సోల్జర్ చెప్పిన కథలు: నేరము-శిక్ష

ఆ సాయంత్రం స్పెషల్ ‘రోల్‌కాల్’లో సుబేదార్ మేజర్ సాబ్ కూడా వచ్చి చేరేడు.

“రెజిమెంట్! సావ్‌ధాన్!” బిగ్గరగా కమాండ్ ఇచ్చిన రెజిమెంట్ హవల్దార్ మేజర్ (ఆర్.హెచ్.ఎమ్), రోల్‌కాల్‌ని సంబోధించడానికి సుబేదార్ మేజర్ సాబ్‌కి అధీనం చేశాడు.

“రెజిమెంట్, విశ్రామ్” అన్నాడు సుబేదార్ మేజర్. “యే ఫౌజ్ హై” అన్నాడు ఉపోద్ఘాతంగా, అందరినీ కలయజూస్తూ. “ఇక్కడ సరిగ్గా పని చేస్తే ‘శాబాషీ’ అందుతుంది. తప్పుడు పనులు చేస్తే…” ఆగాడు ఎఫెక్ట్ కోసం అన్నట్లు. అందరికీ తెలిసిన బూతు పదమే వాడాడు.

“బంబూ మిలేగా, డేడ్ ఫుట్ కా…” రోల్ కాల్ నిశ్శబ్దంగా వింటోంది. “పట్టుబడనంతవరకూ హీరోల్లా తిరుగుతారు ఛాతీ పొంగించుకుంటూ. ఏదో ఒక రోజు పట్టుబడక తప్పదు. అప్పుడు మీరే వచ్చి కాళ్ళ మీద పడి ఏడవడం మొదలెడతారు. ‘సాబ్, తప్పైపోయింది సాబ్. ముఝే బచాలో సాబ్’ అంటూ. అప్పుడు సుబేదార్ మేజర్ సాబ్ మాత్రం ఏం చెయ్యగలడు?”

ఇదంతా ఎవరి గురించి? అసలేమైంది?

“ఏక్ బేషరమ్ ఆద్మీ హై హమారే బీచ్ మే. పదహారేళ్ళ సర్వీస్ పూర్తి కావస్తోంది. సీనియర్ ఎన్‌సిఒ రాంక్ వేసుకున్నాడు. ఒకటి రెండేళ్ళలో జెసిఒ కాబోతున్నాడు. కానీ ఏం లాభం? ఇన్నేళ్ళ ఆర్మీ సర్వీస్ చేసి కూడా బుద్ధి బాగుపడలేదు. ఆ మనిషి పేరు హవల్దార్ కన్హయ్యా లాల్ ఉప్రేతీ…”

“ఉప్రేతీ అంటే, ఆర్‌‌ఎచ్‌క్యూలో క్లర్క్ గా చేస్తున్నతనే కదూ?” పక్కన నిలబడ్డ అతను అడిగాడు గొంతు తగ్గించి. అవునన్నట్లు తలూపాను.

“ఏం చేశాడో…”

పక్కతను అందుకున్నాడు, అడగకుండానే. “ఈ ఫౌజీ క్లర్కులు టైప్ కొట్టడం నేర్చుకొస్తారు. టైమంతా ఆఫీసర్ల పక్కనే గడుస్తుంది. సంతకాల కోసం పది కాగితాలు ముందు పెడతారు. అన్నీ చదివే టైమ్ లేనప్పుడు ఆఫీసర్లు నమ్మకం కొద్దీ సంతకాలు చేస్తారు. వాటి మధ్య వీడు సొంత లాభం ఏర్పాట్లు చేసుకుంటారు.”

ఇతనెప్పుడో ఏ క్లర్కు చేతిలోనో ఇరుక్కున్నట్లుంది!

