేశించి.
“విన్నారుగా! మీకు రావలసింది వదిలిపెట్టవద్దు. రాకూడని దాని కోసం ఆశపడొద్దు. కానీ ఇప్పుడు నేను చెప్పేది కూడా శ్రద్ధగా వినండి. కొద్ది రోజుల్లో, మీ అందరికీ కొంత సొమ్ము మీ బాంక్ ఎకౌంట్‌లోకి నగదుగానూ, ఇంకొంత మొత్తం చెక్‌గానూ అందుతుంది. ఫౌజీ చేతికి ఒక్కసారిగా ఎక్కువ డబ్బొస్తే, వాడి బుర్ర టెంపరరీగా మొద్దుబారుతుంది. బుద్ధి వెనక సీట్లోకి మారుతుంది. చేతుల్లో దురదలు మొదలవుతాయి…”
నవ్వులు వినపడ్డాయి హాల్లో.
“నవ్వండి పర్వాలేదు. రెండు నెలల క్రితం ఏం జరిగిందో విని, అప్పుడు కూడా మీకు నవ్వొస్తే, మిమ్మల్ని మించిన ధైర్యవంతుడు లేడనే అనుకుంటాను.
“ఏమైందా? మీలాగే ఒక హవల్దార్ భాయ్ కూడా నవ్వుకుంటూ చెక్కుని తీసుకుని ఇక్కణ్ణించి ఇంటికి బయల్దేరాడు. మధ్యలో అలహాబాద్‌లో దిగాడు. ఎందుకో అతను చెప్పలేదు గానీ నేను ఊహించగలను. ఇన్నేళ్ళనుంచీ యూనిఫారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలని కడుక్కోవాలని! ఎంత భక్తో, ఎంత భయమో చూడండి! త్రివేణీ సంగమంలో మునకలు వేసి పాపాలన్నీ కరిగించుకొని ఒడ్డు మీదికొచ్చి చూస్తే, అతని గుడ్డ సంచీలో పెట్టుకున్న అరటిపళ్ళని ఒక ఆవు చక్కగా మేస్తూ కనపడింది…”
హాల్ మళ్ళీ నిశ్శబ్దమైంది. ఒకసారి అందర్నీ చూశాడు సుబేదార్ మేజర్.
“హవల్దార్ గుండె ఆనందంతో నిండిపోయింది. స్వయంగా గంగాదేవే ఆవు రూపంలో వచ్చి నైవేద్యం ఆరగిస్తోందని తెగ సంబరపడ్డాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గానీ తెలీలేదు – అరటిపళ్ళ పొట్లంతోబాటు చెక్కుని కూడా ఆ గంగాదేవి ఇష్టంగా నమిలేసిందని!”
పెద్దగా నవ్వులూ, మాటలూ మొదలయ్యాయి – అంతవరకూ సీరియస్‌గా ఉన్న సుబేదార్ మేజర్ మోహంలో విచ్చుకున్న నవ్వుని చూసి.
“…తో భాయియోఁ! జాగ్రత్తగా ఉండమని మీకు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. వెళ్ళి ఏ గంగలోనైనా దూకండి… కానీ – మీ సొమ్ముని భద్రం చేసుకున్న తర్వాత! సమ్‌ఝే?”
దస్తావేజుల పని ముగిసింది. సర్వీస్‌లో ఉండగా చేసిన కోర్సుల తాలూకు సర్టిఫికెట్లు సిద్ధమయ్యాయి. డిశ్చార్జ్ బుక్, ఎక్స్-సర్వీస్ మాన్ సర్టిఫికెట్ కూడా తయారయాయి.
…రెండు రోజుల తర్వాత సొంత వూరికి వెళ్ళడానికి రిజర్వేషన్ కూడా అయింది.
సైకిల్ మీద బయల్దేరాను – ఇప్పుడు తెరపడబోతున్న అంకం ప్రారంభంలో, ముందుగా కాలు పెట్టిన మిలటరీ ట్రైనింగ్ రెజిమెంట్‌కి.
