తెలిసిన బొమ్మే.
తడిమిచూసీ వేళ్ళని అరగదీసీ
ఉరకలు పరుగులతో కావిలించుకోబోయిన బొమ్మే.
అలవాటైన బొమ్మే.
అలుగుతుందని తెలిసీ లెక్కపెట్టకుండా
ఆకురాతిగుండెమీద పలుమార్లు సర్రుమనిపించిన బొమ్మే.
చిరువలయాల్లోంచి చదరాల్లోకీ సూటిగీతల్లోంచి
పేరుకునే నురగలకింది శూన్యపు ఉరవడుల్లోకీ
మలుపుల తలపుల్లోకీ రూపాల్లోంచి పాపాల్లోకీ
జారబోయినప్పుడల్లా పట్టుకోబోయి జార్చుకున్న బొమ్మే.
మారదనుకున్న బొమ్మే.
శ్వాసలమీదుగా అల్లుకుంటూ అడుగులేస్తూ
అలనాటి నక్షత్రాలని కళ్ళు నులుపుకుంటూ
చూడమని మెత్తగా వాతపెట్టిన బొమ్మే.
ఒక వెలుతురు ఒక మాట ఒక గీత ఒక మడత
ఎన్నో ఆవిరైపోతూ ప్రవాహంలో మునుగుతూ లేస్తూ
చెయ్యూపినట్లే బైబై చెప్పినట్లున్న బొమ్మే.
తెలిసిన బొమ్మే.
నిజంగా – తెలుసుకోని బొమ్మే.