సంఖ్యాపదం – ఒకటి
ప్రపంచ భాషలన్నింటిలోనూ మౌలిక సంఖ్యా వాచకాలకు సొంత భాషాపదాలే ఎక్కువగా ఉంటాయి. ఒక భాష వేరే భాషలనుండి పదజాలాన్ని ఎంతగా అరువు తెచ్చుకున్నా, ప్రాథమిక విషయాలను వ్యక్తపరచడానికి మాత్రం తన సొంత భాషలోని పదజాలాన్నే ఉపయోస్తుందని వివిధ ప్రపంచభాషలను పరిశీలించిన భాషావేత్తల సిద్ధాంతం. బంధుత్వాల పేర్లు, శరీర అవయవాల పేర్లు, సర్వనామాల పేర్లు, కాలాలకు సంబంధించిన పేర్లు, కాలకృత్యాలకు వాడే పేర్లు, సంఖ్యా పదాలు మొ॥ ప్రాథమిక పదజాలంగా పేర్కొనవచ్చు. కానీ ఒక్కోసారి కొన్ని భాషలలో మౌలిక సంఖ్యా వాచకాలకు కూడా అన్యభాషా పదాలు కనిపించడం కద్దు. అయితే, ఇలాంటి సందర్భాలలో చాలాసార్లు ఆ ప్రాథమిక పదాలకు సొంత భాషలో పదాలు కూడా ఉండటం గమనిస్తాం. ఉదాహరణకు జపనీస్ భాషలో రెండు రకాలైన సంఖ్యావాచకాలు కనిపిస్తాయి: ఒకటి చైనీస్ భాషనుండి అరువు తెచ్చుకున్న సంఖ్యావాచకాలైతే, మరొకటి జన్మతః సంక్రమించిన జపనీస్ అంకెలు.
ద్రావిడ భాషలలో ఒకటి నుండి పది వరకు, వందకు ప్రత్యేక పదాలు కనిపిస్తాయి. వెయ్యికి ఒక్క తెలుగులో మాత్రమే ద్రావిడ పదం కనిపిస్తుంది. అయితే, సాహిత్య రహిత భాషలలో ద్రావిడ సంఖ్యాపదాలు ఏడు దాటి ఉండవు. మిగిలిన అంకెలకు ఆయా భాషల చుట్టు ఉన్న భాషా కుటుంబాలనుండి అరువు తెచ్చుకున్న పదాల వాడుక కనిపిస్తుంది. మాల్తో, కువి, కుయి (కొన్ని మాండలికాల) భాషలలో మూడు వరకే ద్రావిడ భాషా పదాలు, బ్రాహుయీలో (Brahui) మూడు వరకూ, కొండ, ఒల్లరి, గదబలో నాలుగు వరకు, కొలామిలో అయిదు వరకు ద్రావిడ భాషా పదాలు కనిపిస్తాయి. గోండిలో, కుయి (కొన్ని మాండలికాలు) భాషలలో ఆరు వరకు ద్రావిడ పదాలు, ఆపై అంకెలకు మరాఠి పదాలు కనిపిస్తాయి.
ఈ వ్యాసభాగంలో ఒకటికి సంబంధించిన పదాల గురించి చర్చించుకుందాం.
ఒకటికి ద్రావిడ భాషలలో మూడు రకాలైన ధాతువులు కనిపిస్తాయి.
- ఒన్ఱు – ఒన్ను: తమిళంలోనూ, మళయాలంలోనూ కనిపించే ఒన్ఱు, విశేషణంగా ఒన్- ఒన్ని- అన్న రూపాలుగా కనిపిస్తుంది. తెలుగులో ఒన్ను, ఒంటి, ఒంటరి అన్న పదాలు ఈ ధాతువుకు సంబంధించినవే.
- ఓర్ – ఒర్: దక్షిణ ద్రావిడ భాషలలో అచ్చులముందు ఓర్, హల్లులముందు ఒరు కనిపిస్తాయి. ఉదాహరణ: తమిళంలో ఓర్ ఎయిల్ (ఒక కోట), ఒరునాళ్ (ఒక నాడు), కన్నడంలో ఓర్ అడి (ఒక అడుగు), ఒర్ పెసర్ (ఒక పేరు) మొ॥ తెలుగులో ఒరుడు అంటే ఒకడు, ఒండొరులు (ఒండు+ఒరు+లు) అంటే ఒకరికొకరు అన్న అర్థాల్లో వాడడం కనిపిస్తుంది.
- ఒక్క్ – ఒక్క: దక్షిణాది భాషలైన తమిళ, కన్నడ భాషలలో ఈ ధాతువుకు సంబంధిన పదాలు కనిపించవు. దక్షిణమధ్య భాషలైన తెలుగు, గోండిలలోనూ, మధ్య ద్రావిడ భాషలైన కొలామి, నాయకీ, పర్జి, గదబలలోనూ ఈ ధాతువు కనిపిస్తుంది.