ఇప్పుడక్కడ ఎంతమంది ఉన్నారో? బారక్‌లు అలానే ఉన్నాయో, ఏమైనా మార్చారో, లేక కొత్తగా కట్టారో? మెస్ బిల్డింగ్, రోల్‌కాల్ గ్రౌండ్ వగైరాలన్నీ ఇంకా అలానే ఉన్నాయేమో. అయినా వాటిని మార్చేదేముంది? ఆలోచనలూ జ్ఞాపకాలూ సైకిల్ చక్రాలతోబాటు పరుగెడుతున్నాయి.
మిలిటరీ ట్రైనింగ్ రెజిమెంట్ తాలూకు గేట్ ఎదురైంది. కొద్దిగా ఆశ్చర్యపోయాను. గేటు మీద, ‘మిలిటరీ ట్రైనింగ్ రెజిమెంట్’ అని పెద్ద అక్షరాలతో స్వాగతం పలికే ఆర్చి ఇప్పుడు లేదు. రోడ్డు పొడవునా స్తంభాలున్నా, వాటికి వేలాడుతున్న లైట్లు వెలగడంలేదు.
గేట్ ముందర గార్డ్‌తో చెప్పాను. “సుబేదార్ బీ కే రావ్. డిపో రెజిమెంట్ సే ఆయా హూఁ. నేను ట్రైనింగ్ చేసింది ఇక్కడే. ఒక్కసారి ఈ బారక్‌లని చూసి వస్తాను.”
“క్యా దేఖోగే సాబ్… అంతా ఖాళీ” సెల్యూట్ చేస్తూ గార్డ్ అడ్డు తప్పుకున్నాడు.
ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం, చీకట్లు ముసురుతున్న ఆ సాయంత్రం నడిచిన రోడ్డు ఇదే అయినా ఇప్పుడు గతుకులు ఎక్కువనిపిస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడా రిక్రూట్‌లు కనపడలేదు. సైకిల్‌ని గేట్‌కి ఆనించి నడిచాను. W-40, W-41 బారక్‌లు దాటాను. T-1 బారక్… T-2 బారక్… T-3 బారక్…
“శాబాష్! పూరే వరండే మే ఫస్ట్ క్లాస్ ఝాడూ!” ఛజ్జూరామ్ గొంతు చెవుల్లో మళ్ళీ పలికింది. ఇప్పుడు ఆ వరండానే కాదు, ఆ బారక్‌లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. వాటి కప్పుల మీదా, ఆ చుట్టూతా నేలమీదా రాలిపడిన ఆకులని శుభ్రంచేసి ఎన్ని రోజులయిందో! ఒకప్పుడు బారక్‌ల ముందర నీట్‌గా పేర్చిన, సున్నంతో తెల్లగా మెరిసే ఇటుకల వరసలు గానీ, వాటికి తోడుగా నిలబడ్డ గోరింటపొదలు గానీ ఇప్పుడు లేవు.
మనసు బరువెక్కింది. ఇది ఒకప్పుడు నేను ‘పుట్టి పెరిగిన’ ఇల్లు!
“మై కిలియర్ బతా రహా హూఁ. టైమ్ దొరగ్గానే వెట్ కాంటీన్‌లో దూరి…” హవల్దార్ ఛత్రీ లెక్చర్లు దంచిన రోల్‌కాల్ గ్రౌండ్ బావురుమంటోంది. ఆ పెద్ద గుంట తాలూకు పిట్ట గోడలోంచి చాలా చోట్ల ఇటుకలు నేలమీద పడిపోయాయి. వాటికి నల్లగా పట్టిన పాచి.
“చూడండి బాబూ. మీ ట్రైనింగ్ అయిపోయింది. మీరంతా మమ్మల్ని, ముఖ్యంగా నన్ను తిట్టుకోని రోజు బహుశా ఉండదు…” డ్రిల్ నేర్పిన హవల్దార్ మోరే, స్క్వాడ్ ముందు నిలబడి, మెత్తగా చిరునవ్వుతో అందర్నీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు – అప్పుడు నిలబడింది ఇక్కడే కదూ.
“ఇవాళ మీరంతా పాసవుట్ అవుతున్నారు. ముబారక్ హో!”
