ఊళ్ళోకి కంప్యూటర్ వచ్చీ రాగానే, నేనూ ఒకటి స్వంతం చేసుకున్నాను. చిన్నప్పుడు బంగాళాదుంపలని సగానికి కోసి, ‘శ్రీరామ్’ అనే అక్షరాలని వెనక్కి తిప్పి చెక్కి, ముద్రలా తయారుచేసేవాణ్ణి. వాటిని పాత ఇంక్‌పాడ్ మీద ఒత్తి కాగితాలమీద, బట్టలమీదా ముద్రలు వేయడం, ఆ అక్షరాలని చూసి మురిసిపోవడం ఒక ఆటగా ఉండేది! ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలన్న కోరిక అప్పట్నించే ఉండేది కానీ, ప్రెస్‌కి కావలసిన పెద్ద పెద్ద మిషన్లూ అవీ సమకూర్చుకోవడం, అక్షరాలు, గుణింతాలను పేర్చడంలాంటివేవీ నాకు అందుబాటులో ఉన్నవి కావు. పెద్దయ్యాక పట్నానికి వెళ్ళి కంప్యూటర్ కోర్స్ చేసినప్పుడు, అది నాకు, నేను దానికీ అంకితమయ్యాం. ఆ తర్వాత సహజంగానే అదే నాకు జీవనోపాధిగా మారింది.
బంగాళాదుంపలతో ముద్రలు చేసినప్పుడు పుట్టిన కలను, ప్రెస్ తెరవాలని, కంప్యూటర్ నిజం చేసింది. ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్లతో పనీలేదు, అక్షరాలనీ గుణింతాలనీ పేర్చే శ్రమ అసలే లేదు. అద్దాలగదిలో కూర్చుని చేసే ప్రింటింగ్ వర్క్‌ని మొదలుపెట్టాను. శుభలేఖలు, గ్రీటింగ్ కార్డ్‌లు, చావు కబుర్ల కార్డులు, పాంఫ్లెట్లు, సర్టిఫికెట్లు, టేబుళ్ళు, క్వశ్చన్ పేపర్లవంటివన్నీ రెడీమేడ్‌గానే ఉంటాయి. వాటిలో తేదీలనో, టైములనో, ఆహ్వానిస్తున్నవాళ్ళ పేర్లనో, విషాద వార్తని తెలియజేస్తున్న వాళ్ళ పేర్లనో మారిస్తే చాలు. ఇక మిగిలినదంతా ‘స్వస్తిశ్రీ చాంద్రమానేన…’ అనో, లేకపోతే ‘మా అత్తయ్య పెల్లికి మీలంతా తప్పకుందా లావాలి. వస్తాలు కదూ?’ అంటూ వెరైటీగా చిన్నపిల్లలు పిలుస్తున్నట్లు రాయడాలో ఉండనే ఉంటాయి. ఒక్కోసారి కస్టమర్‌ని ఆకట్టుకోవడానికి చిన్న కిళ్ళీకొట్టుని పెద్ద షోరూమ్‌గా చూపించక తప్పదు.
నాకున్న కల్పనా సామర్థ్యమంతా విజిటింగ్ కార్డులని తయారుచెయ్యడంలో చూపిస్తుంటాను. నా ప్రింటింగ్ వర్క్‌లో, నా అడ్రస్ కార్డ్‌లు నేనే తయారుచేసి, ఊళ్ళో నాకు కనపడ్డవాళ్ళందరికీ ఇచ్చాను. ఇచ్చి ఊరుకోకుండా, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వాటికున్న ప్రయోజనాన్ని కూడా విప్పి చెప్పాను. మెల్లిమెల్లిగా మా పేటలోవాళ్ళే కాకుండా, చుట్టుపక్కల పేటల్లోనివాళ్ళు కూడా తమ విజిటింగ్ కార్డ్‌లని నా దగ్గర ప్రింట్ చేయించుకోవడం మొదలుపెట్టారు.
అలా నాకు షాపు యజమానులు, ఆఫీసర్లు, రచయితల దగ్గర్నుంచీ వంటవాళ్ళు, టెంట్‌వాళ్ళు, మెకానిక్కులు, బ్యాండ్ మాస్టర్లు, సన్నాయి మేళాలవాళ్ళు, జ్యోతిష్కుల దగ్గర్నుంచీ హిజ్రాలవరకూ అనేకమంది కస్టమర్లయ్యారు. అలా విజిటింగ్ కార్డులని తయారుచేస్తుంటే అడ్రస్‌లతో పాటు వాళ్ళ స్టేటస్ కూడా తెలిసేది. అలాగే కొందరిని దగ్గరగా పరిశీలించడానికీ వీలయేది.
