ఓ సైకిల్ కథ

“ఉప్మా తింటారుగా?”

“ఆఁ!”

కాసేపటి తర్వాత ప్లేట్లో తెచ్చి ముందు పెట్టింది. తినడం మొదలుపెట్టాడు.

“బావుందా?”

“ఆఁ, బానే ఉంది.”

“గాస్ స్టవ్ నాబ్ లూజైపోయింది. తిప్పుతుంటే సరిగ్గా గాస్ రావడంలేదు. రెండ్రోజుల్నించీ చెప్తున్నాను. మీరేమో పట్టించుకోరు… దాంతో చచ్చే చావుగా ఉంది.”

“చూస్తా ఉండు.” లేవబోయాడు.

“తినేశాక చూద్దురు లెండి. లేడికి లేచిందే పరుగని… ఉప్పూ అదీ సరిపోయిందా? ఉన్న నాలుగు జీడి బద్దలూ వేసేశాను. రేపు మళ్ళీ ఉప్మాలోకి నన్నడగొద్దు.”

“తెస్తాలే.”


“ఏవండీ! ఈ తలుపొక్కసారి చూడండి.”

“దేనిది?”

“వాషింగ్ మిషన్‌ది. లాక్ కావడంలేదు.”

“వస్తున్నా…”

“ఇంతలా బట్టలు కుక్కితే డోర్ ఎలా మూసుకుంటుంది? మొన్నా మెకానిక్ చెప్పలేదూ, ఇందులో కనీసం ట్వెంటీ పర్సెంటైనా ఖాళీ ఉంచాలని? మర్చిపోయావా?”

“వాళ్ళట్లాగే చెప్తారు. నేనేమన్నా మొదటిసారి వాషింగ్ మిషన్ వాడుతున్నానా? ఇరవయ్యేళ్ళ కాపరంలో మూడోది. నాకు తెలుసులెండి.”

“అది కాదు. ఇలాంటివన్నీ మన సౌకర్యంకోసం తయారైనవే అయినా, వాటిని వాడుకోవడానికో పద్ధతుంటుంది. తక్కువ బట్టలు, తక్కువ డిటర్జెంట్ పౌడర్ వేస్తే చక్కగా పనిచేస్తాయి. ఈ కింద లింట్ స్క్రీన్ తీసి క్లీన్ చేసి ఎన్నాళ్ళయింది?”

“నాకు రాలేదు. ట్రై చేశాను రెండు మూడుసార్లు.”

“కనీసం నెలకోసారైనా క్లీన్ చెయ్యాలన్నాడా లేదా? లేకపోతే అదేదో బ్లాక్ అయిపోయి మిషన్ పాడవుతుందని చెప్పలేదూ?”

“అబ్బ చెప్పాళ్ళెండి. ఈ దయ్యానికి అంత సేవ చెయ్యడంకన్నా సుబ్బరంగా చేత్తో ఉతుక్కోవడమే మంచిది.”

బెడిసికొట్టేట్టుందని వెనక్కి తగ్గాడు.

“అయినా మా ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కునేవాళ్ళం. రేపణ్నించీ ఇక్కడా అదే మొదలెట్టాలి. బాబిగాడికి చెప్తాను. వాడు వింటాడు. మీ ముద్దుల కూతురికి మీరే చెప్పుకోండి. నావి తప్ప నేనెవరి బట్టలూ ఉతకనిహనించీ అని…”

అతని నోరు మూతపడింది. అక్కడికి ఆవిడా ఆగింది.


మధ్యాహ్నం.

తిరగమోత ఘాటు గదిలో గుప్పుమంది. దగ్గొచ్చిందతనికి.

“అబ్బబ్బ! ఎన్నిసార్లు చెప్పినా ఆ చిమ్నీగానీ ఎగ్జాస్ట్ కానీ ఆన్ చెయ్యవేం వంట మొదలెట్టే ముందు?” ‘మీ ఇంట్లో అలవాట్లేదా’ అని ఆ వాక్యం ముగిద్దామనుకున్నాడు కాని అనలేదు.

