మాటల అంచున

మా ఇద్దరికీ
ఒకేలా వయసు మీద పడింది
జుట్టు నాకూ పెంకులు తనకూ తగ్గేయి
బుగ్గల నునుపూ గోడల పెయింటూ
పెచ్చులుగా వూడుతున్నాయి
చేతుల దారుఢ్యమూ ద్వారబంధాల పటుత్వమూ
తరుగుతున్నాయి.

మతిమరుపుతో నా మెదడు మీదా
గాలివిసుర్లతో తన వరండాల మీదా
దుమ్ము పేరుకొంటోంది
విప్పలేకపోయిన ఒక్కొక్క ముడినీ
ఒప్పుకొంటూ నేనూ
పుచ్చుకి దారిచ్చి పడిపోతున్న
కొయ్య స్తంభాలతో తనూ.

ఈల రాని పెదాలని నేనూ
ఈదురుగాలి ఈలలని తనూ
సహిస్తున్నాం
అద్దాలు బీటవారిన కళ్ళజోడుని నేనూ
అద్దాలూడిన కిటికీ ఫ్రేములని తనూ
ఇంకా వదులుకోలేకపోతున్నాం.

చాలాసార్లు కాళ్ళకింది నేల కదిలి నేనూ
గుంటలు పడ్డ సిమెంటు గచ్చు పగిలి తనూ
కలవరపడుతుంటాం
పర్వాలేదని భుజాలు నేనూ నెర్రెలని తనూ
తట్టుకొని ధైర్యం చెప్పుకుంటూంటాం
గుండె చెమర్పుని నేనూ గోడలమీది చవుడుని తనూ
ప్రేమించడాన్ని నేర్చుకుంటున్నాం.

తను నాకోసం చూడకపోయినా
నేను తనని చూడటానికి వెళ్తే
ఇప్పటి తన ఖాళీతనంతోబాటు
అప్పటి ఆపేక్షతో అదేలా హత్తుకుంది
ఎటూ కారని కన్నీళ్ళ ఉప్పదనం ఉప్పెనే అయింది
అలలు అదుపు తప్పకముందే నోరు తెరిచి –

ఎగిరి ఎటో పోయిన పెంకుల్లోంచి
ఇంకా వెన్నెల కురుస్తూనే ఉన్నదంది
ఎప్పుడో చెరిగిపోయిన పాదముద్రలని
ఇప్పటికీ తడుముతున్నానంది
తనకోసం నేనొచ్చినందుకు తన్మయిస్తున్నానంది
మన చేతుల్లో లేని వీడ్కోళ్ళని తలచి వగచరాదంది
ప్రవాహశోభాన్విత ప్రయాణమే కానీ
నిష్క్రమణాత్మకమైన గమ్యం ముఖ్యం కాదంది

నాకోసమో తనకోసమో! ఒప్పుకోగలనా?