ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి

రాజనీతి: ఇతర సంప్రదాయాలు

యామునాచార్యుడు తన కుమారునకు బోధించిన రాజనీతిలో రాజుగా కృష్ణదేవరాయల సొంత గొంతుక వినిపిస్తుంది. అయితే, ఈ రాజనీతి విభాగం సంక్లిష్టమైన నిర్మాణంతో పలు సంప్రదాయాల మేలుకలయికగా మనకు కనిపిస్తుంది. కౌటిల్యుని అర్ధశాస్త్రం నుండి అనాదిగా వస్తున్న సంస్కృత సాహిత్య రాజనీతి సంప్రదాయంతో పాటు తమిళంలోని తిరువళ్ళువర్ రాసిన కుఱళ్ లో (ఇందులోని ప్రధానాంశం రాజనీతి కాకపోయినా) కనిపించే నీతి ప్రబోధ సంప్రదాయాన్ని, మధ్యయుగంలో కొత్తగా వస్తున్న నీతి సాహిత్య సంప్రదాయంతో మేళవించి చెప్పడం ఆముక్తమాల్యద ప్రత్యేకత. మధ్య యుగంలో, 12వ శతాబ్దానికి చెందిన ‘మనోల్లాస’ రచించిన రచయిత ఆముక్తమాల్యద కృతికర్త లాగే స్వయంగా రాజు — దీన్ని చాళుక్య రాజైన మూడవ సోమేశ్వరుడు రాశాడు. అంతే కాక దేశ భాషలలో బద్దెన రాసిన ‘నీతిశాస్త్ర ముక్తావళి’ వంటి నీతి సాహిత్యం కూడ మధ్యయుగంలో కనిపిస్తాయి. ఆనాటి రాజకీయ వాస్తవికతకి అద్దం పట్టే ఈ సాహిత్యం, బ్రిటిష్ వారి పాలన కంటే ముందు భారతీయ సాహిత్యమంతా ఆదర్శవాద సాహిత్యమేనన్న వాదన సత్యదూరమని స్పష్టం చేస్తాయి. అయితే, ఈ నీతి సాహిత్యంలో కనిపించే వాస్తవికతత్వం, చర్విత చర్వణమైన పడికట్టు నీతులు గానే తప్ప, ఆనాటి చారిత్రక పరిస్థితులకు చైతన్యవంత ప్రతిస్పందనలా కనిపించవు. అలాగే, పారశీక భాషలో కనిపించే ‘యువరాజ ప్రబోధ’ సాహిత్యపు ప్రభావం కూడా ఆనాటి మొగల్ రాజులపై, దక్షిణ దేశపు సుల్తానులపై ఉండేది. అయితే, పారశీక భాషలోని ఈ ‘యువరాజ ప్రబోధ’ సాహిత్యపు మూలాలు సంస్కృతంలోని ‘పంచతంత్ర’లో కనిపిస్తాయి. సంస్కృత పంచతంత్రం ‘కలిల వా దిమ్మ’ (కరట(క) దమనులు) అన్న అనువాదం ద్వారా పారశీక ప్రపంచానికి సుపరిచయం. ఆ అనువాద ప్రభావంతోనే, ముస్లిములు కాని రాజులకు మతపరమైన అంశాలను ప్రస్తావించకుండా లౌకికమైన రాజనీతిని బోధించడానికి అనువుగా ప్రారంభమైనదే ‘యువరాజ ప్రబోధ’ సాహితీ సంప్రదాయం.

ఆముక్తమాల్యద లోని రాజనీతి విభాగాన్ని చూస్తే, ఈ రచయితకు పైన పేర్కొన్న సంప్రదాయాలన్నింటితో పరిచయం ఉన్నట్టుగా స్పష్టం అవుతుంది. అయితే, ‘యువరాజ ప్రబోధ’ సాహిత్యంలో కనిపించని అనుభవపూర్వకమైన, ఆచరణాత్మకమైన బోధ ఆముక్తమాల్యదలో కనిపిస్తుంది. ఆదర్శాలను, ధర్మశాస్త్రాలను వల్లె వేయటం కాకుండా, 16వ శతాబ్దపు రాజకీయ, ఆర్థిక, వ్యవస్థాత్మక మార్పులు, ఆనాటి వాస్తవిక పరిస్థితులు ఆముక్తమాల్యదలో ప్రతిబింబిస్తాయి. కానీ, కొన్ని చోట్ల వైయుక్తికమైన అభిప్రాయలతో పాటు, సనాతన నీతిశాస్త్రాలలోని వాక్యాలు దాదాపు యథాతథంగా కనిపిస్తాయి. మొత్తానికి, ఆముక్తమాల్యద లోని రాజనీతి, విభిన్న సాంప్రదాయిక నీతిసూక్తులను తన స్వానుభవాలతో సమన్వయం చేసిన విలక్షణమైన సమ్మిశ్రమంగా కనిపిస్తుంది.

