స్కిట్ (S.C.I.T. Soc.Culture.Indian.Telugu)
యూజ్‌నెట్ గురించి, SCIT (తెలుగు యూజ్‌నెట్ న్యూస్‌గ్రూప్) గురించి ఇప్పుడు మాట్లాడడమంటే తేనెతుట్టె కదిలించినట్టు; పూలచెట్టును అదిలించినట్టు; పాత ఫొటోలను మళ్ళీ చూసినట్టు, పాత ఉత్తరాలను మళ్ళీ చదువుతున్నట్టు. ఆ రోజుల్ని తలచుకుంటుంటే జ్ఞాపకాల ఉధృతిలో కొట్టుకుపోతున్న భావన.
ఇలా SCITని నెమరు వేసుకుంటుంటే, తరుముకుంటూ వచ్చే చిన్నప్పుటి జ్ఞాపకం మా ఊళ్ళోని తమ్మిచెరువుకట్ట. ఈ చెరువు పక్కనే వేదఘోష వినిపిస్తూ ఓంకారేశ్వరాలయం ఉండేది. పేరుకు తగ్గట్టే ఈ తమ్మి చెరువు నిండా పద్మాలు, కమలాలు, అరవిందాలు అంటూ ఒక్కక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకునే అందమైన తామర పూలు. అట్ల తద్ది ఉయ్యాలలు, నారాయణ నామస్మరణలు, రామనవమి ఉత్సవాలు, చివరికి ప్రజానాట్యమండలి ప్రదర్శనలు కూడా ఈ చెరువు గట్టుమీదే జరిగేవి. సాయంత్రం ఊళ్ళోవారంతా ఈ గట్టుమీద చేరి ప్రపంచంలోని అన్నీ విషయాల గురించి సీరియస్‌గా చర్చించేవారు. ఊళ్ళోని వింతలూ, విశేషాలు, ఉద్యోగపువేటలు, పెళ్ళి సంబంధాలు అన్నింటికి కార్యరంగం ఈ చెరువు గట్టే. సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ స్కోర్లు, వేదాంతం, విప్లవ నినాదాలు అన్నింటి గురించి ఇక్కడే తీవ్ర స్థాయిలో చర్చలు జరిగేవి. అప్పుడప్పుడే పాఠ్యపుస్తకాలు దాటి బయటి ప్రపంచం గురించి ఆలోచిస్తున్న నాపై ఆ చర్చలు బలమైన ముద్రవేశాయనే చెప్పక తప్పదు. ఊళ్ళోవారందరి రహస్యాలను గుంభనగా తనలో దాచుకొని నిండుగా కనిపించే మా ఊరి చెరువు లాంటిదే SCIT కూడా.
SCIT చరిత్ర
ఇంతకు ముందు భాగంలో చెప్పినట్లు మొదట్లో భారతదేశానికి సంబంధించిన విషయాలను చర్చించడానికి యూజ్‌నెట్‌లో net.nlang.india అన్న గ్రూప్ ఉండేది. 1987లో, యూజ్‌నెట్ పునర్విభజన తరువాత ఈ గ్రూప్ పేరు soc.culture.indian గా మారిపోయింది. ఆ రోజుల్లో విద్యార్థులుగా అమెరికాకు వచ్చేవారిలో దక్షిణ భారతీయులే ఎక్కువయినా, ఈ గ్రూపులో చర్చలన్నీ భాషాతీతంగా భారతదేశమంతటికీ సంబంధించిన విషయాల మీదే జరిగేవి. ఎప్పుడైనా సినిమాల గురించి మాట్లాడుకుంటే అది హిందీ సినిమాల గురించే ఉండేది. భారతీయ భాషల ఫాంట్ టెక్నాలజీ అభివృద్ధి చెందని ఆ రోజుల్లో చర్చలన్నీ ఇంగ్లీషులోనే జరిగేవి. 1989 లో పర్డ్యూ యూనివర్సిటీలో చదివే సూర్య కావూరి ‘ఆ రజనీకర మోహన బింబము’ అన్న ఘంటసాల పాటను ‘Savor it’ అన్న సబ్జెక్టుతో ఇంగ్లీష్ లిపిలో పోస్టు చేస్తే, తెలుగేతరులు ఆ పాటలో పదాలను “bimbo”, “pimp” అంటూ అటుయిటుగా విడగొట్టి అవహేళన చెయ్యడంతో ఆ గ్రూపులో పెద్ద దుమారం చెలరేగింది. అప్పుడే తెలుగుకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడానికి ఒక ప్రత్యేక గ్రూప్ అవసరమని కొంతమంది తెలుగువారికి అనినిపించింది.
