పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి

నతి సూత్రం

నుతి, నత, నయ అన్న పదాలలో న- కారం ఉంటే, ప్రణుతి, ప్రణతి, ప్రణయ అన్న పదాలలో మాత్రం ణ-కారం ఎందుకు రాస్తామోనని మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? అలాగే శివాని, భవాని వంటి శబ్దాల్లో దంత్య న- కారం రాసినప్పుడు, శర్వాణి, ఇంద్రాణి అన్న పదాల్లో మాత్రం మూర్ధన్య ణ-కారం ఎందుకు వాడుతాం? ప్రకటన అన్న పదంలో చివర మామూలు -న కారం ఉంటే ప్రకరణలో –ణ ఎందుకు ఉంది? రామాయణం ణ-తో రాస్తే సీతాయనం లో న-కారమే ఎందుకు వస్తుంది? ఉత్తరాయణం లో ణ ఉంటే, దక్షిణాయనంలో న- ఎందుకు ఉంటుంది? ఇటువంటి సందేహాలకు సమాధానం తెలియాలంటే మనకు నతి సూత్రం తెలియాలి.

దంత్యాక్షరాలు మూర్ధన్యాక్షరాలుగా ఏ ఏ సందర్భాలలో మారుతాయో వర్ణనాత్మకంగా వివరించే ప్రయత్నమే నతిసూత్రం. ఈ సూత్ర వివరాలు మొదటగా శౌనకునిచే విరచితమని చెప్పబడుతున్న ఋగ్వేద ప్రాతిశాఖ్యలో కనబడుతుంది. ఆ తరువాత పాణిని అష్టాధ్యాయిలోనూ, అథర్వ ప్రాతిశాఖ్యలోనూ, పతంజలి మహాభాష్యంలోను ఇవే సూత్రాల చర్చ మనకు కనిపిస్తుంది. న-కార, ణ-కారాల గురించి ఈ మధ్య ఈమాట-అభిప్రాయవేదికపై చర్చ జరిగింది కాబట్టి, అందరికీ ఉపయోగపడవచ్చుననే ఉద్దేశ్యంతో ఋగ్వేద ప్రాతిశాఖ్యలోని పంచమపటలంలో నతిసూత్రం వివరించిన సంస్కృతశ్లోకాలకు తెలుగు అనువాదం ఈ విడత పలుకుబడిలో ఒక భాగంగా అందజేస్తున్నాను.

ఈ నతి సూత్రాల అనువాదం చదివేముందు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన వేదవాఙ్మయం చాలావరకూ మౌఖికంగా ఒకతరం నుండి ఇంకో తరానికి అందజేసేవారని మనకు తెలుసు. కాబట్టి ఈ సూత్రాలు కొంత క్లుప్తంగా, నిగూఢంగా మనకు అనిపిస్తాయి. అదీగాక పంచమ పటలంలో సూత్రాలు చదువుతున్నప్పుడు అంతకుముందు పటలాలలో సూత్రాలు, వాటిలో నిర్వచించిన కొన్ని పదాలు, సంకేతాలు మనకు తెలుసునని శ్రుతికర్త భావిస్తాడు కాబట్టి మనకు అవి వెంటనే ఓ పట్టాన అర్థం కాకపోవచ్చు. అందుకే నాకు తోచినంతవరకూ ఆయా సూత్రాలను సులభతరం చేస్తూ ఉదాహరణలతో సహా వివరించడానికి ప్రయత్నిస్తాను.

హల్లులను ప్రయత్న భేదాల ఆదారంగా స్పర్శాలు, ఉష్మాలు, అంతస్థాలు అని మూడు రకాలుగా విభజించవచ్చు.

స్పర్శాలు (stops/plosives): గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం వల్ల ఏర్పడే ధ్వనులు స్పర్శాలు. సంస్కృత వర్ణమాలలో క నుండి మ- వరకు ఉన్న అక్షరాలు స్పర్శాలు. ఈ స్పర్శాలలో కొన్ని అక్షరాలను ముక్కు ద్వారా విడుస్తాం. వాటిని అనునాసికాలు అంటారు.