ఒకటి సంబంధిన ఈ మూడు ధాతువులు వేర్వేరు ధాతువులా, లేదా ఒకే ధాతువుకు సంబంధిన వివిధ రూపాలా అన్న విషయం మీద భాషావేత్తల మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. ద్రావిడ వ్యుత్పత్తి నిఘంటువు (DEDR) ఇవ్వన్నింటిని ఒకే జాబితాలో చేర్చింది. భద్రిరాజుగారు తన Dravidian Languages అన్న ఉద్గ్రంథంలో వీటిని మూడు వేర్వేరు ధాతువులుగా పేర్కొని, ఒకవేళ అవి ఒకే ధాతువు నుండి ఉత్పన్నమైతే ఆ ధాతువు ఓ-/ఒ- అయి ఉండాలని సూచించారు. ఒకవేళ అదే నిజమైతే, ఓంటు, ఒరు పదాలకు తమిళ, మళయాల పదాలకు ‘కలిసి ఉండడం’ అన్న అర్థం ఉంది కాబట్టి, మూల ద్రావిడ భాషలో ఓ-/ఒ- అన్న ధాతువు కూడ కలిసి ఉండటానికి సూచకంగా ఉండి ఉండాలి.
తెలుగు మహాభారతంలో ఒరు, ఒండు- పదాల వాడుకే ఎక్కువ. అయితే, ఆధునిక తెలుగులో ఒండు, ఒరు పదాల ప్రయోగం లుప్తమై, ఒక్క అన్న పదప్రయోగం మాత్రమే మిగిలి ఉన్నది. ‘ఒరు’ ప్రయోగం రెండు సార్లు కనిపించే ఈ కింది మహాభారతంలోని తిక్కన పద్యం, మా గురువుగారైన పిల్లలమఱ్ఱి రామకృష్ణ గారికి ప్రియమైన పద్యాలలో ఒకటి:
ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబునకగు తా
నొరులకవి చేయకదియె
పరాయణము పరమ ధర్మపరులకు నెపుడన్
కాంట్ (Immanuel Kant) ప్రతిపాదించిన Categorical Imperative మనకు మహాభారతంలోని పై పద్యంలో కనిపించడం విశేషం.
సంఖ్యాపదం – రెండు
ద్రావిడ భాషలలో మూర్ధన్యాక్షరాలు (ట,ఠ, డ, ఢ, ణ, ళ, ఴ లు), ర-ఱ-లలు ప్రథమాక్షరంగా ఉండడానికి వీలులేదు. అందుచేత ఈ అంకెకు సంబంధించిన పదాలకు రెండు మూలధాతువు కాదు. అయితే, తెలుగు-కుయిలలో మాత్రం పై అక్షరాలు ప్రథమాక్షరంగా కనిపించే పదాలు కోకొల్లలు. ఈ అంశాన్ని విశ్లేషిస్తూ భద్రిరాజు కృష్ణమూర్తి వర్ణవ్యత్యయం (metathesis) అనే ధ్వని పరిణామం వల్ల మూల ధాతువులలో ద్వితీయాక్షరంగా ఉన్న ఈ మూర్ధన్యాక్షరాలు మొదటి స్థానానికి చేరాయని వివరించారు (చూ. Telugu Verbal Bases p 51-52).
ఉదాహరణలు:
లోన < ళోన < *ఒళన
డస్సి < ఴస్సి < *అఴసి
లే(త) < *ఎల
రే(యి) < రెయి < *ఇరు
రోలు < ఒరలు < *ఉరల్
రెండుకు సంబంధించిన పదాలను ఇతర భాషలలో పరిశీలిస్తే, మనకు ఇరు/ఈరు/ఇరంటు అన్నది మూలధాతువని గ్రహించవచ్చు. ప్రాచీన తమిళంలో మలయాళంలోనూ ఇరంటు, రంటు అంటే రెండు. కన్నడలో ఎరడు. బ్రాహుయీలో ఇరట్, గోండిలో రండ్, నాయకీలో ఎరండి.
అంతేకాక, విశేషణంగా తెలుగులోనూ, ఇతర ద్రావిడ భాషలలోనూ హల్లుల ముందు ఇరు-, అచ్చులముందు ఈరు- అన్న రూపాలే కనిపిస్తాయి. ఇరువంకలు అంటే రెండు పక్కలు. ఇరువురు అంటే ఇద్దరు. ఈర్ ఆఱివు అంటే తమిళంలో రెండు రకాల జ్ఞానం అని అర్థం. ఈరొడలు అంటే రెండు శరీరాలు. అలాగే, తెలుగులో ఈరయిదు అంటే పది, ఈరారు అంటే పన్నెండు, ఈరేడు అంటే పద్నాలుగు, ఈరెనిమిది పదహారు. ఇరుకు, ఇరుకాటం అంటే రెండింటి మధ్య నలిగి ఉండటం అన్న మాట.
వచ్చే భాగంలో మూడు-నాలుగు అంకెల గురించి…
(సశేషం)