“నాన్నా! నాన్నా! తొందరగా ఒక్కసారి వచ్చి చూడు!” బాల్కనీలోంచి ఆశ్చర్యంగా కేకపెట్టింది పెద్ద కూతురు.
చేస్తున్న పని ఆపి ఆమె పక్కకి చేరేడాయన. ఆ దృశ్యం చూసి విస్తుపోయాడు.
పెద్ద యెత్తున దుమ్ము ఎగసిపడుతున్నట్లు, తెరలు తెరలుగా మబ్బులు ముంచుకొస్తున్నట్లు ఎగురుతున్నాయి కోట్లకొద్దీ మిడతలు. తమ దారిలోని ప్రతి ఉపరితలం మీదా వాలి, దళసరి దుప్పటిలా కప్పేస్తున్నాయవి. చిర్రుమంటూ ఆగకుండా వినిపిస్తోంది వాటి రెక్కల రొద…
“ఇటు చూడండి!” అన్నదాయన భార్య సంబరంగా, వాళ్ళు నిల్చొన్న బాల్కనీలో వాలిన రెండు మూడు మిడతలని చూపిస్తూ. వాటి గురించి వినడమే కానీ చూడ్డం ఆవిడకి కూడా అదే మొదటిసారి. చిటికెనవేలంత పొడవున్న గోధుమరంగు మచ్చల శరీరం, వాలీవాలగానే కొరుకుతున్నాయవి.
జీవితమంతా పట్నాల్లోనే గడిచిన ఆయనకి ఆ దృశ్యం వింతగా ఉంది. కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కొత్త ఐఫోన్ తెచ్చుకుని చకచకా ఫోటోలూ వీడియోలూ తీస్తోంది. అది చూసి చిన్న కూతురు లోపలినుంచి తన ఫోన్ తీసుకొచ్చి, వాలిన మిడతలని జూమ్ చేసి మరీ ఫోటోలు తీసింది. వెంటనే తన ఇన్‌స్టా, ఎఫ్‌బి, టిక్‌టాక్ ఎకౌంట్లలోకి పంపేసింది కూడా!
ఎదురుగుండా ఉన్న నాలుగంతస్తుల ఎత్తు గోడమీద, మిడతల నీడలు ఏటవాలుగా వేగంగా జారిపోతున్నాయి. నీడల మధ్యలోంచి గోడ తునకలుగా మాత్రమే కనపడుతోంది. ఆ కుటుంబం మొత్తాన్నీ, ఆ అద్భుతం తొందరగా ముగిసిపోతుందేమోనని కాస్త బెంగవంటిది ఆవహించింది.
అక్కడికి అయిదారు కిలోమీటర్ల దూరంలో…
రెండెకరాల జాగాలో ఏపుగా పెరిగి, కోతకి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట… మిడతల దాడికి పీలికలైపోయిన ఆకులనీ, అవి కొరికేయగా తలలు వాల్చిన ఖాళీ మొక్కజొన్న కంకులనీ చూస్తున్నాడా రైతు… కళ్ళముందు దృశ్యం క్షణక్షణానికీ దిగులుని పెంచుతుండగా, కుప్పకూలేడు.
మిడతలు ఎగిరిపోయి చాలాసేపయింది.
ఎర్రటి ఎండ… అందులో నల్లగా ఆమె.
మోకాళ్ళవరకూ మడిచి కట్టుకున్న ముతకచీర. వయసు మీదపడనట్లున్న వొంటి తీరు. మాడుకీ గడ్డిమోపుకీ మధ్య చుట్టగా తుండు. కింద పడిపోకుండా చాలాసేపట్నుంచీ మోపుని పట్టుకుంటున్న ఆమె చేతులు లాగుతున్నాయి. బరువుగా ఉన్నా, ఎండని కాస్త అడ్డుకుంటున్నట్లు నటిస్తున్న తలమీద మోపు నీడ… నుదుటిమీదుగా ధారలు కడుతున్న చెమట.
