కొత్త తాళం

పలకల త్రికోణాల పరాలోకనాలతో
నువ్వు నీలోకీ నేను నాలోకీ కలుస్తూ మనలోకీ
అదే దారి అదోసారి మరోసారి కొట్టుకెళ్తూనే
నడుస్తూ కొన్నిసార్లూ గంతు వేస్తూ కొన్నిసార్లూ
నిన్నూ నన్నూ దాటాలని చూస్తూనే
టపటప మోగుతున్న పెదవులని
రెపరెపలాడుతున్న ఎడదలని
మాటల చివరన విడుదలని
గొంతు లోతుల్లో మార్చుకుంటూ
నటిస్తున్నాం విభ్రమని

తరంగాలు కలిసినా తరంగదైర్ఘ్యాలు కలవని
పైకెంత ఎదగనీ కిందచూపులతోనే ఈదుతూ
గమకాలు వడగడుతూ కాలాన్ని
చెరో వైపుకీ చూస్తూ కాళ్ళలోకి దిగని ముళ్ళు లెక్కిస్తూ
నిష్క్రమణ నియమాలు వల్లిస్తూ
ఇంక చాలింకా ఎందుకని నీ మాటనీ నా పాటనీ
చుట్టలు చుట్టేసి ఎగరేద్దామా
మళ్ళీ మబ్బుల్లో కరుగుదామా
తాళం చెవులిచ్చి పుచ్చుకుంటో…


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...