[ఋగ్వేదంలో మొట్టమొదటి అనువాకంలోని మొదటి సూక్తంలోని తొమ్మిది శ్లోకాలకు నా అనువాద ప్రయత్నం ఇది. ప్రాచీనాంధ్ర కవులు వేదాలకు అనువాదం చేయకపోయినా, ఆధునిక పద్యానువాదాలు ఒకటి రెండు ఇదివరకు వచ్చాయి. ఉదాహరణకు చర్ల గణపతి శాస్త్రిగారు, నేమాని నరసింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు నాకు పరిచయం. అయితే, వారి అనువాద ప్రయోజనం వేరు. నా అనువాద ప్రయత్నం వేరు. వారి అనువాదాలలో మూలంలో లేని భావాలు కనిపించి అవి నాకు పరిపూర్ణ తృప్తినివ్వలేదు. నా అనువాద ప్రయత్నానికి నేను పెట్టుకొన్న నియమాలు ఇవి:
- మూలం లోని భావాలనే యథాతథంగా అనువాదం చేయాలి. మూలంలో లేని భావాలు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.
- సంస్కృతంలో వాడిన పదాలనే తెలుగులో వీలైనంతవరకు వాడుకోవాలి. అప్పుడు ఆ మూల శబ్దాలకు ఉన్న అనేక అర్థాలు అనువాదానికి కూడా పొసగుతాయి.
- గ్రాంథిక క్రియారూపాలు, లుప్తమైన వాక్యనిర్మాణాల బదులు ఆధునిక పాఠకునికి అర్థమయ్యే విధంగా శిష్టవ్యవహారానికి దగ్గరిగా ఉండే వాక్యనిర్మాణం వీలైనంతవరకూ కనిపించాలి. అందుకే న-కారపు పొల్లులు, 11వ శతాబ్దపు వాక్యనిర్మాణ ధోరణులు ఈ పద్యాలలో కనిపించవు. నిత్యవ్యవహారికంలో లాగా ఉకారసంధి కూడా ఈ పద్యాలలో వికల్పమే.
- వేదవాఙ్మయంలో లయ ప్రధానమైనది కాబట్టి తెలుగు అనువాదంలో కూడా ఏదో ఒక ఛందస్సు ద్వారా లయను సాధించాలి. సంస్కృతంలోని వైదిక ఛందంలో చాలా స్వేచ్ఛ ఉంది. అటువంటి ఏ ఛందం అయినా పరవాలేదు. మూలభావం యథాతథంగా అనువాదం చేయడం ముఖ్యం. అక్షరమైత్రి ద్వారా సాధించే యతి కన్నా సంస్కృతంలో లాగా విరామయతి ప్రధానం నాకు. అందుకే కొన్నిచోట్ల విరామయతి మాత్రమే ఉందని గమనించగలరు.
ఈ నియమాలను పాటించే విషయంలో నేను ఎంతవరకూ కృతకృత్యుణ్ని అయ్యానో మీరే నిర్ణయించాలి.
ఈ శ్లోకాలను అర్థం చేసుకోవడంలోనూ, సాయణాచార్యుని భాష్యాన్ని చదవినప్పుడు నాకు కలిగిన సందేహాలను తీర్చడంలోనూ విపుల సమాధానాలతో నాకు సహాయం చేసిన శ్రీ తిరుమల దేశికాచార్యుల వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. — సురేశ్ కొలిచాల.]