“ఏయ్ చుప్! నోళ్ళు ముయ్యండి!” ఫాలిన్‌లో ముందు నిలబడ్డ సెక్షన్ ఎన్‌సిఒ తగ్గించిన గొంతుతోనే గద్దించాడు.

“ఈ ఉప్రేతీగారికి గవర్నమెంటు పెడుతున్న తిండి, జేబులో పోస్తున్న జీతం, ఎలవెన్సులూ సరిపోలేదు. దురాశ పుట్టింది. కానీ పైనుంచి దేవుడు చూసినా చూడకపోయినా, కింద మాలాంటి వాళ్ళున్నారు తప్పు చేస్తే కనిపెట్టడానికి…

“రేపు పదింటికి, రెజిమెంట్ మొత్తం, మళ్ళీ ఇదే గ్రౌండ్‌లో ఫాలిన్ కావాలి. ఫుల్ సెరిమోనియల్ యూనిఫారంలో. ఎందుకో తెలుసా?”

“…”

“మీరే చూస్తారు. మళ్ళీ చెప్తున్నాను. అందరూ ఫుల్ సెరిమోనియల్ యూనిఫారంలో కావాలి. అంటే తెలుసుగా? మీ సర్వీస్ రిబ్బన్లే కాదు, వాటితోబాటు మెడల్స్ కూడా ఉండాలి. పీటీ డ్రస్సులు, డాంగ్రీలూ కోంబాట్ డ్రస్సుల్లో ఎవడైనా వచ్చాడో, మిట్టీ మే మిలాదూంగా… కోయీ శక్?

“…”

ఎటెన్షన్ లోకి మారి ఆదేశించాడు సుబేదార్ మేజర్. “రెజిమెంట్! లైన్ తోడ్!”


మర్నాడు, ఆదేశాన్ని అందుకున్న రెజిమెంట్ అదే గ్రౌండ్‌లో ఫాలిన్ అయింది.

కొద్ది క్షణాల్లో, పూర్తి ఓజీ యూనిఫారం ధరించిన హవల్దార్ ఉప్రేతీని అటూ ఇటూ ఇద్దరు గార్డులతో మార్చ్ చేయిస్తూ గ్రౌండ్ మధ్యకి తీసుకొచ్చాడు ఒక సీనియర్ ఎన్‌సిఒ. ఉప్రేతీ ముఖం కిందికి దిగి లేదు గానీ అందులో దిగులుందో లేదో చెప్పలేం.

ఫ్లాగ్ పోస్ట్ అంచెలంచెలుగా రెజిమెంట్, కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ జె ఆర్ హోతా అధీనంలోకి అందించబడింది. ఆయనకి రెండడుగుల ముందు రెజిమెంట్‌కి ఎడ్జుటెంట్, హెడ్ క్లర్క్ నిలబడ్డారు.

“రెజిమెంట్! సావ్‌ధాన్!” కమాండ్ ఇచ్చి “హెడ్ క్లర్క్ సాబ్, షురూ కరియే” ఆదేశించాడు లెఫ్టినెంట్ కల్నల్.

“యస్ సర్” అంటూ సెల్యూట్ చేసి మొదలెట్టాడు హెడ్ క్లర్క్.

