పలుకుబడి: సంఖ్యాపదాలు – 3

సంఖ్యాపదం: ఏడు

“ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం”

అంటూ అన్నమయ్య జననాన్ని తెలుగు పదానికి జన్మదినంగా వర్ణిస్తూ వేటూరి రాశాడు కదా. ఇంతకీ అన్నమయ్య తిరుమల కొండలను ఏడుకొండలుగా, తిరుమల రాయడ్ని ఏడుకొండల రాయడుగా తన పాటలలో ఎక్కడైనా వర్ణించాడా?

ఏడు అన్న సంఖ్యకు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వాడే పదం: ఏఴు. మన తెలుగులోకూడా ఇది తొమ్మిదో శతాబ్దంవరకు ఏఴు అనే రాసేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఴ- కారం ద్రావిడ భాషలలో కనిపించే ప్రత్యేక వర్ణం. చూడడానికి బండి ఱ-కారం లాగా కనిపిస్తున్నా ఈ ధ్వనికి బండి-ఱ కు ఏ సంబంధమూ లేదు. దీన్ని అమెరికన్లు ర-కారాన్ని పలికే విధంగా మూర్ధన్య అంతస్థంగా (Retroflex Approximant) పలకాలి. తమిళంలో పఴం (ఫలం), కోఴి (కోడి) మొదలైన పదాలలో ఈ వర్ణం కనిపిస్తుంది. తమిళ- అన్న పదం నిజానికి తమిఴ- అని రాసి అలాగే పలకాలి. 8-9 శతాబ్దాల వరకు మన భాషలో కూడా ప్రత్యేక వర్ణంగా ఉన్నట్టు ఆధారాలు ఉన్న ఈ ధ్వని, తరువాతి కాలంలో తెలుగులో అచ్చుల మధ్య డ- కారంగానూ, హల్లు తరువాత ర-కారంగాను మారిపోయింది.

ఏడు: < *ఏఴు కోడి: < *కోఴి సుడి: < *చుఴి మ్రోగు < *మొఴన్కు డస్సి < ఴస్సి < *అఴసి చివరి రెండు ఉదాహరణలలో వర్ణవ్యత్యయం అనే ధ్వనిపరిణామాన్ని గమనించవచ్చు. వర్ణవ్యత్యయం (metathesis) అంటే మూల ధాతువులోని మొదటి అచ్చు, ఆ అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకోవడం. ఉదా: వాడు < వాన్ఱు < *అవన్ఱు వీడు < వీన్ఱు <*ఇవన్ఱు రోలు < ఒరళ్ <*ఉరళ్ ఈ ధ్వనిపరిణామం తెలుగు-కువి-గోండి వంటి దక్షిణ-మధ్య ద్రావిడ భాషలలో మాత్రమే కనిపిస్తుంది. అచ్చుల మధ్య ఴ- కారం, వర్ణవ్యత్యయంవల్ల పదాదికి వచ్చినప్పుడూ డకారంగా మారి, ఆ తరువాత పదాది డకారం ద కారంగా మారింది. వర్ణవ్యత్యయంవల్ల పదాది హల్లు తరవాత వచ్చినప్పుడు అది రేఫగా మారింది. ఴ- కారంతో కూడిన వర్ణవ్యత్యయానికి మరికొన్ని ఉదాహరణలు: మ్రింగు < *మిఴిన్కు దున్ను < డున్ను < *ఉఴు-ను దుక్కి < డుక్కి < *ఉఴుక్కి ‘ఏడు మల్లెల ఎత్తు’ అంటే ఏడుమల్లెల బరువు అన్నమాట. ఎత్తు అన్న పదానికి బరువు అన్న అర్థం కూడా ఉంది కదా. ‘ఏడు వారాల నగలు’ అంటే వారానికి ఏడురోజుల్లో ఒక్కో రోజు ఒక్కో రకం నగ చొప్పున పెట్టుకొనే ఏడు రకాల నగలన్నమాట. ఆధునిక కాలంలో ‘ఏడు’ లాగే ఉచ్చరించే ఇంకో పదం ‘సంవత్సరం’ అన్న అర్థం ఉన్న ‘ఏఁడు’. ఈ పదానికి ‘ఏడు’ అన్న సంఖ్యాపదానికి ఏ సంబంధం లేదు. ‘ఏఁడు’ అన్న పదానికి మూల ధాతువు *యాంటు. మూల ధాతువులోని పదాది య-కారాలన్ని తెలుగులో ఏ-కారంగా మారిపోయాయి కాబట్టి ఇది ముందుగా ‘ఏండు’గా మారి, తరువాత దీర్ఘముమీది సున్న అరసున్నగా మారిపోయి ఏఁడు అయ్యింది. అయితే, ఇప్పటికి ఈ పదానికి బహువచనంగా ఏండ్లు/యేండ్లు అనే వాడుతారు. తమిళంలో, మలయాళంలో దీన్ని ‘ఆండు’ అని అంటారు. కన్నడలో ‘ఏడు’ అని కనిపించడం తెలుగు ప్రభావం కావచ్చు. సంతాలి, ముండారి మొదలైన ముండ భాషలలో ఏడు సంఖ్యావాచకంగా ‘ఎయ’, ‘ఏజ’ వంటి పదాలు కనిపించడం ద్రావిడ భాషల ప్రభావ ఫలితమే అని చెప్పవచ్చు. ఇంతకీ, వారానికి ఏడు రోజులే ఉండాలన్న విధానం ఎక్కడ మొదలయ్యింది? ఇదే పద్ధతి ప్రపంచమంతా ఎలా వ్యాపించిందో ఎవరైనా చెప్పగలరా?

