రచయిత వివరాలు

సురేశ్ కొలిచాల

పూర్తిపేరు: సురేశ్ కొలిచాల
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

జ్యోతిష్మంతమైన యజ్ఞరథమునెక్కి
తమమునెల్లనీవు తరిమివేసి
భీమరూపమందు శత్రుదంభముజేసి
వేదనిందకులను వెడలగొట్టి
గోత్ర భిదము సల్పి స్వర్గ విభము నిల్పి
రాక్షసులను చంపు రక్షకుడవు!

ఋగ్వేదంలో మొట్టమొదటి అనువాకంలోని మొదటి సూక్తంలోని తొమ్మిది శ్లోకాలకు యథాతథంగా తెలుగులో తెచ్చే అనువాద ప్రయత్నం ఇది. ప్రాచీనాంధ్ర కవులు వేదాలకు అనువాదం చేయకపోయినా, ఆధునిక పద్యానువాదాలు ఒకటి రెండు ఇదివరకు వచ్చాయి. ఉదా. చర్ల గణపతి శాస్త్రిగారు, నేమాని నరసింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు నాకు పరిచయం. అయితే, వారి అనువాద ప్రయోజనం వేరు. నా అనువాద ప్రయత్నం వేరు.

మనం ఇప్పుడు చాలా చిత్రమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. నా జీవితకాలంలో ఇటువంటి పరిస్థితులు ఎదురౌతాయని నేను ఊహించలేదు. ముఖ్యంగా భావప్రకటనా స్వాతంత్ర్యానికి చాలా గడ్డు పరీక్షలు ఎదురౌతున్న కాలం ఇది. ప్రపంచంలో భావప్రకటనా స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడు మనకు కనిపించే వైవిధ్యమైన పుస్తకప్రపంచమే ఉండేది కాదు.

ఋగ్వేదంలోని పదవ మండలంలో 129వ సూక్తంగా ఉన్న నాసదీయ సూక్తం ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో అన్న విషయాల గురించి మహాశ్చర్యకరమైన ప్రశ్నలు వేస్తుంది. భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలం నుండి కాకుండా ఆంగ్లానువాదం నుంచి అనువాదం చేయడం క్షమించరాని నేరం. అందుకే సంస్కృత మూలం నుండి ముత్యాల సరాలకు దగ్గరిగా ఉండే ఛందంలో నేను చేసిన తెలుగు అనువాదం ఇది.

ప్రస్తుతం మనం ఘనంగా వీథుల్లో జరుపుకుంటున్న గణేశ చవితి ఉత్సవాలకు మాత్రం మూలం మరాఠ రాజ్యంలోని పీష్వాలు ప్రారంభించిన గణేశ ఉత్సవాలే. నానాసాహెబ్ పీష్వా రాజ్యకాలంలో గాణపత్యవ్రతం ప్రారంభమైనట్టుగా మనకు మరాఠా రాజ్యానికి సంబంధించిన దస్తావేజుల ద్వారా తెలుస్తుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణ భారతంలో గణపతి చాలావరకు బ్రహ్మచారిగా కనిపిస్తే, ఉత్తర భారతంలో ఒక భార్యతో గానీ ఇద్దరు భార్యలతో కానీ కనిపించడం కద్దు. ఒక భార్యతో కనిపించే విగ్రహాలలో కనిపించే సతిని లక్ష్మీదేవిగా, శక్తిగా పరిగణించడం ఉత్తర భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది.

సంస్కృత కావ్యసాహిత్యం అనగానే మనకు ముందుగా కాళిదాసు (క్రీ. శ. 4వ శతాబ్ది) గుర్తుకు వస్తాడు. శివ పార్వతుల పుత్రుడైన కుమారస్వామి జననాన్ని వర్ణించే కాళిదాసు రచన కుమారసంభవమ్ కావ్యంలో కథ అంతా శివ పార్వతుల గురించే అయినా ఎక్కడా గణేశుని గురించి దీనిలో ప్రస్తావన కనిపించదు. ఏకాదశ సర్గలో చేసిన వర్ణన ద్వారా కుమారస్వామి జననం ద్వారానే పార్వతి మొదటిసారి తల్లి అయ్యిందని కవి మనకు విస్పష్టంగా తెలియజేస్తాడు.