ఊష్మాలు (fricatives): స్థానిక నిరోధం లేకుండా గాలి స్థానకరణాల గుండా ఒరుసుకొని వచ్చే ధ్వనులు ఊష్మాలు. సంస్కృతంలో శ, ష, స, హ లు ఊష్మాలు.

అంతస్థాలు (approximants): ఊష్మాల కున్నంత ఒరిపిడి లేకుండా గాలి జారిపోయే ప్రయత్నం వల్ల ఏర్పడే ధ్వనులు అంతస్థాలు. భాషలో ఇవి కొన్నిచోట్ల అచ్చులుగానూ, కొన్ని చోట్ల హల్లులుగాను ప్రవర్తిస్తాయి. సంస్కృతంలో య, ర, ల, వ లు అంతస్థాలు.

స్పర్శాలను వాటి ఉచ్చారణా స్థానాన్ని బట్టి మరిన్ని వర్గాలుగా విభజించవచ్చు. ఈ వర్గాలను వరుసగా కంఠ్యాలు, తాలవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ఠ్యాలు అని అంటారు. ప్రతివర్గంలోనూ శ్వాసాలు, నాదాలు ఉంటాయి. అలాగే అల్పప్రాణాలు, మహాప్రాణాలు, అనునాసికాలు ఉంటాయి. ఈ వర్గాలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి క- వర్గం, చ- వర్గం, ట- వర్గం, ప- వర్గం అని అంటారు.

స్పర్శాలు (stops)
  శ్వాస
అల్పప్రాణ
శ్వాస
మహాప్రాణ
నాద
అల్పప్రాణ
నాద
మహాప్రాణ
అనునాసిక
కంఠ్య
(క-వర్గం)
తాలవ్య
(చ-వర్గం)
మూర్ధన్య
(ట-వర్గం)
దంత్య
(త-వర్గం)
ఓష్ఠ్య
(ప-వర్గం)

నతి సూత్రాన్ని స్థూలంగా చెప్పాలంటే: ఋ-కార, ర-కార, ష-కారాల తరువాత చ-వర్గ, ట-వర్గ, త-వర్గ స్పర్శాల అడ్డులేకుండా వచ్చే న-కారం, ణ-కారంగా మారుతుంది. ఋగ్వేదప్రాతిశాఖ్య ఇదే విషయాన్ని నతి విభాగంలోని మొదటి మూడు సూత్రాల్లో వివరిస్తుంది. తరువాతి సూత్రాలలో ఈ సూత్రాలకు మినహాయింపులు, ఆ తరువాత ఈ మినహాయింపులకు మినహాయింపులు అలా. ఎంతో క్లిష్టమైన ఈ ధ్వని పరిణామాన్ని దాదాపు మూడువేల సంవత్సరాల క్రితమే మనవాళ్ళు శాస్త్రీయంగా విశ్లేషించి క్రోడీకరించడం అబ్బురపరిచే విషయం.

5.40 ఋకారరేఫషకారాః నకారం సమానపదే అవగృహ్యే నమంతి
అంతఃపదస్థం అకకారపూర్వాః అపి సంధ్యాః |

తాత్పర్యం: కకారం పూర్వపదంగా లేని ఋకార, రేఫ, షకారాలు (అవగ్రహతో వేరుచేయగలిగే) పదంలో తరువాత వచ్చే దంత్య న-కారాన్ని మూర్దన్య ణ-కారంగా మారుస్తుంది. సంధివల్ల ఏర్పడిన పదాలకు కూడా ఇది వర్తిస్తుంది.

ఉదాహరణలు:
పితృ-యానం = పితృయాణం (ఋగ్వేదం 10.2.7)
వృత్ర-హనా = వృత్రహణా (ఋగ్వేదం 3.12.4)
పరా-అయనం = పరాయణం (ఋగ్వేదం 10.19.4)
వి-సానం = వి-షానం = విషాణం (ఋగ్వేదం 5.44.1)
కృప-నీళం = కృపనీళం (ఋగ్వేదం 10.20.3)
క్రవ్య-వాహనః = క్రవ్యవాహనః (ఋగ్వేదం 10.16.11)
అక్ష-నహః = అక్షానహః (ఋగ్వేదం 10.53.7)
ఉష్ట్రానాం = ఉష్ట్రానాం (ఋగ్వేదం 8.46.22)
ఇంద్ర-హవాన్ = ఇంద్రహవాన్ (ఋగ్వేదం 9.96.1)

5.41 సంధ్యః ఊష్మా అపి అనింగ్యే |

తాత్పర్యం: గౌణ (secondary) ఊష్మం వల్ల కూడా న-కారం ణ-కారంగా మారుతుంది.