సంఖ్యాపదాలు: ఎనిమిది, తొమ్మిది

ఎనిమిది దిక్కుల బయలై
యెనిమిదిటికి నారికన్న | నెక్కుడుబయలై
వినరాని బయల నడచిన
గనరా యచ్చోట నన్ను | గలసియు వేమా! (- వేమన(?))

ఎనిమిది శబ్దానికి పూర్వరూపం ఎణ్‌-పది అని చెప్పవచ్చు. ఈ సంఖ్యకే ఎణ్బొది, ఎణుంబొది, ఎనుబొది, ఎణ్మ, ఎన్మిది వంటి రూపాలు శాసనాలలో కనిపిస్తున్నాయి. కన్నడ లో దీనిని ‘ఎంటు’ అని, తమిళంలో ‘ఎట్టు’ అని అంటారు. తొమ్భ, తోంభ అనే రూపాలే దొరికాయి. నేటి వ్యవహారంలో ‘తొంబ’ అంటే ‘చాలా(మంది)’ అనే అర్థం.

ఎన్ను/ఎణ్ణు అంటే లెక్కించు అన్న అర్థం ఉంది కదా. అయితే, ఎణ్-పది అన్న పదంలో -పది అన్న పదాంశానికి అర్థమేమిటో ఎవరూ సరిగ్గా వివరించలేకపోయారు. ఎనిమిది, తొమ్మిది శబ్దాలు రెండూ ‘రెండు తక్కువపది, ఒకటి తక్కువపది’ అనే పద్ధతిలో నిష్పన్నమయ్యాయని కొందరు భావించారు. తొమ్మిది శబ్దం విషయంలో ఇటువంటి నిర్మాణక్రమం కొన్నిద్రావిడభాషల్లో కనిపిస్తుంది. తమిళంలో తొమ్మిది ఒణ్బదు, అంటే పదికన్న ఒకటి తక్కువ. కన్నడములో కూడ ఇదే అర్థముతో ఒంబత్తు అంటారు తొమ్మిదిని. కొలామీలో ఒంబయ్‌, తుళు ఒరుంబ అంటారు.

ఈ రకంగా ఎనిమిది నిర్మాణం చెయ్యాలంటే ఎణ్ అంటే లెక్కించు అన్న అర్థం తీసుకోకూడదని నా అభిప్రాయం. కన్నడలో ఎణె, ఎణ అన్నా, తమిళంలో ఇణై అన్నా ‘జత’, ‘కవలలు’ అన్న అర్థాలు ఉన్నాయి. తెలుగులో కూడా ‘ఎనలేని’ ‘సమానమైన వాడు లేని’ అన్న అర్థమున్న పదబంధం కూడా ఈ ధాతువుకు సంబంధించిందే. కాబట్టి, ఎణ-పది అంటే ‘జత తక్కువ అయిన పది’ అన్న అర్థాన్ని వివరించవచ్చని నా ఊహ.

