మళ్ళీ… నవ్వేయాల్సొస్తుంది
గడ్డకట్టిన ముఖాన్ని చీల్చుకుని
నుదుటిమీద జీవితం తుఫుక్కున
ఉమ్మిన తడి నిజాలు జారిపోతుండగా
మళ్ళీ… ముడి విప్పాల్సొస్తుంది
ఛెళ్ళున తగిలిన చెంపదెబ్బ
మనసుని మండిస్తుండగా
ప్రతి మనిషీ ఒక నది ప్రతి క్షణమూ ఒక అల
చేతికి చిక్కేవి కొన్నీ చిక్కక
కనుమరుగయేవి కొన్నీ జ్ఞాపకాల బుడగలు
పట్టుకోలేని పట్టుకోరాని పగ్గాలు
చెర్నాకోల ఛెళ్ళు ఛెళ్ళున వాతలేస్తుంటే
అవును ఇదింతే.
తన్నుకోవడమే తెలుసుకోవడమంటే
ఎన్నుకోలేకపోవడమే అలుసుకావడమంటే
అదుపు చేసుకోలేకపోడమే బిగుసుకున్న ఉచ్చులంటే
అడుసు మీద పడ్డ కాలు అస్సలు కడుక్కోలేకపోవడమే
ఓడిపోయి తలపాగా కాళ్ళమీద ఉంచడమంటే
నోట్లో నురగ మొదలవగానే కళ్ళు తెరుచుకోవాలనేదీ
చేతిలో రేఖ కనపడగానే పరిగెత్తాలనేదీ
చెప్పిన మాట వినాలనేదీ చేతలు సరిగా ఉండాలనేదీ
అందుకే.
ఎన్నో కెరటాలు తీరాన్ని తాకేసేక
ఎన్నో కలలు బండలమీద ఆరేక
కొత్తగా కదను తొక్కడానికి
అటు వీలూ ఉండదు ఇటు కాలూ ఉండదు
ఫొండిరా… ఫొండి.
పోయి అదుపు కొంచెం అరువు తెచ్చుకోండి.