అందరికీ చిరునవ్వులు మొలిచాయి.
“ట్రైనింగ్‌లో, మీలో ఎంతోమందిని లెంపకాయలు కొట్టాను. ఫ్రంట్ రోల్ చేయించాను. ‘బెండ్’ చేయించాను…”
అవును. ఆ నొప్పులని అంత తేలిగ్గా మర్చిపోతామా?
“అప్పుడు మీరు రిక్రూట్లు. నేను మీ ఉస్తాద్‌ని. మిమ్మల్ని ఎత్తుకుని గోరు ముద్దలు తినిపిస్తూ డ్రిల్ చెయ్యమంటే మీరు చేస్తారా? ఉస్తాద్ అంటే భయం, దాన్ని మించిన గౌరవం లేకపోతే రిక్రూట్‌లు మాట వింటారా? చెప్పింది నేర్చుకుంటారా?”
నిజమే కదూ!
“వో కెహతే హై నా! రిక్రూట్, బూట్ ఔర్… ఇంకోటి, పెళ్ళయ్యాక తెలుస్తుంది. అరగదీసిన కొద్దీ మెరుస్తాయి!” నవ్వించాడు కన్ను గీటుతూ.
“ఇప్పుడు మనమందరం ఒకటే. రేపట్నుంచీ మీరు కూడా ఓజీనే (ఆలివ్ గ్రీన్) వేసుకుంటారు. మీకూ నాకూ మధ్య, మనం ఈ రెజిమెంట్లో కలిసే రోజుకి ముందు ఎలా అయితే ఎటువంటి పరిచయం గానీ, శత్రుత్వం గానీ లేదో, ఇప్పుడూ లేదు, ఇక ముందూ ఉండదు. అర్థమైందా పిల్లలూ?”
“యస్సర్!”
“మీరు నన్ను ఎన్ని బూతులు తిట్టుకున్నా సరే, మీకు చక్కగా డ్రిల్ నేర్పించానన్న తృప్తి మాత్రం నాకుంది! నేర్చుకున్నామన్న తృప్తి మీకుందా?”
“యస్ సర్!”
“శాబాష్! తర్వాత మనమెప్పుడన్నా ఏ యూనిట్లోనైనా కలిస్తే, నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా, మీరు నాకు కనీసం ఒక ‘రామ్ రామ్’ అన్నా చెప్తారుగా?” మోరే గొంతులో మార్దవం.
“యస్ సర్.” కళ్ళలో అప్రయత్నంగా తడి పొర ఒకటి చేరింది.
“యాద్ రఖో బచ్చే. ఫౌజ్‌లో చోరీ చెయ్యకూడదు. సెలవనుంచి లేటుగా రిపోర్ట్ చెయ్యకూడదు. సీనియర్ మాటని కాదనకూడదు. ఏ పెరేడ్ నుంచీ తప్పించుకోకూడదు. మన ఇజ్జత్ మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని…”
“…”
“ఇవి పాటిస్తే చాలు. మీ సర్వీస్ చక్కగా సాగుతుంది. కుదుపుల్లేకుండా. సరేనా?”
“యస్ సర్.”
“ఏంటి?”
“య్యస్ స్సర్!”
“శాబాష్. జోర్ సే బోలో! భారత్ మాతా కీ…”
“జై!”
“భారతీయ సేనా కీ…”
“జై!”
“ఎమ్.టి.ఆర్.కీ…”
“జై!”
“హవల్దార్ మోరే కీ…” నినాదం ఇచ్చాడు లీడర్ ఉపాధ్యాయ్.
మోరే మొహం మీద చిరునవ్వు విరిసింది. “నై నై. తప్పు. అలా అనకూడదు. శాబాష్. డిస్-పర్స్!”
జ్ఞాపకాలని ప్రేమగా తడుముతూ బారక్ వెనక్కి నడిచాను.
పొడవాటి యూకలిప్టస్ చెట్లు… రోజూ తెల్లారుజామున నాలుగింటికి, వీటి ఆకులని ఎత్తి పోయడంతో దినచర్య మొదలయ్యేది. ఇప్పుడా ఆకులు అడుగెత్తున పేరుకున్నాయి. కరకరమంటూ నా అడుగులకింద పొడి పొడి అవుతున్నాయి.