బరువుగా, కొద్ది వేగంగా పడుతున్నాయి ఆమె అడుగులు. అడుగడుక్కీ మోపు కిందకీ పైకీ వూగుతోంది చిన్నగా. తొందరగా వెళ్ళాలి. జ్వరంతో మంచాన పడున్న కూతురు, ఈగలు తోలడంతప్ప మరేమీ చెయ్యలేని అవ్వ గుర్తొచ్చారామెకి. తను ఎంత తొందరగా ఇల్లు చేరితే అంత తొందరగా పొయ్యి వెలుగుతుంది.
ఓ చేత్తో బల్లలమీది ఎంగిలి ప్లేట్లు తీస్తూనే చూస్తున్నాడు సర్వర్. బిల్లు చెల్లిస్తున్న కస్టమర్ ఒకసారి చూసి తల తిప్పుకున్నాడు మళ్ళీ చూసేముందు. టీ తాగడం అవగానే సిగరెట్ వెలిగిస్తూ చూసిన కాలేజీ కుర్రాడి నోట్లో ఊరింది బూతుపాట. పంక్చరేస్తున్న పదిహేనేళ్ళ బుడత, బొమ్మకి బ్లౌజ్ తొడుగుతున్నతను, పరుపుల కొట్లో బేరమాడుతున్న పెద్దాయన…
కాలేజీ కుర్రాడి బూతుపాటతోబాటు ఫోన్‌లోకి ఎక్కుతున్నాయి ఆమె నడకలోని కదలికలన్నీ…
అతనో ఫేమస్ యూట్యూబర్. అదీ ఇదీ అని లేకుండా ప్రతి సినిమాని, టీవీ సీరియల్‌నీ వెక్కిరిస్తూ తయారుచేసే అతని వీడియోలకి లక్షల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి.
ఐ.సి.యు.లో అతనికి అది మూడోరోజు. రోడ్డు దాటుతుండగా రాంగ్ సైడ్‌లో వచ్చిన బైక్ గుద్దేయగా లివర్ రప్చర్ అయింది. పక్కకి తిరిగి పడడంవల్ల ఒక వైపు ముఖం గీసుకుపోయింది.
విజిటింగ్ అవర్స్.
ఐ.సి.యు. బయట నర్స్, పేషెంట్‌ని డిస్టర్బ్ చెయ్యద్దని, వీలైనంత త్వరగా వచ్చేయమనీ హెచ్చరించి లోపలికి వెళ్ళనిచ్చింది అతన్ని చూడ్డానికి వచ్చిన అమ్మాయిని.
అతను స్పృహలో లేడు. కానీ బాధతో ముఖం వికృతంగా అవుతోంది నొప్పి మళ్ళీ వేగంగా పెరుగుతున్నట్లు సూచిస్తూ. మూలుగు ఆక్సిజన్ మాస్క్‌లో ఆవిరి కడుతోంది.
బెడ్‌ని సమీపించిన ఆ అమ్మాయి, అతనికేసి చూసింది తదేకంగా రెండు క్షణాలు. తన అభిమాన యూట్యూబర్‌ని లైవ్‌లో చూస్తున్నందుకు ఆమె పెదవులమీద చిన్న చిరునవ్వు మొలిచింది. చుట్టూ చూసింది. అప్పటివరకూ లయగా బీప్ బీప్ అంటున్న మానిటర్ శబ్దం కీ అంటూ పొడవుగా మోగడంలోకి మారింది.
ఆమె మెల్లిగా వంగి, అతని ముఖానికి తన ముఖాన్ని దగ్గరగా చేర్చింది. చాలా మామూలుగా, ఫోన్‌ని పైకెత్తి, తమ ఇద్దరి ముఖాలనీ ఫ్రేమ్ చేసి క్లిక్కుమనిపించి, లేచి బయటికి నడిచింది.
పరుగులాంటి నడకతో చేరుకుంటోంది నర్స్.