“ఢమ్! ఢమ్!”
ట్రంక్ పెట్టె మీద దుడ్డుకర్రతో బాదాడు ఛజ్జూరామ్. “ఉఠో! ఉఠో జల్దీ! దో మినట్ మే బాహర్ ఫాలిన్!”
అప్పుడే తెల్లారిందా? దిండుకింద పెట్టిన వాచీ తీసి చూశాను. కళ్ళు మండుతున్నాయి. రెండు కావస్తోంది. రిక్రూట్లందరూ మేలుకుంటున్నారు. ఎందుకు లేపుతున్నాడో తెలీకపోయినా, ఛజ్జూరామ్ కేకలకి తత్తరపడుతూ లేస్తున్నారు. దోమతెరలోంచి బయటికొచ్చి, చకచకా ఫాంటూ షర్టూ స్వెట్టరూ తొడుక్కుని, కింద పీటీ షూస్ తగిలించుకుని బారక్ బయటికి నడిచాను.
“ఇధర్ ఫాలిన్! తీన్ దహినే బాకీ బాయేఁ!” ఛజ్జూరామ్ గొంతు గర్జిస్తోంది.
“ఖడే హోజావ్! జల్దీ!” ఈసారి ఛజ్జూరామ్ పక్కన నిలబడ్డ మరో హవల్దార్ గద్దించాడు గుంపుని. పూర్తి యూనిఫారంలో ఉన్నాడితను. కింద బూట్లు. పైన టోపీ. ఎడమ భుజం మీది నుంచి ఏటవాలుగా ఎర్రటి శాషే.
ఫాలిన్‌లో నిలబడ్డాం. లేచిన దుమ్ము మెల్లిగా నేలకి దిగుతోంది.
“స్క్వాడ్! సావ్-ధాన్! దహినే – ముడ్. తేజ్ ఛల్!” మార్చింగ్ మొదలుపెట్టాం. అర్ధరాత్రి పూట డ్రిల్లా?
“పీఛే – మూడ్!” వెనక్కి తిరిగాం.
పది నిముషాలైంది. బారక్ ముందర అటునుంచి ఇటూ ఇటునుంచి అటూ మార్చింగ్ చేయిస్తున్నాడా యూనిఫారంలోని వ్యక్తి. అతనికి దగ్గరగా వచ్చినప్పుడు గమనించాను – శాషే మీద Duty NCO అన్న పదాలని.
మా మార్చింగ్‌తో మళ్ళీ ఇంతెత్తున లేచిన దుమ్ము ముక్కుల్లోకి దూరి మండిస్తోంది. ఎవరో దగ్గారు.
“ఖాసీ బంద్!” గద్దించాడు ఛజ్జూరామ్.
“స్క్వాడ్! థమ్!” ఆగాం.
“లీడర్ కౌన్ హై?”
“సర్…” అంటూ మధ్య వరసలోంచి చెయ్యి పైకెత్తాడు ఉపాధ్యాయ్.
“ఏం? ముందుకొచ్చి నిలబడాలని తెలీదా?” గట్టిగా అడిగాడు డ్యూటీ ఎన్సీవో.
“సిగ్గేస్తోంది కొత్త పెళ్ళి కొడుక్కి” పక్కనుంచి వెటకారంగా అంటించాడు ఛజ్జూరామ్.
డ్యూటీ ఎన్సీవో కదిలాడు. ఒక్కొక్క అడుగూ తీరిగ్గా వేస్తూ స్క్వాడ్‌లో రిక్రూట్లని పరికిస్తున్నాడు.
“లీడర్, క్యా నామ్ హైరే తేరా?”
“సర్. ఉపాధ్యాయ్ సర్.”
“ఊఁ, ఇధర్ ఆవ్, ఉపాధ్యాయ్ ‘సర్’” అన్నాడు డ్యూటీ ఎన్సీవో, ‘సర్’ని వొత్తి పలుకుతూ.
దగ్గరికొచ్చిన ఉపాధ్యాయ్ చెవిలో ఏదో చెప్పాడు. “జల్దీ కర్!” అన్నాడు గట్టిగా. ఉపాధ్యాయ్ పరుగులా నడుస్తూ బారక్ లోకి వెళ్ళాడు.
చీపుళ్ళు తెమ్మన్నాడా? ఈ దుమ్మంతా ఎత్తిపోయాలా ఇప్పుడు? ఇదెక్కడి ఆర్మీ? అర్ధరాత్రి ఊడుపులేంటి?
లీడర్ బయటికొచ్చాడు. అతని రెండు చేతుల్లోనూ రకరకాల రంగుల్లో మా అందరి సాక్స్ ఉన్నాయి. స్క్వాడ్ ముందు కుప్ప పోయమన్నాడు డ్యూటీ ఎన్సీవో. పోశాడు ఉపాధ్యాయ్. డ్యూటీ ఎన్సీవో మోహంలో ఒక వెటకారపు చిరునవ్వు కనిపించింది.
“శాబాష్! రేయ్, మీలో చాలామంది అమీర్లు ఉన్నట్టుందే?” అన్నాడు.