-
అ॒గ్నిమీ॑ళే పు॒రోహి॑తం య॒జ్ఞస్య॑ దే॒వమృ॒త్విజ॑మ్ ।
హోతా॑రం రత్న॒ధాత॑మమ్ ॥పదచ్ఛేదం: అగ్నిమ్ । ఈళే । పురఃహితమ్ । యజ్ఞస్య । దేవమ్ । ఋత్విజమ్ । హోతారమ్ । రత్నధాతమమ్ ॥
టీకా: అగ్నిమ్ = అగ్నిని; ఈళే = ఈడ = స్తుతింతు; పురఃహితమ్ = పురోహితుడిని (పురః = ముందు; హితః = నడుచువాడు. ప్రథమహితుడు, ప్రథమ పూజ్యుడు అన్నదే వైదికాన్వయం); యజ్ఞస్య = యజ్ఞము యొక్క; దేవమ్ = దేవుడిని; ఋత్విజమ్ = ఋత్విక్కుని; హోతారమ్ = హోతను; రత్నధాతమమ్ = రత్నములను ధరించినవాడిని.
భావం: పురోహితుడు (ప్రథమ హితుడు), యజ్ఞదేవుడు, ఋత్విక్కు, హోత, రత్నధాతృడైన అగ్నిని నేను ముందుగా స్తుతింతును.
సీ.
అగ్ని పురోహితు డతనికి తొలిజోత!
యజ్ఞ దేవుడతడు ఋత్విజుడును
రత్నరాశులనిచ్చు రత్నధాతృడతడు
హోతయౌ యాగాగ్నిహోత్రుడతడు! -
అ॒గ్నిః పూర్వే॑భి॒ర్ ఋషి॑భి॒రీడ్యో॒ నూత॑నైరు॒త ।
స దే॒వాన్ ఏహ వ॑క్షతి ॥పదచ్ఛేదం: అగ్నిః । పూర్వేభిః । ఋషిభిః । ఈడ్యః । నూతనైః । ఉత । సః । దేవాన్ । ఆ । ఇహ । వక్షతి ॥
టీకా: అగ్నిః = అగ్ని; పూర్వేభిః ఋషిభిః = ప్రాచీనులైన ఋషులచేత; ఈడ్యః = స్తుతింపబడినవాడు; నూతనైః = నూతనుల చేత; ఉత = కూడా; సః = అట్టివాడు; దేవాన్ = దేవతలకు; ఇహ = ఈ యజ్ఞమును; ఆవక్షతి = అందజేయును.
భావం: పూర్వ ఋషుల చేత పొగడబడినవాడు, నూతన ఋషులచేత కూడా పొగడబడినవాడైన అగ్ని దేవతలకు ఈ యజ్ఞమును అందజేయును.
సీ.
పూర్వ ఋషుల చేత పొగడబడుటె గాక
నూతన ఋషులచే నుతులు పొందు
అగ్నిహోత్రుడు దేవతాహ్వనమును జేసి
అమిత హవ్యమొసగి అమరు గాక! -
అ॒గ్నినా॑ ర॒యి మ॑శ్నవ॒త్పోష॑మే॒వ ది॒వేది॑వే ।
య॒శసం॑ వీ॒రవ॑త్తమమ్ ॥పదచ్ఛేదం: అగ్నినా । రయిమ్ । అశ్నవత్ । పోషమ్ । ఏవ । దివేదివే । యశసమ్ । వీరవత్తమమ్ ॥
టీకా: అగ్నినా = అగ్ని చేత; రయిమ్ = ధనము; అశ్నవత్ = పొందగలవాడు; పోషమ్ ఏవ = అభివృద్ధినే; దివేదివే = దినదినము; యశసమ్ = యశస్సును; వీరవత్తమమ్ =వీరవత్ తమమైన వారిని = వీరవంతులను.
భావం: అగ్నిచేత ధనమును, ప్రతిదినము అభివృద్ధిని, యశస్సును, వీరవంతులను (వీరవంతులైన సంతానాన్ని) పొందగలడు.
ఆ. వె.