“దాని సౌండు నాకు నచ్చదూ అని వందసార్లు చెప్పాను. మాట వినబడి చావదు. ఇప్పటికి మూడుసార్లు పిలిచాను మిమ్మల్ని. ఆ పైన కందిపప్పు డబ్బా అంది చావక. చచ్చినట్టు నేనే తీసుకున్నా చివరికి. మీకేం! కూర్చుని ఎన్నైనా చెబుతారు. ఇక్కడికొచ్చి చెయ్యండి తెలుస్తుంది.” గిన్నె ధనేలుమంది.

“…”

“అమ్మా…”

“…”

“అమ్మా, లంచ్‌కి ఏంటి?” హాల్లోకొస్తూ అడిగింది కూతురు.

“ఏదో చేసి ఛస్తున్నాను. అయినా నే వండేవి నీకిష్టముండవుగా! నలుగురికీ నాలుగు వంటలు చెయ్యడం నా వల్లకాదు. అంతగా అయితే ఎవరిక్కావలసింది వాళ్ళు చేసుకోండి. తినండి. అప్పుడు తెలుస్తుంది.”

‘ఎందుకావిడతో నీకు గొడవ?’ అన్నట్లు కూతురికేసి చూశాడు. అర్థం చేసుకున్నట్లు తలాడిస్తూ తన గదిలోకి – ‘వర్క్ ఫ్రమ్‌ హోమ్‌’లోకి దూరింది కూతురు.


లంచ్.

కూర ముద్దతో అతని నోరు భగ్గుమంది. తమాయించుకుని సైలెంట్‌గా తింటున్నాడు.

“ఎలా ఉంది?” అడిగిందామె.

“బానే ఉంది.” మామూలుగానే చెప్పాడు.

“బాగుందమ్మా.” అన్నాడు కొడుకు అడక్కపోయినా… అమ్మ సంగతి వాడికీ తెలుసు.

“అబద్ధమాడతారేం? కారమెక్కువగా లేదూ? చెప్పచ్చుగా?” మళ్ళీ అతన్నే అడిగింది.

“ఏదో… కొద్దిగా… పెద్దగా ఏం లేదులే.”

“పచ్చిమిరపకాయలు రెండెక్కువ పడ్డట్టున్నై. ఈసారి కారమెక్కువుండే రకాలు తెచ్చారు. ఏదో ఆలోచిస్తుంటే పడ్డట్టున్నాయ్.” ఓ ముద్ద తిని అంది అన్-ఎపాలెజెటిక్‌గా.

“అందుకే అంటాను. వంట చేసేటప్పుడు ఫోన్‌లో మాట్లాడద్దని.”

“ఎవరు మాట్లాడారు?”

“ఇందాక చిట్టి ఫోన్ చెయ్యలేదూ?” చిట్టి ఆమె చెల్లెలు. వేరే ఊళ్ళో ఉంటుంది. అక్కచెల్లెళ్ళిద్దరూ రోజూ కనీసం గంటన్నరైనా మాట్లాడుకుంటేగానీ సూర్యుడి రథం సాగదు.

“ఏం? మీకు ఫోనొస్తే మీరు మాట్లాడరూ అవతలివాళ్ళ చెవులు చిల్లులు పడేంతవరకూ? నాకు తెలీదా నేను చూట్టంలేదా?”

“అంతసేపు నేనెవరితో మాట్లాడానూ?”

“ఉన్నారుగా మీ పుస్తకాల పురుగులు.” అక్కసుగా బదులిచ్చింది.

“చూడూ… అన్నాలు తినేటప్పుడు ఇవన్నీ అనవసరం.”

పిల్లలిద్దరూ తలలొంచుకుని తింటున్నారు.

