లిప్తలో చూపులెక్కడికో పరుగెత్తిపోయి
మనోకుడ్యం మీద జ్ఞాపకాలని ముద్రిస్తూ
ఎప్పటివో వాసెనలని వాగ్వాదాలని
అంతమెరగని అలలనీ అలుపెరగక సాగే కలలనీ
చుక్కలతోబాటు లెక్కబెడుతూ ఉద్వేగోదయాల్లోకి పయనిస్తూ
ఈ చట్రాన్ని తప్పించుకుని ఈ కుర్చీల్లోంచి లేచి
ఈదుకుంటూ నీరవరాగపు గమకాలని చేదుకుంటూ
ఎండిన కాలవల్లోని పడవలని పలకరిస్తూ
మానసికాకాశమూ హృదయభూమీ లేదా
హృదయాకాశమూ మానసికభూమీ
కలిసే క్షితిజరేఖని తాకుతూ
దారాల చిక్కుముళ్ళు విప్పుకుంటూ
విముఖ సమ్మేళనాలని కూర్చుతూ
కురిసే రాత్రిని ప్రీతిగా పీలుస్తూ మౌనంగా
ఎందుకో అనుకుంటూనే అంతవరకూ పాడుతూ
ఆద్యంత రహితమైన అవ్యాజభరితమైన
ఒక్క నవ్వొక్క పిలుపొక్క మాట కోసం
అహరహమూ తపిస్తూ అనంతానందంకోసం అర్రులుచాస్తూ
పెదవులపై అనురక్తి పదమై వెలుగుతూ
ఇంకా ఇంకేదో ఇంకాలని
ఇంకో వంకలోకి వంపు తిరగాలని వొలికి చూడాలని
మరో ముక్తాయింపులో ముక్తిని వెతకాలని
కొత్త పుస్తకాన్ని తెరిచి పుటలని వాసన చూసినంత
చేయి అలా నిమిరి కొన్ని చుక్కలని చప్పరించినంత
మెత్తగా లేతగా
ఒక మార్మిక రాగదృశ్యంలోకి మునక.