తొమ్మిది తొమ్మిది వాలిక
యమ్ముల మున్నేసి పటు శరాసారము పైఁ
గ్రమ్మించిన మనదెసఁ దూ
ర్యమ్ములునుం గీర్తనములు నార్పులుఁ జెలఁగెన్. (మహాభారతము 7.3.208)

సంఖ్యాపదం: పది

తలపులోపలి తలపు దైవ మితడు
పలుమారు బదియును బదియైన తలపు (– అన్నమయ్య)

‘పది’ అన్న పదానికి పహ్- మూలధాతువని భద్రిరాజు కృష్ణమూర్తి గారి సిద్ధాంతం. తమిళ తొల్కాప్పియం వ్యాకరణ పుస్తకంలో పత్తు అన్న తమిళ పదాన్ని ఆయితమ్ అన్న వింత అక్షరంతో కలిపి పஃత్తు అని రాసారు. ఆ ఆయితమ్ మొదట కంఠమూలీయ హ- కార ధ్వనిని సూచించేదని కృష్ణమూర్తి గారి సిద్ధాంతం. మూలధాతువులో ఈ హ-కార ధ్వని ఉంది కాబట్టే, ముప్ఫది (ముప్ఫై), నలభది (నలభై), ఏంభయ్‌ (యాభై) అన్న పదబంధాల్లో వాటిల్లో –ఫై-, -భై- అన్న మహాప్రాణాలు తెలుగులో కనిపిస్తున్నాయని ఆయన వాదన. పదిహేను, పదహారు, పదిహేడు లలో కనిపించే హ- కారానికి కూడా ఈ మూలధాతువులోని హ- కారమే కారణమని ఆయన అంటారు.

పైన ఇచ్చిన అన్నమయ్య పాటలో ‘బదియును బదియైన’ అంటే అర్థమేమిటో ఎవరైనా చెప్పగలరా?

సంఖ్యాపదం: నూఱు

నూఱు, వంద శబ్దాల్లో మనకు ప్రాఙ్నన్నయ్య శాసనాల్లో నూఱే ఎక్కువగా కనిపిస్తుంది. నూఱే కాక నూఱుపై గుణింతపు సంఖ్యలు అయిన ఇన్నూఱు, మున్నూఱు, నన్నూఱు, ఏనూఱు వంటి పదాలు కూడా శాసనాలలో కనిపిస్తాయి. వంద అన్న పదం సంస్కృత వృంద (=బృంద) శబ్ద భవం. ఇతర ద్రావిడ భాషల్లో కూడా నూఱు/నూఱ్ఱు అన్న సోదరపదాలే అన్ని భాషల్లో కనిపిస్తాయి.

సంఖ్యాపదం: వెయ్యి

వెయ్యికి సంఖ్యా వాచకంగా ఒక్క తెలుగులోనే ద్రావిడ భాషా పదం కనిపిస్తోంది. కన్నడ లో వెయ్యిని సావిర- అంటారు. ఇది సంస్కృత పదమైన సహస్ర- శబ్దభవమే. తమిళంలోని ఆయిరం కూడా, స-కార, హ-కార లోపం వల్ల ఆయిరం అయ్యింది.

ప్రాఙ్నన్నయ్య శాసనాల్లో వేయి, వేయు, వెయ్యి వంటి రూపాలు మనకు కనిపిస్తాయి. ఈ వేయి శబ్దానికి ధాతురూపం *వేన్‌- అని నిరూపించవచ్చు. దీని మౌలికార్థం ‘వైశాల్యం, సమృద్ధి’ (చూ. DEDR 5404).

సంఖ్యాపదాలలో ఎరువు మాటలు

అచ్చ తెలుగుపదాలే గాక ఇతర భాషల నుండి ఎరువు తెచ్చుకున్న సంఖ్యాపదాలు ప్రాఙ్నన్నయ్య శాసనాల కాలం నుండీ మనకు కనిపిస్తాయి. వాటిలో ప్రాకృతంనుంచి వచ్చిన దువ, దోయి (= రెండు), తిణ్ణి (=మూడు), చౌ (=నాలుగు), బారస (=పన్నెండు), సత్తిగ (=ఇరవై ఒకటి), పాతిక (= ఇరవైఅయిదు), వంద (=నూఱు) మొదలైనవీ, సంస్కృతంనుంచి వచ్చిన త్రి (=మూడు), నవ (=తొమ్మిది), షష్టి (=అరవై), నవతి (=తొంభై), సహాస్ర (=వెయ్యి), కోటి మొదలైనవీ కనిపిస్తాయి.