WETD (World Electronic Telugu Digest) – తెలుగు డైజెస్ట్
యూజ్‌నెట్ లో ఒక కొత్త న్యూస్‌గ్రూప్ సృష్టించాలంటే ఎంతో తతంగం ఉండేది. ముందుగా కొత్త గ్రూప్ యొక్క పేరు, లక్ష్యాలు, ప్రమేయాలను వివరిస్తూ RFD (Request for Discussion) తయారు చేసి సంబంధిత గ్రూపులలో పోస్ట్ చెయ్యాలి. దానిపై కొంత చర్చ జరిగిన తరువాత ఆ గ్రూప్ లక్ష్యాలకు ఏవైనా మార్పులు-చేర్పులు జరిగితే మళ్ళీ ఇంకో కొత్త RFD (Request for Discussion) పోస్ట్ చెయ్యాలి. అలా ఒక నెల రోజుల పాటు ఏ మార్పులు లేకుండా RFD పై చర్చ జరిగితే, ఆపై వోటింగుకి పిలుపునిస్తారు (CFV – Call For Votes). మూడు నాలుగు వారాల దాకా వోటింగ్ జరుగుతుంది. ఆ గ్రూప్ ఏర్పాటుకు అనుకూలంగా మూడింట రెండొంతుల మెజారిటీ వోట్లు వస్తే అప్పుడు ఆ కొత్త గ్రూప్ సృష్టించబడుతుంది (అనుకూలంగా కనీసం 100 వోట్లుఎక్కువ ఉండాలి). ఈ తతంగం అంతా పూర్తి అవ్వడానికి నాలుగు నెలల నుండి ఆరు నెలల దాక పట్టేది. మరీ వివాదాస్పదమైన జమ్మూకాశ్మీర్ (soc.culture.indian.jammu-kashmir) వంటి న్యూస్‌గ్రూపుల సృష్టికి సంవత్సరం పైగానే పట్టింది.
దీనికన్నా, ఒక మెయిలింగ్ లిస్ట్ ప్రారంభించడం చాలా సుళువు. అయితే ఆ రోజుల్లో కొన్ని పెద్ద యూనివర్సిటీలలో మాత్రమే మెయిల్ సర్వర్లు ఉండేవి. ప్రొఫెసర్ కె. వాణీనాథ రావు (కె.వి.రావు) గారు పనిచేస్తున్న బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీలలో ఒకటి. ఆయన సహాయంతో తెలుగువారు తెలుగుకు సంబంధించిన అన్ని విషయాలపై చర్చించడానికి వీలుగా WETD (World Electronic Telugu Digest) అన్న మెయిలింగ్ లిస్ట్ 1991లో ప్రారంభమయ్యింది. ఈ డైజస్టుకు మొదట్లో కె. టి. నారాయణ ఎడిటర్‌గా ఉండేవారు. తరువాత డెట్రాయిట్లో చదువుకుంటున్న సీతంరాజు ఉదయ భాస్కర శర్మ ఎడిటరై ఎంతో సమయాన్ని వెచ్చించి 1995 చివరి వరకూ ఈ డైజస్టును నడిపించారు.