రాజనీతి: చారిత్రక నేపథ్యం

దక్కన్ పీఠభూమిపై విజయనగర పరిపాలన, 14వ శతాబ్దపు చివరిలో కుమార కంపన చేసిన దక్షిణదేశ దండయాత్రలలో భాగంగా మాబర్ సుల్తానును ఓడించడంతో ప్రారంభమయింది. అయితే, పదిహేనవ శతాబ్దమంతా అంతర్గత కలహాలతోను, స్థానిక తిరుగుబాట్లతోను, పొరుగు రాజుల దండయాత్రలతోను విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కుంటూ ఉండేది. కృష్ణదేవరాయలకు పూర్వం 15వ శతాబ్దపు మధ్యభాగంలో పాలించిన దేవరాయల కాలంలో విజయనగరం ఇంకా పశ్చిమ రాజ్యంగానే ఉంటూ, ప్రతి సంవత్సరం మారిపోయే సరిహద్దులతో అస్థిరంగానే ఉండేది.

కృష్ణదేవరాయలు 1509లో రాజైనట్లు మనకు తెలుస్తోంది. ఇప్పుడు లభిస్తున్న పలు శాసనాల ఆధారంగా, అతని పట్టాభిషేక మహోత్సవం 1509 ఆగస్ట్ 8న జరిగినట్లు చెప్పవచ్చు. ఆయన రాజుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, రాజకీయంగా ఎన్నో గడ్డు సమస్యలను పరిష్కరించవలసి వచ్చింది. 16వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో విజయనగర సామ్రాజ్యం ఎన్నో రాచరిక సమస్యలను ఎదుర్కొన్నది. సాళువ వంశపు చిట్టచివరి రాజు పరిపాలిస్తూ ఉండగానే కృష్ణదేవరరాయల సోదరుడైన వీర నరసింహ నాయకుడు రాజ ప్రతినిధిగా రాజ్యాన్ని నడిపేవాడు. నిజానికి సాళువ నరసింహ రాయల (1456-1491) మరణానంతరం అతడి పుత్రుడైన ఇమ్మడి నరసింహ రాయడు రాజైనా రాజ్యాధికారమంతా తుళు ప్రాంతపు నాయకుడైన నరస నాయకుని చేతిలోకి, అతడి మరణానంతరం అతడి కొడుకులలో ఒకరైన వీర నరసింహ నాయకుని చేతిలోకి చేరుకుంది. 1505లో వీర నరసింహ నాయకుడే ఇమ్మడి నరసింహ రాయుడిని చంపించి, వీర నరసింహ రాయలుగా తానే సింహాసనాన్ని అధిష్టించాడు. దీనికి సంబంధించిన వివరాలు 1506లో రాసిన పోర్చుగీసు వ్రాతప్రతిలో స్థూలంగా వివరించారు. ఈ రకమైన సమస్యలు – అంతర్గత కలహాలు, పొరుగు రాజుల దండయాత్రలు, స్థానిక నాయకుల తిరుగుబాటు – ఆముక్తమాల్యదలోని రాజనీతి విభాగంలో మనకు అంతర్లీనంగా గోచరిస్తాయి: ఏ రకమైన రాజకీయ వ్యవస్థ ద్వారా చిన్న రాజ్యాన్ని సామ్రాజ్యంగా విస్తరింపజేస్తూ కూడా స్థిరత్వాన్ని సాధించవచ్చు? ఎవరిని నమ్మవచ్చు? ఎవరిని నమ్మకూడదు? ఎవరికి ఎంత అధికారం ఇవ్వాలి? ఎవరిని అదుపులో పెట్టాలి?

వేరేవిధంగా చెప్పాలంటే, స్థానిక నాయకులను, సామంత రాజులను ఎంత వరకు నియంత్రించాలి, వారికి ఎంత స్వయం ప్రతిపత్తి కలిగించాలి అన్నది ఆ రోజుల్లో భారతీయ రాజులందరు ఎదుర్కొన్న సమస్య. ఈ సందిగ్ధత కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోనూ కనబడుతుంది. ఎక్కడో పశ్చిమ తీరంలోని తుళునాటికి చెందిన కృష్ణదేవరాయలకు, దక్షిణాదిన తూర్పు తీరం నుండి పశ్చిమ తీరం వరకూ విస్తరించిన విజయనగర సామ్రాజ్యాన్ని ఏలడానికి తన ప్రాంతీయతత్వాన్ని విడనాడి, సర్వ ప్రాంత సమ్మతమైన రాజనీతిని సృష్టించుకోవల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ విషయంలో, కృష్ణదేవరాయలు పాత పద్ధతిలో పురాణాలలో, ధర్మశాస్త్రాలలో చెప్పబడిన బ్రాహ్మణ-క్షత్రియ మైత్రిపై ఆధారపడకుండా వైష్ణవమతానుబంధంగా ఒక కొత్త రాజనీతిని నిర్వచించాడు. అంతకు కొద్దికాలానికి పూర్వమే విజయనగర నేతలు శైవమతం నుండి వైష్ణవమతావలంబికులుగా మారారన్న సత్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.