అగ్నిచేత ధనము నందుకొనుచు యష్ట†
ప్రతిదినమభివృద్ధి ప్రబల యశము
వీరవత్తములను విధిగ పొందగలడు!(†యష్ట = యాగము చేయువాడు)
-
అగ్నే॒ యం య॒జ్ఞమ॑ధ్వ॒రం వి॒శ్వత॑: పరి॒భూరసి॑ ।
స ఇద్దే॒వేషు॑ గచ్ఛతి ॥పదచ్ఛేదం: అగ్నే । యమ్ । యజ్ఞమ్ । అధ్వరమ్ । విశ్వతః । పరిభూః । అసి । సః । ఇత్ । దేవేషు । గచ్ఛతి ॥
టీకా: అగ్నే = ఓ అగ్ని; యమ్ = ఏదైతే; యజ్ఞమ్ = యజ్ఞము; అధ్వరమ్ = విధ్వంసం కానిది; విశ్వతః = అన్నివైపుల; పరిభూః = వ్యాపింపజేయువాడు; అసి = ఉండు, అగు; సః =యజ్ఞము; ఇద్ = తప్పకుండా; దేవేషు = దేవతలయందు; ఆ గచ్ఛతి = చేరును.
భావం: ఓ అగ్నీ, ఏ విధ్వంసం కాని యజ్ఞమును అన్నివైపులా వ్యాపింపజేయువానిగా నీవు ఉండినావో ఆ యజ్ఞము తప్పకుండా దేవతలను చేరును.
ఆ. వె.
అధ్వరమగు యజ్ఞ మన్ని దెసలకును
వ్యాప్తి చెందజేయు వహ్ని చేత
దివిజలోకమందు దేవతతిని జేరు! -
అ॒గ్నిర్హోతా॑ క॒విక్ర॑తుః స॒త్యశ్చి॒త్రశ్ర॑వస్తమః ।
దే॒వో దే॒వేభి॒రా గ॑మత్ ॥పదచ్ఛేదం: అగ్నిః । హోతా । కవిక్రతుః । సత్యః । చిత్రశ్రవఃతమః । దేవః । దేవేభిః । ఆగమత్ ॥
టీకా: అగ్నిః = అగ్ని; హోతా = హోమమును స్వీకరించేవాడు; కవిక్రతుః = క్రాంతదర్శి; సత్యః = సత్యవంతుడు; చిత్రశ్రవఃతమః = గొప్ప కీర్తులతో కూడినవాడు; దేవః = దేవుడు; దేవేభిః = దేవతలతో కూడి; ఆగమత్ = ఆగమించును.
భావం: హోత, క్రాంతదర్శి, సత్యవంతుడు, గొప్పకీర్తులతో కూడినవాడు దేవుడు అయిన అగ్ని ఇతర దేవతలతో కూడి ఆగమించును.
తే. గీ.
హోత కవి సత్యవంతుడు చిత్ర శ్రవుడు
దేవుడైన అగ్ని ఇతర దేవతలను
యాగశాలకు తోడ్కొని ఆగమించు! -
యద॒ఙ్గ దా॒శుషే॒ త్వమగ్నే॑ భ॒ద్రం క॑రి॒ష్యసి॑ ।
తవేత్తత్స॒త్యమ॑ఙ్గిరః ॥పదచ్ఛేదం: యత్ । అఙ్గ । దాశుషే । త్వమ్ । అగ్నే । భద్రమ్ । కరిష్యసి । తవ । ఏతత్ । సత్యమ్ । అఙ్గిరః ॥
టీకా: యత్ = ఏదైతే; దాశుషే = దాశులకు, యజ్ఞము చేయు యజమానులకు; త్వమ్ = నీవు; అగ్నే = ఓ అగ్ని; భద్రమ్ = భద్రమును; కరిష్యసి = చేయుచున్నావో; తవ = నీకే (చేరును); ఏతత్ సత్యమ్ = ఇది నిజము; అఙ్గిరః = ఓ అంగిర/అగ్ని;
భావం: ఓ అగ్ని, ఏదైతే యజమానులకు నీవు భద్రము చేయుచున్నావో (ద్రవ్యములను కూర్చుతున్నావో) అది చివరకు నీకే చేరును. ఇది నిక్కము ఓ అంగిరుడా (అగ్ని).