కృష్ణ అని, ఓ కస్టమరుండేవాడు. అతనో ఆల్ రౌండర్ మెకానిక్. కరెంటు పనులు, ప్లంబింగ్ పనులు, ఎలెక్ట్రానిక్ ఐటమ్స్ రిపేర్లవంటివన్నీ చేసేవాడు. రేకుతో తయారుచేసుకున్న ఒక టూల్ బాక్స్ అతని డొక్కు సైకిల్‌కి బిగించి ఉండేది. దానిమీద రకరకాల రంగుల్లో తను చేసే రిపేరింగు పన్ల గురించి వంకరటింకర అక్షరాలతో రాశాడు.
ఇంటింటికీ వెళ్ళి రిపేర్లు చేసే ఈ కృష్ణ, అందరి మెకానిక్కుల్లాంటివాడు మాత్రం కాదు. కస్టమర్లనుంచి డబ్బు లాగడానికి మెకానిక్కులు సాధారణంగా చేసే గిమ్మిక్కుల్లాంటివి అతనికి రావు. విజిటింగ్ కార్డు వేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు, తను చేసే రకరకాల పనులన్నీ చెప్పాడు. అతనికి నచ్చజెప్పి, ఆ లిస్టుని కుదించాల్సి వచ్చింది. పైగా ఇతని పనితనాన్ని గురించి మా పేటలో తెలియనివాళ్ళెవరు? అతని పేరూ మొబైల్ నెంబరూ చాలు. డిగ్రీలూ సర్టిఫికెట్లూ అక్కర్లేదు. ఆ విజిటింగ్ కార్డులో ముఖ్యమైంది అతని మొబైల్ నెంబరే.
పనంతా చక్కగా నీట్‌గా చేసేవాడు కృష్ణ – ఎక్కువగా క్రెడిట్‌లో! కానీ డబ్బులు రాబట్టుకునే తెలివితేటలు మాత్రం అతనికి అంతగా లేవు. అందుకే లోకం తీయించే పరుగుపందేల్లో వెనకబడిపోయాడు. అతని పనితనం అతన్ని డొక్కు సైకిల్ మీదినుంచి, డొక్కు మోపెడ్ మీదికి మార్చగలిగింది. దానికీ అతనే మెకానిక్కు! నా దగ్గర కార్డులని ప్రింట్ చేయించుకున్నప్పుడల్లా – బిల్లు పూర్తిగా చెల్లించేవాడు. ఒకటి రెండుసార్లు మా ఇంట్లో పనిముట్లేవో రిపేరు చేసిచ్చాడు కానీ, డబ్బులు మాత్రం తీసుకోనంటాడే! బాగా బలవంతపెట్టి ఇవ్వాల్సొచ్చింది. కష్టపడేవాళ్ళన్నా, నిజాయితీపరులన్నా నాకు అభిమానం. నేను కృష్ణని అభిమానించేవాణ్ని. అతనికి నామీద గౌరవముండేది. అలా మా ఇద్దరి మధ్యా పరస్పర మర్యాదపూర్వకమైన ఒక పరిచయం కొనసాగింది.
ఇప్పుడు ఇంకో కస్టమర్.
ఈయనది మా పేటకి పక్కనున్న ఊరు. స్కూలు చదువు అయిందనిపించాక, వంశపారంపర్యంగా వస్తున్న వేషంతో, పెద్దగా కష్టపడకుండా బండి నెట్టుకొస్తున్నాడు. ఈయన మొదటిసారి నా దగ్గరికి ఓ పాత నూలు పంచె-చొక్కా, భుజాన ఎర్ర ఉత్తరీయం ధరించి, చొక్కాజేబులో మూడు మడతలు పెట్టిన పంచాంగంతో వచ్చాడు. విజిటింగ్ కార్డ్‌లు వెయ్యాలన్నాడు. సిద్ధంగా ఉన్న కొన్ని విజిటింగ్ కార్డ్‌ల నమూనాలు ఆయనకి చూపెట్టి, కార్డ్ మీద వేయవలసిన వివరాలు చెప్పమన్నాను.