సంస్కృత తత్భవమైన దోయి ఎన్నో పదబంధాలలో అచ్చతెలుగు పదాలతో కలిసికనిపించడం విశేషం. కనుదోయి, చనుదోయి, తోడదోయి వంటి పదాలే కాక దోయికట్టు (=జతగూడు), దోయిలి/దోసిలి (=చేతులు జోడించు) వంటి మిశ్రసమాసాల్లో కనిపించడం ఆరోజుల్లో మనభాషపై సంస్కృత ప్రాకృత భాషల ప్రభావాన్ని తెలుపుతుంది.

సంస్కృతంలో పాదిక అంటే నాలుగోవంతు. పశువులకు, పద్యాలకు నాలుగు పాదాలుంటాయి కాబట్టి పాదిక అంటే నాలుగోవంతు. ఆమాట ప్రాకృతం ద్వారా తెలుగులోకి పాతికగా ప్రవేశించింది.

బారసాల అనే మాటకి వ్యుత్పత్తి ఏంటి? “దీనిని అసలు బాల సారె అంటారు. అదివాడుకలోకి వచ్చే సరికి బారసాల అయినది.” అని “అప్పటిదాకా తల్లి చీరలతో చేసిన పొత్తిగుడ్డల్లో ఉండే బాలకి మొదటిసారి సారె పెట్టడం” అంటూ బోలెడంత లోకనిరుక్తి (folk-etymology) సాహితీ లోకంలోనూ, ఇంటర్నెట్టులోనూ ప్రచారంలో ఉంది (గూగుల్ లో బారసాల బాలసారె అని వెతకండి). ఇక అసలు వ్యుత్పత్తి విషయానికి వస్తే, సంస్కృతంలో 12ను ‘ద్వాదశ’ అంటారుగదా. ఈ ‘ద్వాదశ’ అన్న పదం పాళీలోనూ, ప్రాకృతంలోనూ, ‘బారస’ గాను, ‘బారహా’/బారహ్ గాను మార్పు చెందింది. తెలుగు శాసనాల్లో కనిపించే ‘బారస’ పదానికి తెలుగు ప్రత్యయమైన -(అ)ల జతచేసి 11వ/12వ రోజు చేసుకునే నామకరణోత్సవానికి ఆపాదించాం. మరాఠి భాషలోనూ ‘బారసా’ అంటే 12వ రోజు నాడు చేసే నామకరణ మహోత్సవము (చూ: మోల్స్‌వర్త్ మరాఠి నిఘంటువు).

మనుష్యవాచక సంఖ్యాపదాలు

తెలుగులోనూ ఇతర ద్రావిడ భాషలలోనూ మనుష్యవాచక సంఖ్యాపదాలు ప్రాథమిక సంఖ్యాపదానికి మనుష్యవాచక ప్రత్యయం చేర్చడంవల్ల ఏర్పడతాయి. తెలుగులో ఈ ప్రత్యయ రూపాలు:

-రు (ఒకరు, ఒక్కరు, ఎనమండ్రు, తొమ్మండ్రు, పదుండ్రు)
-దఱు (ఇద్దఱులో మాత్రం),
-వురు/గురు (మూవురు, మువ్వురు, ముగ్గురు, నలువురు, నల్వురు, నలుగురు, ఆరుగురు, ఏడుగురు మొ.)

-వురు/-గురు అన్న ప్రత్యయానికి సంబంధించి తమిళ, మలయాళ, కన్నడ భాషలలో –వరు/వర్ ప్రత్యయం తమిళంలో మూవర్‌ అన్నా, కన్నడలో మూవరు అన్నా ముగ్గురు అన్న అర్థం.

కొన్ని మాండలికాలలో ఎనమండుగురు, తొమ్మండుగురు అన్న వాడకం ఉన్నా, ఆధునిక తెలుగు భాషలో ‘ఎనిమిది’ కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో ‘మంది’ చేర్చడమే ప్రమాణం: ఎనిమిదిమంది, తొమ్మిదిమంది, పదిమంది. ప్రాచీన భాషలో ‘పదుగురు’ అన్న ప్రయోగం ఉండేది: ‘పదుగురాడు మాట పాడియై ధర చెల్లు’ అని విన్నాం కదా. రాయలసీమ మాండలికంలో ఐదు, ఆరు, ఏడులకి కూడా ‘మంది’ చేర్చి వ్యవహారిస్తారు.