తేలికపాటి వెన్నెల

అంత తేలికేం కాదు

కన్నీరు జారి చార కట్టడం
రెప్పల వెనుక మెలకువని
తట్టి నిద్ర లేపడం
లబ్‌డబ్‌లతో పెనవేసి చాచిన
చేతిని విదుల్చుకోవడం
శ్వాసల మధ్య నీరవాన్ని
గుర్తించి గౌరవించడం
కెరటాల మధ్య
ఖాళీలని పూరించుకోవడం

అంత కష్టమూ కాదు

నవ్వు ముసుగుని లాగేసి
మన నాటకాలకి తెర దించడం
కాస్తంత శ్రమించి
పేరుకున్న తుప్పు వదల్చడం

అంత కష్టమేం కాదు

ఎదురుగా కూర్చున్న
అగాథాలని దాటడం
ఎగస్తున్న కోపాల నిప్పులని
కాస్తకాస్తగా చప్పరించెయ్యడం

నిజానికి

అస్సలు కష్టం కాదు
గుక్కెడేసి చొప్పున చక్కెరని పంచుతూ
వొక్కొక్కటిగా లెక్కలన్నింటిని
ఈజీక్వల్టూ జీరోగా మార్చడం


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...