అలాగే అంతకు ముందు సాహిత్యంలో విఘ్నకారకులుగా, దుష్టులైన భూతగణాలతోపాటు వర్ణించబడ్డ వినాయకులు చివరకు ఒకే వినాయకుడి రూపు దాల్చడం, ఆ వినాయకుడు గజముఖుడైన గణేశునితో విలీనం చెందడం, గణేశుడు పార్వతి పుత్రుడిగా, స్కందుని సోదరుడిగా శివపార్వతుల కుటుంబంలో చేరిపోవడం– ఈ కథనాలన్నీ పురాణాల్లోనే కనిపిస్తాయి.

“నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”

“అదేమిటి, నేను చదివింది ఆంజనేయ దండకం కాదుగా? శుక్లాంబరధరం వినాయకుడి స్తోత్రమే కదా!”

తెలుగు వైయాకరణులు సాధురేఫను లఘురేఫ, శుద్ధరేఫ, మేలురా, గుండురా అని, బండి-ఱను అలఘురేఫ, శకటరేఫ, గౌరవరేఫ, పెద్దఱ, గురుఱ అని పలురకాల పేర్లతో ప్రస్తావించారు. బండి-ఱ లిపి రూపం రెండు బండి చక్రాలతో, మధ్యలో గీత ఇరు,సు లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని బండి-ఱ అన్నారని మనం ఊహించవచ్చు.

“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్,” అన్నాడో సినీకవి. అయితే, అనేక మానవ సమాజాల్లో కుడిచెయ్యిని మంగళప్రదమైనది గానూ, ఎడమచెయ్యిని అమంగళకరమైనదిగా భావించడం కనిపిస్తుంది. ఎన్నో ఇండో-యూరోపియన్ భాషలలో కుడిచేయి అంటే దక్షిణహస్తం అని, దక్ష- అంటే నేర్పుగల (dexterous), బలం కలిగిన- చెయ్యి అన్న అర్థాలున్నాయి. లాటిన్ భాషలో ఎడమ అన్న అర్థంలో వాడే పదం sinister. అదే పదానికి వక్రమైన-, చెడ్డ, దుష్ట- అన్న అర్థాలున్నాయి.

నాకు వెండీ డానిగర్ పుస్తకంలో హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని ఏ కోశానా కనిపించలేదు. ప్రతి పేజీలోను ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది.

సూర్యకాంతిలో గాని, ఇంద్రధనస్సులో గాని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిన ఏడు రంగుల గురించి ఈ శ్లోకం వివరిస్తుందంటే నమ్మశక్యం కాదు. నిజానికి, ఋగ్వేద కాలం నాటికే ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ఏడు వేర్వేరు పేర్లుండేవని చెప్పగలిగే శ్లోకం ఏదీ మనకు ఋగ్వేదంలో కనిపించదు.

శ-, ష-, స- అక్షరాలు మూడు ప్రత్యేక వర్ణాలుగా పలు భారతీయ భాషలలో కనిపించినా, ఈ అక్షరాల ఉచ్చారణ విషయంలో అన్ని భాషలవారిలోనూ కొంత అయోమయం కనిపిస్తుంది. సంస్కృత భాష ఆధారంగా తయారైన వివిధ వర్ణమాలలలో వీటిని మూడు ప్రత్యేక అక్షరాలుగా పేర్కొన్నా, ఇవి మూడు విభిన్న ధ్వనులుగా ఏ దేశభాషలోనూ స్థిరత్వం పొందలేదు.

చిన్నప్పుడు మనమంతా ఋతువులు ఆరు అని రెండేసి నెలల చొప్పున వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అని సంవత్సరకాలాన్ని ఆరు ఋతువులుగా విభజించవచ్చని మనమంతా మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం. అయితే, భారతీయ దేశంలో — ముఖ్యంగా దక్షిణ భారతంలో — ప్రధానంగా మనకు అనుభవమయ్యేవి ఎండకాలం, వానకాలం, చలికాలం అన్న మూడు కాలాలు మాత్రమే.