“నెంబర్ 8449245 ఎల్, హవల్దార్, క్లర్క్ జనరల్ డ్యూటీ, మహేంద్ర కుమార్ ఉప్రేతీ… బాధ్యతగల ఒక నాన్ కమీషన్డ్ ఆఫీసర్‌గా వ్యవహరించవలసిన మీరు గత మూడేళ్ళుగా, ప్రభుత్వం కేటాయించిన మ్యారీడ్ ఎకామడేషన్లో నివసిస్తూ కూడా, చట్టవిరుద్ధంగా హౌస్ రెంట్ ఎలవెన్స్‌ని కూడా క్లెయిమ్ చేసి తీసుకుంటున్నారని, జవాన్లు, జేసీఓలూ ప్రతి నెలా మీ వద్ద జమ చేసే రెజిమెంటల్ ఫండ్ మొత్తంలో లెక్కలు తగ్గించి చూపి ఎక్కౌంట్ ఆఫీసులో జమ చేస్తున్నారని, జవాన్లకీ జేసీఓలకీ ఏడాదికి ఒకసారి చొప్పున మంజూరయ్యే ‘రైల్వే ఫ్రీ వారంట్’లని, రూల్స్‌కి విరుద్ధంగా, అధికార్లని మభ్యపెట్టి, రహస్యంగా అనేకసార్లు అమ్ముతున్నారని, వాహనాల విభాగంలోని సివిలియన్లతో కుమ్మక్కై పెట్రోల్, డీజెల్‌లని దొంగతనంగా అమ్ముతున్నారనీ అభియోగాలున్నాయి. జనరల్ ఆఫీసర్-ఇన్-కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ పర్మిందర్ సింగ్ శేఖావత్, పరమ్ విశిష్ట్ సేవా మెడల్ వారి ఆదేశాల మేరకు జరిపిన కోర్ట్ మార్షల్ ప్రొసీడింగ్స్‌లో, మీ మీద మోపిన ఈ అభియోగాలన్నీ నిజమని నిరూపించబడ్డాయి. మీకు విధించిన శిక్ష – ఎటువంటి టెర్మినల్ బెనిఫిట్స్ లేకుండా, సైన్యపు సేవలనుంచి తక్షణమే డిస్మిస్ చేయబడడం.”

చిన్న కదలిక కూడా లేకుండా కిందకి చూస్తూ బిగుసుకుపోయి నిలబడ్డాడు హవల్దార్ ఉప్రేతీ.

ఆపి, కమాండింగ్ ఆఫీసర్ వైపు తిరిగి సెల్యూట్ చేశాడు హెడ్ క్లర్క్. తల పంకించాడాయన. “ఆర్‌ఎచ్‌ఎమ్, ప్రక్రియని మొదలుపెట్టండి.” కల్నల్ హోతా ఆదేశించాడు.

ఆర్‌హెచ్‌ఎమ్ స్టిఫ్‌గా సెల్యూట్ చేసి, హవల్దార్ ఉప్రేతీని సమీపించాడు. ముందు అతని తల మీది బెరేని తొలగించాడు. షర్ట్ ఎడమ జేబు మీది నేమ్ ప్లేట్‌ని, కుడి జేబు మీది మెడల్స్‌ని తొలగించాడు. తర్వాత నడుముకున్న బెల్ట్ వైపు చేసిన సైగనందుకున్న ఉప్రేతీ, స్వయంగా బెల్ట్ తీసేసి గార్డ్‌కి ఇచ్చాడు. అప్పుడు సుబేదార్ మేజర్ సాబ్ ముందుకి వచ్చి, ఉప్రేతీ షర్ట్ కుడి భుజానికి ‘కుట్టి’ ఉండవలసిన హవల్దార్ హోదా చిహ్నం (v ఆకారంలో మూడు తెల్ల గీతలు), ప్రస్తుతం నొక్కుడు బటన్లతో అతికించి ఉంది – దాన్ని ఒక్క కుదుపుతో లాగేశాడు…

అలా, పన్నెండేళ్ళ సర్వీస్ తర్వాత హవల్దార్ హోదాకి చేరిన మహేంద్ర కుమార్ ఉప్రేతీ, క్షణాల్లో ఉత్త ఉప్రేతీగా మారాడు.

ఇన్నేళ్ళ తర్వాత, సైన్యం నుంచి అప్పుడెప్పుడో పారిపోయిన బీపీ హఠాత్తుగా తారసపడినప్పుడు ఇదంతా జ్ఞాపకాల్లో మెదిలింది.


“హేయ్ రావ్!”

వెనక్కి చూశాను. ఎక్కడో చూసినట్లుంది అతన్ని.