వివరణ: ఈ పంచమ పటలంలో మొదటి నలభై శ్లోకాలలో ఏ పరిస్థితులలో స-కారం ష-కారంగా మారుతుందో వివరిస్తారు. ఇప్పుడు అలా మార్పు చెందిన ష-కారం కూడా ఆపై వచ్చే న-కారాన్ని ణ-కారంగా మార్చగలదు అని చెబుతున్నాడు.

ఉదాహరణలు:
అధి + స్వని = అధి ష్వని (5.12) = అధి ష్వణి (ఋగ్వేదం 9.66.9)

5.42 న మధ్యమైః స్పర్శవర్గైః వ్యవేతం |

తాత్పర్యం: స్పర్శవర్గాలలో మూడు మధ్యవర్గాలు తగిలితే ఈ సూత్రం వర్తించదు.
వివరణ: చ-వర్గ, ట-వర్గ, త-వర్గ స్పర్శాలు మూడు మధ్యవర్గాలు. ఋకార, రేఫ, షకారాలకు ఈ మూడు మధ్యవర్గాల స్పర్శం తగిలితే ఈ సూత్రం వర్తించదు.

ఉదాహరణలు:
ఋజు-నీతీ = ఋజునీతీ (ఋగ్వేదం 1.90.1)
ఆ-వర్తనం = ఆవర్తనం (ఋగ్వేదం 10.19.4)
అరిష్ట-నేమిః = అరిష్టనేమిః (ఋగ్వేదం 1.89.6)

5.43 పరిప్రఋషీంద్రాదిషు చ ఉత్తమేన |

తాత్పర్యం: పరి, ప్ర, ఋషి, ఇంద్ర మొదలైనపదాలతో ప్రారంభిమైన సమాసాలకు ఇది వర్తించదు.

ఉదాహరణలు:
పరి-పానం = పరిపానం (ఋగ్వేదం 5.44.11)
ప్ర-మినంతి = ప్రమినంతి (ఋగ్వేదం 1.24.6)
ఋషి-మనాః = ఋషిమనాః (ఋగ్వేదం 9.96.18)
ఇంద్ర-పానః = ఇంద్రపానః (ఋగ్వేదం 9.96.3)
సు-ప్రపానం = సుప్రపాణం (ఋగ్వేదం 5.83.8)

5.44 తథా శకారసకారవ్యవేతం సర్వాదిషు |

తాత్పర్యం: అలాగే మధ్యలో శకార, సకారాలు వస్తే ఇది ఎప్పుడూ వర్తించదు.

ఉదాహరణలు:
పరి-శయానం = పరిశయానం (ఋగ్వేదం 3.32.11)
అద్రి-సానో = అద్రిసానో (ఋగ్వేదం 6.65.5)

5.45 పూర్వపదాంతగం చ |

తాత్పర్యం: ఋకార, రేఫ, షకారాలు సమాసంలో పూర్వపదం చివరలో వస్తే అవి ఉత్తరపాదంలోని న-కారాన్ని మూర్దన్య ణ-కారంగా మార్చలేవు.

ఉదాహరణలు:
కర్మన్-కర్మన్ = కర్మన్కర్మన్ (ఋగ్వేదం 10.28.7)

5.46 నాభినిర్ణిక్ప్రవాదాదీ |

తాత్పర్యం: అలాగే నాభి, నిర్ణిక్ అనే పదాంశాలలోని ప్రథమ న-కారం ణ-కారంగా మారదు.