స్కిట్ ఆవిర్భావం
ఈ-మెయిల్ సౌకర్యం ఉన్న వారందరూ తెలుగు డైజెస్ట్‌లో సభ్యులుగా చేరే అవకాశమున్నా, యూజ్‌నెట్ న్యూస్‌గ్రూపులకు ఉండే ఎన్నో వసతులు డైజస్ట్‌కు లేవు. ఉదాహరణకు, న్యూస్‌గ్రూపులు చదవడానికి ప్రత్యేక సభ్యత్వం అవసరం లేదు. డైజస్ట్‌లో సభ్యులుగా చేరితేనే అందులోని చర్చలను చదవడానికి వీలౌతుంది. అంతేకాక, డైజస్ట్ గురించి కొత్తగా ఇంటర్నెట్‌కి వచ్చే తెలుగు వారికి తెలియటం కష్టం. అదే న్యూస్‌గ్రూపు గురించి ప్రత్యేకంగా ప్రచారం చెయ్యాల్సిన అవసరం లేదు. యూజ్‌నెట్ సదుపాయం ఉన్న ప్రతి సర్వర్‌కి అన్ని ముఖ్యమైన న్యూస్‌గ్రూపులు అందజేయబడుతాయి. అంతేకాక, యూజ్‌నెట్ న్యూస్‌గ్రూపులు ఎవ్వరి సొంతం కావు, కానీ, WETD డైజస్ట్ మాత్రంఅది ప్రారంభించినవారి ఇష్టాలకి అనుగుణంగా నడుస్తుంది. “వాణీనాథుడు కోపగించితే చాలామందిని వెలివేయు” అని మరచిపోకుండా డైజస్టులో మసలుకోవాల్సివస్తుంది. ఇలా ఎన్నో కారణాల వల్ల తెలుగు వారికోసం ప్రత్యేకంగా న్యూస్‌గ్రూప్ సృష్టించాలని నడుం కట్టిన వారు ఆనంద కిషోర్, రమణ జువ్వాడి, రమణ ఈడూరి, శరత్ వేమూరి గార్లు.
భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్ర విభజన ఏ విధంగా అయితే తెలుగు, తమిళులకు ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుతో మొదలయ్యిందో, అదే విధంగా యూజ్‌నెట్‌లో భాషల ఆధారంగా విడివడి ప్రత్యేక న్యూస్‌గ్రూపులుగా ఏర్పడడం soc.culture.tamil, soc.culture.indian.telugu అన్న తమిళ, తెలుగు గ్రూపులతోనే ప్రారంభం కావడం విశేషం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రసాధనకు ఎంతగా వ్యతిరేకత వ్యక్తం అయ్యిందో, ప్రత్యేక తెలుగు యూజ్‌నెట్ గ్రూపు ఏర్పాటు కోసం చేసిన చర్చల్లో దాదాపు అదే విధమైన వ్యతిరేకత కనిపించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల భారతదేశం ఎంతగా నష్టపోయిందో, భాష పేరిట ప్రత్యేక న్యూస్‌గ్రూపులుగా విడిపోవడం వల్ల భారతీయ యూజ్‌నెట్ సభ్యులు అంతకంటే ఎక్కువ నష్టపోతారని ప్రతికూల వర్గాల వాదన. ఇటువంటి వాదన చేసిన వారిలో కె. టి. నారాయణ వంటి తెలుగువారే ముందుండడం చెప్పుకోదగ్గ విశేషం. తెలుగు కోసం ప్రత్యేక చర్చావేదిక ఏర్పాటుచేసుకుంటే తప్పేమీ లేదని, దాన్ని తెలుగువారు భారతదేశం నుండి విడిపోయి వేరే రాష్ట్రంగానో, దేశంగానో ప్రకటించుకున్నంత దేశద్రోహంగా పరిగణించాల్సిన అవసరంలేదని రమణ జువ్వాడి, ఆనంద కిశోర్, రామారావు కన్నెగంటి మొదలైనవారు చాలా ఓపికగా సమాధానాలిచ్చేవారు. మొదట్లో తెలుగు గ్రూప్ కోసం ప్రతిపాదించిన పేరు soc.culture.telugu అయినా ఈ చర్చల ఫలితంగా ఈ గ్రూప్ పేరును soc.culture.indian.telugu అని సవరించాల్సి వచ్చింది.
ఆరు నెలలపాటు సాగిన తీవ్ర వాదోపవాదాల మధ్య ఈ గ్రూప్ ఏర్పాటు పై ఆగస్ట్ 7, 1992 నాడు వోటింగ్ ముగిసింది. 338 మంది అనుకూలంగా వోటు వేస్తే, 103 మంది వ్యతిరేకించారు. ఆగస్ట్ 15, 1992 నాడు తెలుగు న్యూస్‌గ్రూపుగా soc.culture.indian.telugu ఆవిర్భవించింది.