ఆయన అసలు పేరు గోవిందు. కానీ, ‘జ్యోతిష్యాచార్య గోవిందశర్మ, భూత-భవిష్యత్-వర్తమాన, జాతకచక్ర, గృహ శాంతి, ప్రేత బాధా నివారణ, కాలసర్పదోష, పితృ దోష నివారణ నిపుణ’ లాంటివేవేవో రాయమన్నాడు. ఆ లిస్టు చూస్తే ఈయన వచ్చింది విజిటింగ్ కార్డుల కోసమో పాంఫ్లెట్ల కోసమో అర్థంకాలేదు. ఆ చాంతాడుని కురచగా మార్చడం చాలా కష్టమైంది. చిన్న నోట్లో బ్రహ్మాండాన్ని చూపించడానికి ఆ బాలకృష్ణుడు కష్టపడ్డాడో లేదో తెలీదుగాని, ఈయన విజిటింగ్ కార్డ్‌ని రూపొందించేటప్పుడు నేను అంతకన్నా ఎక్కువ కష్టపడ్డాను. చెమటలు కక్కాను. పైగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక చదరాన్ని వంకర గీతలతో ముక్కోణాలుగా విభజించి వాటిలో ఇల్లు, హస్తం, హస్తరేఖలూ పేర్చమన్నాడు. వాటిని, లావాటి అక్షరాల్లో ఆయన పేరుని, ఉన్నాయో లేవో తెలీని విశ్వవిద్యాలయాలు ఇచ్చిన డిగ్రీలనీ అమర్చడానికి నా సృజనాత్మకత బానే ఖర్చయింది. మొత్తానికి ఆయన విజిటింగ్ కార్డ్ తయారైంది.
విజిటింగ్ కార్డుని ప్రింట్ చేశాక, కస్టమర్ మొహంలో తృప్తికోసం ఆశగా ఎదురుచూడ్డం నా అలవాటు. ఆయన వచ్చాడు. విజిటింగ్ కార్డ్‌ని చూశాడు–నిర్లిప్తంగా. నచ్చినట్లు మొహం పెడితే ఎక్కువ డబ్బిమ్మంటాననుకున్నాడేమో బహుశా. కార్డుల కట్టని పక్కన పెట్టి, నా షాపు వాస్తు గురించి లెక్చరివ్వడం మొదలెట్టాడు. నా చెయిర్ ఆ దిక్కున ఉండాలని, కంప్యూటర్ ఫలానా వేపుకి ఉండాలనీ సలహాలిచ్చి, గుమ్మం మీద కట్టాల్సిన తాయత్తుల గురించి, లోపల వేళ్ళాడదీయాల్సిన యంత్రాల గురించీ వివరించాడు. ఆయనిచ్చిన సలహాలని పాటించి బాగుపడ్డవాళ్ళ లిస్టొకటి చదివాడు. నా అనుమానం బలపడసాగింది. ఈయన డబ్బుకి బదులు వాస్తు సలహాలతో సరిపెడదామనుకుంటున్నాడు. నేను ఆయన చెప్తున్నవేమీ పట్టించుకోకుండా బిల్లుని ముందుకి జరిపాను. అయిష్టంగా అయినా, డబ్బివ్వక తప్పలేదాయనకి.
కార్డులు వేయించుకున్న వాళ్ళు అయిదారు నెలల తర్వాత మళ్ళీ కొత్త కార్డుల కోసం వస్తారు. ఆ పరిచయాలు ఒక పట్టాన తెగేవికావు.
కృష్ణ వేయించుకున్న కొత్త కార్డుల్లో మార్పేమీ లేదు. అదే అడ్రస్, అదే మొబైల్ నెంబర్. అదే దశ. కష్టపడి సంపాదించే కూలితో కుదిరేది – చావకుండా బతకడం మాత్రమేగా!
రెండో కస్టమర్ ‘శ్రీ గోవింద్, జ్యోతిష్కుడు’ కాస్తా ‘జ్యోతిష్య విశారద’ గోవిందాచార్యగా అవతారమెత్తేడు. ఆయన జ్యోతిష్యం చెప్పే టూరింగ్ టాకీస్ ఇప్పుడు జ్యోతిషాలయం అయింది. ఇంట్లో ఒక ఫోను, ఆఫీసులో మరో ఫోను. ఈసారి ఆయన రూపురేఖలతోబాటు బండి కూడా మారిపోయింది. ఖరీదైన స్కూటర్ మీద ఫెళఫెళలాడే ధోవతీ పంచెలతో, పై మీద పట్టు ఉత్తరీయంతో వేంచేశాడు! ఇప్పుడు రకరకాల దండలు, దళసరి విభూతిపట్టెలతో దిగిన తన ఫోటోని కార్డు మీద ఫిట్ చెయ్యమన్నాడు.
