కెహర్వా!

వెళ్ళిపోతే ఎలా…
పట్టుకోవాలి గుండెకి చుట్టుకోవాలిగదా
గొంతులో సుడులు తిప్పుకోవాలిగదా
రాకున్నా స్వరాల్ని పేనబూనాలిగదా.

అక్షరాల్ని అలా లయల్లో ఒదిగిస్తూ
విషాదానందాల స్వరతరంగాలేవో
విశ్వాంతరాళం నుండి వక్షాంతరాళానికి
ఒక అనులోమాలాపనలోంచి ఇంకో తాళముద్రలోకి
చిగురాకులమీది చినుకుల్లా మారుతూ…

అయిపోయిందంటే ఎలా…
నీ గమకాల తమకాలు
అల్లుకోవాలిగదా
ఒక ప్రకంపన ఒక మూర్ఛన ఒక తిరికిటతో
సురాపానమూ ఆత్మస్నానమూ రెండూ ఒకేసారి
జరుగుతున్నట్లు లోపలి
మోహాల మడుగుల్లోకి
జారిపోవాలికదా.

సర్వస్వాన్ని శ్రవణేంద్రియంగా మార్చుకుని
సర్వదా పదాల ముద్రలు వేసుకుని
త్వమేవాహమై తన్మయిస్తూ…

శ్రావ్యతెంత సౌందర్యమోగదా!