ఉదాహరణలు:
వృష-నాభినా = వృషనాభినా (ఋగ్వేదం 8.20.10)
చంద్ర-నిర్నిక్ + మనః-ఋంగా = చంద్రనిర్ణిఙ్మనఋంగా (ఋగ్వేదం 10.106.8)
వర్ష-నిర్నిజః = వర్షనిర్ణిజః (ఋగ్వేదం 3.26.5)

5.47 యకారస్పర్శసంహితం |

తాత్పర్యం: య-కారంతోనూ, స్పర్శ వర్ణాలతో సంయుక్తాక్షరంగా ఉండే న-కారం మూర్ధన్యం కాదు.

ఉదాహరణలు:
హరిమన్యు-సాయకః = హరిమన్యుసాయకః (ఋగ్వేదం 10.96.3)
ప్రఘ్నతాం-ఇవ = ప్రఘ్నతామివ (ఋగ్వేదం 9.69.2)
వృత్ర-ఘ్నే = వృత్రఘ్నే (ఋగ్వేదం 9.98.10)
పురు-సంత్యోః = పురు-షంత్యోః (5.30) = పురుషంత్యోః (ఋగ్వేదం 9.58.3)
సు-సుమ్నా = సు-షుమ్నా = సుషుమ్నా (ఋగ్వేదం 10.132.2)

5.48 కర్మనిష్ఠాం దీర్ఘనీథే |

తాత్పర్యం: కర్మనిష్ఠ, దీర్ఘనీథే అన్న పదాలలో న- కారం ణ-కారంగా మారదు.

ఉదాహరణలు:
కర్మనిః-స్థాం = కర్మనిష్ఠాం (ఋగ్వేదం 10.80.1)
దీర్ఘ-నీథే = దీర్ఘనీథే (ఋగ్వేదం 8.50.10)

5.49 భానుశబ్దే |

తాత్పర్యం: భాను శబ్దంలో న- కారం ణ-కారంగా మారదు.

ఉదాహరణలు:
చిత్ర-భానుః = చిత్రభానుః (ఋగ్వేదం 7.9.3)
స్వః-భానోః = స్వర్భానోః (ఋగ్వేదం 5.40.6)

5.50 హినోమి చ |

తాత్పర్యం: హినోమి శబ్దంలో న- కారం ణ-కారంగా మారదు.

ఉదాహరణలు:
పరి-హినోమి = పరిహినోమి (ఋగ్వేదం 7.104.6)

5.51 హ్రస్వోదయం త్వేషపుర్వేవమాదిషు |

తాత్పర్యం: త్వేష, పురు శబ్దాలతో మొదలైన సమాసాలలో హ్రస్వాచ్చుతో ఉన్న న-కారం, ణ-కారంగా మారదు.

ఉదాహరణలు:
త్వేష-నృమ్ణః = త్వేషనృమ్ణః (ఋగ్వేదం 10.120.1)
పురు-నృమ్ణాయ = పురునృమ్ణాయ (ఋగ్వేదం 8.45.21)
పురు-నీథే = పురుణీథే (ఋగ్వేదం 1.59.7)

5.52 త్రిశుభ్రయుష్మాదిషు చ ఉభయోదయం |

తాత్పర్యం: త్రి, శుభ్ర, యుష్మా శబ్దాలతో మొదలైన సమాసాలలో హ్రస్వాచ్చుతోనైనా, దీర్ఘాచ్చుతోనైనా ఉన్న న-కారం, ణ-కారంగా మారదు.

ఉదాహరణలు:
త్రి-నాకే = త్రినాకే (ఋగ్వేదం 9.113.9)
శుభ్ర-యావానా = శుభ్రయావానా (ఋగ్వేదం 8.26.19)
యుష్మా-నీతః = యుష్మానీతః (ఋగ్వేదం 2.27.11)

5.53 అహకారేషు అధిక్త్ర్యక్షరేషు చ పురఃపునఃదుశ్చతుర్జ్యోతిరాదిషు |

తాత్పర్యం: హ-కారంలేక, మూడు అక్షరాలకంటే ఎక్కువ ఉండి, పురః, పునః, దుః, చతుః, జ్యోతిః అనే శబ్దాలతో మొదలయ్యే సమాసాలకు ఈ సూత్రం వర్తించదు.