…ఈ పొడవాటి తొట్టి దగ్గరే స్నానాలు కానిచ్చేవాళ్ళం. నీళ్ళ మీది నుంచి పొగలు లేస్తుండేవి ఆ చలికాలంలో. చుట్టూ గచ్చు తడిగా – ఎప్పుడైనా జారి పడతావని హెచ్చరించేది. ఇప్పుడు తొట్టిలోకి నీళ్ళు పడేందుకు గొట్టం ఒక్కటే ఉంది. పంపు లేదు. తొట్టిలో ఎండి, చుట్టుకుపోతున్న పాచి అట్టలు.
బారక్ లోపలికి నడిచాను. రెండు వరసలుగా వేసిన మంచాలకి పైన కట్టిన దోమతెరలనుంచి, విప్పిన సాక్స్ నుంచీ చుట్టుముట్టే ముక్కవాసన స్థానే ఇప్పుడు ఖాళీ బారక్ గోడలనుంచి జారుతున్న చౌడు వాసన వస్తోంది. నా మంచం ఒకప్పుడున్న స్థలంలో నిలబడ్డాను. పక్కన రెడ్డి మంచం. పైన ఫాన్ ఉండేది. ఆ ఫాన్ గాలి వేడిగా! ఒక్కసారి ఆ దృశ్యం కళ్ళముందు నిలిచింది. కిటికీ దగ్గరికి చేరి పరీక్షగా చూశాను. ఒక మూల, నేను చెక్కిన పొడి అక్షరాలు BKR – A60 చెక్కుచెదరకుండా…
అప్పుడు గుర్తొచ్చింది. వడిగా బారక్ వెనక్కి నడిచాను. కుడినుంచి మూడో యూకలిప్టస్ చెట్టు… అదే కదూ… కావచ్చు, కాకపోవచ్చు. అది పడిపోయిందేమో! ఇది ఆ స్థానంలో నాటిన మరో మొక్కేమో! అయినా ఇన్నేళ్ళ తర్వాత ఒక చెట్టు ఇంకా ఉంటుందా? నా పిచ్చిగానీ. ఉండొచ్చు… ఈ చెట్లు దాదాపు అరవై ఏళ్ళు బతుకుతాయట – పరిస్థితులు అనుకూలిస్తే! ఎక్కడో చదివాను.
చెట్టు మొదట్లో చూశాను. ఎవరో విసిరేసినట్లు కనిపించేలా, నేను పెట్టిన ఇటుక! ఇన్నేళ్ళైనా అలాగే పడి ఉంది. నమ్మబుద్ధి కాలేదు. ఇదేమైనా కలా? సినిమానా? రెండూ కాదే!
కానీ…
గబగబా వెళ్ళి దాన్ని జాగ్రత్తగా తొలగించాను. కింద తేళ్ళు ఉండొచ్చు మరి. లేవు. హమ్మయ్య అనుకుంటూ, గట్టిపడి పోయిన అక్కడి మట్టిని పక్కనే దొరికిన పెంకు ముక్కతో తవ్వసాగాను. దాదాపు అడుగు లోతు తవ్వేక చేతికి తగిలింది ఆ ప్లాస్టిక్ కవర్.
నిర్ఘాంతపోయాను. మొహం మీద నవ్వు నిశ్శబ్దంగా పరుచుకుంది.
“ఇప్పుడు చెక్ చేస్తాను. ఎవడి పెట్లోనైనా వాచీ దొరికిందో…” అంటూ డ్యూటీ ఎన్సీవో బెదిరించిన రాత్రే, ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఎవరూ చూడకుండా పాతిపెట్టిన నా హెచ్.ఎమ్.టి. వాచీ… ఆగిపోయినా, డయల్ మీది నికెల్ పూత పెచ్చులుబారి నల్లబడినా, స్ట్రాప్ శిథిలమైనా, కవర్లోనుంచి పలకరిస్తోంది సంతోషంగా.
(సమాప్తం)