వేదకాలం నుంచి మనకు సెకండులో ఒక కోటివంతు కాలం నుండి 40 లక్షల కోట్ల సంవత్సరాల దాకా లెక్క పెట్టగలిగే కాలమానం ఉండేదని చెప్పే వెబ్‌సైట్లు ఇంటర్నెట్టులో కోకొల్లలు. అలాగే, వేదాలలో (సూర్య)కాంతి వేగాన్ని కూడా విలువకట్టి చెప్పారని, అది నేటి శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను ఉపయోగించి కనిపెట్టిన విలువకు ఉరమరగా సరిపోతుందనీ గర్వంగా చెప్పుకోవడం కూడా కొన్ని సైట్లలో కనిపిస్తుంది.

అన్నమయ్య రాసిన 32వేల కీర్తనల రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడి ఉన్న సంగతి 70 ఏళ్ళకు పూర్వం ఎవరికీ తెలియదనీ, వేటూరి ప్రభాకర శాస్త్రి గారో, ఇంకొకరో అయాచితంగా ఈ రాగిరేకులను కనుగొన్నారని, తద్వారా ఈ భాండారాన్ని వెలికితీశారని ఒక కట్టుకథ బహుళ ప్రచారంలో ఉంది. ఈ కథ దాదాపు అన్నమయ్య గురించి రాసిన చాలా పుస్తకాలలో ఉటంకించడం కనిపిస్తుంది.

దాదాపు ఇటువంటి కథే చాలా సాహితీ గ్రంథాల విషయంలో చెప్పుకునే సంప్రదాయం దక్షిణ భారతంలో ఉంది. గొప్ప సాహితీ సంపద ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోవడం, దానిని అనుకోకుండా ఒక పండితుడు కనుక్కోవడం ఈ కథలన్నింటిలోనూ కనబడే సాధారణ అంశం.

దాదాపు 35,000 సంవత్సరాల క్రితమే చంద్రుని గమనాన్ని మానవుడు అర్థం చేసుకున్నాడనడానికి మనకు ఆధారాలున్నాయి. ఆఫ్రికాలో దొరికిన లెబోంబో ఎముకపై వరుసగా 29-గీతలు ఉండడం శాస్త్రజ్ఞులను ఆశ్చర్య పరిచింది. ఇది ఆ కాలంలో చంద్రుని గమనానికి, స్త్రీల ఋతుచక్రంలో రోజులను లెక్కించడానికి ఉపయోగించి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల ఊహ.

బాలవ్యాకరణం కన్నా ముందు వచ్చిన తెలుగు వ్యాకరణ గ్రంథాల గురించి చాలామందికి తెలియదు. పాణిని తనకన్నా ముందు వచ్చిన వ్యాకరణాల గురించి ప్రస్తావించినట్టుగా, చిన్నయ్యసూరి తనకంటే పూర్వం వెలువడిన వ్యాకరణాలను ప్రస్తావించలేదు. కానీ, తెలుగులో కూడా వ్యాకరణ గ్రంథాలు కవిత్రయ కాలం నుండీ వెలువడుతూ ఉన్నాయి.

ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత. దెబ్బ తాకితే అమ్మో! అంటాము. జాలి చూపడానికి అయ్యయ్యో! అంటాము. అలాగే ఆశ్చర్యానికి అబ్బో! అంటాము. పని పూర్తి కాగానే అమ్మయ్య! అని నిట్టూరుస్తాము.

న-కార, ణ-కారాల గురించి, నతిసూత్రం గురించి ఈ మధ్య ఈమాట-అభిప్రాయవేదికపై చర్చ జరిగింది కాబట్టి ఋగ్వేద ప్రాతిశాఖ్యలోని పంచమపటలంలో నతిసూత్రం వివరించిన సంస్కృతశ్లోకాలకు తెలుగు అనువాదం ఈ విడత పలుకుబడిలో భాగంగా అందజేస్తున్నాను. అలాగే కళింగత్తుపరణిలో కరునాడు ప్రస్తావన ఉన్న పద్యం గురించి నా అభిప్రాయం కూడా.

మా ఊళ్ళో సాయిబులు పెద్దమ్మ, పెద్దనాన్నల సంతానంతో పెళ్ళి సంబంధాలు నెరపడం చూసి మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకొనేది. అయితే, ఉత్తరభారతీయులు మనం మేనమామ, మేనత్త కొడుకు, కూతుళ్ళతో మేనరికపు పెళ్ళిళ్ళు జరపడం చూసి అంతే ఆశ్చర్యపోతారు.