SCIT స్వర్ణ యుగం: 1992-1996
ఇప్పటిలాగ బోలెడన్ని వెబ్ సైట్లు, చర్చా వేదికలు, అప్పట్లో లేవు కాబట్టి ఇంటర్నెట్టు అందుబాటులో ఉన్న తెలుగువారందరికీ SCIT ఒక కేంద్రస్థలంగా మారింది. ఎక్కువమంది యూనివర్సిటీల ద్వారా యూనిక్స్, వాక్స్, ఉపయోగించి పేజీలకి పేజీలు తెలుగుని ఆంగ్ల లిపిలో రాసేవాళ్ళు, చదివే వాళ్ళు (ఈ సందర్భంలోనే ఆనంద కిషోర్, రామారావు కన్నెగంటి గార్లు RIT సాఫ్ట్‌వేర్ కోసం సృష్టించిన R.T.S. లిప్యంతరీకరణ (transliteration) పద్ధతి వాడుకలోకి వచ్చింది). రూమ్మేట్ల కోసం అన్వేషణ, వరుడు లేక వధువు కావలెను ప్రకటనలు, ఇండియా నుంచి వస్తున్న తల్లిదండ్రులకు తోడుగా ఎవరైనా ప్రయాణం చేసేవాళ్ళుంటే చెప్పమనే విన్నపాలు, లేక ఇండియా వెళ్ళేవాళ్ళెవరైనా ఫలానా పాకెట్ తీసుకెళ్ళగలరేమో అనే అభ్యర్థనలు, వగైరాలన్నింటికీ SCIT వేదిక. సినిమాలు, రాజకీయాలు, ఫ్యాన్స్ అసొసియేషన్స్, తానా, ఆటా సమావేశాలు, కులాలు, మతాలు, అన్నింటి గురించి ఇక్కడే చర్చలు జరిగేవి. అప్పుడప్పుడు, కొన్ని విషయాల్లో వాదోపవాదాలు శ్రుతి మించేవి. కొందరు సభ్యులు ‘కత్తుల రత్తయ్య’, ‘సూతపుత్ర’, ‘గండర గండడు’, ‘టిప్పు సుల్తాన్’, ‘దాన వీర శూర కర్ణ’ వంటి మారు పేర్లతో అనేక వివాదాస్పదమైన విషయాలపై ఇతర సభ్యులతో గొడవ పడేవారు.
ఇండియాకు తిరిగి వెళ్ళడం గురించి ఆ రోజుల్లో అన్ని భారతీయ గ్రూపులలో ఎంతో కొంత చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేది. అప్పట్లోనే ఆర్. కె. నారాయణ్ హిందులో రాసిన ఒక వ్యాసం ‘x=x+1 సిండ్రోమ్’ అమితంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాకు వచ్చిన వాడెవ్వడూ ఇండియాకు తిరిగి వెళ్ళడు అని ఈ చర్చలలో పాల్గొనే వారి గట్టి నమ్మకం. అయితే, 20 సంవత్సరాలు అమెరికా-కెనడాలలో నివసించి CAIR (Center for Artificial Intelligence and Robotics) డైరెక్టరుగా భారతదేశానికి తిరిగి వెళ్ళిన డాక్టర్ ఎమ్. విద్యాసాగర్ గారు ఈ విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ SCITలో రాసిన వ్యాస పరంపర భారతీయ గ్రూపులన్నింటిలోనూ ఎనలేని సంచలనాన్ని సృష్టించింది. తెలుగు తెలియని ఇతర భారతీయులు కేవలం ఆయన వ్యాసాలు చదవడానికి, చర్చించడానికి తెలుగు యూజ్‌నెట్ గ్రూపుకి వచ్చేవారు. ఆయన వ్యాసాల వల్లనే ఇతర భారతీయ గ్రూపులలో SCITకి అప్పటిదాకా లేని గౌరవం, ప్రచారం లభించాయి.
SCIT ఏర్పాటు అయినా పాత తెలుగు డైజస్ట్ ఇంకా కొనసాగుతూనే ఉండేది. అయితే, SCIT చర్చలన్నీ తెలుగు డైజస్ట్ సభ్యులకు పంపే విధంగా తెలుగు డైజస్టుని SCITతో అనుసంధానం చేసారు. నెమ్మదిగా, డైజస్ట్ సభ్యులందరు నేరుగా SCITలోనే పొస్ట్ చెయ్యడం అలవాటు చేసుకోవడంతో తెలుగు డైజస్ట్ అవసరం తీరిపోయింది.