పలుకుబడి: రంగులు

రంగు అన్న పదం సంస్కృత జన్యం. దీని మూలధాతువు √రఞ్జ్- యొక్క ప్రాథమికార్థం colorను సూచించేదే. ఈ ధాతువుకు సంబంధించిందే రాగ- అన్న పదం. సంధ్యారాగం, పుష్యరాగం అన్న పదాలల్లో కూడా రాగం అన్న పదాన్ని రంగు అన్న అర్థంలో వాడడం చూడవచ్చు. రంగు అన్న అర్థంలో అన్ని ద్రావిడ భాషలలో కనిపించే మూల ధాతువు లేదు. అయితే, మూల ద్రావిడంలో రంగు అన్న అమూర్త భావనకు పదం లేనంత మాత్రాన ఆ కాలంలో వివిధ రంగుల మధ్య తేడా చెప్పలేకపోయేవారని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని చాలా భాషలలో రంగులను తెలిపే పదాలు ఉన్నా, రంగు అన్న భావనకు పదం కనిపించదు. ఉదాహరణకు, అమెరికాలోని నవాహో జాతి మాట్లాడే భాషలో వివిధ రంగులను తెలిపే పలు పదాలు ఉన్నా, రంగు- ‘color’ అన్న అర్థంలో పదం లేదు. తమిళంలో రంగును నిఱం అంటారు. ఇది నెఱ- ‘నిండు’ పదానికి సంబంధించింది కావచ్చు.

ప్రపంచంలోని అనేక భాషలలో రంగులకు సంబంధించిన పదాలను నిశితంగా పరిశీలించి, విశ్లేషించిన బెర్లిన్, కే అనే శాస్త్రవేత్తలు 1969లో వెలువరించిన పరిశోధనా ఫలితాలు* అందరిని అబ్బురపరిచాయి. వారి పరిశోధనల ప్రకారం, ప్రపంచంలోని అన్ని భాషలలోనూ రంగు పదాల పరిణామంలో ఒక రకమైన క్రమబద్ధత, సార్వజనీనత కనిపిస్తుంది. చాలా భాషలలో ఈ మధ్యకాలం వరకూ మూడు లేదా నాలుగు రంగులకు మించి పదాలు లేకపోవడం వారు తమ పరిశోధనల ద్వారా తేల్చిన ఆశ్చర్యకరమైన విషయం. ప్రపంచ భాషలలో రంగు పదాల పరిణామాన్ని వారు వివిధ అంచెల (stages) వారిగా సూచించారు.

  • స్టేజ్ 1: నలుపు, తెలుపు — రెండు పదాలు
  • స్టేజ్ 2: నలుపు, తెలుపు, ఎఱుపు — మూడు పదాలు
  • స్టేజ్ 3: నలుపు, తెలుపు, ఎఱుపు, పచ్చ (ఆకుపచ్చ/పసుపుపచ్చ) — నాలుగు పదాలు
  • స్టేజ్ 4: నలుపు, తెలుపు, ఎఱుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ — అయిదు పదాలు
  • స్టేజ్ 5: నలుపు, తెలుపు, ఎఱుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలం (blue) — ఆఱు పదాలు
  • స్టేజ్ 6: నలుపు, తెలుపు, ఎఱుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలం, గోధుమ రంగు — ఏడు పదాలు
  • స్టేజ్ 7: నలుపు, తెలుపు, ఎఱుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలం, గోధుమ రంగు, ఊదా రంగు, నారింజ రంగు, గులాబి రంగు, బూడిద రంగు — అనేక పదాలు

చారిత్రక భాషావేత్తలు చేసిన భాషా పునర్నిర్మాణం ద్వారా మూల ద్రావిడ భాష స్టేజ్-3కి చెందిందని చెప్పుకోవచ్చు. మూల ఇండో-యూరోపియన్ భాష కూడా నాలుగు రంగు పదాలతో లోనే స్టేజ్-3కి చెందిందిగా పరిగణిస్తారు. హోమర్ కాలంనాటి గ్రీక్ భాషలో కూడా నాలుగే రంగులు కనిపించినా, ఋగ్వేదం నాటి సంస్కృత భాషలో అయిదు నుండి ఆరు రంగు పదాలు కనిపిస్తాయి కాబట్టి, ఈ భాష స్టేజ్-4కు చెందిందిగానో, స్టేజ్-5కు చెందింది గానో పరిగణించవచ్చు. ఆ వివరాలు ఈ కింది విభాగంలో విపులంగా చర్చిద్దాం.