ఉదాహరణలు:
పురః-యావానం = పురోయావానం (ఋగ్వేదం 9.5.9)
పునః-నవ = పునర్నవ (ఋగ్వేదం 10.161.5)
దుః-నియంతుః = దుర్నియంతుః (ఋగ్వేదం 1.190.6)
చతుః-అనీకః = చతురనీకః (ఋగ్వేదం 5.48.5)
జ్యోతిః-అనీకః = జ్యోతిరనీకః (ఋగ్వేదం 7.35.4)
పునః-హనః = పునర్హణః (ఋగ్వేదం 10.34.7)
దుః-నామా = దుర్ణామా (ఋగ్వేదం 10.162.1)

5.54 ఉస్రయామ్ణే అనుస్రయామ్ణే సుషామ్ణే వృషమణ్యవః అధిషవణ్యా ప్రణ్యః |

తాత్పర్యం: ఉస్రయామ్ణే, అనుస్రయామ్ణే, సుషామ్ణే, వృషమణ్యవః, అధిషవణ్యా, ప్రణ్యః వంటి పదాలలో న- కారం ణ-కారంగా మారుతుంది.

ఉదాహరణలు:
ఉస్ర-యామ్నే = ఉస్రయామ్ణే (ఋగ్వేదం 4.32.24) (exception to 5.47)
ప్ర-న్యః = ప్రణ్యః (ఋగ్వేదం 3.38.2) (exception to 5.47)

5.55 దూఢ్యదూణాశదూలభప్రవాదాః దుః దూభూతం అక్షరం తేషు నంతృ |

తాత్పర్యం: దుర్- ధాతువు నుండి నిష్పన్నమైన దూఢ్య, దూణాశ, దూలభ మొదలైన శబ్దాల తరువాత వచ్చే న-కారం ణ-కారంగా మారుతుంది, దుర్- లోని ర-కారం వల్ల.

ఉదాహరణలు:
దుః-ధ్యః = దుర్-ధ్యః = దూఢ్యః (ఋగ్వేదం 1.94.8)
దుః-నశః = దుర్-నశః = దూణాశః (ఋగ్వేదం 9.63.11)
దుః-దభ = దుర్-దభ = దూ-డభ = దూళభ (ఋగ్వేదం 7.86.4)

5.56 అవ్యవేతం విగ్రహే విఘ్నకృద్భిః రేఫోష్మాణౌ సర్వపూర్వౌ యథోక్తం |

తాత్పర్యం: పూర్వపదం ఏదైనా రేఫ, షకారాలు మధ్యలో విఘ్నం కలిగించే స్పర్శాక్షరాలు లేని న-కారాన్ని, ణ-కారంగా మారుస్తుంది.

5.57 ఆనీత్ ను త్యం నోనువుః నోనుమః చ నయత్యర్థం చ ప్ర పరి ఇతి పూర్వౌ |

తాత్పర్యం: ప్ర- పరి- అన్న శబ్దాలు ఆనీత్, ను త్యం, నోనువుః, నోనుమః, మరియు నీ- ధాతువుగాగల శబ్దాలలోని న-కారాన్ని, ణ-కారంగా మారుస్తాయి.

ఉదాహరణలు:
ప్ర + ఆనీత్ + అమమన్ = ప్రాణీదమమన్ (ఋగ్వేదం 10.32.8)
ప్ర + ను + త్యం = ప్ర ణు త్యం (ఋగ్వేదం 5.1.7)
ప్ర + నోనువుః = ప్ర ణోనువుః (ఋగ్వేదం 6.45.25)
ప్ర + నోనుమః = ప్ర ణోనుమః (ఋగ్వేదం 7.31.4)
పరి + నీయతే = పరి ణీయతే (ఋగ్వేదం 3.2.7)
పరి + నయంతి = పరి ణయంతి (ఋగ్వేదం 3.53.24)

5.58 పురుప్రియా బ్రహ్మ సుతేషు నేషి ప్లుతాకారాంతం సషకారం ఇంద్ర
నతే సు స్మ ఇతి సవనేషు పర్షి స్వః అర్యమా ప్ర ఉరు పరి ఇతి తైః నః |

తాత్పర్యం: పురుప్రియా, బ్రహ్మ, సుతేషు, నేషి శబ్దాలు, ష-కారంతో ఉండి ప్లుత ఆ-కారంతో అంతమయ్యే శబ్దాలు, ఇంద్ర శబ్దం, మూర్ధన్యీకరించిన సు, స్వ శబ్దాలు, సవనేషు, పర్షి, స్వః, అర్యమా, ప్ర, ఉరు, పరి శబ్దాలు న-కారాన్ని ణ-కారంగా మారుస్తాయి.

