ప్రాథమిక పదజాలం
రెండు భాషల మధ్య సంబంధం చూపించాలంటే ఆ భాషలలోని ప్రాథమిక పదజాలాల మధ్య సంబంధం చూపించాలి. ప్రాథమిక పదజాలం అంటే ఆ భాషలో అనునిత్యం వాడే మౌలికమైన పదజాలం ఉదా: బంధుత్వాల పేర్లు, శరీర అవయవాల పేర్లు, సర్వనామాల పేర్లు, సంఖ్యావాచకాల పేర్లు, ఋతువులకు, కాలాలకు సంబంధించిన పేర్లు, కాలకృత్యాలకు వాడే పేర్లు మొదలగునవి. ఒక భాష వేరే భాషాకుటుంబంనుండి పదజాలాన్ని ఎంతగా అరువు తెచ్చుకున్నా, ప్రాథమిక విషయాలను వ్యక్తపరచడానికి మాత్రం తన సొంత భాషలోని పదజాలాన్నే ఉపయోస్తుంది. కానీ ఒక్కోసారి కొన్ని భాషలలో ప్రాథమిక పదజాలంలో కూడా అన్యభాషా పదాలు కనిపించడం కద్దు. అయితే, ఇలాంటి సందర్భాలలో చాలాసార్లు ఆ ప్రాథమిక పదాలకు సొంత భాషలో పదాలు కూడా ఉండటం గమనిస్తాము. ఉదాహరణకు జపనీస్ భాషలో కనిపించే రెండు రకాలైన సంఖ్యావాచకాలు: ఒకటి చైనీస్ భాషనుండి అరువు తెచ్చుకున్న సంఖ్యావాచకాలైతే, మరొకటి జన్మతః సంక్రమించిన జపనీస్ అంకెలు.
భాషా సంబంధాలను వివరించడానికి ఉపయోగించే ప్రాథమిక పదజాలానికి ఒక ఉదాహరణ Swadesh list. కానీ ఈ ప్రాథమిక పదాల పట్టికను తయారు చేసిన Morris Swadesh దీని ఆధారంగా సోదర భాషల మధ్య కాల వ్యత్యాసాన్ని గణిత సూత్ర సంబంధంగా (glottochronology) కొలవటానికి ఉపయోగించడంతో ఇది వివాదాస్పదంగా మారింది. ప్రాథమిక పదజాలం అన్ని భాషలలోనూ ఒకే గతిలో మార్పు చెందుతుందన్న Swadesh ప్రతిపాదన చాలామంది భాషావేత్తలు ఒప్పుకోరు. అయితే, భాషాసంబంధ నిరూపణకు అవసరమైన ప్రాథమిక పదజాలానికి మాత్రం ఈ పట్టిక ఒక నమూనాగా ఉపయోగపడుతున్నది.
ధ్వన్యనుకరణ పదాలు, శైశవ పదాలు
భాషాసంబంధ విషయంగా పదజాలాలను పోల్చిచూసేటప్పుడు, భాషావేత్తలు ధ్వన్యనుకరణ పదాలను, శైశవ పదాలను ప్రాథమిక పదజాలంగా పరిగణించకుండా జాగ్రత్తపడతారు. ధ్వన్యనుకరణ పదాలు ప్రపంచంలోని చాలా భాషలలో ఒకే రకంగా వినిపిస్తాయి. కోడి కూత తెలుగులో కొక్కొరక్కో అయితే, జపనీస్ భాషలో కొక్కెకొక్కో, ఇంగ్లీష్ భాషలో కొక్క-డూడుల్-డూ. ఈ పదాల ఆధారంగా తెలుగు, జపనీస్, ఇంగ్లీష్ భాషల మధ్య ఏదో సంబంధం ఉందనడం పసలేని వాదన అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అలాగే , “అమ్మ” అన్న పదానికి చైనీస్ భాషలో వాడే పదం “మా”, బాస్ఖ్ భాషలో పదం “అమ”, వెస్టిండీస్ లో కోబన్ తెగ వారు మాట్లాడే భాషలో పదం “అమ్మీ”. అంతమాత్రం చేత ఈ భాషలకు తెలుగు భాషకు సంబంధం ఉందని చెప్పలేము. ఈ పదాలలో సామ్యతకు మౌలికమైన వివరణ ఉంది. పసి పిల్లలు మాటలు నేర్చుకునే వయస్సులో కొన్ని రకాల ధ్వనులను మాత్రమే ఉచ్ఛరించగలుగుతారు. పెదవులతో తేలికగా ఉచ్ఛరించగలిగే /ప/, /ఫ/, /బ/, /భ/, /మ/ (ఓష్ఠ్యాలు) శిశువులు మొట్టమొదట పలకగలిగే ధ్వనులు. అచ్చులలో తేలికగా పలికే అచ్చు /అ/. అందుకనే పసిపిల్లలు పలికే మొదటి పదం మనకు “అమ్మ” అనో “మా” అనో వినిపిస్తుంది. ఆ మొట్టమొదటి పదాన్ని తల్లికి ఆపాదించడం సహజం కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా మ-కారంతో కూడిన తల్లి పదం. అదే విధంగా అన్ని భాషలలో వేర్వేరు అర్థాలలో కనిపించే పాపా, మామా, బాబా, దాదా, తాతా, నానా అన్న పదాలు. ఈ శైశవ పదాలలో కనిపించే సామ్యతను, సార్వజనీనతను కూలంకషంగా చర్చించి, వివరించిన భాషాశాస్త్రవేత్త జాకబ్‌సస్ [5].