“మిమ్మల్నేమీ అనకూడదు. మీరు మాత్రం అనొచ్చు. నేను చిట్టితో మాట్లాడితేనే వచ్చేస్తుంది ఎక్కడలేని ఏడుపూనూ.”

“అరె…”

“అరే లేదు ఒరే లేదు. నన్నంటే నేనూరుకుంటానా? నోటి దగ్గిర్నించీ డాష్ దాకా చేసి పెడుతుంటే తెలీడం లేదిక్కడ ఎవరికీ. ఊరికే మాటలు పడతానా?”

భోజనాలయాయి.

“ఇక పదండి.” మాటరాఫ్ ఫాక్ట్‌లా అంది.

“ఎక్కడికి?”

“పడకకి. తమరిప్పుడు పడుకోవాలి కదా భోజనం తర్వాత?!”

“ఏదో, ఓ పది నిముషాలు నడుం వాలుస్తా. అంతేగా!”

“మీ పది నిముషాలు ఎవడికి తెలీదూ? మళ్ళీ ఆరయితేగానీ కళ్ళు తెరుచుకోవు మీకు, ఈలోపు ఏ భూకంపమొచ్చినా సరే.”

అతనికి నిజంగానే నిద్దరొస్తోంది. పొద్దున్నే అయిదింటికి లేస్తాడు. వాకింగూ, ఫ్లోర్ ఎక్సర్‌సైజులూ అలవాటులానే, భోజనం చేశాక చిన్న సియెస్టా కూడా. మాట్లాడకుండా వెళ్ళి దిండు తెచ్చుకుని, టీవీముందు నేలమీద వెల్లకిలా పడుకుని చూస్తున్నాడు.

“కానివ్వండి.”

“ఏంటి?”

“పడుకోండీ.”

“పడుకుంటాన్లే. అది కూడా నువ్వే చెప్పాలా?”

“ఏమో. చెప్తేగానీ ఏదీ చెయ్యరుగా. ఈటీవీ హెచ్‌డీ రావట్లేదో అని మొత్తుకుంటున్నాను వారంనించీ. మీకు మీ ఇంగ్లీష్ సినిమాలుంటే చాలుగా.”

“అబ్బబ్బబ్బ! డబ్బులెప్పుడో కట్టాను. అయినా ఆ చానెల్ రావట్లేదు. కంప్లైంటిచ్చాను. ఇదిగో చూస్తాం అదిగో చేస్తాం అంటున్నారు. అంతకంటే నేనేం చేసేది?”


గంట తర్వాత.

“కాఫీ తాగుతారా?”

“ఇవ్వు.”

నాలిక చుర్రుమంది.

“లక్షసార్లు చెప్పాను. పొయ్యిమీదినుంచి అలా దించి ఇలా ఇస్తావు. నాలిక ఊడిపడేంత వేడిగా ఛస్తుంది. కొంచెం చల్లారాక ఇవ్వచ్చుగా?”

“అవున్లెండి ఉగ్గుపాలు తాగే పాపాయి కాదూ మీరు? చల్లారబెట్టకపోతే ఎలా పాపం?” కోస్తున్నట్లు నవ్వి, నోరు మూతవెయ్యడం ఇన్నేళ్ళలోనూ అతను నేర్చుకోలేదు. నేర్చుకోలేడు.


రాత్రి తొమ్మిదవుతోంది.

“ఇంకా ఎన్నాళ్ళో ఈ లాక్‌డౌన్. బోర్ కొట్టి చచ్చిపోతున్నా.”

“…”

“మనం చివరిగా వెళ్ళిందెక్కడికీ? నైనితాలే కదూ?”

“నైనితాల్ వెళ్ళి మూడేళ్ళైంది. మధ్యలో సిమ్లా వెళ్ళాం. హరిద్వార్ కూడా వెళ్ళాం మొన్న అక్టోబర్లో మీ పిన్నీ బాబాయ్ గార్లొచ్చినప్పుడు. నీకు మతిమరుపు బానే పెరుగుతున్నట్లుంది.” ‘గార్లు’ వత్తి పలికేడు.