“మీరు… నువ్వు… హేయ్ బీపీ – బీపీ త్రివేదీ!”

ఆర్మీ డ్యూటీలన్నీ చేస్తూనే కష్టపడి చదివి, కోర్స్‌లో సెకండ్ టాపర్‌గా నిలిచిన భోలా ప్రసాద్ త్రివేదీ ఉరఫ్ బీపీ… ఆ కోర్స్ పూర్తయిన వెంటనే దక్కే జెసిఒ రాంక్‌ని ధరించకుండానే పారిపోయాడని విన్న బీపీ…

“సరిగ్గా గుర్తుపట్టావు. బీపీనే!” సందేహాలతో నిండిన నా మొహాన్ని పట్టించుకోకుండా విశాలంగా నవ్వుతూ కౌగలించుకున్నాడు. “గడ్డం పెంచావేంటి? బాలీవుడ్ ఛాన్స్‌కి ట్రై చేస్తున్నావా?” మళ్ళీ పెద్దగా నవ్వాడు.

“అదేం లేదు గానీ నువ్వేంటిక్కడ? ఢిల్లీలోనే సెటిలయ్యావా ఏంటి?” కనీసం ఇరవై ఏళ్ళు దాటింది ఇతన్ని చూసి? మనిషి బొద్దుగా అయాడు. ఖరీదైన బట్టలు. సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు. మాటల్లో బలంగా వినిపించే ఒడియా యాసలో మాత్రం మార్పేం లేదు అప్పటికీ ఇప్పటికీ.

“లేదు లేదు. బిజినెస్ పని మీద వచ్చాను.”

“బిజినెస్సా?”

“బిజినెస్సే. చేస్తాననుకోలేదా? అంత ఆశ్చర్యపోతున్నావ్” మళ్ళీ నవ్వబోతున్నాడు.

“భలే వాడివే! ఏం బిజినెస్?”

“చెప్తా. ముందు కాఫీ తాగుదాం పద” అంటూ పక్కనే ఉన్న బరిస్టా లోకి లాక్కుపోయాడు. కూర్చున్నాం. ఆర్డరిచ్చాడు. ఒకప్పుడు ఖాళీగా ఉండే అతని ఎడమ మణికట్టు మీద ఇప్పుడు ఖరీదైన స్మార్ట్‌వాచ్ ఒకటి మెరుస్తోంది.

“చెప్పు బీపీ. నిన్ను కలవడం ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ ఉంది. ఎక్కడుంటున్నావ్ ఏం చేస్తున్నావ్? ఎన్నాళ్ళు ఢిల్లీ ట్రిప్?”

“చెప్పాగా. మీడియా బిజినెస్‌లో ఉన్నాను. మా భువనేశ్వర్ లోనే ఒక ఏజెన్సీ తెరిచాను. ఒక పార్టనర్ ఇక్కడుంటాడు. ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ పని గురించి, అతను పిలిస్తే వచ్చాను. రేపు సాయంత్రం బాక్ టు హోమ్!”

“సో నైస్. చాలా బాగుంది. పద, ఇంటికి వెళ్దాం.”

“థ్యాంక్ యూ రావ్. కానీ సారీ. ఈసారి కుదరదు. ఇంకోసారి – తప్పకుండా వస్తాను. సరేగానీ, నువ్వేం చేస్తున్నావ్? ఉద్యోగమా బిజినెసా?”

“కార్పొరేట్ జాబ్ చేస్తున్నాను. సీనియర్ మేనేజర్, ఆపరేషన్స్,” చెప్పాను.

“వెరీ గుడ్.”

ఆర్డర్ చేసినవి వచ్చాయి. “ప్లీజ్…” తీసుకోమని సైగ చేశాడు.