ఉదాహరణలు:
పురు-ప్రియాః + నః = పురుప్రియా ణః (ఋగ్వేదం 8.5.4)
బ్రహ్మ + నః = బ్రహ్మా ణః (ఋగ్వేదం 7.28.1)
సుతేషు + నః = సుతేషు ణః (ఋగ్వేదం 1.10.5)
నేషి + నః = నేషి ణః (ఋగ్వేదం 1.129.5)
రక్ష + నః = రక్షా ణః (ఋగ్వేదం 1.18.3) (సేఏ 7.33)
ఇంద్ర + నః = ఇంద్ర ణః (ఋగ్వేదం 5.42.4)
తే + సు + నః = తే షు ణః (ఋగ్వేదం 1.169.5) (సేఏ 5.8)
ఆసు + స్మా + నః = ఆసు ష్మా ణః (ఋగ్వేదం 6.44.18) (సేఏ 5.7)
సవనేషు + నః = సవనేషు ణః (ఋగ్వేదం 3.41.4)
పర్షి + నః = పర్షి ణః (ఋగ్వేదం 2.33.3)
స్వః + నః = స్వర్ ణః (ఋగ్వేదం 1.70.9)
అర్యమా + నః = అర్యమా ణః (ఋగ్వేదం 3.54.18)
ప్ర + నః + దేవీ + సరస్వతీ = ప్ర ణో దేవీ సరస్వతీ (ఋగ్వేదం 6.61.4)
ఉరు + నః + తన్వే = ఉరు ణస్తన్వే (ఋగ్వేదం 8.68.12)
పరి + నః = పరి ణః (ఋగ్వేదం 2.33.14)

5.59 హేళః ముంచతం మిత్రాయ రాయా పూషా గధి అవిషత్ ఛకారవత్
నవ్యేభిః త్మనే వాజాన్ కృణోత ద్వే నయ ప్రతరం పరేషు న |

తాత్పర్యం: కానీ, హేళః, ముంచతం, మిత్రాయ, రాయా, పూషా, గధి, అవిషత్ శబ్దాలు, ఛకారం కలిగిన శబ్దం, నవ్యేభిః, త్మనే, వాజాన్ కృణోత శబ్దాలు, నయ ప్రతరం జంట పదాలు తరువాత వచ్చే న-కారం ణ-కారంగా మారదు.

ఉదాహరణలు:
పరి + నః + హేళః = పరి నో హేళః (ఋగ్వేదం 7.84.2)
ప్ర + నః + యచ్ఛతు = ప్ర నో యచ్ఛతు (ఋగ్వేదం 10.141.2)
ఉరు + నః + కృణోత = ఉరు నః కృణోత (ఋగ్వేదం 10.128.5)
ప్ర + నః + నయ + ప్రతరం = ప్ర నో నయ ప్రతరం (ఋగ్వేదం 6.47.7)
ప్ర + నః + నయ + వస్యః = ప్ర ణో నయ వస్యః (ఋగ్వేదం 8.71.6)

5.60 గోరోహేణ నిర్గమాణి ఇంద్ర ఏణా ఇంద్ర ఏణం స్వర్ణ
పరాణుదస్వ అగ్నే రవేణ వార్ణ శక్ర ఏణం |

తాత్పర్యం: గోరోహేణ, నిర్గమాణి, ఇంద్ర ఏణా, ఇంద్ర ఏణం, స్వర్ణ, పరాణుదస్వ, అగ్నే రవేణ, వార్ణ, శక్ర ఏణం ఈ పదాలలో న- కారం ణ-కారంగా మారుతుంది.