ఒకేపేరు పెట్టుకున్న వ్యక్తులెందరో ఉన్నా, వారందరిలో ఏ రకంగా ఒకే లక్షణాలు కనిపించవో అలాగే, ఈ కథనాలన్నింటికి రామాయణమని పేరు ఉన్నా వాటి లక్షణ స్వభావాలు వేరువేరని చెప్పవచ్చు.

కొన్ని మాండలికాలలో ఎనమండుగురు, తొమ్మండుగురు అన్న వాడకం ఉన్నా, ఆధునిక తెలుగు భాషలో ‘ఎనిమిది’ కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో ‘మంది’ చేర్చడమే ప్రమాణం. ప్రాచీన భాషలో ‘పదుగురు’ అన్న ప్రయోగం ఉండేది.

“ఒక్కా ఓ చెలియా, రెండూ రోకళ్ళు, మూడు ముచ్చిలక” అంటూ మనలో కొంతమంది అంకెలు గుర్తు పెట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకొన్న పాట! ఇంతకీ మూడుకు ముచ్చిలకకు ఉన్న సంబంధం ఏమిటి?

పదాల వ్యుత్పత్తిని శాస్త్రీయంగా ధాతువుల ద్వారా నిరూపించే నిరుక్త శాస్త్రం తరువాతి రోజుల్లో భాష్యకారుల కృత్తిమ వ్యుత్పత్తులతో వారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఒక వినోద సాధనంగా మారిపోయింది. సాధారణ వివరణ ఇస్తే, నిరుక్తంలో వారి నిపుణత మనకెలా తెలుస్తుంది చెప్పండి?

ద్రావిడ భాషలలో ఒకటి నుండి పది వరకు, వందకు ప్రత్యేక పదాలు కనిపిస్తాయి. వెయ్యికి ఒక్క తెలుగులో మాత్రమే ద్రావిడ పదం కనిపిస్తుంది. అయితే, సాహిత్య రహిత భాషలలో ద్రావిడ సంఖ్యాపదాలు ఏడు దాటి ఉండవు.

భాష అంటే జ్ఞాపకాల నిధి. ఒక జాతి సంస్కృతి, చరిత్ర ఆ భాషలో నిక్షిప్తమై ఉంది. భాషలోని ప్రతి పదం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంటుంది. ఒక భాషలోని పదాల సామూహిక ఆత్మకథే ఆ భాషాచరిత్ర అని చెప్పుకోవచ్చు.

దక్షిణ భారతీయ సాహిత్య చరిత్రలో మొదటిసారిగా రాజు యొక్క వ్యక్తిగత ధర్మాలకు, రాజ్యపాలనా ధర్మాలకు మధ్య భేదాన్ని విస్పష్టం చేసింది ఆముక్తమాల్యద.

ఈమాట పత్రికా సౌధానికి కనిపించని పునాదులైన SCIT, తెలుసా, రచ్చబండల ద్వారా మేము అలవర్చుకున్న విలువలే ఈమాట పదేళ్ళుగా మనగలగడానికి దోహదం చేసాయి.

నా జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకోవడం ఇంటర్నెట్టులో తెలుగు వికాసానికి, ఈమాట పుట్టుకకి సంబంధించిన చారిత్రకాంశాలను — పాక్షికంగానైనా — కొత్తతరం వారికి పరిచయం చేయడానికి ఉపయోగపడుతుందన్న నమ్మకమే ఈ వ్యాస రచనకు పూనిక.

ఎంతో అనుభవజ్ఞులైన తెలుగు సాహితీ వేత్తలు, విశ్వవిద్యాలయాధికారులు కూడా ఈ రకమైన సిద్ధాంతాలకు వత్తాసు పలకడంతో ఈ వాదాల అశాస్త్రీయతను ఎత్తిచూపిస్తూ మరోసారి రాయడంలో తప్పులేదనిపించింది.

గత సంవత్సరం తమిళానికి దీటుగా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో రుజువు చెయ్యడానికి ప్రయత్నిస్తూ తెలుగు పత్రికల్లో కనిపించిన వ్యాస పరంపర చూసి మొదట్లో […]