“బీపీ, నువ్వు జెసిఒ ప్రమోషన్ తీసుకోకుండానే వెళ్ళిపోయావని విన్నాను. ఆబ్సెంట్ విత్‌ అవుట్ లీవ్ (AWOL) మీద నీపై…”

“ఆఁ, ఆఁ. అవన్నీ నిజమే. నీకు తెలుసుగా రావ్. ఆర్మీ పద్ధతుల్లో కొన్నే నచ్చేవి నాకు. అందుకే నాకు నచ్చినట్లుగానే ఉండేవాణ్ణి…”

అవును. డిసిప్లిన్‌కి భంగం రాకుండా, తన పద్ధతిలో తనుండే ఇతన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది. యూనిఫారంలో షూస్ దగ్గర్నించీ కాప్ వరకూ, తన వీలు కోసం చేసుకున్న చిన్నా పెద్దా తేడాలేవీ బయటికి కనిపించకుండా జాగ్రత్తపడేవాడు. బరాక్‌లో అతని బెడ్‌ని అటు చదువుకోవడానికీ ఇటు విశ్రాంతికీ వీలుగా, మెత్తటి దోమతెర, రీడింగ్ లాంప్‌ వంటి ఏర్పాట్లతో సౌకర్యవంతంగా మలచుకున్నాడు. అవసరమైతే తప్ప పక్కవాడితో మాట్లాడడు. డ్రింక్, సిగరెట్లు ముట్టుకోడు. సాయం చెయ్యడానికి మాత్రం ఎల్లప్పుడూ రెడీ.

ఒక్కటే ఇబ్బంది ఉండేది. ఇతనికి షేక్‌హాండ్ ఇస్తే, తువ్వాలుతో తుడుచుకోవలసినంత తడి తగిలేది.

“దీన్నిమాత్రం ఫౌజీ డాక్టర్లెవరూ సరిచెయ్యలేకపోయారు.” హుషారుగా చెప్పేవాడు. “న్యూరోసర్జన్‌ నన్ను సైకాలజిస్ట్ దగ్గరికి పంపాడు. ఆయనేమో డెర్మటాలజిస్ట్‌ని చూడమన్నాడు. విసుగొచ్చింది. మానేశాను. రెండు జేబుల్లోనూ రెండేసి రుమాళ్ళు పెట్టుకోవడం మొదలెట్టాను. ప్రాబ్లం సాల్వ్!”

అదంతా అప్పటి కథ. ఆ కోర్స్ చేసేది నూటికి నూరు శాతమూ ప్రమోషన్ గురించే అన్నది నిజం. అలాంటిది, దాదాపు పదేళ్ళు సర్వీస్ చేసి, అందులో మూడేళ్ళపాటు రాత్రనకా పగలనకా పడ్డ మానసిక, శారీరక శ్రమని తేలిగ్గా మర్చిపోయి, ఫలితంగా దక్కే రాంక్‌నీ, ఆ తర్వాత సగౌరవంగా సాగే ఆర్మీ కెరియర్‌నీ గడ్డిపోచలా తృణీకరించి పారిపోగలిగాడంటే, ఈ బీపీ సామాన్యుడు కాడు.

“ఇప్పుడు చెప్పు బీపీ. ఎందుకు వెళ్ళిపోయావ్? ఏమయింది?”

“నీకు తెలుసుగా, మన కోర్స్ పూర్తి కావస్తుండగా మా తమ్ముడు యాక్సిడెంట్లో పోయాడు. అమ్మ చిన్నప్పుడే పోయింది. ఇక మా నాన్నకి మిగిలింది నేనొక్కణ్ణే. ‘ఆయన్ని చూసుకోవాలి, నన్ను ఇంటికి పంపించేయండి’ అని డిశ్చార్జ్ కోసం అప్లై చేశాను. కోర్స్ చేశాక బాండ్ ప్రకారం అయిదేళ్ళూ సర్వీస్ చెయ్యక తప్పదన్నారు. కేస్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ దాకా వెళ్ళింది. ఇంతలో అక్కడ నాన్నకి మైల్డ్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. సెలవు ఇవ్వకపోయినా పర్వాలేదనుకుని వెళ్ళిపోయాను. అంతే. మళ్ళీ తిరిగి రాలేదు.” కాఫీ సిప్ చేస్తూ చెప్తున్నాడు, నా ఆశ్చర్యాన్ని గమనిస్తూ.