“అందరూ అమీర్లే” మళ్ళీ వంత పలికాడు ఛజ్జూరామ్.
“వాచీలు ఎంతమందికున్నాయి? చేతులు పైకెత్తండి.”
“…”
“ఫౌజ్‍లో, ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మర్యాదగా చెప్పేయండి. ఇప్పుడు చెక్ చేస్తాను. ఎవడి పెట్లోనైనా వాచీ దొరికిందో…”
దాదాపు అందరూ చేతులు పైకెత్తారు. నాతో సహా.
“చూశారా, బెత్తం చూస్తేగానీ దయ్యం వదలదు. ఇవ్వాల్టినుంచీ మీరంతా మీ వాచీలని ఎక్కడ దాస్తారో నాకు తెలీదు. ఈ రెజిమెంట్ నుంచి బయటికి అడుగుపెట్టేంతవరకూ ఎవడైనా వాచీ పెట్టుకుని కనబడ్డాడో, వాడికి మర్యాద దక్కదు.”
“…”
“లీడర్, ఇందులోంచి ఫౌజీ సాక్సన్నీ తీసి అవతల పెట్టు.”
ఖాకీ సాక్స్ ఏరి వేరే కుప్పగా పోశాడు ఉపాధ్యాయ్.
“బీడీలెవరు కాలుస్తార్రా మీలో?”
అందరం మొహాలు చూసుకున్నాం.
“లీడర్, బీడీ కాలుస్తావా?”
“నై సర్…”
“కోయీ బాత్ నహీఁ. అగ్గిపెట్టె తే పో.”
ఉపాధ్యాయ్ బారక్ లోకి పరిగెత్తి, అగ్గిపెట్టె తెచ్చాడు. మేజోళ్ళ కుప్పని కళ్ళతోనే సూచిస్తూ అన్నాడు డ్యూటీ ఎన్సీవో.
“అంటించు.”
ఉపాధ్యాయ్ సందేహిస్తూ నిలబడ్డాడు. డ్యూటీ ఎన్సీవో గొంతు కఠినంగా మారింది. “అంటించరా!”
ఉపాధ్యాయ్ అగ్గిపుల్ల గీసి, ఒక మేజోడుని అంటించాడు. పుల్ల చురచురా మండి ఆరిపోయింది.
చురుగ్గా చూశాడు డ్యూటీ ఎన్సీవో. “అబే ఘోచూ, వెళ్ళి నాలుగు కాయితాలు తే,” అన్నాడు. ఉపాధ్యాయ్ మళ్ళీ పరుగెత్తి కాగితాలతో తిరిగొచ్చాడు.
ఈసారి కుప్ప తగలబడిపోయింది.
కరుకుగా అందర్నీ పరికిస్తూ అన్నాడు డ్యూటీ ఎన్సీవో. “ఫౌజ్‌లో చేరాం కదా, మేమే హీరోలం అనుకోకండి. మీ వూళ్ళో మీరు పెద్ద పోటుగాళ్ళు అయితే కావచ్చు. ఇక్కడ, ఈ గ్రౌండ్‌లో నిలబడ్డ తర్వాత మాత్రం మీలో ఎవడు హీరో కాదు. ‘సివిల్ కా హీరో, ఫౌజ్ కా జీరో’ అర్థమైందా?
“…”
“మీ ఇష్టమొచ్చినవి తొడుక్కుని, ఇష్టమొచ్చినట్లు వెనకాలి తోకలూ ముందరి ___ ఝాడించడానికి వీల్లేదిక్కడ. తోకలు కత్తిరించడం నాకు బాగా తెలుసు. జాగ్రత్త!” కళ్ళురిమాడు.
“పొద్దున్నే మీ సివిల్ డ్రస్‌లన్నీ మూటగట్టి గుంటలో పాతిపెట్టాలి!”
“…”
“చెడ్డీ సే లేకర్ షర్ట్ తక్, అన్నీ ఫౌజీ ఇష్యూ క్లోతింగే ఉండాలి మీ దగ్గర. యాద్ రఖో!”
“మీరంతా అనాథలు. అక్కర్లేని సంతానం. నిజంగా మీరు కావాలీ అనుకుంటే మిమ్మల్ని మిలట్రీలో చేరమని మీ వాళ్ళు చస్తే పంపించరు. తెలిసిందా? మీరంతా రిజెక్టెడ్. గుర్తుంచుకోండి. అన్‌వాంటెడ్.”
కొరడా దెబ్బలా తగిలిందా మాట. ‘కాదు. కానే కాదు’ అనుకున్నాను. కాదు అరిచాను మనసులో. అమ్మ ముఖం ఒక్కసారి కళ్ళముందు ప్రత్యక్షమైంది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“ఆజ్ కే బాద్…” డ్యూటీ ఎన్సీవో గొంతులో ఏదో చిన్న మార్పు.
“మీరంతా మా బిడ్డలు. ఈ రెజిమెంట్‌కి బిడ్డలు. ఈ సైన్యానికి, ఈ దేశానికి బిడ్డలు. సమ్‌ఝే?”