ఋగ్వేదంలో రంగుపదాలు

సూర్యకాంతిలో ఏడు రంగులుంటాయని ముందుగా ఎవరు కనిపెట్టారు? గూగులమ్మను ఈ ప్రశ్న అడిగితే, ఋగ్వేదంలో ఈ విషయం ముందుగా రాశారని కొన్ని వేల సైట్లను చూపుతుంది. అయితే, ఋగ్వేదంలో సూర్యునికి సప్తాశ్వాలు ఉన్నట్టుగా వివరించిన మాట వాస్తవమే గాని, ఆ ఏడు గుర్రాలను ఏడు రంగులుగా ఎక్కడా వివరించలేదు. సప్తాశ్వాల ప్రసక్తి ఉన్న శ్లోకం ఇది:

ఆ సూర్యో యాతు సప్తాశ్వః క్షేత్రం యద్ అస్యోర్వియా దీర్ఘయాథే|
రఘుః శ్యేనః పతయద్ అన్ధో అచ్ఛా యువా కవిర్ దీదయద్ గోషు గచ్ఛన్||
5-045-09

ఇంతకు ముందు మనం కాలమానంలో సూర్యుడిని ఏడు రోజుల వారానికి ప్రతీకగా సప్తచక్రాలు ఉన్నవాడిగా అభివర్ణించినట్టుగానే, ఇక్కడ కూడా ఏడు అన్న సంఖ్యను అన్వయించుకోవాలి. అంతేకాని, సూర్యకాంతిలో గాని, ఇంద్రధనస్సులో గాని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిన ఏడు రంగుల గురించి ఈ శ్లోకం వివరిస్తుందంటే నమ్మశక్యం కాదు. నిజానికి, ఋగ్వేద కాలం నాటికే ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ఏడు వేర్వేరు పేర్లుండేవని చెప్పగలిగే శ్లోకం ఏదీ మనకు ఋగ్వేదంలో కనిపించదు. ఋగ్వేదంలోని రెండవ మండలంలోనే సూర్యుని రథాన్ని వర్ణించే శ్లోకంలో శ్వావ, రోహిత, రక్త వర్ణాలు గల అశ్వాలు ఆ రథాన్ని అలరిస్తాయని వర్ణించారు.

శ్రూయా అగ్నిశ్ చిత్రభానుర్ హవమ్ మే విశ్వాభిర్ గీర్భిర్ అమృతో విచేతాః |
శ్యావా రథం వహతో రోహితా వోతారుషాహ చక్రే విభృత్రః ||
2-010-02

ఇక్కడ ఏడు రంగుల ప్రస్తక్తే కాకుండా ఏడు అశ్వాల ప్రస్తావన లేదు.

నిజానికి, ఋగ్వేదం తరువాతి కాలంలో వెలువడినదిగా అందరూ ఒప్పుకొనే ఛాందోగ్యోపనిషత్తులో సూర్యకాంతిలో శుక్ల (తెలుపు), నీల (నలుపు), పీత (పసుపు/బంగారు), లోహిత (ఎఱుపు) వర్ణాలు కలిసి ఉన్నాయని వర్ణించారు.

అథ యా ఏతా హృదయస్య నాడ్యస్తాః పింగలస్యాణిమ్నస్
తిష్ఠంతి శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్యేతి
(ఛాందోగ్యోపనిషత్తు 8.6.1)

బృహదారణ్యోపనిషత్తులో (4.4.9) మనకు శుక్ల (white), నీల (black), హరిత (green), లోహిత (red), పీత (yellow) రంగుల పేర్లే మనకు కనిపిస్తాయి.

పై శ్లోకాల్లో నీలం అన్న పదానికి నేను నలుపు అని అర్థం ఇవ్వడానికి చాలా మంది అభ్యంతరం చెప్పవచ్చు. ఆధునిక కాలంలో blue అన్న పదాలకు మారుగా తెలుగులోనూ నీలి- అని, నీలం రంగు అని వాడుతూ ఉన్నా ఈ ప్రయోగం అర్వాచీనమైనది! ఋగ్వేదంలోనూ, సంస్కృతంలోని రామాయణ, భారత కావ్యాలలోనూ నీల- అన్న పదాన్ని dark, black అన్న అర్థాలలోనే తప్ప, blue ఆకాశాన్నో, blue సముద్రాన్నో వర్ణించడానికి ఉపయోగించలేదు. తెలుగులో కూడా ఈ మధ్య కాలం దాకా నీలి- అన్న పదాన్ని నలుపు అన్న అర్థంలోనే ఉపయోగించారు. నీలినీడలు- అంటే నల్లని ఛాయలు. నీలి కురులు అంటే నల్ల వెంట్రుకలు; నీలకంఠుడు అంటే నల్లని మచ్చ గల శివుడు. నీలిమేఘం అంటే నల్లమబ్బు. నీలిమ- అంటే నలుపు.