“నువ్వు కూడా బానే సెటిలై ఉంటావ్ కదా రావ్? ఇల్లు కట్టేశావా?”

“ఆఁ. ఫ్లాట్ కొన్నాను. పిల్లల చదువులైపోయాయి. నెత్తిమీద నయాపైస అప్పు లేదు. లైఫ్ ఇప్పుడు బానే వుంది. కానీ త్రివేదీ, పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళిపోయావు. ఇబ్బందులు రాలేదూ?”

“వచ్చాయిలే! కోర్స్ చేశాక బాండ్ ప్రకారం సర్వీస్ చెయ్యలేదు కాబట్టి, కోర్స్ ఫీజుగా అయిదులక్షలు కక్కమన్నారు ఆర్మీ వాళ్ళు. దాన్ని సవాలు చేస్తూ హైకోర్ట్‌లో కేస్ వేశాం. ‘తండ్రికి మిగిలిన ఒక్కగానొక్క కొడుకుని ‘కంపాషనేట్ గ్రౌండ్స్’ మీద విడిచిపెట్టలేదని, ఆయన్ని చూసుకోవడానికి పారిపోవడం తప్ప అతనికి మరో దారి లేకపోయిందనీ వాదించాం. మొదటి హియరింగ్ లోనే కేస్‌ని కొట్టేశారు.”

“ఆర్మీ ఊరుకుందా?” ఆశ్చర్యంగా అడిగాను.

“నో వర్క్-నో పే బేసిస్ మీద వదిలేయమంది కోర్ట్! ఇంకేం చేస్తుంది?”

“కానీ ఎక్స్-సర్వీస్‌మాన్ సర్టిఫికెట్ దొరకలేదు కదూ?”

“అది దొరక్కపోయినా, కోర్స్ చేసిన సర్టిఫికెట్ ఉందిగా! అప్పట్లో తెలీలేదు గానీ రావ్, బయటికి వచ్చాక తెలిసింది ఆ కోర్స్ విలువేమిటో. ఆ సర్టిఫికెట్ సాయంతో బి.టెక్‌.లో ఎడ్మిషన్ దొరికింది. ఎమ్.టెక్. కూడా చేశాను. ఫ్రెండ్‌తో కలిసి చిన్న బిజినెస్ మొదలెట్టాను. ఇప్పుడది బాగా నిలదొక్కుకుంది. రోజుకి మినిమమ్ పదివేలు క్రెడిట్ అవుతుంటాయి నా ఎకౌంట్‌కి! హైయెస్ట్ టాక్స్ బ్రాకెట్లో ఉన్నాను తెలుసా రావ్!”

“వావ్! వెరీ హాపీ టు నో దట్!”

“ఎనీవే రావ్, ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా అనుకోకుండా నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది! ఇక నేను వెళ్ళాలి” అంటూ లేచాడు. “కెన్ ఐ డ్రాప్ యూ సమ్‌వేర్?”

“థ్యాంక్ యూ. ఐ హావ్ మై కార్.” జవాబిచ్చాను.

బరిస్టా బయటకు చేరి ఆగిన ఇన్నోవా ఆపి దిగిన డ్రైవర్, బ్యాక్ డోర్ తెరిచి పట్టుకున్నాడు.

షేక్‌హాండ్ కోసం చెయ్యి ముందుకి చాచాడు బీపీ.

“ఇప్పుడు ఫుల్లీ డ్రై!” అన్నాడు మెరుస్తున్న కళ్ళతో.