ఆయన ఆర్థిక స్థాయిని చూసి కాసేపటివరకూ నాకు ఆశ్చర్యం తగ్గలేదు. అయితే డబ్బిచ్చే విషయంలో మాత్రం ఆయనేం మారలేదు. నా పిచ్చిగానీ, సముద్రం నదిలోకి పారుతుందా, నది పర్వతాల్లోకి పాకుతుందా? నేను ఎంత కష్టపడి కార్డుని రూపొందించినా, మెచ్చుకోలు మాట మచ్చుకైనా ఆయన నోట్లోంచి ఊడిపడలేదు. మెచ్చుకోలు అన్న పదానికి ‘పూర్తి చెల్లింపు’ అన్న అర్థం చెప్పుకుందాం. ఎంతైనా కస్టమర్ కస్టమరే!
అన్నట్లు, కృష్ణ ఇంటి అడ్రస్ మారింది. ఇప్పుడతను తక్కువ అద్దె ఇంట్లోకి మారాడు. ఇంతకుముందు ఒక్క అద్దె మాత్రమే ఎక్కువ. ఇప్పుడు ఇతర ఖర్చులు కూడా పెరిగాయి. పిల్లల చదువులు తలకు మించిన భారమయ్యే రోజులివి. మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలంటారు. అతను చాపుకోలేదు. ఏకంగా కాళ్ళు నరుక్కున్నాడు. ఏమాటకామాటే, విజిటింగ్ కార్డులవల్ల శ్రమ-నైపుణ్యం-ప్రవర్తనలతోబాటు, అతని ‘మొబైల్’ మెకానిక్కు పని కూడా మెరుగైంది. ధరలు మండిపోతున్న ఈ కాలంలో ఆ మాత్రం ఎదిగినా గొప్పే కద!
కృష్ణ తన కొత్త విజిటింగ్ కార్డులకోసం వచ్చినప్పుడు, బాత్రూమ్‌లో పంపు లీకవుతోంది. అతను వచ్చీ రాగానే దాన్ని సరిచెయ్యమంది మా ఆవిడ. అతను తన చక్కటి పనితనంతో ఒక్క వాషర్‌ని మాత్రం మార్చి, పంపుని మార్చే అవసరం లేకుండానే సమస్యని పరిష్కరించాడు. అదే ఇంకెవరైనా ప్లంబరైతే పంపునీ మార్చేవాడు, దాని ఖరీదులో కమీషనూ కొట్టేసేవాడు. విజిటింగ్ కార్డులకి డబ్బివ్వబోతున్నప్పుడు, అతను చేసిన పనికి నేనూ డబ్బివ్వబోయాను. మళ్ళీ అదే మాట! ససేమిరా వద్దంటాడు. ఈసారి కూడా బలవంతపెట్టక తప్పలేదు.
చాలా రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ ఈ ఇద్దరూ నా షాపుకి వచ్చారు. ఇద్దరి బళ్ళనీ షాపు ముందర పార్క్ చేశారు. ఒకటి ఫోర్-వీలర్, రెండోది డొక్కు మోపెడ్. మెడలో రకరకాల హారాలతో, వేళ్ళకి రంగురంగుల రాళ్ళ ఉంగరాలతో, మొహమ్మీద జ్ఞానగర్వంతో ఒకళ్ళు వెలుగులు చిమ్ముతుండగా, సాదా బట్టల్లో బిడియంగా ముడుచుకుపోతూ, కష్టాలతో నలిగి ముడతలు పడిన మొహంతో, కష్టరేఖలు తప్ప మరేమీ లేని హస్తాలతో నిస్తేజంగా, నిస్సహాయంగా కనిపిస్తున్న మెకానిక్ ఇంకొకరు! ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ మెకానిక్ భవిష్యత్తు ఎలా ఉందని ఆ ధగధగల జ్యోతిషాచార్యులవారిని అడిగితే, ఇదంతా ఇతని పూర్వజన్మ కర్మల ఫలితమేనంటాడు బహుశా.
అదే ప్రశ్న మిమ్మల్ని, మన సంఘాన్ని, మన వ్యవస్థనీ అడిగాననుకోండి, ఏమని జవాబొస్తుందో?
(హిందీ మూలం: విజిటింగ్ కార్ద్)