ఉదాహరణలు:
గోః + ఓహేన = గోరోహేణ (ఋగ్వేదం 1.180.5)
నిః + గమాని = నిర్గమాణి (ఋగ్వేదం 4.18.2)
ఇంద్రః + ఏనాః = ఇంద్ర ఏణాః (ఋగ్వేదం 10.19.2)
ఇంద్రః + ఏనం = ఇంద్ర ఏణం (ఋగ్వేదం 1.163.2)
స్వః + న = స్వర్ణ (ఋగ్వేదం 10.43.9)
పరా + నుదస్వ = పరా ణుదస్వ (ఋగ్వేదం 7.32.25)
అగ్నేః + అవేన = అగ్నేరవేణ (ఋగ్వేదం 1.128.5)
వాః + న = వార్ణ (ఋగ్వేదం 2.4.6)
శక్రః + ఏనం = శక్ర ఏణం (ఋగ్వేదం 8.1.19)

5.61 ఏషా నతిః దంత్యమూర్ధన్యభావః |
తాత్పర్యం: ఇది దంత్యాలను మూర్ధన్యాలుగా మార్చే నతి సూత్రం.

(ఈ అనువాదానికి నాకు సహాయపడ్డ గ్రంథం మోతీలాల్ బనారసీ దాస్ వారు ప్రచురించిన మంగళదేవశాస్త్రి గారి “The Rgveda-pratisakhya with the commentary of uvaṭa”. )

కళింగత్తుపరణిలో కరునాడు

తమిళసాహిత్యంలో యుద్ధవీరుని గాథలను వర్ణించే కావ్య ప్రక్రియకు ‘పరణి’అని పేరు. భరణి నక్షత్రం యుద్ధదేవతకు సంబంధించిందని భావిస్తారు కాబట్టి ఆ భరణియే తమిళంలో ‘పరణి’ అయ్యింది. వెయ్యి ఏనుగులను యుద్ధరంగంలో సంహరించిన వీరుడిని వర్ణిస్తూ వెయ్యి పద్యాల సమాహారంగా రాసే కావ్యం ఇది. యుద్ధగాథలను వర్ణించడమే కాక వీరత్వాన్ని ఉగ్గడించి రాజ్యం వీరభోజ్యమని అభివర్ణించడం ఈ కావ్యాలలో కనిపించే ఇతివృత్తం. మనకు లభ్యమౌతున్న పరణి కావ్యాలలో జయంకొండర్ రాసిన కళింగత్తుప్పరణి, ఒట్టక్కూత్తర్ రాసిన తక్కయాగప్పరణి (దక్షయాగభరణి) అతి ప్రాచీనమైనవి.

చోళరాజైన మొదటి కులోత్తుంగ మహరాజు (1070-1122 క్రీ.శ.) ఆస్థానకవి జయంకొండర్. ఆయన రాసిన ‘కళింగత్తుప్పరణి’ 1110వ సంవత్సరం కళింగ యుద్ధంలో విజయం సాధించి తెచ్చిన చోళ సేనాధిపతి కరుణాకర తొండమాన్‌ను కీర్తిస్తూ రాసిన కావ్యం. పదమూడు భాగాలుగా ఉన్న ఈ కావ్యంలో ఉపోద్ఘాతం తరువాత ద్వారోద్ఘాటన (తలుపు తెరవడం) విభాగంలో విజేతలుగా వెనుదిరిగి వస్తున్న వీరులకు తలుపులు తెరవమని ఉద్ఘోషించే పద్యాలు 50 దాకా ఉన్నాయి.

విశాలాంధ్ర ప్రచురణాలయం వారు ప్రచురించిన ఆరుద్ర అనువాద కావ్యం ‘వెన్నెల-వేసవి’కు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ‘ముదావహం’ అనే పేరుతో తొలిపలుకు రాసారు. అందులో ఆయన “కరునాడు” అంటే ఆంధ్రదేశమేనని ఉద్ఘాటిస్తూ అందుకు నిదర్శనంగా కళింగత్తుపరణిలోని ఒక పద్యం చూపించారు.