పోతన తన భాగవతంలో తనకు ప్రత్యక్ష్యమైన రామచంద్రమూర్తిని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇలా సాగుతుంది:

మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి
      నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక
      ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ
      బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి
      ఘన కిరీటము తలఁ గల్గువాఁడు

పుండరీక యుగముఁ బోలు కన్నులవాఁడు,
వెడఁద యురమువాఁడు విపుల భద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె
.(భాగవతం. 1-14)

ఆ రామచంద్రమూర్తి నల్లని శరీరానికి పెట్టిన ఘన కిరీటం నల్లని కొండ మీద సూర్యుని లాగా మెరిసిపోతుందట అని చెప్పడానికి “నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలఁ గల్గువాఁడు” అన్నాడు పోతన. పోతన దృష్టిలో రాముడు, కృష్ణుడు ఇద్దరూ నల్లని వారు, పద్మ నయనమ్ముల వారే కదా!

ఇక తెలుగు, తమిళాది ద్రావిడ భాషలలో రంగు పదాల గురించి పరిశీలిద్దాం.

ద్రావిడ భాషలలో ప్రాథమిక రంగు పదాలు

తులనాత్మకంగా పరిశీలించి భాషావేత్తలు పునర్నిర్మాణం చేసిన మూల ద్రావిడ భాషలో ప్రాథమిక రంగు పదాలు నాలుగు అని చెప్పుకున్నాం కదా. వాటి వివరాలు:

మూల ధాతువు తెలుగు తమిళం కన్నడ
*వెళ్- ‘తెలుపు’ వెల్ల, వెఁలుగు, వెండి, వెన్న వెళుప్పు, వెళ్ళి, వెణ్- బెళుపు, బెళకు
*కార్- ‘నలుపు’ కారు కారు కారు
*కెమ్- ‘ఎఱుపు’ కెంపు, కెంజాయ, కెమ్మోవి, చెంగావి చెమ్-, చేత్తు కెమ్-
*పచ్- ‘పచ్చ(ఆకుపచ్చ/పసుపుపచ్చ)’ పచ్చ పచ్చ పచ్చ

ఈ రంగులే గాక తమిళంలో పసుపుపచ్చ రంగు అనే అర్థంలో మంజిల్ అనే పదం, బూడిద రంగు అర్థంలో నరై అన్న పదం సంగ సాహిత్య దశనుండి కనిపిస్తున్నాయి. సంస్కృతంలో కనిపించే మంజిష్ఠ అన్న పదానికి మంజిల్ పదానికి సంబంధం ఉండవచ్చు. నెరయు-, నెరసిపోవు- అన్న పదాల్లో వెంట్రికలు గ్రే (gray) రంగులోకి మారిపోయే అర్థం తెలుగులో ఉన్నా నెర- అన్న పదం రంగును సూచించే విశేషణంగా గానీ విశేష్యంగా గానీ అర్థ వ్యాకోచం జరగలేదు.

తెలుపు

తెలుపు రంగుకు సంబంధించిన అనేక పదాలు తెలుగుతో సహా అన్ని ద్రావిడ భాషలలో వెళ్-/వెణ్- ధాతువుకు సంబంధించి ‘వ’-కారంతోనో, లేదా బ- కారంతోనో ప్రారంభమయితే, తెలుగులో మాత్రం అసలు రంగుపదం మాత్రం వెళుపు/వెలుపు అని కాకుండా ‘తెలుపు’ అవ్వటం కొంత ఆశ్చర్యకరమైన విషయమే. తెళ్- అన్న ధాతువుకు తేటతెల్లమగు, అవగాహన కలుగు (తెలివి కలుగు) అన్న అర్థాల్లో ప్రయోగాలు అన్ని భాషల్లోను కనిపించినా, రంగుపదంగా త- కారంతో ప్రయోగాలు ఇతర భాషలలో కనిపించవు.

18వ శతాబ్దానికి చెందినదిగా భావించే సారంగపాణి పదాలలో కనిపించే వెళుపు- అన్న పద ప్రయోగానికి రవ్వ శ్రీహరి తెలుపు అన్న అర్థం చెప్పారు.

హరహర నీకు చిత్తజు భవనమింత వెళుపైతేనే. (సారంగ. 84)

ఇది నిజంగానే తెలుపు అన్న అర్థంలో వాడి ఉంటే, బహుశా, అది తమిళ భాషా ప్రభావం వల్ల కావచ్చు.

రంగు పదంగా కాకుండా వెళ్-/వెణ్- అన్న ధాతువు ద్వారా ఉద్భవించిన తెలుగు పదాలు కోకొల్లలు. వెల్ల, వెలవెలబోవు, వెలది (వెలయాలు అన్న పదంతో సంబంధం లేదు), వెన్నెల, వెన్న (‘వెల్- ‘white’ + నెయ్ ‘oil’), వెల్లుల్లి, వెలుగు, వెండి, వెలయించు, వెల్లిక, బెళుకు (తళుకు-బెళుకు), బొల్లి ‘తెల్ల మచ్చల వ్యాధి’ ఈ పదాలన్ని ఈ ధాతువుకు సంబంధించినవే.