“యస్ సర్.” అన్నాడు ఉపాధ్యాయ్.
“తిండి తినలేదా? గట్టిగా చెప్పు!” ఛజ్జూరామ్ కేక పెట్టాడు.
“య్యస్ స్సర్!”
“చార్ చీజే యాద్ రఖో. అనుశాసన్ – ఇజ్జత్ – నమక్ – వర్దీ. అర్థమైందా?”
“…”
“ఓయ్ మద్రాసీ! ఏం అర్థమైందిరా తంబీ?” అందర్లోకీ లావుగా పొడవుగా కనిపిస్తున్న ప్రేమ్ కుమార్‌ని అడిగాడు డ్యూటీ ఎన్సీవో.
“అనుశాసన్, ఇస్కట్, నమ్మ…” తడబడ్డాడు ప్రేమ్.
“దుబారా సునో. అనుశాసన్ – అంటే క్రమశిక్షణ. ఇది ఫౌజ్. ఫౌజ్‌లో మనం వేసే ప్రతి అడుగులోనూ క్రమశిక్షణ ఉండి తీరాలి. ఇజ్జత్ – అంటే ఆత్మగౌరవం. ఇప్పుడు మీరు సివిలియన్లు కారు. ఇష్టమొచ్చినప్పుడు లేచి, తిని, జులాయిలుగా తిరగడానికి. ఇప్పుడు మీరు భారత సైన్యంలో సైనికులు. ఇప్పుడు మీకు గౌరవం ఉంటుంది. అర్థమైందా?”
“…”
“చెప్పరేం?” ఉరిమాడు.
“య్యస్ స్సర్!”
“ఫౌజీకి బతికున్నప్పుడు ఎటూ విలువుంటుంది. తర్వాత కూడా ఉంటుంది – దాన్ని నిలబెట్టుకున్నవాళ్ళకి…”
“…”
“నమక్ – అందరూ రోటీ తిన్నారా?”
“యస్ సర్!” ఉపాధ్యాయ్ బదులిచ్చాడు.
“మీరంతా పస్తులున్నార్రా గాడిదల్లారా?” మిగిలిన వాళ్ళని గద్దించాడు.
“య్యస్ స్సర్!” అందరం అరిచాం.
స్క్వాడ్ చుట్టూ అడుగులేస్తున్న డ్యూటీ ఎన్సీవో నా ముందు ఆగాడు. “ఈ సైన్యం ఉప్పు తిన్నారు మీరు. అది మీ నెత్తుట్లో కలిసింది. నమక్… దానికి ద్రోహం చెయ్యకూడదు.”
వింటున్నాం.
“అర్థం కాలేదా?”
“…”
“జాగ్రత్తగా వినండి. మనకి ఇచ్చిన డ్యూటీని సక్రమంగా చెయ్యాలి. అర్ధరాత్రి రెండింటికి మిమ్మల్ని లేపి భాషణ్ దంచడానికి నేనేం బేవకూఫ్‌ని కాదు. ఇది నాకు సర్కార్ ఇచ్చిన డ్యూటీ. మీ బారక్‌కి వచ్చానా, మీకు లెక్చరిచ్చానా లేదా అని నన్నెవడూ చెక్ చెయ్యడు. కానీ, నా డ్యూటీ నేను చేస్తాను. ఇప్పుడర్థమైందా?”
“యస్ సర్.”
“నాలుగోది – వర్దీ. వర్దీ సమఝ్‍తా హై? యూనిఫార్మ్. సమ్‍ఝే?” అన్నాడు అందర్నీ కలయజూస్తూ.
“ప్రాణాలు పోతున్నా సరే, వర్దీ మే దాగ్ లగ్నే నహీ దేనా తుమ్ నే…”
“ యస్ సర్!”
“తొందర్లోనే అన్నీ అర్థమౌతాయి మీకు. ఠీక్ హై?”
“…”
“మిమ్మల్ని ఇంట్లోవాళ్ళు తరిమేశారు. పర్వాలేదు. ఇవాల్టినుంచీ మనమంతా అన్నదమ్ములం. ఎవరం?”
“అన్నదమ్ములం సర్!”
“ఆ? బ్రావో కంపెనీ దాకా వినపడాలి. ఎవరం మనం?”
శక్తికొద్దీ అరిచాం. “అన్నదమ్ములం సర్!”
“శబాష్! బోలో భారత్ మాతా కీ – జై!” బిగ్గరగా నినదించాడు ఎన్సీవో.
“జై!” దూరంగా ఎక్కడో గోడకి తగిలి ప్రతిధ్వనించాయి మా గొంతులన్నీ. చుట్టూ చెట్లమీది పక్షులు ఒక్క పెట్టున గాల్లోకెగిరాయి. “…కీ జై!”
“జై!”
“…కీ జై!”
“జై!”
“MTR కీ…”
“జై!”
“భారతీయ సేనా కీ…”
“జై!”
“డిస్-పర్స్!”
పక్షుల రెక్కల చప్పుడు వినిపించడం లేదిప్పుడు.