దూరం
నించి బహుశా చూస్తూనే వున్నావేమో
దూరం
నించి బహుశా పిలుస్తూనే ఉన్నావేమో
దూరం
నించి తెప్పలో సాగుతూనే వొడ్డుకి
బహుశా పాటని పంపిస్తున్నావేమో
ఏ చేపా ఆగలేదు వలలూ తగ్గలేదు
పదే పదే తలబాదుకుంటో అలలు సానబెడుతూనేవున్నా
బండలింకా నునుపెక్కలేదు
అదేపనిగా రుచిచూశామేమో తీపి కూడా
తీపు పుట్టించడం మానలేదు
అవున్నిజమే కొన్ని రేణువుల్ని సానబట్టాం ఎన్నో తారల్ని లెక్కేసుకున్నాం
రైళ్ళ చక్రాలకింద నాణేల్ని సాగదీసుకు మరీ చూసుకున్నాం
స్పీడుగా తిరిగిన గడియారం ముళ్ళ సెంట్రిఫ్యూగల్ ఫోర్సు
మనల్ని చెరో మూలకీ విసిరేసినా
అపుడపుడూ కక్ష్యల్లో కలుస్తూ భ్రమణాల్లో భ్రమల్ని చెరిపేసుకున్నాం
వ్యసనంలాంటి వ్యామోహంలాంటి వావివరసలాంటి వానతుప్పరలాంటి
క్షణాల పెనవేత అక్షరాల కలబోత కట్‌గ్లాసుల మోత కన్నీళ్ళ కలనేత
తీగల శబ్దాలూ మద్దెల దరువులూ సిగరెట్ల పొగా
మొత్తం ఆవిరి కాగా
గడ్డకట్టించుకున్న…
దూరం
బహుశా కొలుస్తున్నావేమో
దూరం
బహుశా మోస్తున్నావేమో
దూరం
నించి బహుశా చలిస్తున్నావేమో
దూరం
నించి బహుశా నువ్వూ కదుల్తున్నావేమో…