తెల్లని రెక్కల్ని విడదీసి ఒకసారీ
తల వేగంగా పైకీ కిందకీ ఆడించి మరోసారీ
తన భాషలో తను
ప్రేమని వివరించాలని ఆపేక్షని పూయాలని
నువ్వంటే నాకిష్టమని అంతా నీకోసమేనని
మొత్తం కళ్ళతోనే సంపూర్ణంగా
ఆర్తిగా చూస్తూ ఆర్ద్రంగా అల్లుకుంటూ
అప్పుడప్పుడూ గింజలకని గూట్లోకి చేరీ
పక్కగదిలోకెళ్ళినా శక్తికొద్దీ పిలుస్తూ
అదే పనిగా కూస్తూ అన్న మాటలు అప్పగిస్తూ…
అదే ఊళ్ళో
అవే రెక్కలు అవే ముక్కులు బుగ్గలమీద
అవే నారింజ రంగు మచ్చలు
పల్చని పసుపు తోకా సన్నటి పొడవాటి వేళ్ళు
భయమే అస్తిత్వమై బతుకే వ్యాపారమై
మెడలో ముక్కుని దాచుకుని
కళ్ళు మూసుకుని గట్టిగా పట్టుకుని
మోటుగా లోనికి దూసుకొచ్చే చేతినుంచి తప్పించుకుంటూ
పాటలేకా పాడలేకా
అలా చూస్తుండటం రొదలో నిశ్శబ్దంగా అరుస్తూ…
“యే ఆఠ్ సౌ కా హై. వో సాత్ సౌ పచాస్. బోలో కోన్సా చాహియే?”