తే. గీ.
యష్టలకు నీవొసగు భద్ర మగ్నిదేవ!
నీకు చెందుచుండు మరల నిక్కమిదియె! -
ఉప॑ త్వాగ్నే ది॒వేది॑వే॒ దోషా॑వస్తర్ధి॒యా వ॒యమ్ ।
నమో॒ భర॑న్త॒ ఏమ॑సి ॥పదచ్ఛేదం: ఉప । త్వా । అగ్నే । దివేదివే । దోషావస్తః । ధియా । వయమ్ । నమః । భరన్తః । ఆ । ఇమసి ॥
టీకా: ఉప = దగ్గరకు; త్వా = నిన్ను; అగ్నే = ఓ అగ్ని; దివేదివే = దినదినము; దోషావస్తః = రాత్రి పగలు; ధియా = బుద్ధితో; వయమ్ = మేము; నమః = నమస్సుల; భరన్తః = నింపుకొన్నవారమై; ఆ ఇమసి = వచ్చుచున్నాము.
భావం: ఓ అగ్ని, నీ దగ్గరకు ప్రతిదినము, రాత్రి పగలు, బుద్ధితో మేము నమస్సులను నింపుకొని వచ్చుచున్నాము.
తే. గీ.
దినదినమహర్నిశము నిన్ను ధిషణ తోడ
వేడుకొందుము మతినిండు వినతి తోడ! -
రాజ॑న్తమధ్వ॒రాణాం॑ గో॒పామృ॒తస్య॒ దీది॑విమ్ ।
వర్ధ॑మానం॒ స్వే దమే॑ ॥పదచ్ఛేదం: రాజన్తమ్ । అధ్వరాణామ్ । గోపామ్ । ఋతస్య । దీదివిమ్ । వర్ధమానమ్ । స్వే । దమే ॥
టీకా: రాజన్తమ్ = రాజిల్లునది; అధ్వరాణామ్ = విధ్వంసం కానిది అగు యజ్ఞమునందు; గోపామ్ = రక్షించువానిని; ఋతస్య = సత్యము/ధర్మము యొక్క; దీదివిమ్ = వెలిగించు; వర్ధమానమ్ = వృద్ధి పొందువాడిని; స్వే = తన; దమే = ఇంటిలో.
భావం: యజ్ఞమునందు ఆరిపోకుండా ప్రజ్వరిల్లి సత్యధర్మములను రక్షించి, ప్రవర్ధమానమై నీ వసతి ఇంటిలో వెలుగుమయ్యా!
తే. గీ.
అధ్వరంబున రాజిల్లి ప్రజ్వరిల్లి
సత్యధర్మములకెపుడు కాపుకాసి
వర్ధమానమగుచునుండు వసతి యందు! -
సః నః॑ పి॒తేవ॑ సూ॒నవేఽగ్నే॑ సూపాయ॒నో భ॑వ ।
సచ॑స్వా నః స్వ॒స్తయే॑ ॥పదచ్ఛేదం: సః । నః । పితాఇవ । సూనవే । అగ్నే । సుఉపాయనః । భవ । సచస్వ । నః । స్వస్తయే ॥
టీకా: సః = అతడు; నః = మాకొరకు; పితాఇవ =పితవలె; సూనవే = సుతులకు; అగ్నే = ఓ అగ్ని; సుఉపాయనః = శుభప్రదమైనవి కలుగునట్లు; భవ = ఉండునో; సచస్వ = సిద్ధముగా; నః = మా కొరకు; స్వస్తయే = స్వస్తికొరకు;
భావం: సుతులకు శుభము కలుగునట్లు ఉండే పితవలె నీవు మా స్వస్తి కొరకు సిద్ధముగా ఉండుము, ఓ అగ్ని!
తే. గీ.
సుతులకు శుభములను గూర్చు పితరువోలె
మాకు స్వస్తి కలుగునట్లు మసలుమగ్ని!