“ఆ వెళ్ళాంలెండి! మరీ అర్ధరాత్రి మూడింటికే లేపి కార్లో కుదేస్తారు. పోనీ ఆ వెళ్ళిన తర్వాతైనా పడుకోనిస్తారా అంటే అదీ లేదు. ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు అది చూద్దాం ఇది చూద్దాం అంటూ హడావుడి పెడతారు. అయినా ఎక్కడ చూసినా అవే పరాఠాలు, అదే బటర్ చికెన్. ఏ లోకానికెళ్ళినా మీకు మాత్రం మందు పడాల్సిందే. మీ మందు కార్యక్రమం అయ్యేదాకా మేమంతా డిన్నర్ కోసం చూస్తూ చొంగలు కార్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు చూళ్ళేదూ?”

“నేను తాగేది మహా అయితే ఓ పెగ్గు. అది లెక్కలోకి రాదు.”

“ఎందుకొస్తుందీ. నేనూ పిల్లలూ కలిసి నాలుగు రోజులకో సీసా ఖాళీ చేస్తున్నాం కదా!”

ఈసారి అతని పెదాలు అంటుకుపోయి గీతలా అయాయి.


సినిమా అయిపోయింది.

కొడుకు చూసే జోనాస్ అయిపోయింది. కూతురు మొబైల్‌లో చూస్తున్న హారర్ సినిమా కూడా అయిపోయినట్లుంది. ఇద్దరూ కలిసి యూట్యూబ్‌లో ‘బోర్డ్ఇండియన్’ పాత ఎపిసోడ్లు రెండువందల పదమూడోసారి కూడా చూసేసి, పన్నెండు కాబోతుండగా నలుగురూ రెస్పెక్టివ్ బెడ్రూమ్‌ల వైపు కదిలేరు.

“ఈ దిక్కుమాలిన ఎక్వేరియమ్ ఒకటి నా ప్రాణానికి. దాన్నీ ఇక్కడే తగలెట్టేరు. రాత్రంతా ఒకటే రొద. కొత్తది కొన్నారుగా. ఈ పాత డొక్కుని ఓయెల్లెక్స్‌లో అమ్మిపడేయ్యొచ్చుగా?”

నిజమే. ఒక ఫ్రెండ్ దగ్గర కొత్త ఎక్వేరియమ్‌తో బాటు అనుకోకుండా రెండు చిన్న చిన్న తాబేళ్ళు కూడా కొనాల్సొచ్చింది. వాటితోబాటు, అంతవరకూ, గత యేడేళ్ళనుంచీ తమ దగ్గరున్న పాకూ ఫిష్‌ని కూడా ఉంచితే, అవి ఒకదాన్నొకటి వేటాడేందుకు చూస్తున్నాయి. పాకూని మళ్ళీ పాత ఎక్వేరియమ్‌లోకీ, ఆ ఎక్వేరియమ్‌ని బెడ్రూమ్‌లోకీ మార్చాడు.

లైట్లారాయి. పిల్లల గదుల్లోనూ. వీళ్ళ గదిలోనూ.

చెరో గోడవైపూ తిరిగారు భార్యాభర్తలిద్దరూ.

పది నిముషాలు గడిచాయి.

ఆమె వైపు తిరిగి… వీపుకి తన ఛాతీని చేర్చాడతను.

ఇటు తిరగకుండానే తలయెత్తి, అతని ఎడమ భుజానికి చోటిచ్చి, దిండుగా చేసుకుందామె.

అతని కుడి చెయ్యి కదిలింది.

ఎక్వేరియమ్ మోత వినిపిస్తోనే ఉంది డబుల్‌ బెడ్‌కి.