ఆసక్తికమైన విషయమేమిటంటే, దక్షిణాది భాషల్లో ఈ నతి సూత్రం ల-కారానికి కూడా వర్తించడం. తెలుగు, కన్నడ మొదలైన భాషలలో సంస్కృత పదాలలో కనిపించే “ళ” కారం చాలావరకు నతి సూత్రం ద్వారానే వివరించవచ్చు. ఈ కింది పదాలలో ర- కారం తరువాతే వచ్చే ల-కారం ళ-కారంగా మారింది, గమనించండి:
అరళము, కేరళము, ఖురళి, గరళము, తరళము, ధారళము, పరళులు, ప్రళయము, మురళి, విరళము, విరళి, సరళ వంటి పదాలలో ర-కారం తరువాత ళ-కారం కనిపిస్తుంది. అలాగే, ప్రక్షాళన, క్ష్వేళితము, క్షాళితము, ఇక్షునాళిక వంటి పదాల్లో ష-కారం తరువాత ళ-కారం కనిపించడం నతి వంటి ధ్వనిపరిణామమే.

అయితే, తెలుగులో “ళ” కారం కనిపించే కొన్ని పదాలు కన్నడ తమిళాలలో ళ-కారం కనిపించదు. ఉదహారణకు

కళ్యాణి (తెలుగు), కల్యాణి (కన్నడ, తమిళం);
కళ (art) కలా (కన్నడ, తమిళం);

అలాగే కన్నడలో “ళ” కారం కనిపించే కొన్నిపదాలు తెలుగులో మామూలు ల-కారంతో కనిపిస్తాయి:

మంజుళ (కన్నడ), మంజుల (తెలుగు);
తుళసి (కన్నడ, తమిళ), తులసి (తెలుగు).

ఈ పదాలలో ళ-కారాన్ని వివరించడానికి ఆరోజుల్లోని వివిధ ప్రాకృత భాషలను పరిశీలించవలసి ఉంటుందని నా అభిప్రాయం.

ఆనాడు తెలుగులూ- తమిళులూ – చాల సన్నిహితంగా బ్రతికినారు. ఆంధ్రదేశాన్ని వారు “కరునాడు” అనేవారు. తెలుగును “వడక్కు” అని పిలవటం వాడుక. ఆ సందర్భంలో మూలం ఇలా వుంది.

‘మజలై తిరుమొజియిల్ చిలవడకుం,చిలతమి జుం
కురిత్తరు,కరునాటియర్! క్కటై తిరమిన్’

దీని అనువాదం:
మురిపించుతూ కొన్ని ముద్దు తెలుగు పదాలు
అరవమ్ముతో కలిపి అచటచట తడబడుచు
చిరుతీపి పలుకులు చెవులు విందులు చేయ
కరునాడు యువతులు గడియ తీయండి …”

కళింగత్తుపరణి లోని అసలు పద్యం ఇది:

మఴలై తిరుమొఴియిల్
చిల వడుగుం చిల తమిఴుం
కుఴఱిత్తరు కరునాడియర్
కుఱుగి కడై తిఱమిన్

దానికి నా ముక్కస్య-ముక్క అనువాదం:

మురిపపు చిరునుడువులలో
కొంత తెలుగును కొంత తమిళమును
కలగలిపి పలుకు కరునాటి స్త్రీలు
వచ్చి గడియను తెఱువుడీ

కొంత తెలుగును, కొంత తమిళాన్ని కలగలిపి మాట్లాడే కరునాటి యువతులు అంటే కన్నడ మాతృభాషగా గల యువతులు కొంత తెలుగును, కొంత తమిళాన్ని కలగలిపి మాట్లాడుతారు అన్న అర్థమే ధ్వనిస్తుంది నాకు. ఇది అనాటి బహుభాషా సామాజిక పరిస్థితులను తెలియజేస్తుందేమో గానీ, కరునాడు అంటే ఆంధ్రదేశమని నిరూపించదని నా అభిప్రాయం. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి విద్వత్తుపై నాకు సదభిప్రాయమే ఉన్నా కరునాడును ఆంధ్రదేశమని చెప్పడం నిరాధారమని నా నమ్మకం.